శృంగార గీతాల రచనలో వేటూరిది ప్రత్యేకమైన శైలి. రసరమ్య గీతాల నుంచీ, నాటు పాటల వరకూ ఏ రకమైన శృంగార గీతాలు రాసినా ప్రతి పాటలోనూ ఎంతో కొంత కవిత్వం, సౌందర్యదృష్టీ చొప్పించే శైలి అది. ఈ శృంగార గీతాల్లో పదుగురితో పంచుకునేవి కొన్ని, సన్నిహితులతోనే పంచుకోవాల్సినవి కొన్ని, ఎవరికి వారే ఆస్వాదించాల్సినవి కొన్ని! అయితే పదుగురితో పంచుకోదగ్గ కొన్ని అతి చక్కని వేటూరి పాటలు కూడా పెద్దగా ప్రాచుర్యం పొందక మరుగున పడిపోయాయి. “విద్యాసాగర్” స్వరకల్పనలో “ఒట్టేసి చెప్తున్నా” చిత్రానికి వేటూరి రాసిన అలాంటి ఓ శృంగార మాధురీ గీతాన్ని పరికించి పులకిద్దాం రండి!
ఇద్దరు ప్రేమలో పడ్డ యువతీయువకులు! సాయంసంధ్య వేళ! ప్రకృతి మనోహరంగా ఉంది. ఇద్దరి గుండెల్లో ప్రేమా, ఆరాధనా, ఆరాటం. ఎంత చెప్పుకున్నా మిగిలిపోయే మాటలు, ఎంత సేపు చూసుకున్నా తనివి తీరని చూపులు, ఎంత దగ్గరైనా పూర్తిగా దగ్గరి కాలేనితనం! ఇలాటి సందర్భాల్లోనే పాట పనికివచ్చేది. ముందుగా అబ్బాయి చిలిపిగా అందుకున్నాడు –
పల్లవి:
అబ్బాయి: వెన్నెల్లో వేసంకాలం, ఎండల్లో శీతాకాలం, నీ ఒళ్ళో సాయంకాలం, హాయిలే హలా!
వేసవికాలంలో వెన్నెలా, శీతాకాలంలో లేత ఎండా ఎంతో హాయిగా ఉంటాయి. అయితే ఇక్కడ వేటూరి చెప్తున్నది కొంచెం వేరు. “వేసవికాలంలో వెన్నెల హాయి” అనలేదు, “వెన్నెల్లో వేసవికాలం హాయి” అంటున్నాడు! అంటే వెన్నెల వల్లే వేసవికి అందం వచ్చి, హాయి కలిగింది అన్నమాట! అలాగే లేత ఎండవల్లే శీతాకాలం శోభిల్లుతోంది. అచ్చం అలాగే ఆ అమ్మాయి సన్నిధిలో ఉంటూ, తన ఒళ్ళో తలవాల్చి ఉన్నప్పుడు, “అబ్బా! సాయంకాలం ఎంత బావుందో సుమా!” అనిపిస్తోందట అబ్బాయికి! ఇలా పొగిడితే ఏ అమ్మాయికి నచ్చదు చెప్పండి?
అమ్మాయి: కన్నుల్లో తొలి కార్తీకం, కౌగిట్లో కసి తాంబూలం, సరసంలో సంధ్యారాగం సాగునే ఇలా!
ఇక అమ్మాయి కూడా పాటలో జతకలిసింది అబ్బాయికంటే చిలిపిగా! కన్నుల్లో కార్తీక మాసపు వెన్నెల్లాంటి వెలుగట! అది ప్రియుణ్ణి చూసినందుకు వచ్చిందో, లేక తియ్యని ఊహల కాంతో మరి! ఇద్దరూ కౌగిలిగా పెనవేసుకున్నప్పుడు వెచ్చని ప్రేమ తాంబూలాలు అందాయట! ఇలా సరస సాయంసంధ్యా సరాగాలు రోజూ సాగుతూ ఉండడం ఎంత బావుందో అంటోంది! ఏమి జాణతనం!
అబ్బాయి: ఏకంగా ఏలే రాజ్యం, ఎదలోనే వ్రాసే పద్యం, ఆశల్లో పోసే ఆజ్యం, కాదులే కలా!
లాలి లాలి లాహిరి – ఇదేమి లాహిరి!
అమ్మాయి: లాలి ఎంత పాడినా ఇదేమి అల్లరి!
