అపరంజి మదనుడే, అనువైన సఖుడులే!

తెలుగు సినిమాల్లో ఉన్న క్రీస్తు భక్తిగీతాల్లో ఒక ప్రత్యేకమైన గీతం “మెరుపు కలలు” చిత్రంలోని “అపరంజి మదనుడే” అన్నది. ఈ పాటకి ఎంతో మాధుర్యం, భక్తిభావం ఉట్టిపడేలా సంగీతాన్ని సమకూర్చడం రెహ్మాన్ గొప్పతనమైతే, క్రీస్తుని వినూత్నమైన  పదప్రయోగాలతో వర్ణించి స్పందింపజెయ్యడం వేటూరి గొప్పతనం. క్రిస్మస్ సందర్భంగా ఈ పాటని పరికించి పులకిద్దాం.

వేటూరి అంతకమునుపే “క్రీస్తు గానసుధ” అనే ప్రైవేటు ఆల్బంకి అలతి పదాలతో జనరంజకమైన పాటలు రాసి మెప్పించారు. తమిళంలో వైరముత్తు సాహిత్యానికి తెలుగు అనుసృజన చేసిన ఈ పాటలో కూడా సరళమైన పదభావాలనే వాడినా క్రీస్తుని వర్ణించడానికి ఎవరూ సాధారణంగా ఎంచుకోని శబ్దాలను వాడి ప్రయోగం చేశారు. ఈ ప్రయోగాలని అందరూ హర్షించకపోవచ్చు, కొందరు తప్పుపట్టొచ్చు కూడా! అయితే క్రీస్తుపట్ల తనకున్న నిష్కల్మషమైన భక్తిభావమూ, ప్రేమా తనదైన పద్ధతిలో ఆవిష్కరించుకునే ఓ భక్తురాలి ప్రార్థనే ఈ గీతం అని గ్రహించిన వారికి పాట పరమార్థం, వేటూరి హృదయం అర్థమౌతాయి. ఓ అద్భుతమైన ట్యూన్‌కి పవిత్రంగా పొదిగిన సాహిత్యానికి మనం స్పందించగలిగితే మనలోనూ ఓ భక్తిభావం అంకురిస్తుంది.

పాట పూర్తి సాహిత్యం ఇది (దురదృష్టవశాత్తూ రెహ్మాన్ చాలా తెలుగు పాటల్లానే ఈ పాటలో కూడా గాయని చాలా తప్పులు పాడింది. ఆ తప్పులని ఇక్కడ సరిజెయ్యడం జరిగింది):

అపరంజి మదనుడే, అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చె వలపంటివాడే

వినువీధిలో ఉండే సూర్యదేవుడునే, ఇల మీద ఒదిగినాడే

కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిశుపాలుడొచ్చినాడే   

 

అపరంజి మదనుడే, అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

పోరాటభూమినే పూదోటకోనగా పులకింపజేసినాడే  

 

కల్వారి మలనేలు కలికి ముత్యపురాయి, కన్నబిడ్డతడులేవే

నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి ఒడిలోన చేరినాడే

ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇలబాలుడొచ్చినాడే

ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే పుష్పమై తోడు నాకై

 

అపరంజి మదనుడే, అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చె వలపంటివాడే

 

అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

నిజానికి ఈ పాటా ఓ ప్రేమగీతమే! ఇక్కడ ప్రేమ భగవంతుని పట్ల ప్రేమ. అలనాడు బెత్లహాంలో పుట్టిన పసిబిడ్డడు, జనుల వెతలు తీర్చిన దేవుడై, శిలువనెక్కిన శాంతిదూతై, ఈనాటికీ ప్రపంచంలోని అత్యధికులకి చీకటిలోని వెలుగురేఖ అవుతున్నాడంటే అతనెంతటి మహనీయుడు! అటువంటి బాలఏసుని తలచుకుంటే నిలువెత్తు ప్రేమస్వరూపం గుర్తుకు రావాలి, తన సువార్త ద్వారా జీవితంలో అడుగడుగునా సఖుడైనట్టి దేవుడు కనిపించాలి. ఈ వాక్యాల్లో కనిపించే భావం అదే! అవును అతను “అపరంజి (బంగారు) మదనుడు (ప్రేమ స్వరూపుడు)”. అతని ప్రేమ స్వచ్ఛమైన బంగారపు తళతళ. జీవితంలోని ఎదురయ్యే సంఘర్షణల్లోనూ, సందిగ్ధాల్లోనూ అతని పట్ల విశ్వాసమే దారిచూపిస్తూ ఉంటే అతను కాక “తగిన స్నేహితుడు” (అనువైన సఖుడు, right companion) ఎవరు? ఇతని కంటే అందగాడు ఇంకెవ్వరు? ఇక్కడ అందం అంటే బాహ్యమైన అందం కాదు. అతని కరుణ నిండిన వీక్షణం అందం, అతని ప్రేమ నిండిన చిరునవ్వు అందం, అతని గుండె పలికిన ప్రతిపలుకూ అందం. అతనికంటే అందమైన వాళ్ళుంటారా?

