సినిమా – సీతారామయ్య గారి మనవరాలు
రచన – వేటూరి
పూసింది పూసింది పున్నాగ
కూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసే సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై (2)
ఆడ, జతులాడ
ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కథ చెప్పాయిలే
అనుకోని రాగమే, అనురాగ దీపమై
వలపన్న గానమే, ఒక వాయులీనమై
పాడె మది పాడె
పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కలలే కల్యాణిగా
అరవిచ్చేటి ఆభేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఇల పూల తోటలై
పసిమొగ్గ రేకులే పరువాల చూపులై
పూసె విరబూసె
“సరదా పాట” కి నిర్వచనం ఏంటి? ఈ పాటే . నిజానికి విడమర్చి చెప్పాల్సిన అవసరం లేని పాట,
ఇందులోని కొన్ని విశేషాలు
పున్నాగ పువ్వు వేటూరి కీ చాలా ఇష్టమనుకుంటా తరచుగా ఆయన పాటల్లో వినిపిస్తుంది. (ఉదా: సిరిమల్లె నీవే – పంతులమ్మ సినిమా)
పున్నాగ పువ్వు కొంచెం నీలా నవ్వింది అనటం. నిజానికి అమ్మాయిలు నవ్వితే పువ్వులా నవ్వావు అంటారు, కానీ పువ్వే అమ్మాయిలా నవ్విందంటే, ఆ నవ్వు ఎంత అందంగా ఉందో ….
ఇష్టసఖి, అష్టపది, నా చిలుకా, నీ పలుకే … ఇటువంటి జంట పదాలతో వేటూరి తనకి శబ్దాలంకారలంటే మక్కువ ఎక్కువ అని మరొక్క మారు నిరూపించుకున్నాడు.
కలిసొచ్చిన కాలాల కౌగిళ్ళలో కలలోచ్చాయిట ! కాల స్పర్శ కాదు , కౌగిలిలా చుట్టుముడితే, కలలు రావా ? వస్తాయి అవెంత అందంగా ఉంటాయో, ఏ ఏ కథలు చెప్తాయో … ఈ భావన ఎంత బాగుందో
ఎక్కడో అనుకోకుండా తగిలిన రాగం (ప్రేమభావన) ఒక బంధంగా మరలుతుంది, ఇది కేవలం ఒక భావుకుడు, ప్రేమికుడు మాత్రమే అనగలిగిన మాట.
నా పదం (పాదం) నీ పదాన్ని (కవితని ) పారాణి గా పెట్టుకుందిట ! పాదానికి పారాణే అందం , అదొక contrast, నీకు నాకు మధ్య ఉన్నవి differences కావు, contrasts అంతే. అది మనిద్దరికీ అందం అన్న పొందిక ఎంత poetic గా చెప్పాడో వేటూరి.
అరవిచ్చిన రాగాలు అంటే అవ్యక్తమైన భావాలు వ్యక్తం చేస్తున్న దశ, అప్పుడు ఉన్న “కృత్యాద్యవస్థ” నీ రాక వల్ల తీరిందని ఎంత సొంపుగా చెప్పాడు వేటూరి.
సరదా పాటలకి ఈ పాట ఒక textbook. అందమైన పదాలతో, ముగ్ధసౌందర్య పూరితమైన ఈ పాటకి m.m.కీరవాణి అద్భుతమైన సంగీతం అందించాడు.
————————————–
నళినీకాంత్ గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్ టీం
Manchi vivarana icharu