(వెండి తెర మీద కనిపించక పోయినా, తమ ప్రతిభ, మేధతో వెండి తెరను వెలిగించి, ప్రేక్షకుడి మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానుభావులు అనేక మంది ఉన్నారు. అందులో ముందు వరసలో ఉన్న శ్రీ వేటూరి గురించి ఈ వ్యాసం.)
సచిన్ టెండూల్కర్ ఒక సెంచరీ చేస్తే అది అతని క్రీడా కౌశల్యానికి మరో తార్కాణం, ఎడిసన్ మరో ఆవిష్కరణ చేస్తే అది అతని ప్రతిభకి మరో నిదర్శనం, గుల్జార్ ఒక గొప్ప గీతం వ్రాస్తే అది అతని అద్భుత సాహిత్య సృష్టి లో మరో ఆణి ముత్యం. కష్ట పడి ఉన్నత స్థానానికి చేరుకొని, ఎంతో కీర్తి గడించిన వ్యక్తి గొప్పతనాన్ని ఒక్కోమాటు మనం గుర్తించ లేక పోవచ్చు , ముఖ్యంగా అతను మన మధ్యనే ఉండి తన పని కొనసాగిస్తున్నప్పుడు. అద్భుత సాహిత్య సృష్టిని అతి సామాన్య గీతంతో సరితూస్తూ, సరదాగా సాగిపోయే పాటకు దీటుగా గంభీర గీతాలు వ్రాస్తూ, విషాద గీతాల సరసన ప్రణయ గీతాలు చేరుస్తూ, సినిమాలలో సాహిత్యానికి ఉన్నత స్థానం కల్పించిన మహా కవి శ్రీ వేటూరి సుందర రామ మూర్తి. తన రచనలలో శ్రీ వేటూరి పలికించని భావం కానీ, రసం కానీ, మానవీయ కోణం కానీ లేవు అంటే అతిశయోక్తి కాదు. తన మాట మీద నిలబడే, పదనిధి శ్రీ వేటూరి వారి సాహిత్య సామర్ధ్యాన్ని వర్ణించడానికి పదాలు లేవు.
సముద్రంలో ఒక అతి పెద్ద అల లేచి తీరాన్ని తాకుతుంది. కొంత సేపటికి అంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంత పెద్ద పరిమాణం గల అల, తీరంలో కొద్ది దూరం వరకు ఉన్నఅన్నిటిని తనలో కలిపేసుకోగల సామర్ధ్యం కల కెరటం మళ్ళీ రాదేమో అనిపిస్తుంది. ఆ ప్రశాంతత కొనసాగుతుందేమో ననిపిస్తుంది. కానీ, అంతదో, అంతకన్నా పెద్దదో కూడా ఇంకో అల రావడం ప్రకృతి సహజం. డెబ్భైవ దశకం మధ్యలో ఆత్రేయ, సినారె, శ్రీశ్రీ మరియు ఆరుద్ర లాంటి మహా కవులు సినిమాలకి వ్రాయడం తగ్గించేస్తున్న కాలం లో, వారు వ్రాయని లోటు తీర్చడానికా అన్నట్టు, ఆ కవులకు దీటైన ప్రతిభతో, వారి వారసత్వం పుణికి పుచ్చుకున్నట్టుగా, సినీ సాహిత్యంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శ్రీ వేటూరి స్వరం పలికింది. ఆ మహా కవులందరికీ కూడా సినిమా పాటలు వ్రాయడం లో, సామాన్య శ్రోత కూడా గుర్తించగల తమదైన శైలి ఉంది. ఆత్రేయలా సాధారణ పదాలతో పలికించే అసాధారణ భావాలను, సినారె పద గాంభీర్యత తో పలికించే సున్నిత భావాలని, శ్రీ శ్రీ లోని ఆవేశాన్ని, ఆరుద్ర అనుప్రాస లో సొగుసులని, గుర్తు కొచ్చే విధంగా శ్రీ వేటూరి తన అసమాన ప్రతిభకు విశాల దృక్పధం జోడించి తనదైన శైలిలో పలికించారు. అందుకనే శ్రీ వేటూరి అన్ని భావాలను ప్రతిభావంతంగా పలికించగల కవి గా పేరు పొందారు.
