మనిషిగ పుట్టెను ఒక మట్టి(రచన-వేటూరి) – సందీప్.పి

కథానాయకదర్శకనిర్మాతాదుల ఒత్తిడి లేకుండా వ్రాయడం ఏ చలన చిత్ర కవికైనా వరమే. బహుశా అందుకేనేమో, వేటూరి private albums కొన్నిటికి ఆణిముత్యాల వంటి పాటలు వ్రాసారు. శ్రీ వేంకటేశ్వర పదములు” అనే album లో భక్తిని, వేదాంతాన్ని కలగలిపి వ్రాసిన సాహిత్యం విన్న ప్రతి ఒక్కరికీ నచ్చితీరుతుంది. ఆ పాటల్లో నాకు పదే పదే గుర్తొచ్చేది మనిషిగ పుట్టెను ఒక మట్టి” అనే పాట. దీన్ని స్వరపరిచినది కే.వీ.మహదేవన్, పాడింది ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం. వీరిద్దరూ వేటూరి సాహిత్యానికి తగిన న్యాయాన్ని చేకూర్చారు.

వేదాంతం అంతా మూడిటి మధ్య సంబంధం గురించి చెబుతుంది. అవి జీవుడు (జీవాత్మ), ప్రపంచం (జాగత్తు), ఈశ్వరుడు (పరమాత్మ). ఈ మూడూ ఒకటే అనేది అద్వైతవేదాంతం. అద్వైతం అంటే – “రెండవది లేనిది” అని అర్థం. అద్వైతసారం: ఉన్నది ఒకటే – బ్రహ్మం. మాయ వలన బ్రహ్మమే విడి విడిగా అనేక జీవులుగా, వస్తువులుగా (ప్రపంచం), ఈశ్వరుడిగా కనిపిస్తోంది. తెల్లదైన సూర్యరశ్మి తేమ ద్వారా చూస్తే ఏడు రంగులుగా కనిపించినట్టు అన్నమాట. శంకరాచార్యుల నుండి, నిసర్గదత్త వరకు గురువులు అందరూ ఇదే విషయాన్ని అనేక దృష్టాంతాలతో (ఉదాహరణలతో) వర్ణించి చెప్పారు. వీటిలోని అనేక అంశాలను స్పృశిస్తూ వేటూరి కలం నుండి పల్లవించిన ఈ పాట ఆ పరమేశ్వరుడి చరణాలను చేరింది అని నా నమ్మకం.

ఈ పాటలో పల్లవి, చరణాలూ పంచభూతాలలో ఒక్కొక్క దాన్నీ వర్ణించుకుంటూ వెళ్తాయి. కవి వాటిని చూసి జిజ్ఞాసతో తేలిక మాటలలో లోతైన ప్రశ్నలను అడుగుతూ ఉంటాడు. ఆ ప్రశ్నలు అనంటికీ సమాధానం తెలిస్తే వేదాంతం అర్థమైనట్టే. (అర్థమైనంత మాత్రాన అనుభవంలోకి రాదు. అనుభవంలోకి రానప్పుడు అర్థమైనా కానట్టే.) ఆ ప్రశ్నలు, వాటికి వేదాంతంలో నాకు తెలిసిన సమాధానాలు కూడి ఈ వ్యాసం వ్రాస్తున్నాను. ఈ వ్యాసం చదువుతుంటే మీకు “వేటూరి ఈ ఉద్దేశంతోనే వ్రాసుంటారా?” అని అనిపిస్తే, మీరు ఏకాకి కాదు. వ్రాస్తున్నప్పుడు నాకే బోలెడు సార్లు అలాగ అనిపించింది. కచ్చితంగా ఈ పాటలో చాలా లోతైన భావాలను కొద్దిపాటి పదాలలో చెప్పారు. అందుచేత ఆయన రచించిన వేరే పాటలలో భావాలను, శైలిని బట్టి కవిహృదయాన్ని ఊహించవలసి వచ్చింది. ఆ ప్రక్రియలో పొరబాట్లు కూడా దొర్లి ఉండవచ్చును. ఇది వేటూరి పాటల్లో తరచూ జరిగే (నాకు ఇష్టమైన) విషయం. ఒక వేళ మీకు “ఈ పాటలో ఉన్న పది పదాలకు, వీడు వేయి మాటల్లో వేదాంతం వివరించాలా?” అని అనిపిస్తే మన్నించాలి. ఈ పాట నేను అప్పుడప్పుడూ చదువుకున్న వేదాంత తర్కసారాలను మనసు లోపొరల్లోంచి తవ్విస్తుంది. అందుకు కృతజ్ఞతగా ఈ వ్యాసాన్ని వ్రాస్తున్నాను.