 

వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చె వలపంటివాడే

క్రీస్తు జననం సాధారణ ప్రదేశంలో జరిగింది (పశువుల కొట్టంలోనని కొందరంటారు), ఏ రాజమహల్లోనో కాదు. ఆయన తొలుత సామాన్యులకీ, పేదలకీ దేవుడయ్యాడు కానీ అధికారులకీ, రాజులకీ కాదు. “వరిచేల మెరుపు” అనడం ద్వారా అప్పటి కాలంలోని ప్రధాన పంటైన వరిని, వరిచేలతో నిండిన ఆ నేలని ప్రస్తావించడం కన్నా, సామాన్యుల కోసం పుట్టిన అసామాన్యుడైన దైవస్వరూపంగా క్రీస్తుని కొలవడం కనిపిస్తుంది. చెక్కుచెదరని ధగధగ కాంతుల ప్రేమవజ్రం అతను. అతను ప్రపంచానికి వలపు సందేశం అందించడానికి అరుదెంచిన సర్వశ్రేష్టుడు (రత్నం; నవరత్నాల్లో వజ్రమూ ఒకటి. వజ్రాన్ని ముందే ప్రస్తావించాడు కాబట్టి ఇక్కడ రత్నాన్ని “అన్నిటి కన్నా శ్రేష్టమైన” అన్న అర్థంలో కవి వాడాడని అనుకోవడం సబబు)

 

వినువీధిలో ఉండే సూర్యదేవుడునే, ఇల మీద ఒదిగినాడే

కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిశుపాలుడొచ్చినాడే

ఇంతటి అనంత విశ్వంలో  కేవలం భూమి మీదే జీవరాశి ఎందుకు ఉండాలి (మనకి తెలిసి)? కొన్ని కోట్ల ఏళ్ళ పరిణామ క్రమంలో ఈ జీవరాశుల్లోంచి ఓ మానవుడు అద్భుతంగా ఎందుకు రూపుదిద్దుకోవాలి? ఎంతో బుద్ధి కలిగిన ఈ మానవుడే మళ్ళీ తెలివితక్కువగా తన దుఃఖాన్నీ, వినాశనాన్నీ తనే ఎందుకు కొనితెచ్చుకోవాలి? అలా దారితప్పిన మానవుడికి త్రోవచూపడానికి ఓ దేవుడులాంటి మనిషి ఎందుకు దిగిరావాలి? ఎందుకు ఎందుకు? శాస్త్రజ్ఞులు, “అదంతే! కారణాలు ఉండవు!” అనొచ్చు. కానీ ఓ భక్తుడి దృష్టిలో ఇదంతా దేవుని కరుణ. ఆకాశంలో ఉండే సూర్యుడికి నిజానికి భూమితో ఏమీ పని లేదు, భూమిని పట్టించుకోనక్కరలేదు. కానీ సూర్యుడు లేకుంటే భూమిపైన జీవరాశే లేదు. అలా సూర్యుడిలా కేవలం తన ప్రేమ వల్ల జనులని రక్షించడానికి దిగివచ్చిన అపారకరుణామూర్తి క్రీస్తు! నేలపైన వెలిగిన సూర్యుడు! జనుల బాధలనీ, శోకాలనీ, కష్టాలనీ ఇలా అన్ని కన్నీళ్ళనీ తన చల్లని ప్రేమామృత స్పర్శతో కడిగిన దేవుడు. ఈ బాలకుడే కదా లోకపాలకుడు (శిశుపాలుడు)!

 

పోరాటభూమినే పూదోటకోనగా పులకింపజేసినాడే!

చరిత్ర చూడని వినాశనం లేదు. మనుషులు రాక్షసులై జరిపిన హింసాకాండలెన్నో. ఈ యుద్ధోన్మాదం మధ్య సుస్వర సంగీతంలా, ఎడారిలో విరిసిన పూదోటలా, తన ప్రేమసందేశంతో జగానికి శాశ్వత మార్గాన్ని చూపినవాడు క్రీస్తు. హింసని ప్రేమతో ఎదుర్కొని, చిరునవ్వుతో శిలువనెక్కి, మరణం లేని మహిమాన్వితుడిగా వెలిగిన చరితార్థుడు.