సినిమా సంగీతం సంకట పరిస్థితులలో ఉన్న కాలంలో, శ్రీ వేటూరి సందర్భం, సన్నివేశం, కధాంశం, అనుకూలించినప్పుడు సరదాగా సాగే సాహిత్యం తో పాటలను కొత్త పుంతలు తొక్కించారు. వేటగాడు సినిమా లోని పాట ‘ఆకు చాటు పిందె తడిసె’ సినిమాల్లో వాన పాటలకి కొలబద్ద గా నిలిచి పోయింది. అంతే కాదు, అనేక సందర్భాలలో; దర్శకుడు కోరినట్టుగా, కారణం లేకుండా కధాగమనానికి అవసరం లేని చోట, పాత్రల కోసమే ఒక యుగళ గీతం వ్రాయాల్సిన సందర్భాలలో వ్రాసిన, సాహిత్యపరంగా మనోరంజకం కాని అనేక పాటలకి కూడా ఆ పాట ఒరవడి అయింది. శ్రీ వేటూరి సినీ జీవిత గమనంలో, సినీ రంగానికి ఆయన చేసిన, అద్వితీయమైన, ముఖ్యమైన , కలకాలం గుర్తుంచుకోదగ్గ, సాహిత్య సేవలు మూడు దశాబ్దాలలో (70,80,90,ల్లో)మూడు అధ్యాయాలుగా చూడాలి.
‘ఓ సీత కధ’ సినిమాతో విజయవంతం గా సినిమా రంగ ప్రవేశం చేసిన శ్రీ వేటూరి తిరిగి శ్రీ విశ్వనాద్ తో నవరస భరిత కావ్యం ‘సిరి సిరి మువ్వ’ కు, కలిసి పనిచేశారు. ఇందులో,
అందమైన పదాలని కూర్చి అతి సున్నితమైన భావాలను పలికించిన పాట,
‘గోదారల్లె ఎన్నెట్టో గోదారల్లె’ (ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు ఒక గొంతులోనే పలికింది)
భావావేశం తో తీవ్రమైన ప్రశ్నలు సంధిస్తూ వ్రాసిన పాట,
‘రా దిగి రా’ ( వికట నటస్పద విస్ఫులింగముల విలయ తాండవము సలిపిన నీవే శిలవే అయితే పగిలిపో, శివుడే అయితే రగిలిపో )
వేదాంత పరమైన భావాలని అతి సాధారణ పదాలతో పలికించిన పాట,
‘ఎవరికెవరు ఈ లోకంలో’ (వాన కురిసి వెలిసేది వాగులో, వాగు వంక కలిసేది నదిలో,నదులు కదిలి చేరేది కడలిలో, ఆ కడలి కలిసేది ఎందులో)
పదాలలో సొబగు, భావాలలో లాలిత్యం పొదిగిన పాట,
‘అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ’ (పలకమన్నా పలకదీ పంచదార చిలక కులుకే సింగారమైన కోన సిగ్గుల మొలక)
శ్రీ వేటూరి ప్రజ్ఞా పాటవాలకి తొలి సంకేతాలు. డెభై చివరిలో తక్కువ వ్యయం తో నిర్మించిన సినిమాలలో గుర్తుంచుకోదగ్గ కొన్ని, ‘పంతులమ్మ’ ‘రామ చిలుక’ ‘పదహారేళ్ళ వయసు’ ‘ఇంటింటి రామాయణం’ లకు, అప్పటికే సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీ వేటూరి, కధాంశాలకి, సన్నివేశ సందర్భాలకి అతికినట్టు గా అందమైన, ఇంపైన పాటలు వ్రాసారు.
1977 శ్రీ వేటూరి సినీ జీవితంలో ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఒక ఏడాది వ్యవధిలో విడుదల అయిన ‘శంకరాభరణం’ మరియూ ‘అడవి రాముడు’ సినిమాలు శ్రీ వేటూరిని సినీ సాహిత్య రంగంలో మకుటం లేని మహారాజుగా నిలబెట్టాయి. సాహిత్యపరం గానూ, వ్యాపార పరం గానూ కూడా, సాటిలేని, అమూల్యమైన ఆయన పాటలు పండిత, పామర ప్రశంసలు పొందాయి. వ్యాపారాత్మక సినిమాలలో సాహిత్యాన్ని కళ గానూ , కళాత్మక సినిమాలలో సాహిత్యం లోని సరసతను మేళవించి వ్రాయడంలో తనదైన శైలిని, జనరంజకంగా సృష్టించుకున్నారు. ‘ఓంకార నాదాను సంధానమౌ గానమే’ వ్రాసిన కలం తోనే ‘ఓలమ్మి తిక్క రేగిందా’ అంటూ వ్రాసారు. ‘చిలక కొట్టుడు కొడితే’ అనే పాటకు ప్రతిచర్యగా అనుకునేటట్టు ‘ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా’ అంటూ వ్రాసారు. ‘కిరాతార్జునీయం’ ఎంత శ్రద్ధాసక్తులతో వ్రాసారో అల్లాగే ‘కోకిలమ్మ పెళ్ళికి కోనంతా సందడి’ కూడా వ్రాసారు. భాషా వైవిధ్యాల మీద తన సాధికారతను చాటుతూ, జటిలమైన ప్రయోగాలను సామాన్య సంభాషణల లాగ కూరుస్తూ , సినీ రంగ అవసరాలకు తన అసమాన ప్రతిభను సరి తూస్తూ శ్రీ వేటూరి వ్రాసిన పాటలు విమర్శకుల ప్రశంసలను, ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నాయి.
