చిత్రం: సాగర సంగమం
రచన: వేటూరి
సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్.జానకి
——————————–
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళాపూర్ణోదయా లయనిలయా
పంచభూతములు ముఖపంచకమై
ఆరుఋతువులూ ఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వర సప్తకమై
నీ దృక్కులే అటు అష్టదిక్కులై నీ వాక్కులే నవరసమ్ములై
తాపసమందార నీ మౌనమే
దశోపనిషత్తులై ఇల వెలయ
త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమథాదులు నీ సంకల్పానికి ఋత్విజ వరులై
అద్వైతమే నీ ఆదియోగమై నీ లయలే ఈ కాలగమనమై
కైలాస గిరివాస నీ గానమే జంత్రగాత్రములు శ్రుతికలయ
వేటూరి, విశ్వనాథ్ ల కలయికలో వచ్చిన అత్యద్భుతమైన పాటల్లో ఈ పాట ఒకటి. వేటూరికి సహజంగా శివభక్తి, మెండుగా ఉన్నాయనుకొంటా. ఎందుకంటే ఆయన శివుడి గురించి రాసిన కిరాతార్జునీయం, శివశివ శంకరా (భక్తకన్నప్ప), రాదిగిరా (సిరిసిరిమువ్వ), శంకరా(శంకరాభరణం), మొదలైన పాటలు చాలా అందంగా రమణీయంగా ఉండటమే కాకుండా అందులో ఎంతో శివతత్త్వం దాగి ఉంటుంది.
విశ్వనాథ్ గారి సినిమాల్లోని పాటల్లో (వేటూరి రాయనివి)కూడా ఆదిభిక్షువు(సిరివెన్నెల), శివపూజకు చిగురించిన (స్వర్ణకమలం), తెలిమంచుకరిగింది (స్వాతికిరణం), రమావినోదివల్లభా (స్వరాభిషేకం) (రచన: సామవేదం షణ్ముఖశర్మ) వంటి పాటలు ఆయనకున్న శివాభిలాషను తెలియజేస్తాయి. అందుకు కారణం నాట్యానికి నటరాజు కావటం వల్ల, నాదరూపుడూ ఓంకారరూపుడూ అవడం వల్ల సంగీతానికీ కూడా శివుడే గురువు, ఆద్యుడూ అవటం, ప్రధానంగా విశ్వనాథ్ గారికి ఈ రెండు కళలంటే ఎక్కువ అభినివేశం ఉండటం ఒక కారణం అయ్యుండచ్చు.
“ఓం నమఃశివాయ” పరమపావనమైన పంచాక్షరి తో ప్రారభించారు వేటూరి.
చంద్రకళాధర – తలపై అలంకారంగా, చిన్న పువ్వును దాల్చినట్టు, చంద్రకళను ధరించిన వాడా
సహృదయా – మంచి మనస్సు కలవాడా .
ఆహా ఇదే ఈ పాట మొత్తానికి పరమోత్కృష్టమైన మాట. దేవుడు మంచివాడుట. కాదా మరి? కాకపోతే మన ఆటలు సాగుతాయా? మన మనస్సుల్లో ఉన్న ఆవేశాలు, ఆపసోపాలు, అందాలూ, బంధాలూ, కొన్ని గుణాలూ, పెక్కు దోషాలూ అన్నీ తెలిసి కూడా, మనల్ని అర్ధం చేసుకుని ఎప్పుడూ మనకి అందుబాటులో ఉండేవాడు కదా. అన్నమయ్య ‘కొండలలో నెలకొన్న’ కీర్తనలో అంటాడు కదా “ఎంచ ఎక్కుడైన వేంకటేశుడు మనలను “మంచివాడై” కరుణ పాలించిన వాడు” అని, ఆ స్ఫూర్తి, నమ్మకమూ వేటూరి చేత ఈ మాట పలికించాయి.
