విశ్వనాథ విద్వద్వైభవము! (వేటూరి)

విశ్వనాథ వారికి 1970-71 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా వేటూరి వారు వ్రాసిన వ్యాసం

Visawanatha Satyanarayana garu

 

విశ్వనాథ వారికి 1970-71 సంవత్సరానికి గాను  జ్ఞానపీఠ పురస్కారాన్ని కొద్ది రోజుల క్రితం ప్రకటించినప్పుడు ఆయన “నిజానికి నాకీ పురస్కారం ఆరేళ్ళ క్రితమే దక్కి ఉండాలి” అన్నారుట! నిజమే, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తన ప్రతిభనెన్నడూ తక్కువ చేసుకు మాట్లాడిన దాఖలాల్లేవు. స్వయంకృషితో, సాధనతో ఒక్కొక్క మెట్టూ దాటుకుంటూ తెలుగు సాహిత్య శిఖరాలను అధిరోహించిన ఘనత వారి సొంతం. సాహితీ ప్రస్థానపు తొలినాళ్ళలో సహచరులు కొందరు ఆయనకున్న సంస్కృతాంగ్ల పరిజ్ఞానాన్ని చులకన చేసి మాట్లాడిన కారణానికేనేమో, ఆయనకి తీవ్రమైన ఆత్మాభిమానం మాత్రం ఏర్పడిపోయింది.

ఆ రోజుల్లోని వర్థమాన కవులందరిలానే ఆయనా దేశభక్తి గీతాలతోనే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. దేశభక్తిని, ప్రాంతీయాభిమానాన్ని కవితాత్మకంగా వ్యక్తీకరించేందుకు ఆనాటి కవులందరూ పోటీ పడుతున్న రోజుల్లో ఆయన రచించిన “ఆంధ్ర ప్రశస్తి” ఆయనకు ప్రశస్తిని తీసుకు వచ్చినా, ఈ కీర్తిని తుమ్మల సీతారామమూర్తి, రాయప్రోలు సుబ్బారావు వంటి వారితో పంచుకోవలసి వచ్చింది. ఆ తరువాత భావకవిత్వపు పూలపరిమళం తెలుగుసాహిత్యమంతా పరచుకున్నప్పుడు, మత్తెక్కని తెలుగు కవి లేడు. కొందరు షెల్లీ కవిత్వపు ఛాయల్లో తలదాచుకుంటే, ఇంకొందరు కీట్స్ వెంటపడ్డారు. మరికొందరు వర్డ్స్ వర్త్‌ని అనుకరించారు. ఇలా మనకు తెలుగు షెల్లీలు, కీట్సులు, వర్డ్స్ వర్తులు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చారు. ఒక వర్గం కవులు ఒక అడుగు ముందుకేసి కొంత అక్కడా, కొంత ఇక్కడా అన్నట్టు ఇరుభాషా ప్రాజ్ఞులనీ అనుసరిస్తూ వీలైనంత గొప్పగా వ్రాయాలని ఉబలాటపడ్డారు. మరి కొందరు ఘనులు ఈ ఆంగ్ల భావకవిత్వమంతటనీ మధించి, ఆ భావాలను తోచిన రీతిలో తెలుగులో వెళ్ళగక్కారు. మొదటి పంక్తిలో వర్డ్స్‌వర్త్‌నీ, రెండో పంక్తిలో షెల్లీని నిస్సిగ్గుగా అనువదించుకుని కవితలు వ్రాసుకున్న వారెందరో. విశ్వనాథ సైతం తమ సమకాలికుల దారిలోనే నడచి భావకవిత్వాన్నే ఆశ్రయించినా, తన శైలిని మరే ఇతర ఆంగ్ల కవి శైలికీ నకలుగా చెప్పలేని స్థితి కల్పించడంలోనే, ఆయన కవిత్వ విలక్షణత దాగి ఉంది. వారి “గిరికుమారుని ప్రేమగీతాలు”, “శృంగార వీధి” వంటి పద్యకావ్యాలు పాశ్చాత్య భావకవిత్వపు వాసనలు అంటని ఆత్మానుభవ నవసుమాలు. గమనిస్తే, వారి భావకవిత్వమంతటా కూడా సాంప్రదాయ కవిత్వ ధోరణి ప్రబలంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఈయన తొలినాళ్ళ రచన, అత్యంత లయాత్మకంగా సాగిన “కిన్నెరసాని” లో విశేషంగా ఈ సాంప్రదాయ ప్రతీకలూ, శైలి కనపడుతూ ఉంటాయి. లీలామాత్రమే అయినప్పటికీ, ఈ ప్రాచ్య (టాగోర్), పాశ్చాత్య ప్రభావాలన్నింటిని, అతి వేగంగా దాటుకు వచ్చేశారు విశ్వనాథ. సామాన్యంగా తోచిన తన విశ్వాసాల పట్ల అనురక్తినీ, ప్రయోగాత్మకతనూ, విభిన్నతనూ కూడా ఆయన క్రమేణా కాదనుకున్నారు. అంతకు మించి, ఒక స్థిరమైన, సాంద్రమైన పునాదుల ఆధారంగా రచనా ప్రక్రియను కొనసాగించారు.

