వేటూరి పాటల చెట్టు – విజయా గార్డెన్స్

చెన్నై లోని వడపళని మెయిన్ రోడ్డులో ఉన్న విజయా గార్డెన్స్ దానికి ఎదురుగా విజయా హాస్పిటల్, విజయా వాహిని స్టుడియోలు. విజయా గార్డెన్స్ చాలా ప్రసిద్ధి ఎందుకంటే ఇందులో చాలా సినిమాలు షూటింగు అయ్యేవి, ఇంకా అందులోనే రెండు రికార్డింగ్ థియేటర్స్ ఉండేవి. ఒకటి పాతది అందులోనే పాత సినిమాల క్లాసిక్స్ అన్నీ రికార్డ్ చేసారు,ఇంకొకటి చక్రవర్తి గారి కోసం కట్టిన అధునాతన డీలక్స్ థియేటర్.

వేటూరి గారు ఉదయమే 5గం.లకి లేచి తయారయి ఒక కప్పు కాఫీ తాగి 6 కి.మీ దూరంలో ఉన్న విజయా గార్డెన్స్ కి నడుచుకుంటూ వెళ్ళేవారు. ఆ గార్డెన్స్ లో ఉన్న పెద్దచెట్టే ఆయన ఆఫీసు,అందుకే దానికి పేరు వేటూరి పాటల చెట్టు.

వేటూరి గారు వ్రాసిన మొత్తం పాటల్లో సగం పాటలు ఆ చెట్టు కిందే రాసారు, అందుకే సినిమా జనాలంతా ఆ చెట్టుని వేటూరి పాటల చెట్టు అనేవారు. వేటూరి కి ఆ పరిసర ప్రాంతం,అలంకరణ ఎంతగా నచ్చాయంటే అలాగే అదే రీతిలో వారింట్లో చేయించుకునేంతగా.

నాగిరెడ్డి గారు వేటూరి కి ఒక గది కూడా కేటాయించారు విజయా గార్డెన్స్ డీలక్స్ థియేటర్లో సినిమా జనాల్ని కల్సుకునేందుకు,పాటలు రాసుకునేందుకు, కానీ ఆయనకి ఆ చెట్టుకిందే కూర్చోడానికి ఇష్టపడేవారు. దర్శకులు,నిర్మాతలు అందరూ ఆ చెట్టుకిందే వేటూరిని కలిసేవారు,చర్చించుకునేవారు. ఎప్పుడయినా మ్యూజికల్ సిట్టింగ్స్, ఇంకేదయినా చర్చలు ఉంటే అక్కడకి వెళ్ళి అదయ్యాక మళ్ళీ ఇదే చోటికి తిరిగి వచ్చేవారు.
ఈ స్థలం ఒక కూడలి లాంటిది,ఎందుకంటే ఏ సినిమా షూటింగులకి వెళ్ళాలన్నా, విజయా గార్డెన్స్ కయినా, ఏవిఎం స్టూడియోకయినా,ప్రసాద్ స్టూడియోకయినా,కోదండపాణి రికార్డింగ్ థియేటర్ కి వెళ్ళాలన్నా ఇది అన్నిటికీ దగ్గర,తక్కువదూరం ప్రయాణమన్నమాట.

సినిమాలకి సంబంధించిన పాటల్ని తీసుకోడానికి అందరు సహాయదర్శకులూ అసోసియేట్ దర్శకులూ 7గం.30ని.ల కల్లా ఆ చెట్టుదగ్గరకి చేరి వేటూరి గారితో కూర్చునేవారు.

వేటూరి 6గం.లకి అక్కడకి చేరుకుని అన్ని తెలుగు,ఇంగ్లీషు వార్తాపత్రికలూ తెచ్చుకుని చదివేవారు. అది ఆయనకి మొదట్నించి వస్తున్న అలవాటు. ఈలోపున సినిమాకి సంబంధించిన వాళ్ళు రాగానే ఫలహారం తెప్పించుకుని అందరితో పంచుకుని తినేవారు,అదయ్యాక పాటల వ్యవహారం మొదలయ్యేది ప్రాధాన్యతను బట్టి.