శ్రీ వేటూరి సినీ రంగ ప్రవేశం చేసి సుస్థిర స్థానం సంపాదించుకోవడం , జూలియస్ సీజర్ ని ఉద్దేశించి చెప్పుకునే సామెత – “అతను వచ్చాడు. అతను చూసాడు, అతను జయించాడు” లాగ నాటకీయం లాగానే అనిపిస్తుంది. ఆ సామెత లో మొదటి భాగం శ్రీ వేటూరి 70 లలో పూర్తిచేసారు. మిగతా భాగాలు 80 లలో పూర్తి చేసారు.
రాబర్ట్ ఫ్రాస్ట్, తన ఒక కవిత ‘తక్కువ మంది నడిచిన మార్గము’ లో అన్నారు. “ఒక అరణ్యం లో నడుస్తుంటే రెండు మార్గాలు కనిపించాయి. దురదృష్టవశాత్తూ నేను రెండు మార్గాలలోనూ ప్రయాణించ లేను. నేను తక్కువ మంది ప్రయాణించిన మార్గమే ఎన్నుకున్నాను. అదే నాకు మంచి చేసింది.” శ్రీ వేటూరి తన రచనా వ్యాసంగంలో ఇంతకు ముందు ఎవరూ ఎక్కని శిఖరాలకి ఎదిగిన విధానం గురించి ఇంతకన్నా బాగా చెప్పలేము. ముద్ర వేయడం, స్వాభావికమైన, విశిష్టతను మూసగా అపార్ధం చేసుకునే వెలుగు నీడల ప్రపంచంలో, తనదైన విలక్షణమైన శైలిలో, అప్పటి దాకా తెలుగు పాటలలో ఉన్న సాహిత్య సంక్లిష్టతలోనూ , భావాలలోనూ మార్పులు తెచ్చారు. విశ్వనాద్, జంధ్యాల, వంశి, ముఖ్యంగా ప్రసార మాధ్యమ ప్రముఖుడు రామోజీరావు లతో కలసి తన సాహిత్య ప్రతిభకు పదును పెడుతూ, పనిచేస్తూన్న కాలం లో కూడా వేటూరి వ్యాపారవిలువలను విస్మరించకుండా రాఘవేంద్ర రావు, కోదండరామి రెడ్డి మొదలైన వారితో కూడా కలిసి పని చేసారు. ఆనాటి పోకడలకు ఆచారాలకు విరుద్ధంగా వేటూరి చేసిన ఈ జోడు గుఱ్ఱాల స్వారీ విజయవంతమైంది.
ఒకే భావాన్ని రెండు రకాలుగా పలికించారు వేటూరి ఈ కింది పాటలలో, ఒకటి పూర్తిగా సాహిత్యం గుబాళిస్తూ, రెండవది సాహిత్యానికి వ్యాపార విలువలు కూరుస్తూ,
౧. వేసవిలో అగ్ని పత్రాలు వ్రాసి
విరహిణి నిట్టూర్పుల తీగ సాగి
జలద నినాదాల పలుకు మృదంగాల
వాశుక జల గీతిలో తేలి ఆడి
సయ్యలలో కొత్త వయ్యారమొలికే
శరదృతు కావేరిలా కొంత సాగి
చలి ఋతువే సరిగమలౌ నాద సుధా మధువనికి
౨. అగ్ని పత్రాలు వ్రాసి గ్రీష్మమే సాగిపోయే
మెరుపు లేఖల్లు వ్రాసి మేఘమే మూగపోయే
మంచు ధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోయే
మాఘ దాహాలు లోన అందమే అత్తరాయే
ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే
మొదటిది ‘ఆనంద భైరవి’ సినిమా (జంధ్యాల దర్శకత్వం, రమేష్ నాయుడు సంగీతం) లోని పాట ‘చైత్రము కుసుమాంజలి’ లో ఒక చరణం, రెండవది ‘ప్రేమించు పెళ్ళాడు’ సినిమా (వంశీ దర్శకత్వం , ఇళయ రాజా సంగీతం) లోని పాట ‘నిరంతరమూ వసంతములే’, లోనిది. సమయ సందర్భాలు వేరైనా రెండు పాటల్లోని పదాలు ఒకే భావాన్ని ప్రకటిస్తున్నాయి. మొదటి పాటలో భాష పూర్తిగా సాహిత్య పరం గా ఉంటే రెండవ దానిలో ఒక స్థాయి, మెట్టు దింపి వ్యావహారిక భాష కలిపి సామాన్య జనప్రియం గా వ్రాసారు. వేటూరి పాటలలో కిటుకు ఇదే, ప్రేక్షక స్థాయిని బట్టి కూడా ఆయన పాటలు వ్రాస్తారు.