ప్రాచీన శ్లోకం ఒకటి ఉన్నది
“ఆంగికం భువనం యస్య – ఎవని ఆంగికము అంటే చేతుల పాదాల కదలికే ఈ సమస్తవిశ్వమో
వాచికం సర్వ వాగ్మయం – ఎవని పలుకులే వేదము మొదలుకొని నేటి ఈ నా మాటల వరకూ విస్తరించిన వాగ్మయమో
ఆహార్యం చంద్ర తారాది – ఎవని అలంకారమే ఈ చంద్ర, సూర్య నక్షత్రాది గ్రహములో
తమ్ వందే సాత్వికం శివం – అటువంటి సాత్వికాభినయ రూపుడైన శివుని నమస్కరిస్తున్నాను
నాట్యంలో నాలుగు అంగాలనీ, అందులో
మొదటిది ఆంగికం – అంటే భావానికి అనుగుణమైన ముద్రలు ప్రదర్శించటం
రెండవది వాచికం – అంటే తగిన మాట లేదా పాట లేదా శ్లోకం చెప్పటం
మూడవది ఆహార్యం – పాత్రకీ, సన్నివేశానికీ తగిన వస్త్రాలూ ఆభరణాలు ధరించటం
నాలుగవది ముఖ్యమైనది సాత్వికం – సాత్వికాభినయం అంటే హావభావ ప్రకటన. English లో అందంగా చెప్పాలంటే expression.
ఇందులో ముద్రలు ప్రపంచము, మాటలు వేదాలు మొ”నవి ,
ఆహార్యం చంద్రుడు నక్షత్రాలు అయితే ఆ expression యే శివుడుట.
అంటే ప్రకృతిలో అంతర్లీనంగా, అవ్యక్తంగా, గుప్తంగా subtle గా ఉన్నవాడు శివుడు.
మనపూర్వీకులకి ఉన్న శివభక్తి మాత్రమే కాకుండా వారి మాటలో ఎంత ఆశ్చర్యకరమైన కవిత్వం ఉందో చదివితే అంతుపట్టదు.
ఈ శ్లోకాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూనే ఇంకొక అడుగు ముందుకేశారు వేటూరి.
సాత్వికుడు అంటే మంచివాడు అని అర్ధం ఉంది కదా. సత్వగుణం అంటే మంచి విషయాల్లో ప్రావీణ్యం ఆసక్తి ఉండటమే కదా. ఈ శ్లోకంలో సాత్వికం అనే మాటని subtlety అని కాక మంచి వాడు అని శివునికే అందగించిన కవి వేటూరి.
ఇదే అన్నిటికంటే గొప్ప లక్షణం. నిజానికి ఇది ఒక్కటి ఉంటె చాలదా ?
కానీ అన్నీ ఉన్న వాడు శివుడు. అన్నీ ఉండటమే కాదు సంపూర్ణంగా , సాంద్రంగా – చిక్కగా ఉన్నవాడుట.
అదే సాంద్రకళాపూర్ణోదయా అనే సంబోధనలో మనకి కనిపిస్తుంది. కేవలం నాట్యకళకే కాదు హృదయాన్ని రంజింపచేసే ప్రతికళలూ అత్యున్నతస్థాయిలో ప్రకటించేవాడు, ఆ కళలయొక్క సాధన వల్ల లభించేవాడూ శివుడే.
ఆ శివుడు లయనిలయుడు – ఆ మాటలోనే అందమైన శబ్దాలంకారం ఉంది.
లయ అంటే ఏమిటి?
ఇది కాలగమనానికి గుర్తు. ఉదాహరణకి సంగీతం లో కీర్తనకి ఖచ్చితంగా తాళం ఉంటుంది. (ఆదితాళం, ఖండచాపు తాళం మొ”నవి)
ఆ తాళమే లయ అంటే. కీర్తనకి ఒక కొలత తాళం. ఆ కీర్తన వేగానికీ అదే కొలత (ఒకటో కాలం, రెండో కాలం, మూడో కాలం).
అంటే మరల మరల ఉత్పన్నమౌతూ నడుస్తున్నదానిలో ఎన్ని మార్పులూ చేర్పులూ వస్తున్నా తాను మారకుండా ఉండి, నడుస్తున్నడానికి అందాన్నిస్తూ ఉండేది లయ.
Science పరిభాషలో frequency అంటే ఇదే అనుకుంటా; English లో arts లో rhythm అంటారు దీనినే.
లయ సమయానికి సంబంధించినది కాబట్టి అది వేరే వస్తువుకి supporting role లోనూ ఉంటుంది. ఇంకేమీ లేనప్పుడూ ఉంటుంది. లయ అన్న శబ్దానికి స్థూలంగా నేను తెలుసుకోగలిగినంత అర్ధం ఇది.