విశ్వనాథ నవలలు కూడా వ్రాశారు. అయితే అవి కవిత్వం వ్రాయలేని రోజుల్లో, విరామం ప్రకటించుకుని చేసిన కాలక్షేపం రచనలు కావు. నిజానికి, కవిత్వం చెప్పినంత సహజంగానూ నవలలు వ్రాసి మెప్పించడమూ, కొన్ని వచన రచనల్లో తన కవిత్వ సంపుటాలలో కూడా దొరకనంత కవిత్వ ధోరణినీ జొప్పించడమూ ఆయనకే చెల్లింది. విశ్వనాథ వారి నవలలలో తొలుతగా ప్రచురించబడినదీ, ప్రముఖమైనదీ అయిన ఏకవీర నిజమైన, నిఖార్సైన కవిత్వంతో నిండి ఉన్నది.  విశ్వనాథ సర్వోత్కృష్ట వచన రచన అయిన “వేయిపడగలు” నవల తెలుగు సాహిత్య అభిమానులందరినీ వారికి ఋణపడిపోయేలా చేసింది. టాగోర్ తాను పాడలేని వేళల్లో నవలలు వ్రాస్తానని ఓ సందర్భంలో అంటాడు (ముద్దాడలేని పెదవులే పాడతాయని మరో పాశ్చాత్య కవి అన్న రీతిలోనే). టాగోర్ నవలలు కొన్ని ఈ మాటలను నిర్ధారించేవిగానూ ఉంటాయి. తెలుగు సాహిత్య విమర్శకులు కొందరు విశ్వనాథ రచనలను టాగోర్ రచనలతో పోల్చి చూశారు. ఇటువంటి పోలిక టాగోర్ పట్ల అనుచితమైనదిగానూ, విశ్వనాథను అవమానించేదిగానూ భావించవలసి ఉంటుంది. నవలాకారుడిగా విశ్వనాథ శైలి సర్వస్వతంత్రంగా ఉంటూనే అత్యంత మనోరంజకంగా ఉండడంలో తనదైన ముద్రను వేసుకుని ఉన్నది. విస్తృతంగా అనుకరించబడినా, అనుసరణకు లొంగని శైలిగానే మిగిలిపోయిందది. అయితే, విశ్వనాథ నవలా రచనలను పరిపూర్ణతకు ఒకింత దూరంలో నిలబెట్టే నెరసొకటి ఉంది. అది, విమర్శకుల పరిభాషలో చెప్పాలంటే, ఆ రచనలు ప్రతిస్పందనాత్మకం (reactionary) కావడం. ప్రతిస్పందనాత్మక భావజాలం కన్నా, ప్రతిస్పందనా, సమర్థనా, వాదవివాదాలతో నిండిన వారి కథనశైలి కళారచనలోని రసజ్ఞతకు ఎక్కువ భంగం కలిగించింది. విశ్వనాథ నవలలో కొన్నింటిని ప్రగతిశీలమైన, విప్లవాత్మక ధోరణి కలిగిన చలం నవలలకు బదులుగా భావించే వారున్నారు. అయినప్పటికీ, విశ్వనాథ తన వైదుష్యవైభవంలో సింహభాగం నవలా రచన ద్వారానే సాధించారనడం అతిశయోక్తి కాదు. వైదిక ధర్మం యొక్క సప్రమాణికత పట్ల స్థిరమైన నమ్మకాన్ని కలిగి ఉంటూనే, మన గతం వైపు సునిశితమైన చూపుని విసిరి, ఆ స్వకాల ప్రాంతాల పట్ల ప్రీతిని కలిగించే రచనలు వారివి.