‘సిరి సిరి మువ్వ’ సినిమాలాగానే ‘శ్రీ వారికి ప్రేమలేఖ’ కూడా వేటూరి కి మంచి పేరు తెచ్చింది. హీరో ప్రాధాన్యమైన దృక్పధం నుంచి ఈ సినిమాలో పాటలు ప్రత్యేక పరిస్థితులకు అంటే ప్రకృతి సౌందర్యం, జీవితం లో విశేషాలు, ఆరాధన మొదలగు వాటికి మారాయి. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ లో పాటలు ముఖ్యంగా స్త్రీ పరంగా ఉంటాయి అందుచేత పాటల్లో సుకుమారంగా, లలితంగా ఉండే సాధారణ పదాలను ఎంచుకున్నారు వేటూరి.
౧. అతనికి నేను నచ్చానో లేదో
ఆ శుభ ఘడియ వచ్చేనో రాదో
తొందర పడితే అలుసే మనసా తెలుసా IIమనసా తుళ్ళి పడకేII
౨. అరుణం అరుణం ఒక చీరా
అంబర నీలం ఒక చీరా
అందాలన్నీ అందియలై శృంగారంలో నీ లయలై
అలముకున్న పూతావిలా అలవికాని పులకింతలా
హిందోళరాగ గంధాలు నీకు ఆంధోళికా సేవగా IIసరిగమ పదనీ స్వరధారII
౩. ఏ తల్లి కుమారులో తెలియదు కాని
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగధీరులో తెలియలేదు కాని
నా మనసు దోచుకొన్న చోరులు మీరు
వలచి వచ్చిన వనితను చులకన చేయక
తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి
చప్పున బదులీయండి ఇప్పుడే బదులియ్యండి IIతొలిసారి మిమ్మల్నిII
వంశీ సినిమా ‘సితార’ లో వేటూరి పద లాలిత్యానికి భావ లాలిత్యాన్ని అందంగా అల్లారు. ఒక భగ్న హృదయం యొక్క తీవ్ర మనో వేదన, యాంత్రికంగా సితార కొట్టే చప్పట్లలో స్వాంతన వెతుక్కోలేని అశక్తతను, ఎంతో అద్భుతంగా వేటూరి ‘వెన్నెల్లో గోదారి అందం’ పాటలో వర్ణించారు. తొలి సంకోచం, గుర్తించడం లో పొరపాటు, ఒడిదుడుకులకు లోనైన గతం, సందేహాస్పదమైన భవిష్యత్తు, వీటన్నిటిని ఎంతో అందంగా ఆవిష్కరించారు ‘జిలిబిలి పలుకుల చిలిపిగా’ అనే పాటలో,
అడగునులే చిరునామా చిరునవ్వే పుట్టిల్లు
విను వీధి వీణల్లో రాగమాల హరివిల్లు రంగుల్లో అందంలా
విశ్లేషిస్తే ‘హరివిల్లు రంగుల్లో అందం’ , అని వ్రాసి ఎన్ని భావాలు పలికించారో అనిపిస్తుంది.
హరివిల్లు వర్షం పడినప్పుడే వస్తుంది అంటే మనసులో భావోద్వేగం ఉబికిన వేళ, హరివిల్లు రావాలంటే పరావర్తం చేయడానికి సూర్యుడు కావాలి, అది కొంతసేపటికి కరిగి పోతుంది అంటే సితార గడించిన కీర్తి , కీర్తి సమసిపోవడం లను సూచిస్తుంది. పాటలోని ఇతివృత్తం కన్న ఇంకా ఎక్కువుగా వేటూరి ఉపయోగించే పదాలు ఆయన ఉహలని, భావాలని ప్రస్ఫుటంగా పలికిస్తాయి. వంశీ, ఇళయ రాజా లతో కలిసి అందమైన, చమత్కార భరితమైన పాటలు వ్రాసారు వేటూరి. అప్పటికే కట్టిన సంక్లిష్టమైన బాణీని భావస్ఫూరితమైన పదాల అమరికతో అందమైన పాటగా మలిచారు.
కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే
అలరులు కురియగ తడిసిన మధురస వాణి (అన్వేషణ)
అలాగే సాధారణ బాణిని సొగసైన పదాలతో, అందమైన పాటగా మార్చారు.
ముద్దు బేరమాడకుండా ముద్దాయిలా ఉండవా
రాగాలైన రాధ గోలలు రాధా బాధితుండి లే
(ప్రేమించు పెళ్ళాడు సినిమా లో ‘గోపెమ్మ చేతిలో గోరుముద్ద’ పాట )
వంశీ, ఇళయరాజా లకి వ్రాసేటప్పుడు వేటూరి తన శైలికి ఇటువంటి ప్రయోగాలు చేర్చారు.