మనిషిగ పుట్టెను ఒక మట్టి
తన మనసును పెంచినదే మట్టి
మానై పుట్టెను ఒక మట్టి
తన పూవై పూసినదే మట్టి

మట్టిలోంచే అంతా వస్తుంది, మట్టిలోకే అంతా వెళ్తుంది అన్నది వీధి వేదాంతం. అంటే – అందరికీ తెలిసిన వాదం, అందరూ సుమారుగా అంగీకరించే వాదం. శరీరానికి మట్టి ముడిసరుకు. మరి, మనసు కనబడదు, తాకడానికి వీలు కాదు కదా – దానికి ముడిసరుకు ఏది? మాను మట్టి లోంచే పుట్టింది, ఆ మానుకు భిన్నంగా ఉండి, కళను తెచ్చే పువ్వు ఎక్కడనుండు వచ్చింది?

అంతా మట్టి అని మనం అంటాము. అంతా బ్రహ్మం అని వేదాంతులు అంటారు. మనిషి దేహం మట్టిలోంచి వచ్చింది. మనసు అదృశ్యం, అస్పృశ్యము, అభౌతికము కదా, దానికి మూలం ఏమిటి? దానికి జవాబు “అజ్ఞానం (అవిద్య)”. జీవుడికి “నేను ఈ దేహాన్ని” అనే మోహం కలిగించేది అజ్ఞానం. ఈ అజ్ఞానానికి కొమ్మలు – బుద్ధి, మనసు, అహంకారం, చిత్తం. సూక్ష్మంగా వీటిలో భేదాలు ఉన్నా, స్థూలంగా వీటిని కలిపి “మనసు” అంటాము. దేహంలోని ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూసి మనసు కోరికలను, బంధాలను ఏర్పరుచుకుని బలపడుతుంది. ఆ దేహం వాసయోగ్యం కానప్పుడు ఇంకా మనసు మిగిలిపోతే – అది మళ్ళీ వేరే దేహాన్ని ఆశ్రయిస్తుంది. మనిషి-మనసులకు ఉపమానాలుగా మాను, పువ్వులను చెప్పారు. చెట్టు నుండి పువ్వు వస్తుంది. పువ్వు నుండి చెట్టు వస్తుంది.

ఆయువు పోసెను ఒక గాలి
జీవాత్మలనూదినదే గాలి
వేణువులూదెను ఒక గాలి
పరమాత్మునికూపిరి ఏ గాలి

జీవుడికి ఒక దేహంలో ఆయువుని ఇచ్చేది గాలి. మరి దేహాలను మారుస్తూ పోయే జీవాత్మలను కల్పించినది ఏ గాలి? ఈ జీవాత్మల జీవనవేణువులు (జీవితంలో రాగాలు – అనుభూతులు) ఊదుతున్నది ఏ గాలి? అది ఈశ్వరుడు అనుకుంటే మరి ఈశ్వరుడికి ఆధారం ఏమిటి? §

ప్రాణం అంటే మామూలు భాషలో ఊపిరి. యోగాభ్యాసంలో జీవుడి ఉనికిని (vitality, life-breath) ప్రాణం అంటారు. దీన్నే తెలుగులో ఉసురు అని అంటాము. దేహంలో ఉసురు ఉన్నంతవరకే జీవుడు అందులో నివసిస్తాడు, దీన్నే ఆయువు అంటాము. కవి ప్రాణాన్నే గాలి అంటున్నాడు. ‡