 

కల్వారి మలనేలు కలికి ముత్యపురాయి, కన్నబిడ్డతడులేవే

నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి ఒడిలోన చేరినాడే

కల్వారి కొండ (Calvari Hill) అన్నది క్రీస్తుని శిలువ వేసిన ప్రదేశం. అంతటి కొండా భక్తుల గుండెల్లాగే శిలువనెక్కిన క్రీస్తుని చూసి కన్నీరైతే, ఆయన నమ్మిన వారిని రక్షించడానికి మరణాన్ని దాటి పునరుత్థానుడయ్యాడు. ఆ కొండపైన శిలువ వేయబడిన ఏసు ఆ కొండనే ఏలుతూ (మలనేలు – మలని + ఏలు, మల అంటే కొండ) స్వచ్చమైన తెల్లని ముత్యంలా మెరిశాడట! ఎంత అందమైన కల్పన!

ఈ “కలికి ముత్యపు రాయైన” క్రీస్తు భక్తులకి కన్నబిడ్డ లాంటివాడట! ఇందాకే బాలఏసు తండ్రి లాంటి పాలకుడయ్యాడు, ఇప్పుడు ఒడిలోన కన్నబిడ్డ అయ్యాడు! తండ్రీ బిడ్డా రెండూ ఆయనే. ఒడిలోని పసిపాపని చూసి ఓ తల్లికి కలిగే ఆనందం వర్ణనాతీతం. ఎంతటి బాధనైనా తక్షణం మటుమాయం చేసే గుణం పాప నవ్వుకి ఉంటుంది. “ఇంకేమీ లేదు, సమస్తమూ నా కన్నబిడ్డే” అనిపిస్తుంది. ఆ బిడ్డే దేవుడూ అయినప్పుడు కలిగే భరోసా “నూరేళ్ళ చీకటిని ఒక్క క్షణంలో పోగొట్టేదే” అవుతుంది!

ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇలబాలుడొచ్చినాడే

ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే పుష్పమై తోడు నాకై

ప్రేమే తెలియని కరకు, ఇరుకు గుండెలకి ప్రేమంటే తెలియజెప్పిన శాంతిదూత క్రీస్తు. ఇలకి దిగివచ్చిన ఈ బాల దేవుణ్ణి “అనురాగ మొలక” గా వర్ణించడం ఎంతో చక్కగా ఉంది.

ఇలా ప్రేమ మూర్తిగా, స్నేహితుడిగా, పాలకుడిగా, కన్నబిడ్డగా పలు విధాల క్రీస్తుని కొలుచుకోవచ్చు. భక్తుడి బాధ తీర్చే పెన్నిధీ ఆయనే, భక్తుడు ఆనందంలో చేసే కీర్తనా ఆయనే. చీకటనుండి చేయిపట్టి నడిపించే వెలుగురేఖా ఆయనే, అంతా వెలుగున్న వేళ మెరిసే ఇంధ్రధనుసూ ఆయనే. సర్వకాల సర్వావస్థల్లోనూ పూజకి పువ్వులా దొరికాడు కనుకే “ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే” అనడం. “ముక్కారు” అంటే “మూడు కాలాలు” అని అర్థం. అన్ని కాలాల్లోనూ, అన్ని కష్టాల్లోనూ తోడుండే దేవుడు ఆయనే!

ఈ పాటని యూట్యూబులో ఇక్కడ వినొచ్చు. ఇది కేవలం క్రైస్తవులకే చెందిన పాట కాదు. భక్తిలోని ఓ చిత్రం ఏమిటంటే, మొదట్లో భగవంతుడు, భక్తుడు, భక్తి అని వేరువేరుగా ఉన్నా, చివరకి కేవలం భక్తే మిగులుతుంది. ఆ స్థితిలో కృష్ణుడు, క్రీస్తు, అల్లా అని తేడాలుండవు. ఇలా ప్రేమని పెంచి, ఏకత్వాన్ని సాధించి జనులని నడిపించే భక్తి నిజమైన భక్తి అవుతుంది. అలాంటి భక్తి మాధుర్యం ఈ పాటలోనూ ఉంది.

(తొలి ప్రచురణ సారంగ పత్రికలో)

You May Also Like

One thought on “అపరంజి మదనుడే, అనువైన సఖుడులే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.