శివుడు లయకారకుడు అంటే ఇదే. అటు కళలకూ ఇటు ప్రపంచ నిర్వహణకీ సరిపోయే మాట లయ.
శివుడు లయ నిలయుడుట ! అదే వేటూరికున్న అవగాహనకి గుర్తు.
ఇంక పాటలోకి వెళ్దాము.
సంస్కృతం లో మాతృకావర్ణమాల స్తోత్రం ఉన్నది. ఒక్కో శ్లోకం అ, ఆ, ఇ, ఈ ఇలా మొదలౌతుంది. అది వినటం, చదవటం వల్లనేమో వేటూరి అంకెలతో అలా రాసినట్టు అనిపిస్తుంది. మూడు తో మొదలుపెట్టి రాసారు.
త్రికాలములు, చతుర్వేదములు, పంచభూతములు, ఆరు ఋతువులు, స్వర సప్తకం, అష్ట దిక్కులు, నవరసమ్ములు, దశోపనిషత్తులు ఇలా.
చిత్రంగా ఇందులో మొదటి రెండు రెండో చరణంలో వస్తాయి. మరి మొదట ఇదే వరసలో రాసి తరవాత సినిమాలో కుదరడానికో ఏమో, లేదా సన్నివేశం కోసమో మార్చారనుకుంటా.
పంచభూతములు ముఖపంచకమై – శివునికి ఐదు ముఖాలని చెప్తారు అవి సద్యోజాత, వామదేవ, అఘోర, ఈశాన తత్పురుష అనే పేర్లతో నాలుగు దిక్కులా నాలుగు, ఆకాశం వైపు ఐదవది ఉంటాయి. అంటే శివుడు అన్ని వైపులా చూస్తాడు అని అర్ధం. ప్రపంచం మట్టి, నీరు, నిప్పు, గాలీ, ఆకాశం అనే పంచభూతాలతో ఏర్పడింది అంటారు కాబట్టి ఆ ఐదూ కుడా శివుడే అని equate చేసి ముఖాలతో పోల్చారు వేటూరి. ఇది సంఖ్యాపరంగా చమత్కారమూ, తత్త్వపరంగా గొప్పదీ మాత్రమే కాకుండా సినిమాలో సందర్భానికి కూడా చాలా ముఖ్యఘట్టం ఈ పంక్తి. ఐదు భూతములు అంటే శైలజ భూతాలూ దయ్యాలూ అన్నట్టు అభినయం చూపడం, దానిని కమల్హాసన్ తన వ్యాసంలో తప్పు పట్టడం ఇలా కథలోకి తీసుకెళ్ళడానికి ఈ మాట బాగా ఉపయోగించింది
.
ఆరు ఋతువులూ ఆహార్యములై – ఆరు ఋతువులూ శివుడికి makeup ట. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది వినటానికి. English లో ఋతువర్ణనలో, ముఖ్యంగా శిశిర ఋతువు గురించి చాలా సామాన్యంగా the leaves are sporting a new shade లాంటి మాటలు వాడుతూంటారు. ఆ shade అన్నమాటకి తెలుగు వర్ణం. వివిధ వర్ణాలతో నే నటులు makeup వేసుకుంటారు కాబట్టి అలా వాడారు వేటూరి అనిపిస్తుంది.
ప్రకృతి స్వరూపిణి యైన పార్వతి నీతో పెళ్లి నాట నడిచిన ఏడు అడుగులే సప్తస్వరాలై , సంగీతం నిత్యకళ్యాణం అవడానికి కారణం అయ్యాయి అంటున్నారిక్కడ.
నీ దృక్కులే అటు అష్టదిక్కులై – ఇక్కడ నీ మూర్తులు అని ఉండాలేమోనని నా అనుమానం ఎందుకంటే శివుడికి అష్టమూర్తి రూపాలు ఉన్నాయని చెబుతారు (పంచభూతాలూ – 5, సూర్యుడు – 6, చంద్రుడు – 7, ఆత్మ – 8). చూపులు అనుకున్నా నష్టంలేదు. నాలుగు ముఖాలతో ప్రపంచాన్ని చూస్తాడు కాబట్టి అందులోని ఎనిమిది కన్నులే ఎనిమిది దిక్కులలో ప్రసరిస్తున్నాయని అనుకోవచ్చు.