సాంఘిక ఇతివృత్తాలు కవుల కెక్కువుగా ప్రీతి పాత్రాలు. ఎనభైలలో ఆయా సందర్భాలలో వేటూరి కలం సెలయేరు ప్రవాహంలా పరవళ్ళు తొక్కింది. భారతి రాజా దర్శకత్వం వహించిన, ఇళయరాజా సంగీతం సమకూర్చిన ‘సీతాకోక చిలుక’ సినిమాకి వేటూరి వ్రాసిన పాట ‘సాగర సంగమమే’ కలకాలం నిలిచి ఉంటుంది. అంతర్లీనంగా కులమత ఛాందస భావాలను నిరసిస్తూ, వినూత్న పధంలో నాయికను వేడుకుంటూ ఆలాపించిన ఈ పాటలో ప్రజలందరూ కుల మత భావాల పరిధులను దాటి కలసి మెలసి సాంస్కృతిక సాగరాల సంగమం చెయ్యాలి అనే సందేశం వినిపిస్తుంది.
కన్యాకుమారి నీ పదముల నేనే
కడలి కెరటమై కడిగిన వేళ
సుమసుకుమారి నీ చూపులకే
తడబడి వరములు అడిగిన వేళ
భారత భారతి పద సన్నిధిలో
కులమత సాగర సంగమ శృతిలో
నా రతి నీవని వలపుల హారతి
హృదయము ప్రమిదగా వెలిగిన వేళ
1986లో, భుజం తట్టి నిద్రలేపిన, తీవ్ర భావజాలంతో కుదిపిన, ప్రభావ వంతమైన సినిమా ‘ప్రతి ఘటన’ విడుదలయింది. ఈ చిత్రంలో ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకం లో’ పాటకి కొన్ని తప్పుడు కారణాలవల్ల వేటూరికి జాతీయ బహుమతి రాకపోయినా, సాంఘిక దురాచారాన్ని ఖండిస్తూ వ్రాసిన ఈ పాట ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. కాకతాళీయంగా ఈ ఇతివృత్తం కూడా స్త్రీ జాతికి సంబంధించినదే. అనాదిగా ఇంటికే పరిమితమై, సంఘం లో తగు స్థానం కరువై, శారీరకంగా, ఆర్ధికంగా, సామాజికంగా అణచివేయబడి, తమ హక్కులను, గౌరవాన్ని కోల్పోయిన స్త్రీజాతి ఆక్రోశం ఈ పాటలో ప్రతిధ్వనిస్తుంది.
పుడుతూనే పాలకేడ్చి
పుట్టి జంపాల కేడ్చి
పెరిగి పెద్ద వారైతే
ముద్దు మురిపాల కేడ్చి
తనువంతా దోచుకున్న తనయులు మీరు
పై పాటలు సినీ సాహిత్యంలో తగు స్థానం సంపాదించుకున్నా, వేటూరి ఎనభైలలో వచ్చిన కె. విశ్వనాద్ సినిమాలకి ‘శుభోదయం, సప్తపది, సాగర సంగమం, జననీ జన్మ భూమి మొదలైనవి.’ వ్రాసిన పాటలలో జీవం నింపి సినీ సాహిత్యంలో తనను మించిన వాడు లేడు అని నిరూపించారు.
మధురా నగరిలో యుమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
కాళింది మడుగున కాళీయుని పడగన
ఆబాలగోపాలమా బాల గోపాలుని II వ్రేపల్లియ ఎద ఝల్లన II
త్యాగరాజ కీర్తనల్లె ఉన్నదీ బొమ్మ
రాగమేదో తీసినట్టుందమ్మా
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా
రాతిరేల కంట నిదర రాదమ్మా IIకంచికి పోతావా కృష్ణమ్మాII
పంచ భూతములు ముఖ పంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై
గజముఖ షణ్ముఖ ప్రమధాదులు
నీ సంకల్పానికి ఋత్విజవరులై II ఓం నమశ్శివాయ II
మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్న వన్నె కాడే
కన్న తోడు లేనివాడే కన్నె తోడు ఉన్నవాడే
మోహనాల వేణువూదే మోహనాంగుడితడే లే IIవేయివేల గోపెమ్మల II
‘వేయి వేల’ పాటలో ఉపయోగించిన (ఇంకా అనేక పాటలలో కూడా) పదశైలి వేటూరి కే స్వంతం. ఈ విధానం లో పదాలను కొద్దిగా మార్చి, విడగొట్టి లేక కలిపి కొత్త అర్ధాలను, కొత్త కోణాలను చూపిస్తారు. ఆ రాధ – ఆరాధన , ఆబాలగోపాలము – ఆ బాల గోపాల ,కన్న తోడు – కన్నె తోడు, చూసిన కంటను చూడకనే గురి చూసిన కంటను చూడకనే (కిరాతార్జునీయం పాట, భక్త కన్నప్ప), మా రేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు (శివ శివ శంకర పాట, భక్త కన్నప్ప). సిరివెన్నెల గారు కూడా సమాంతరంగా (బహుశా సన్మాన పూర్వకంగా నేమో కూడా) ఈ ప్రయోగం చేసారు, ఔరా అమ్మకు చెల్లా (ఆపద్బాంధవుడు, ఆలమంద కాపరి ఆలు మంద కాపరి వేలితో కొండను ఎత్తే కొండంత వేలుపటే).
