బాలూ గారు ‘పాడుతా తీయగా’ వేదిక మీద ఇంతలా భావోద్వేగానికి లోనైన సంఘటన ఇంకొకటి లేదేమో!
వేటూరి గారి స్మృతులనుండి వచ్చిన కన్నీళ్లవి.
చంద్రబోస్ ఆ పాటని విశ్లేషిస్తుంటే తట్టుకోలేనంత ఆనందంతో బాలూ గారు ప్రదర్శించిన హావభావాలు అనిర్వచనీయం.
అయిదారు సంవత్సరాల క్రితం ఈ పాడుతా తీయగా ఎపిసోడ్ లోనే మొదటిసారి ఈ పాట విన్నా.
ఇంత గొప్ప పాట ఇంతకాలం ఎలా మిస్ అయ్యానా అనిపించింది.
‘చిన్ని కృష్ణుడు’లో అమెరికా మీద రాసిన ఈ పాట, ‘పడమటి సంధ్యారాగం’లో
“ఏ దేశమైనా ఆకాశమొకటే
ఏ జంటకైనా అనురాగమొకటే
అపురూపమీ ప్రణయం”
అంటూ ఇంగ్లీషబ్బాయి, తెలుగమ్మాయి అమెరికాలో పాడుకొనే ‘ఈ తూరుపు ఆ పశ్చిమం” పాట – రెండూ అద్భుతాలే. వేటూరి గీతాలే.
జీవితం సప్తసాగర గీతం
వెలుగునీడల వేదం
సాగనీ పయనం
కల ఇల కౌగిలించే చోట
కల ఇల కౌగిలించే చోట
ఏది భువనం ఏది గగనం తారా తోరణం
ఈ చికాగో సియర్స్ టవరే స్వర్గ సోపానమూ
ఏది సత్యం ఏది స్వప్నం డిస్ని జగతీలో
ఏది నిజమో ఏది మాయో తెలీయనీ లోకమూ
హే… బ్రహ్మ మానస గీతం
మనిషి గీసిన చిత్రం
చేతనాత్మాక శిల్పం
మతి కృతి పల్లవించే చోట…
మతి కృతి పల్లవించే చోట
ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్చా జ్యోతులూ
ఐక్య రాజ్య సమితిలోనా కలిసే జాతులూ
ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు
ఈ మయామీ బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ..
హే… సృష్టికే ఇది అందం
దృష్టికందని దృశ్యం
కవులు రాయని కావ్యం.
కృషి ఖుషి సంగమించే చోట..
కృషి ఖుషి సంగమించే చోట
జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం
సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..
కల ఇల కౌగిలించే చోట
రాజన్.పి.టి.ఎస్.కె గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం