ఆయన రూపం కూడా ఆయన పేరులానే, పాటలానే సుందరంగా ఉంటుంది.
వేటూరి గారు తను అభిమానించే సినీ కవుల పేర్లు కొన్ని ఆయన రాసిన పాటల్లో కూర్చి- వారిని ఆ అక్షరాల కుర్చీలపై కూర్చోబెట్టి నమస్కరించి ఆనందించారు.
‘నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం ఆత్రేయ ప్రేమ గీతం’
అని ‘మాధవయ్య గారి మనవడు’ సినిమాలోనూ,
‘శ్రీరాగం పాడే శృంగార క్షణంలో – శ్రీశ్రీ లో రేగే కవితాగ్ని కణంలో’ అని ‘రాజా విక్రమార్క’ లోని ‘గగనకిరణ గమనమిది’ పాటలోనూ,
‘భావకవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే’
అని ‘అల్లరి ప్రియుడు’ సినిమాలో ‘అందమా నీ పేరేమిటి అందమా’ పాటలోనూ,
‘ఆడవారి మాటకు అర్థాలే వేరులే అన్నాడు గ్రేటు పింగళీ’
అని ముత్యమంత ముద్దు సినిమాలో ‘ప్రేమలేఖ రాశా .. నీకంది ఉంటదీ’ పాటలోనూ రాసి ఆ కవులపై తన గౌరవాన్ని ప్రకటించుకున్నారు. ఈ పాటలన్నీ హిట్టే!
ఇవన్నీ చూశాక…వేటూరి గారు తన ముందు తరం కవులపై అభిమానం చూపించుకున్నట్టే..ఆయనపై ఆయన తరువాత తరం కవులెవరైనా వారి పాటలలో ఆయనని స్మరించుకున్నారా అని అనిపించింది.
అప్పుడు ఆలోచించగా గుర్తొచ్చినవి మూడు పాటలు.
‘అత్తారింటికి దారేది’లో ‘నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే’ పాటలో ‘సిరివెన్నెల మూటలా వేటూరి పాటలా ముద్దుగున్నావే మరదలా’ అని దేవిశ్రీ ప్రసాద్ మురిసిపోతే…
‘సీతయ్య’ సినిమాలో “ఆది శంకరుల సౌందర్యలహరి’ పాటలో
‘శ్రీనాథ శృంగారలహరి వేటూరి గేయాల మాధురి’ అని చంద్రబోస్ నమస్కరించుకున్నాడు.
వెన్నెలకంటి కూడా ‘డ్యూయెట్’ సినిమాలో…
‘పాటకు ఎస్పీబి పల్లవికి వేటూరి నా జత నువ్వేలే’ అని ‘ కొడితే కోలాటం కొలువైతే పరమశివం’ అనే ప్రణయగీతంలో రాస్తూ పాడుకున్నాడు.
ఇంకా చాలా పాటలు ఉండుండవచ్చు. నాకు గుర్తుకువచ్చినవి మాత్రం ఇవి.