అదయ్యేసరికి ఆయన కారు డ్రైవర్ తంగరాజ్ (1975 నించి ఆయన దగ్గరే పనిచేస్తున్నాడు) కారు తీసుకుని వచ్చేవాడు. వచ్చేప్పుడు ఇంటినించి భోజనం కేరియర్ కూడా తెచ్చేవాడు, ఒక్కోసారి స్పెషల్స్ ఉంటే అవి ఎలా చేస్తారు అంటూ చర్చించుకుంటూ, అందరితో పంచుకుని తినేవారు.

సాయంత్రం అయ్యేసరికి అప్పటికి మిగిలి ఉన్న సహాయ దర్శకుల్ని తీసుకుని కార్లో మెరినా బీచ్ కో లేక చెన్నైలోని వేరే ప్రముఖ స్థలాలకో వెళ్ళి కాసేపు గడిపి, మళ్ళీ విజయా గార్డెన్స్ కి వచ్చి ఆ డీలక్స్ థియేటర్ కారిడార్లో కూర్చుని పాటలు రాసుకునేవారు.

సాధారణంగా ప్రతి పాటకి 4-5 పల్లవులు రాసి దర్శకుడికి నచ్చితే ఆ పల్లవి ప్రతి చరణానికి 2-3 చరణాలు రాసి అందులో మార్పులు చేర్పులు ఉంటే మార్చి పూర్తిచేసేవారు.

అలా ఒక పాటకి రికార్డింగ్ థియేటర్లకి, స్టూడియోలకి అటు ఇటూ తిరగడం, పూర్తి చేయడం, ఈ కార్యక్రమం రాత్రి 10-12 వరకూ సాగుతూ ఉండేది, జరుగుతున్న సినిమా షూటింగులూ, అవసరాన్ని బట్టి.

30 యేళ్ళుగా వేటూరి దినచర్య ఇదే 2002 లో చెన్నై నించి హైదరాబాద్ వచ్చేవరకూ. చాలామంది అనుకునేదేమంటే వేటూరి పాటలు రాయడానికి హొటల్ రూముల్లో కూర్చుని రాస్తారు అని, కానీ ఆయన ఆరోగ్యం సహకరించినంతవరకూ ఆ చెట్టుకిందే చప్టామీద కూర్చుని రాసేవారు.అసలు ఆయన ఎప్పుడూ నేలమీద చాపవేసుకుని పడుకునేవారు హైదరాబాద్ వచ్చిన తరువాత కూడా.

పాటలు రాయడంలో, రచనలు చెయ్యడంలో కానీ ఎక్కడా ఆలశ్యం చెయ్యకపోడం, అవసరానికి తగ్గట్టుగా అక్కడికక్కడే రాసివ్వడం, వేగంగా కావాల్సిన మార్పులు చేర్పులూ చెయ్యగలగడం వంటి వాటిల్లో ప్రసిద్ధులు కాబట్టి వేటూరి సినిమా పరిశ్రమలోనయినా పత్రికా రంగంలోనయినా అందరికీ కావాల్సిన రచయితగా, గౌరవించబడ్డ వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అలా ఆయన ఖర్చు విషయంలో నిర్మాతల పాలిట కల్పవృక్షంగా ఉండేవారు

విశేషం ఏంటంటే రోజుకి సరాసరి ఒక్క పాటయినా రాసి ఉన్నారని,పనిలో ఎక్కడా నిర్లక్ష్యం చెయ్యలేదన్నది వాస్తవం.

అది సినిమా పాట కావచ్చు,లేదా ప్రైవేటు పాట కావచ్చు, పత్రికలకి వ్యాసం కావచ్చు ప్రతిరోజూ అదే పనిలో తలమునకలుగా ఉండి ప్రయాణాలతోనో, కొత్తవ్యక్తులని కలుసుకోడంలోనో, చర్చలతోనో కాలం గడిపేవారు.