అద్వైతంలో “సృష్టి” అనేది ప్రపంచానికి ఉందేమో కానీ జీవాత్మలకు లేదు. కృష్ణభగవానుడు కూడా గీతలో “న త్వేవాహం జాతు నాసం న త్వం న ఇమే జనాధిపాః” అన్నాడు కదా. జీవాత్మ తను బ్రహ్మం నుండి వేరని భావించడానికి కారణం అజ్ఞానం. అజ్ఞానానికి ఆది ఉండదు. ఉదాహరణకు, ఒకడు తాడును చూసి పాము అనుకున్నాడు. వాడు దాన్ని పాము అని అనుకుంటుండగా “అక్కడ పాము ఎంత సేపటినుండి ఉంది?” అని అడిగితే వాడు రెండు రోజులన్నా, రెండు కోట్ల సంవత్సరాలన్నా పొరబాటే. ఎందుకంటే అక్కడ ఉన్నది అసలు పామే కాదు. పోనీ, వాడు అది తాడు అని తెలుసుకున్న తరువాత, “అక్కడ పాము ఎంత సేపటినుండి ఉంది?” అని అడిగితే ఆ ప్రశ్నే నిరర్థకం. అలాగ “జీవాత్మ, అజ్ఞానం ఎప్పుడు సృష్టింపబడ్డాయి?” అంటే దానికి సమాధానం “అసలు అవి సృష్టింపబడలేదు”. బహుశా అందుకేనేమో వేటూరి “సృష్టించిన” అనే భావం రాకుండా, సున్నితంగా జీవాత్మలను “ఊదినది” ఏ గాలి అన్నారు.

ఈ జీవాత్మలకు అనుభవాలు కలగాలి అంటే వారికి ఒక పరిసరం కావాలి. ప్రపంచాన్ని సృష్టించి వారి జీవనవేణువులను ఊదినది ఏ గాలి అని కవి అడుగుతున్నాడు. దానికి సమాధానం ఈశ్వరుడు అని చెప్పచ్చును. మరి ఆ ఈశ్వరుడికి ఉసురు ఎవరు పోసారు? అసలు జీవాత్మనే ఎవరూ సృష్టించలేదు అంటే, మరి పరమాత్మ సంగతి అడగాలా? ఆయనా సనాతనుడే. ఆ వాదం నచ్చలేదూ, వేదం మరొక ఆధారం ఇచ్చింది –  “ప్రజ్ఞానం బ్రహ్మ” అనే మహావాక్యంలో. అంటే తమ తమ ఉనికిని గుర్తించే సకలజీవాలలోనూ “నేను ఉన్నాను” అనే జ్ఞానమే (అనుభవం, స్ఫురణ) బ్రహ్మ. ఆంగ్లంలో దీన్ని consciousness అంటారు. మరి ఆ జ్ఞానాన్ని ఎవరు సృష్టించారు అంటే – ఆ ప్రశ్నే నిరర్థకం. సృష్టించేవాడికి జ్ఞానం ఉండాలి కదా, అంటే స్రష్ట కంటే ముందు జ్ఞానం ఉంది అన్నమాట. అంటే జ్ఞానం సృష్టించబడినది కాదు, సనాతనమైనది. ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు – ఆయనా సనాతనుడే.

ఆకలి పెంచినదొక నిప్పు
తన అంగము పెంచినదే నిప్పు
కన్నుగ వెలిగెను ఒక నిప్పు
తన వెన్నుని గాంచినదే నిప్పు

నిప్పుకు రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి మండటం, రెండు వెలగడం. దేహానికి ఆ రెండూ అవసరం. ఎప్పటికప్పుడు ఆకలి అగ్ని లాగా మండుతున్న అనుభవాన్ని ఇస్తుంది. తిండి పెడితే దాన్ని జీర్ణించుకుని శరీరభాగాలకు బలాన్ని ఇచ్చి, పెంచుతుంది. ఇది నిరంతరం దేహంలో జరిగే యజ్ఞము. అన్ని ఇంద్రియాల లోకీ ముఖ్యమైనది కన్ను. ఆ కంటికి ఏదైనా కనబడేందుకు ఆధారం వెలుగు. ఇదంతా బానే ఉంది, మరి ఈ దేహానికి చైతన్యాన్ని ఇచ్చిన నిప్పు ఏమిటి?