ఇన్ని పాటలు విన్న/చదివిన తరువాత ఒక ప్రశ్న ఉదయించ వచ్చు, అసలు వేటూరి బాణీ ఏమిటి?
కొన్ని పాటలు విన్నప్పుడు , అందులోశ్రీ వేటూరి పాట ప్రత్యేకం గా అనిపించడానికి గల కారణాలు ఏమిటి? ముఖ్యంగా వేటూరి శైలి లో ప్రముఖ రచయితల శైలులు ఇమిడిపోయాయి అని చెప్పుకున్నప్పుడు వేటూరి స్వరం ఎలా గుర్తుపట్టగలము? మిగతా రచనల కన్నా వేటూరి రచనలలో ఉండే ఆ స్పష్టమైన ప్రత్యేకత ఏమిటి ?భాషతో, పాటని, సందర్భాన్ని నిర్వచిస్తారా లేక సందర్భానుసారంగా భావ ప్రకటనని, భాషని ఉపయోగిస్తారా? పూర్వ రచయితలతోను, సమకాలీనులతోను, ముందుతరం వారితోను, మహా కవి వేటూరిని ఎలా పోల్చగలము, కొలబద్దలు ఏమిటి?
సాధారణంగా చాలామంది రచయితలు సందర్భాన్ని ఉహించేటప్పుడు దాన్ని సాధారణ స్థాయి లో ఉంచడమో లేక ఉన్నత స్థాయి కి తీసుకెళ్ళడమో చేసి ఆ ఉహకు తగు భాషను జోడిస్తారు. ఆ సందర్భం పాటగా సాహిత్య రూపం తీసుకునేటప్పటికి, ఆ సందర్భాన్ని కొంచెం స్థాయి తగ్గించో, పెంచో చూపించే విధంగా పాట మార్పులు తెస్తుంది. చాలా మట్టుకు వేటూరి పాటలు సందర్భానికి అనుగుణంగానే ఉంటాయి. తన కల్పనా శక్తితో, శంకరాభరణ రాగాన్ని నిర్వచించడానికి “నాదాను సంధానమౌ గానమే శంకరాభరణమూ” అంటారు. దేవలోకపు రాజకుమారి మొదటి మాటు భూమి మీదకు వచ్చే సందర్భంలో దేవతా భావం కలిగించే పదాలు “అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం” అంటూ పలుకుతారు. కొండ గుహలలో నివసించే భక్తుడు తన దైవాన్ని కొలిచేటప్పుడు అమాయకంగా ధ్వనించే సాధారణ పదాలు “శివ శివ శంకర భక్త వశంకర……..గంగమ్మ మెచ్చిన జంగమయ్య వనీ గంగను తేనా నీ సేవకు” వాడతారు. ఒక పల్లెటూరు పడుచు నీ ఏడిపించడానికి “రామా చిలకమ్మ (రామ్మా అని పాడినట్టు కాదు) ప్రేమా మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళేనలుపన్న గోపెమ్మ” అని చిలిపిగా అంటారు. ఆయన తన స్వరాన్ని; సందర్భానుసారంగా , ప్రేక్షకాభిరుచికి అనుగుణంగా , ముఖ్యంగా సాహిత్యం బాణీని శాసించేటట్టు గానా (సాహిత్యానికి బాణీ కట్టే మహాదేవన్ గారి సంగీతం) లేక బాణీ కి అనుగుణంగా (ఇళయరాజా గారి చాలా పాటలు) సాహిత్యం ఉండాలా అనే అంశాల మీద ఆలోచించి; పలికిస్తారు. ఈ విధానం వేటూరి మీద విమర్శలకు కూడా ఆస్కారమిచ్చింది.
చాలామంది రచయితలు తమ భావాలని ప్రకటించడానికి భాషను తమదైన శైలిలో ఉపయోగించారు. దేవులపల్లి శబ్ద సౌందర్యాని కన్నా భావలాలిత్యానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. సినారె భావ ప్రకటనలో గాంభీర్యత తొణికిసలాడుతుంది. శ్రీశ్రీ పదాలలో ఆవేశం పెల్లుబుకుతుంది. ఆత్రేయ తక్కువ పదాలతో ఉన్నత భావాలు పలికిస్తారు. సముద్రాల (సీ), పింగళి నాగేంద్ర రావు తరువాత కవు లెవరూ, వేటూరి వచ్చేదాకా, భాషా సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తూ, భాషతో సందర్భానికి ఔన్నత్యం కలిగించే ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా భాషను మలచి (అవసరమైతే పదాలను మార్చి లేక సృష్టించి) సందర్భానికి అతికేటట్టు వ్రాయడం లో వేటూరి బాణీ కొంత పింగళి బాణీ ని పోలి యుంటుంది. పింగళి శైలికి అనుబంధంగా, విశేషణాలను నామవాచకం గా మారుస్తూ వేటూరి ఒక కొత్త, ఆహ్లాద పరిచే పధ్ధతి ప్రవేశపెట్టారు. ఈ పధ్ధతి ఇప్పటికీ వాడుకలో ఉంది.
వ్యాపారాత్మక విలువలకోసమే కట్టిన బాణీలకు పదాలు కూర్చడం లో వేటూరి అసాధారణ ప్రతిభ కనపర్చారు. ఎనభైల మధ్యలో, ప్రసిద్ధి నటుల వల్లనే చిత్రం విజయవంతం అవుతుందనే అభిప్రాయం బలపడింది. వేటూరి అటువంటి సినిమాలకి కొన్ని వేల పాటలు వ్రాసారు. అందులో కొన్ని అద్భుతంగా కుదిరాయి. కొన్ని పెదాల మీద చిరునవ్వు తెప్పించాయి. కొన్ని కొద్దిగా విపరీతంగా అనిపించాయి మరీ కొన్ని అప్రసన్నత (కోపం కూడా) కలిగించాయి. కట్టిన బాణీల పరిధులకు లోబడి, స్వరానికి, పదాల అర్ధాలకి సమన్వయం సరిచూసు కుంటూ, భాష భావం విషయాలలో అనేక సలహాలను పరిగణలోకి తీసుకుంటూ, వేటూరి తన సినీ జీవితంలో ముళ్ళు తొలగించుకుంటూ, గోతులను గమనిస్తూ జాగ్రత్తగా అడుగులు వేసారు. ఏ విధమైన సాహిత్య సృష్టికి, కల్పనా పటిమకు ఆస్కారమివ్వని నిస్సారమైన పాటలు వ్రాసినా, తన సాహితీ ప్రతిభని, కల్పనా శక్తి ని చూపించగల అరుదైన అవకాశాలను అందిపుచ్చుకుని అందమైన పాటలు వ్రాసారు . ‘మాతృదేవోభవ’ సినిమాకి వ్రాసిన రెండు పాటలు (‘వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి’ , ఉత్తమ గేయ రచయితగా జాతీయ బహుమతి పొందిన ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’) ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
సినిమాలలో కొన్ని పాటలు పెడుతూ ఉంటారు; కొన్ని ప్రేక్షకుడికి ఆహ్లాదం కలిగించటానికి, మరి కొన్ని ఒక సందర్భాన్ని పొడిగించటానికి (ఒక బంధాన్ని బలపర్చటానికో లేక ఒక విషాద ఘటన పర్యవసానం చూపించటానికో ), ఇంకొన్ని ఏ కారణం లేకుండానూ కూడా. ఇటువంటి సందర్భాలలో కవి ఏదో ఒక ముఖ్యమైన అంశాన్ని ఎంచుకొని దాని చుట్టూ పాట అల్లుతారు. ఒక ఉదాహరణకి, రెండవ హిరోయిన్, హీరో తో కలలో ఒక బాణీకి నృత్యం చేయాలి. కవికి పాట వ్రాయడానికి కధలో ఏ అంశం ఉండదు. వాళ్ళిద్దరూ బొంబాయి లో ఉంటారు, అక్కడే కలిసారు అన్న విషయం తప్ప ఇంకేమి దొరకదు. కధను ముందుకు తీసుకెళ్ళటానికి పాట వ్రాయాలి. కవి, వారు బొంబాయి లో ఉంటారు అనే అంశం మీద పాట వ్రాసారు. ‘నారిమన్ లో నడిచింది మొదలు, లోవ్వు గ్రాంట్ లో పిలిచింది పగలు, చౌపాటి లో చౌద్వికా చాంద్ వో’ (సినిమా అశోక చక్రవర్తి , సంగీతం ఇళయరాజా) ఒక దశాబ్దం పాటు వేటూరి ఇలాంటి పాటలు వ్రాసారంటే, పాటకు కారణం వెతకటానికి ఆయన ఎంత సునిశిత పరిశీలన చేసారో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటిదే మరొకటి, ‘ఈ అజాజ్ బీచ్ లో ఎలాకిలా అందమంతా ఆరవేసుకో’ ‘సేమ్భావాంగ్ రంభ తోటి సాటున్న రాస లీలలో’ ‘సింగపూరు సోకులన్ని దొంగిలించు కున్న హేలలో’ పాత్రలు సింగపూర్, మలేసియా లలో పాటలు పాడారు (సినిమా రుద్ర నేత్ర , సంగీతం ఇళయ రాజా). ఈ విధమైన అనవసరమైన, నిస్సారమైన పాటలు వ్రాయడం వల్ల తెలుగు పాటల్లో సాహిత్య స్థాయి దిగజారి పోయింది. ఈ వత్తిడిలో బాణీకి వేటూరి దురదృష్టవశాత్తు తన స్థాయి కి సరిపడని పాటలూ వ్రాసారు.
గుంటరి నక్కా డొక్కల చొక్కా అమ్మో అనిపిస్తా
గోపాలా మసజస తతగా శార్దూలా
నంది కొండ వాగుల్లోనా (గీతాంజలి, ఇళయరాజా )
శుకాలతో పికాలతో ధ్వనించిన మధూదయం
దివి భువి కలా నిజం స్పృసించిన మహోదయం
ఈ వాడిపోయిన ఉగాది వేళలో
గతించి పోని గాధ నేనై
ఆమని పాడవే హాయిగా (గీతాంజలి, ఇళయరాజా)
మొదటి గిచ్చుళ్ళు నిన్నే గిచ్చా
మొగ్గ సిగ్గంతా నేనే తుంచా
ఈడు వచ్చాకా ఇట్టా వచ్చా
నువ్వు నచ్చాకా నీకే ఇచ్చా
అచ్చ అచ్చా (రాక్షసుడు , ఇళయరాజా)
దేహమున్నా లేవు ప్రాణాలే నీవు కదా నాకు ప్రాణం
కళ్ళ ముందు నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం
దూరమున్న రాయబారాలే చెప్పబోతే మాట మౌనం
చేరువైన వింత గానాలే పాడబోతే భావగీతం
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు (రాక్షసుడు , ఇళయరాజా)
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ
మహా కసి గుంటది బలే రుచి గుంటది
ఒకే గిలి అంటది తనే ఒడి అంటది (మరణ మృదంగం, ఇళయరాజా)
కరిగిపోయాను కర్పూర వీణ లా
కురిసి పోయింది ఓ సందె వెన్నెల
నీ తీగ వణికి పోతున్నా
రాగాలు దోచుకుంటున్నా (మరణ మృదంగం, ఇళయరాజా)
వేటూరికి సహజమైన రచనా చమత్కృతి వల్ల వ్యాపార విలువలు గల పాటలకి సాహిత్య విలువలు గల పాటలకి సమన్యాయం చేయగలిగారు. ఎన్నో సాధారణ పాటలు అందంగా వ్రాసిన వేటూరి కలం లోంచి అద్భతమైన సాహిత్య సృష్టి కూడా జరిగింది. అతని లోని ఈ ద్వైతం అతనికి ధనార్జనకీ ఉపయోగపడింది, సాహిత్యానికీ వన్నెలు దిద్దింది. మహాదేవన్ నుంచి కీరవాణి దాకా, రహ్మాన్ నుంచి రాజ్-కోటి దాకా, ఇళయరాజా నుంచి చక్రవర్తి దాకా, అందరికీ వేటూరి ఒక వ్యవస్థ లాగా నిలబడి, పదాలకు ప్రాణం పోసి, తన కవితా చమత్కారంతో బాణీలకు సొగసు లద్దారు. ఒక మాట మీద నిలబడ్డ పదనిధి వేటూరి సుందర రామమూర్తి.
ఈ పాట కన్నా వేటూరిని ప్రస్తుతించగల, అతని జీవిత గమనాన్ని వర్ణించగల పాట మరొకటి లేదు.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు
మహా పురుషులవుతారు
తరతరాలకి తరగని వెలుగవుతారు
ఇలవేలుపు లవుతారు (అడవి రాముడు, మహాదేవన్)
సమాప్తం.
———————————————————————————–
ఐడిల్ బ్రెయిన్ లో శ్రీనివాస్ కంచిభొట్ల గారు వ్రాసిన ఈ ఆంగ్ల వ్యాసానికి బులుసు సుబ్రహ్మణ్యం గారి తెలుగు స్వేచ్చానువాదం.
శ్రీనివాస్ కంచిభొట్ల గారికీ,బులుసు సుబ్రహ్మణ్యం గారికి ఐడిల్ బ్రెయిన్ వారికీ కృతజ్ఞతలతో వేటూరి.ఇన్
Veturi …still we feel that void in film songs.