నీ వాక్కులే నవరసమ్ములై – వాచికం సర్వ వాగ్మయం అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది. వాంగ్మయం అంతా నవరసాలతో నిండి ఉందనే కదా మన సాహిత్య సిద్ధాంతం.
నీ మౌనమే దశోపనిషత్తులై – ఇది మళ్ళీ చాలా గొప్పమాట. సంగీతానికీ, నాట్యానికీ శివుడు ఎలా అయితే గురువో, ఆత్మవిద్య, బ్రహ్మవిద్య అని చెప్పబడే వేదాంతానికి కూడా శివుడే దక్షిణామూర్తి రూపంలో గురువు. ఆ దక్షిణామూర్తి ఎప్పుడూ మౌనంగానే ఉండి భక్తులని ఉద్ధరిస్తాడని చెప్తారు. ఆ మౌనమే వేదాంతానికి ముఖ్యమైన దశోపనిషత్తులని చెప్పటం ఎంతో గంభీరమైన, మేధోమయమైన పోలిక. ఇదంతా ఎవరికి? “తాపస మందార” అనటం వల్ల తపస్సులో ఉన్న సత్యాన్వేషులకు మాత్రమే.
అంటే మొత్తానికి శివుడు మాట్లాడితే సాహిత్యం. మాట్లాడకపోతే వేదాంతం.
అన్నీ శివుడే అని చెప్పటానికి మరో మంచి ప్రయోగం చేసారు వేటూరి.
త్రికాలములు నీ నేత్ర త్రయమై – భూత భవిష్యత్ వర్తమానాలే శివుడి కన్నులట. ఇదీ శివుడి మూడు కన్నుల రహస్యం అన్నమాట, అన్నీ చూడగలగటం.
చతుర్వేదములు ప్రాకారములై – నాలుగు వేదాలే ఆయన ప్రాకారమట . అంటే ఆయనది వేదగృహం. వేదాలలో ఉంటాడట. “వేద విహారా హరా జీవేశ్వరా “ అన్నా ఇదే. అన్నది కూడా ఈయనే కదా.
గజముఖ, షణ్ముఖ, నంది మొదలైన మహామహులంతా నీ ప్రతి సంకల్పాన్నీ ఋత్విక్కులు యజ్ఞం చేసునంత శ్రద్ధగా చేయడానికి నిలిచి ఉండగా
అద్వైతమే నీ అది యోగమై (అసలు స్థితి, స్వరూపము అయి ఉండగా)
నీ లయలే కాలగమనమై – నువ్వే కాలాన్ని నడిపిస్తూండగా,
కైలాసంలో కొలువు దీరిన పరమేశ్వరా
నేను చేస్తున్న ఈ నా గానమే జంత్రము – వాయిద్యం , గాత్రము – వాక్కు యొక్క మేలుకలయిక అయి నిన్ను అర్చిమ్పగా
ఓం నమఃశివాయ
ఇవీ ఈ పాటలో కొన్ని విశేషాలు. ఈ పాట పూర్తిగా విన్న వారెవరైనా వేటూరికి పాండిత్యమే కాక, చక్కని శివభక్తి, స్థాయి ఉన్నవని ఒప్పుకుని తీరాల్సిందే.
chala bagundi
mee visleshana adbhutham…..veturi vaari paata athyadbhutham!!!!
చాలా రోజుల తరువాత ఈ పాటని మళ్లీ వింటున్నాను … పంచ భూతాలు అంటే దెయ్యాలు భూతాలు అనే అర్థం వచ్చినట్టు చేశావా అని జయప్రద అడగటం హైలైట్ అయింది కానీ ఈ పాట ఒక అధ్భుతం … వేటూరి వారి ఎన్నో అధ్భుతమైన రచనలలో ఇది కూడా ఒకటి … ఈ పాట గురించి మీ వాఖ్యానం ఎంతో బావుంది … కవి రాసింది తెలుసుకొని అనుభవించి మీ అభిప్రాయం జోడించి చక్కగా వివరించారు … ధన్యవాదములు