జీవితకాలపు సాధనా ఫలితంగా రామాయణ కల్పవృక్షాన్ని రచించిన కవి విశ్వనాథ. ఆంధ్ర మహాభారతానికి లభించిన స్థాయి కానీ, ప్రజాదరణ కానీ, ఏ ఒక్కరి రామాయణ తెలుగు సేతకీ లభించలేదన్నది నిర్వివాదాంశం. నిజానికి రామాయణం తెలుగు అనువాదాలన్నీ కాలప్రభావానికి మరుగున పడిపోక తప్పలేదు. ఆంధ్రమహాభారత స్థాయిని పొందలేకపోయినా, ఈ రెండింటినీ పోల్చి చూడటం ఏ విధంగానూ లాభించదనడం నిజమే అయినా,  విశ్వనాథ కల్పవృక్షం తెలుగు సాహిత్యానికి, మరీముఖ్యంగా శ్రీరామ కథకూ నిస్సందేహంగా  అదనపు శోభను చేకూర్చింది. మరో వైపు, మూలంలోని వాల్మీకి కథకు దూరంగా జరగడంలో విశ్వనాథ స్వతంత్రతను తెలుగు సాహిత్యకారులు సాదరంగా స్వీకరించలేకపోయారు. అయితే, మూలానికి నిబద్ధుడు కానందుకు కవిని విమర్శించినందువల్ల ఏ ప్రయోజనమూ లేదు. అక్షరమక్షరమూ మూలానికి లోబడి వ్రాసినా, లెక్కకు మిక్కిలిగా ఉన్న మన రామాయణ తెలుగు అనువాదాలు చాలా మటుకు  మూలంలోని ఆత్మను పట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాయి. విశ్వనాథలా స్వతంత్రించి మూలానికి అవసరమనుకున్నప్పుడల్లా దూరం జరుగుతూ కావ్య రచన చేసిన వాళ్ళూ లేకపోలేదు. నిజమైన ప్రశ్న, పరీక్ష – వీరందరూ రచనని పరిపూర్ణమైన కళారూపంగా మలచగలిగారా లేదా – అన్నది మాత్రమే. తమ తమ పక్షపాతధోరణితోనూ, నిర్హేతుకమైన ఆలోచనలతోనూ, విగ్రహారాధనతోనూ సంతృప్తి పొందో, సమర్ధించుకుంటూనో తెలియదు కానీ, ఈ ప్రశ్నను మాత్రం ఎవ్వరూ సంధించినట్టు కనపడదు.

విశ్వనాథ కేవలం మహోన్నత సాహిత్యకారుడు మాత్రమే కాదు. తెలుగునాట తనదైన చరిత్ర సృష్టించుకున్న చరితార్థుడు కూడా! బెర్నార్డ్‌షా తన జీవితకాలంలో సాధించినంత స్థాయినీ కీర్తినీ విశ్వనాథ ఈనాడు అనుభవిస్తున్నారు. ఎంత మంది శత్రువులను సంపాదించుకున్నారో అంతకు మించిన భక్త బృందాలనూ సమకూర్చుకున్నారు. ఎంతటి ప్రచండ వాగ్వివాదంలో చొరబడడానికైనా వెనుకాడని ధీర వ్యక్తిత్వం విశ్వనాథ సొంతం. విమర్శలకు వెరవని అభిప్రాయ ప్రకటన, ముక్కుసూటి సమాధానాలూ ఆయన నైజం. అలనాడు మాక్స్ బీర్‌బాం షా గురించి చెప్పిన మాటలే విశ్వనాథ వ్యక్తిత్వానికీ సునాయాసంగా వర్తిస్తాయి – “ఆయన అమరుడు”!


 

వేటూరి గారు వ్రాసిన అసలు (తెలుగు) వ్యాసం దొరకలేదు కావున వేటూరి గారి మిత్రులు శ్రీ ఎస్.రాధాకృష్ణమూర్తి గారు ఆంగ్లీకరించిన ఈ ఇంగ్లీష్ వ్యాసానికి స్వేచ్చానువాదం చేసి ప్రచురిస్తున్నాం

ఫణీంద్ర గారికీ,మానస చామర్తి గారికీ ధన్యవాదాలతో వేటూరి.ఇన్
ప్రత్యేక ధన్యవాదాలు వేటూరి రవిప్రకాష్ గారికి

You May Also Like

One thought on “విశ్వనాథ విద్వద్వైభవము! (వేటూరి)

  1. Many Thanks to Dear Phanindra and Manana Chamarthy for taking mush time and effort in translating the english version, it as good as and true to the original version,
    you have done a great job,
    Many Thanks and Warm Regards,
    Veturi Ravi Prakash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.