మనిషి వెన్ను క్రింది కొన దగ్గర ఒక శక్తి ఉంటుంది అని యోగుల అనుభవం. దాన్నే కుండలినీ శక్తి అంటారు. దీన్ని పాముతోనూ, నిప్పుతోనూ పోలుస్తారు. ఈ శక్తి భౌతికమైన దేహానికి, అధ్యాత్మికమైన బ్రహ్మానికి ఒక వంతెన. ఎందుకంటే వేదాంతులు ఆ శక్తి మరేదో కాదు – ప్రజ్ఞానమే అంటారు. దీనికే అఖండాకార వృత్తి, అహం (“నేను ఉన్నాను”) స్ఫురణ అనే పేర్లు కూడా ఉన్నాయి. “వెన్నును చూసిన నిప్పు” అంటే జీవుడి వెనుకనున్న “చైతన్యం” – అది బ్రహ్మం అన్నమాట.

దాహము తీర్చెను ఒక నీరు
తన దేహపుటొరవడి ఏ నీరు
కడలై పొంగిన దొక నీరు
తన కన్నుల పొంగినదే నీరు

దాహం తీరుస్తున్న నీరు తెలుసును. మరి దేహాన్ని నడుపుతున్న నీరు ఏమిటి? ఫలానా పరిస్థితుల మధ్యన ఈ జీవుడు దేహాన్ని పొందుతాడు అని నిర్దేశించేది ఏమిటి? దానికి జవాబు – కర్మ. జీవుడు తన మనసులో కోరికలు (దాహం) తీర్చుకోవడానికి ప్రస్తుతదేహంతో కర్మలు చేస్తాడు. ఆ కర్మ ప్రతిఫలాన్ని, మిగిలిన మనసును (వాసనలను) బట్టి ఈ దేహపు ఆయువు తీరాక, మరొక దేహాన్ని ఆశ్రయిస్తాడు.

కడలిలో నీటికి కడవలో (కుండ) నీటికి తేడా ఏమిటి? కడలిలో ఎంత నీరు పోసినా ఇంకా పడుతుంది. కడవలో నీటి రంగు, రూపు, రుచి మొదలైన గుణాలు మార్చనవుతుంది. కడలిలో నీటిని మార్చడం అసంభవం. కడవలో పోసిన నీరు వెనక్కి తీసుకోవచ్చును. కడలిలో పోసిన నీరు వెనక్కి రావు. ఇక్కడ కడలి ఈశ్వరుడు, కడవ జీవుడు. జీవుడు తాను దేహాన్ని అనుకుని కర్మను చేస్తే ప్రతిఫలం అనుభవించాలి. అదే, జీవుడు కర్మను ఈశ్వరుడికి సమర్పించి చేస్తే, అది ఈశ్వరుడి కర్మ అవుతుంది. దానికి ప్రతిఫలం జీవుడికి రాదు. దీన్నే కర్మయోగం అంటారు.

క్రమేపి కడలి వంటి ఈశ్వరుడి విస్తారాన్ని, లోతుని గుర్తించిన జీవుడి కన్నుల్లో భక్తి పొంగి కర్మయోగం భక్తియోగం గా పరిణమిస్తుంది.

అటనట నిలిచెను ఒక గగనం
తన ఘటమున నిండినదేగగనం
ఘటనాఘటనల నడుమ నటనలో
మెరుపులు మెరిసినదే గగనం

ఎక్కడ వేరే వస్తువు లేదో అక్కడ ఆకాశం (space) ఉన్నట్టే కదా. ఆ లెక్కన అణువుకూ అణువుకూ మధ్యలో కూడా ఆకాశం ఉంది, అంటే ఆకాశం అంతటా ఉంది. ఒక ఖాళీ కుండ ఉంది అనుకోండి. ఆ కుండలో కూడా ఆకాశం ఉంది. ఆ లోపలి ఆకాశం, బయటన ఉన్న ఆకాశం ఒకటేనా? జరిగేవాటితో, జరగనివాటితో ప్రపంచం నడుస్తుండగా ఉన్నట్టుండి మెరుపులు మెరుస్తున్నాయి – అవి ఏ ఆకాశానివి? కుండ బయట ఉన్న ఆకాశానివా? అది కాక మరొక ఆకాశం ఉందా? ఇదంతా కవి ఆలోచిస్తున్నాడు.