సరస్వతీ దేవి దయవల్ల వేటూరి గారు ఆయనకి అత్యంత ఇష్టమయిన రచనా వ్యాపకాన్ని ఏనాడూ విడిచిపెట్టి ఉండలేదు.

అందుకే ఆయన్ని కొంతమంది సినీజనాలు ముద్దుగా పనిరాక్షసుడు, పాటల చెట్టు వేటూరి అని కూడా పిలిచేవారట

——————————————————————————

వేటూరి రవిప్రకాష్ గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం

You May Also Like

3 thoughts on “వేటూరి పాటల చెట్టు – విజయా గార్డెన్స్

 1. మీరు చెట్టు గురించి ప్రస్తావించాక.. అది నిజమనే నిర్దారించే సంఘటన నేను ఒకటి చూసాను.

  అది 1999లో నేనప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నాను. వృత్తిలో భాగంగా చెన్నైకి పంపారు. ఆ సమయంలో “పాడుతా తీయగా” ఫోగ్రామ్ డైరెక్టర్ బాలు గారి కజిన్ అనుకొంటాను శాస్త్రి గారు ఆ ఫోగ్రాం కోసం “మణిశర్మ”తో ఇంటర్ వ్యూ వున్నది పదా అని నన్ను తీసుకెళ్లారు.

  మణిశర్మ గారి మహతి రికార్డింగ్ థియేటర్ వున్న కాంపౌండ్‌లోనే ఆయన ఇల్లు కూడ వుండేది. లోనకు వెళ్లగానే మొదట ఎదురయ్యేది ఒక పెద్ద చెట్టు పేరు గుర్తు లేదుగాని. ఆ చెట్టు చుట్టు పెద్ద అరుగు వున్నది దాని మీద “వేటూరి” గారు ఒక్కరే కూర్చోని పాటలు రాసుకొనే ఆలోచనలో కనపడ్డారు. నేనసలు ఊహించని విషయమది.. వేటూరి గారిని చూడగానే లోపల ఒక ఆనందం.. అయన్ని కలిసి మాట్లాడాలని ఎప్పటి నుండో అనుకొంటున్నది. కాని వచ్చిన ప్రొఫిషన్ పని వదిలి వెళ్లలేను కాబట్టి. స్టూడియోలోకి వెళ్లి “మణిశర్మ”గారితో ఇంటర్ వ్యూ తీసుకొని బయటకు వచ్చాను. అప్పుడు తెలిసింది. ఆయన ఏ.సి గదుల్లో కాని లేక రూముల్లో కాని కూర్చోని పాటలు రాయరనే సంగతి.

  మహతి స్టూడియోకు ఎప్పుడు వచ్చినా ఆయన అదే కాంపౌండ్ లో వుండే ఆ చెట్టు కింద మాత్రమే కూర్చోని పాటలు రాస్తారట.

  నేరుగా వేటూరి వారు కూర్చోని వున్న చెట్టు వద్దకు వెళ్లి నేను నించున్నాను. అప్పటికే ఆయన చుట్టూ చేరిన వ్యక్తులతో ఆయన మాట్లాడుతుంటే వింటూ వుండిపోయాను. నేనేమి మాట్లాడలేదు. కారణం ఆయన మాటల్లో “అచ్చు తెనుగు” పదాలు అలా ఆలవోకగా జాలువారుతుంటే వింటూ వుండిపోయాను. కొత్త కొత్త పదాలు అలా ఆసువుగా వొస్తున్నాయి ఆయన నుండి.. వినడం మించి నేనేమి చేయగలను…!!

  అప్పుడే తెలుసుకొన్నాను ఆయన ఎప్పుడైనా సరే ఏ చెట్టు కిందనో లేక కారులొ వూరంతా తిరుగుతూ చెట్లను వాటి మీద వున్న పక్షులను చూసుకొంటూ పాటలు రాసుకొంటారనే విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.