“ఆహా, ఈ రోజు అమ్మాయి మంచి జోరుమీద ఉంది కదా!” అనుకుని ఆ అబ్బాయి కూడా ఊపందుకుని కొంచెం చిలిపితనాన్ని పెంచాడు. పెళ్ళి అయ్యాక జరిగే సంగతుల ఊహల్లో మునిగాడు. వారిద్దరూ ఏకమై ఏకాంతంగా ఏలే రాజ్యాన్నీ, ఆ ఏకాంత అనుభూతులన్నీ ఎదలో శాశ్వత కవితలై నిలిచే వైనాన్నీ, అలుపంటూ లేక ఆజ్యంపోసి మరీ పెంచే కోరికలనీ, ఇలా దొరకబోయే కానుకలన్నీ తలచుకుంటూ అవన్నీ కల కాదు సుమా అంటున్నాడు! అబ్బాయిలతో వచ్చే చిక్కు ఇదే! అమ్మాయి కొంచెం సరదా చూపిస్తే శ్రుతి మించిపోతారు! ఇలా “ఈ తీయని ఊహల లాహిరి ఎంత బావుందో!” అని అబ్బాయి మురిసిపోతూ ఉంటే, “చనువిచ్చాను కదా అని మరీ అల్లరి ఎక్కువ చెయ్యకు” అని అమ్మాయి ఓ హెచ్చరిక జారీ చేసింది!
అబ్బాయి: పండనీ పదే పదే పెదాల తిమ్మిరి!
అమ్మాయి: పండనీ పదే పదే పెదాల తిమ్మిరి!
“సరే, కనీసం ముద్దులనైనా పండించనీ!” అన్నాడు అబ్బాయి (ఇక్కడ ముద్దుని “పెదాల తిమ్మిరి” అనడం వేటూరి చిలిపితనం!). అదీ పదే పదే! దీనికి అమ్మాయి అభ్యంతర పెట్టినట్టు లేదు. ఎంతైనా ముద్దు అందరికీ ఆమోదయోగ్యమే కదా!
చరణం 1:
అబ్బాయి: నీ తోడులేనిదే నాకు తోచదు
అమ్మాయి: నీ నీడ కానిదే ఊపిరాడదు
నీ తోడు లేకుంటే నాకసలు తోచదని ఒకరు అంటే, నీ నీడ కాకుంటే ఊపిరే ఆడదని ఇంకొకరు! ఈ భావం కొత్తదేమీ కాదు గానీ ట్యూనులో వింటే ఎంతో ప్రేమగా మార్దవంగా పలికేలా పదాలు పొదిగిన వేటూరికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం! సరే, ఇలాంటి విడదీయలేని గాఢమైన ప్రేమ మొదలైంది అంటే ఇక పెళ్ళికి సమయం దగ్గర పడిందనే!
అబ్బాయి:కోకిలమ్మ పాడింది కొమ్మకొక్క సన్నాయి
అమ్మాయి: కొంగుముళ్ళు కోరింది కోకచాటు అమ్మాయి
అబ్బాయికి కొమ్మకొమ్మనా కోయిల పాటలు, ఆ పాటల్లో పెళ్ళి సన్నాయి వినిపిస్తున్నాయి. తొందర అలాంటిది మరి! కానీ అమ్మాయికి కొంచెం భద్రతాభావం కావాలి. “అప్పుడే పెళ్ళైపోయినట్టు అల్లరి మొదలెట్టెయ్యకు! ఇంకా కొంగుముళ్ళు పడాలి” అంటోంది. “కోకచాటు అమ్మాయి” అనడంలో అమ్మాయి కోరుకునే భరోసాని సూచించడంతో పాటూ శృంగారమూ పలికించాడు వేటూరి!
అబ్బాయి: చెలి చూపు రాసె తొలి ప్రేమలేఖ!
అమ్మాయి: పొలిమేర దాటే చలికాగలేక!
అబ్బాయి: విరజాజి పూల వాసనే వంతెనేయగా!