ఈ పాట చరణలన్నిటిలోనూ నాకు అత్యంత ఇష్టమైన చరణం ఇదే. వేదాంతంలో ఘటాకాశ దృష్టాంతం (ఉదాహరణ) అని చెప్తారు. ఆకాశం అంతటా ఉంది. కుండ (ఘటము) లోపలా ఉంది, బయటా ఉంది. కుండ ఉన్నంత కాలం లోపల ఉన్న ఆకాశం (ఘటాకాశం) వేరుగా, బయట ఉన్నది (మహాకాశం) వేరుగా అనిపిస్తాయి. ఒక సారి ఘటం ముక్కలైపోతే మిగిలేది మహాకాశమే. ఇక్కడ ఆకాశం ప్రజ్ఞానానికి (బ్రహ్మానికి) ప్రతీక. ఒక్కటే ప్రజ్ఞానం అఖండంగా ఉంది. అజ్ఞానమనే మట్టితో కొన్ని కుండలు (జీవాత్మలు) ఏర్పడ్డాయి. ఆ అజ్ఞానపు ఆవరణ వలన “నేను వేరు, బయట వేరు” అనే భావన జీవాత్మలకు కలుగుతోంది. ఆవరణ లోపల ఉన్నది మాత్రమే “నేను” అనే భ్రమ జీవాత్మ అయ్యింది. ఆవరణ లోంచి బయటకు చూస్తే ప్రజ్ఞానమే చిత్రవిచిత్రంగా విక్షేపం (projected) అయ్యి ప్రపంచంగా కనిపిస్తోంది. ఒక సారి ఆ అజ్ఞానం ఛిన్నమైపోతే జీవుడూ, ప్రపంచం, బ్రహ్మమూ అంతా ఒకటే అని గోచరిస్తుంది.

ఒక వేదిక పైన ఇద్దరు మనుషుల సంభాషణ హేతుబద్ధంగా ఉండవచ్చును, నిజం అనిపించవచ్చును. ఒక్క సారి హేతుబద్ధంగా జరగవలసింది జరగకపోతే అది రంగస్థలం అని, వారిది నటన అని మనకు అనుమానం వస్తుంది. అలాగే, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికీ భౌతికంగా ప్రత్యక్షహేతువు (rationale) గోచరిస్తోంది. కానీ ఏ ఒక్క విషయాన్ని పరిపూర్ణంగా నిర్దేశించడం కుదరదు. ఒక్కోసారి పరిపూర్ణ ప్రయత్నానికి ప్రతిఫలం రాకపోతే మనం చేసేది కూడా నటన ఏమో అనిపిస్తుంది. ఈ నటన మనం చేస్తుంటే, ప్రపంచాన్ని అనుకోని మలుపులు (మెరుపులు) తిప్పుతున్నది ఎవరు? ఈ ప్రశ్నకు వేదాంతం ఇచ్చే సమాధానం ఈశ్వరుడు (సగుణ బ్రహ్మం). మామూలుగా బ్రహ్మానికి గుణాలు ఉండవు. ఉదాహరణకు బ్రహ్మం ఏ రంగులో ఉంటుంది అంటే, దానికి సమాధానం – “బ్రహ్మానికి రంగు లేదు” అని. బ్రహ్మానికి నిర్వచనం సత్ (ఎప్పటికీ ఉండేది, మారనిది), చిత్ (“నేను ఉన్నాను” అనే స్ఫురణ), (అనంతమైన) ఆనందం. మరి సగుణ బ్రహ్మం ఎవరు? అజ్ఞానం జీవాత్మకు ప్రపంచంతో పాటు, ఈశ్వరుడు అనే పాలకుణ్ణి చూపిస్తోంది. ఆ పాలకుడి దగ్గర “మాయ” అనే శక్తిని కూడా ఉందని చూపిస్తోంది. ఈ సగుణ బ్రహ్మాన్ని ఒక్కో జీవి (తన వాసనలను బట్టి) ఒక్కో లాగా చూస్తాడు. మాయ ఒకడికి శివుడిగా, మరొకడికి విష్ణువుగా, ఇంకొకడికి అమ్మవారిగా అనిపిస్తుంది. సగుణ బ్రహ్మానికి జీవాత్మ దృష్టిలో గుణాలు ఉంటాయి. నిజానికి – జీవాత్మ, ప్రపంచం, ఈశ్వరుడు అన్నీ ఒక్కటే – ప్రజ్ఞానం (బ్రహ్మం).