సరే! పెళ్ళయ్యే వరకూ విరహం తప్పదు కదా! అప్పటి వరకూ చెలిచూపుల ప్రేమలేఖలే శుభలేఖలుగా అందుకోవాలి. ఆ ప్రేమలేఖ “తనని తానుగా ఉండనివ్వని ఊహల జోరుకి తాళలేక” ఆ అమ్మాయి రాసినది! అంతటి ప్రేమా విరహం నిండిన ఘాటైన ప్రేమలేఖ అన్నమాట! (దీనినే వేటూరి “పొలిమేర దాటే చలికాగలేక” అంటూ తనదైన శైలిలో చిలిపిగా పలికించాడు). ఈ విరహాన్నీ, ఈ దూరాన్నీ తగ్గించమని ఆ అమ్మాయి జడలోని జాజిపూలని అబ్బాయి వేడుకుంటే, తమ సువాసననే ఇద్దరికీ మధ్య వంతెనగా వేసి కలిపాయట ఆ విరజాజి పువ్వులు! ఎంత అద్భుతమైన భావం! సాహో వేటూరి, సాహో!
చరణం 2:
అమ్మాయి: జాజిపూల గాలితో జాబులంపినా
అబ్బాయి: జాబిలమ్మ గిల్లుడే ఆగనంటది
పొద్దుపోయి రాతిరయ్యింది, చందమామ వచ్చాడు! చిక్కులు మొదలయ్యాయి! ఈ జాబిలి మహా టక్కరోడు. విరహంతో ఉన్నవాళ్ళని చూసి వినోదిస్తూ, విరహం పెంచుతూ ఉంటాడు. కాబట్టి జాజిపూల పరిమళంతో వంతెన వేసినా, జాబులు పంపినా జాబిలమ్మ “గిల్లుడు” ముందు ఏవీ పనికిరావట్లేదు!
అమ్మాయి: ఆకలమ్మ ఏనాడో కడుపు దాటిపోయింది
అబ్బాయి: దాహమంత కళ్ళల్లో దాగి నిన్ను తాగింది
ఈ విరహవేదన కూడా ఒకరకమైన ఆకలే. అది కడుపుకు సంబంధించిన ఆకలి కాదు. ఆ ఆకలి ఎప్పుడో పోయింది. ప్రేమించిన వాళ్ళకి ఆకలీ దాహం ఉండవని తెలుగు సినిమా కవులు చెప్పలేదూ మనకి? ఈ ఆకలి తనువూ, మనసూ, అణువణువూ పరుచుకున్న ఆకలి. ప్రేమ రసాస్వాదనలోనే, ప్రియ సమాగమంలోనే తీరే ఆకలి! ఇక దాహం కూడా గొంతుదాటి కళ్ళలోకి చేరింది. ప్రియురాలి ప్రేమస్వరూపాన్ని చూస్తూ అమాంతం ఆ ప్రణయామృతాన్ని గ్రోలితే కానీ తీరేది కాదు! ఎంత గొప్ప శృంగార భావాలివి! ఎంత అందంగా, కవితాత్మకంగా చెప్పాడో వేటూరి ఇక్కడ.
అమ్మాయి: విరహాల ఏటి కెరటాలు దాటి
అబ్బాయి: మరుమల్లె పూల వరదల్లో తేలి
అమ్మాయి: ఒడి చేరుకున్న ప్రేమలా వాలిపో ఇలా!
“ఆ కళ్యాణ ఘడియలు రాకుండా పోవు, ఈ విరహాల ఏటి కెరటాలు దాటకుండా పోము. దాటాక ఇంకొక్క వరదొచ్చి పడుతుంది. అది మరుమల్లె పూల వరద, ముంచెత్తే ప్రేమ వరద. హాయిగా మునిగి తేలదాం. చివరికి చేరుకునే ఒడ్డు ప్రేమ ఒడే! ఆ ప్రేమ ఒడిలో కలకాలం ఇలా మధురగీతాలు ఆలపించుకుంటూ ఉండిపోదాం! రా ప్రియా రా, వచ్చి వాలిపో!” – ఇవి ఆ ప్రేమికులు ఒకరితో ఒకరు చేసుకున్న బాసలు! వేటూరి మనకి చేసిన ఉద్బోధలు! వినిపించుకున్న వారు రసజ్ఞులు, బ్రతుకులో పండించుకున్నవాళ్ళు ధన్యులు!
విద్యాసాగర్ ఇచ్చిన సుమధురమైన బాణీలో, ఎస్పీబీ – సాధనా సర్గంలు ఎంతో చక్కగా పాడిన ఈ వేటూరి పాటని కింద వీడియోలో చూసి/విని ఆస్వాదించొచ్చు
————————————————————————
ఫణీంద్ర గారు రాసిన అసలు వ్యాసం ఈ కింద లింక్ లో కూడా చూడచ్చు.