పంచభూతముల పంజరశుకమై
అలమట జెందిన నేనెవరో
ఏడు కొండలా ఎత్తున నిలిచి
బదులే పలుకని నీవెవరో!
ఇంతకు నాకు నీవెవరో!

చరమచరణంలో జీవుడు (కవి) తనకూ ఈశ్వరుడికీ ఉన్న సంబంధం ఏమిటి అని అడుగుతున్నాడు. వేదాంతానికి పునాది అయిన ఈ ప్రశ్నను ఇక్కడ లేవనెత్తాడు. ప్రతి ముముక్షువు (మోక్షాన్ని కాంక్షించేవాడు) పంచభూతాలతో చేసిన పంజరం (దేహం) లో చిక్కుకున్న చిలుకను నేను, పంజరం నుండి పంజరానికి మారుతూ దుఃఖపడుతున్నాను, నాకు శాంతి కావాలి!” అనే అనుకుంటాడు. జీవుడు ఎంత వేదన పడుతున్నా, ఏడు కొండలపైన ఉన్న వేంకటేశ్వరుడు (ఈశ్వరుడు) బదులు చెప్పట్లేదు. ఎందుకంటే ఈశ్వరుడిని గుర్తించాలంటే బయట కాదు, లోపల వెతకాలి. నిజమైన భగవదుపదేశం మౌనంలోనే ఉంది.† అందుకేనేమో ఇదే album లో మరొక పాటలో వేటూరి “మౌనమైన నీ జ్ఞానబోధలే కానక నివురున కలిసితిని” అన్నారు.

  • ఈ చరణంలో ఆఖరి రెండు పంక్తులకు చాలా అన్వయాలు గోచరించాయి. కొంచం సులభంగా అన్వయించుకోవాలి అంటే “సాక్షాత్తు ఆ ఈశ్వరుడే కృష్ణపరమాత్ముడై వేదాన్ని నాదంగా ఊదాడు. అప్పుడు ఆయనకు ఊపిరి అయ్యి, వేణువులో రాగజీవాన్ని పోసినది కూడా ఈ గాలే,” అని అనుకోవచ్చును. కానీ, “వేణువులు” అని బహువచనం ఉపయోగించడం, గతంలో వేటూరి “జీవన వేణువులూదగా” అని ప్రయోగించడం కారణంగా ఇలాగ అన్వయించాలి అనిపించింది.

‡ ప్రాణానికి, మనసుకు అవినాభావ (ఒకటి లేక మరొకటి లేదు) సంబంధం  ఉంది అని శాస్త్రం. అందుకే యోగులు, సాధకులు ప్రాణాయామం చేసి ఊపిరిని అదుపులో పెట్టుకుని, తద్ద్వారా మనసును అదుపులో ఉంచుకుంటారు.

† అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యులు “మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం” అన్నారు.

పై పాటని ఈ కింద లింకులో వినవచ్చు

వేటూరి రవిప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదములు వేటూరి.ఇన్ టీం

సందీప్.పి గారికి ధన్యవాదములతో వేటూరి.ఇన్ టీం

You May Also Like

One thought on “మనిషిగ పుట్టెను ఒక మట్టి(రచన-వేటూరి) – సందీప్.పి

  1. Thanks for sharing beautiful poetry and explanation andi. Please continue do the good work, Thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.