తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా (సందీప్)

veturi2“ష్ గప్‌చుప్” సినిమాలోని ఈ పాటలో తెలుగుదనాన్ని కాచి వడబోసారు వేటూరి. మాట మాటలో తెలుగుదనాన్ని నింపారు. మాటి మాటికీ తెలుగు ధనాన్ని గుర్తు చేసారు.

 

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా

మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా

అమ్మడి సిగ్గులే గుమ్మడి పువ్వులై

పిల్లడి పల్లవే పచ్చని వెల్లువై

కాటుకాకళ్ళలో కన్నె వాకిళ్ళలో

 

పాటను మొదలు పెట్టడమే తెలుగుతో మొదలుపెట్టి శ్రోతకు రాబోయే తీయదనాన్ని సూచించారు. అమ్మాయి తెలుగు అందాలు అబ్బాయి గుండెను తొలకరి (తొలిప్రేమ) లాగా తాకాయి,ఆమెలో వలపుతేనె(మకరందం) మనసు దాటి తుంటరిగా బయట పడుతోంది అట. ఇలాంటి సున్నితమైన భావాలను తెలుపడం ఈ మధ్యన పాటల్లో కరువైపోయింది అని అనిపిస్తోంది. జొన్నవిత్తుల వంటి రచయితలు కొంచెం ఆశని కలిగిస్తున్నారు కానీ వారికి ఎంతవరకు అవకాశం దక్కుతుందో చూడాలి.

పల్లవి దాటిన వెంటనే అమ్మాయి సిగ్గుని, గుమ్మడి పువ్వుతో పోల్చారు. గుమ్మడి పువ్వులు ఎంత పసుపుపచ్చగా అందంగా ఉంటాయి . ఇదివరకు ఆడవాళ్ళు ముఖానికి పసుపు రాసుకోవడం వలన ఈ పోలికకు మరింత లోతు ఏర్పడింది. అబ్బాయి ఉత్సాహాన్ని జీవానికి సంకేతం అయిన పచ్చని పొలాలతో పోల్చింది. అన్నపూర్ణ ఐన ఆంధ్రదేశంలో పచ్చందనం కంటే మంచి ఉపమానం  దొరుకుతుందా?

 

తిక్కనలో తీయదనం లిపి చక్కని నీ కన్నెతనం

పోతనలో రామరసం, వడబోసెను నీ ప్రేమరసం

ప్రాయానికే వేదం, నవపద్మావతీపాదం

రాగానికే అందం రసగీతగోవిందం

వంశధర ఒడిలో హర్షవల్లికా

సూర్యకాంత వీణారాగదీపిక

 

తిక్కన కవిత్వంలో తీయందనం కొత్త ఉపమానం కాకపోవచ్చును కానీ “లిపి చక్కని నీ కన్నెతనం” అనడం లో వేటూరి దస్తూరి కనిపిస్తోంది. ఒక మంచి భావాన్ని ఎవరు వ్రాసినా దాని లోతు అలాగే ఉంటుంది. చక్కని పద్యాన్ని అందమైన దస్తూరితో వ్రాస్తే అది చదివేటప్పుడు ఇంకా ఆవేశం కలుగుతుంది .అలాగే అమ్మాయి ఎవరైనా ఆమెలో సహజంగా సౌందర్యం ఉంటుంది. కానీ లిపి చక్కని అనడంలో ఆమె ఆకృతి కూడా చక్కగా ఉంది అని అంటున్నారు.

 

ప్రేమ అనే పదాన్ని తెలుగు ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారు అని నా ఉద్దేశం. వైదిక సాహిత్యంలో  ప్రేమ అనే పదానికి చాలా లోతుని కల్పించారు. (భగవంతునిపై) ప్రేమ కలిగిన వ్యక్తికీ వేరే ధ్యాస ఉండదు. జీవన్మరణాలు దానిలోనే. దురదృష్టవశాత్తు తెలుగు చిత్రాలు, ప్రజలు ఆకర్షణకి, కోరికకి, వెఱ్ఱికి, ప్రణయానికి కూడా ఈ పదాన్ని వాడేస్తున్నారు. వేటూరి చాలా పాటలలో ప్రేమని సులువుగా వాడేసారు కానీ ఈ చరణంలో కాస్త లోతును కల్పించారు. పోతనలో రాముడి పై ఉన్నంత ఆవేశం, నాయకుడిలో నాయికకై ఉంది అని ఆమె నమ్మకం. చక్కని ఉపమానమ్. ఇక్కడి దాక తెలుగు కవుల ప్రస్తావన చేసారు.

 

ఆ పైన, ప్రాయానికి నడక నేర్పించేది పద్మావతి దేవి కొత్త అవతారంలాగ కనిపించే నాయిక యొక్క పాదం అంటూ తిరుపతిని గుర్తు చేసారు. ఆ పైన కొంచెం తూర్పుకు వెళ్లి జయదేవుని గీతాగోవిందం సంగీతానికి అలంకారంగా కొనియాడారు. ఇక్కడ సందర్భానికి అది నాయకుడి ప్రేమగీతంగా భావించాలి అని నా నమ్మకం. ఆంధ్రప్రదేశ్ కి తూర్పున వంశధార నది ఉంది. ఆ నది దగ్గర హర్షవల్లి (అరసవల్లి) అనే ఊరిలో సూర్యుని గుడి ఒకటుంది. ఆ గుడితో (సూరుని తేజస్సు) అమ్మాయిని పోల్చారు. తనను తాను సూర్యకాంతగా (సూర్యుని అంశతో జన్మించిన స్త్రీ)  అంగీకరిస్తూ, ఆ కాంత (జీవన) వీణా రాగం అతడేనని నాయిక చేత చెప్పించారు.

 

క్షేత్రయలో జాణతనం, వరదయ్యెనులే వలపుతనం

అందని నీ ఆడతనం, అమరావతిలో శిల్పధనం

ఏడుగ చీలిందిలే నది గౌతమి గోదావరి

ఏకం కావాలిలే ఏడుజన్మలబంధాలివి

కృష్ణవేణి జడలో శైలమల్లిక

శివుని ఆలయాన భ్రమరదీపిక

 

ఈ చరణం మొదటి పంక్తిలో వేటూరి చిన్న ప్రయోగం చేసారు. క్షేత్రయ్య అన్నా, వరదయ్య అన్నా ఒక్కరే. క్షేత్రయ్య శృంగార గీతాలలో జాణతనం వరదయ్యింది అంటూ వరదయ్య అనే మాటను కూడా కలిపారు. అమ్మాయి అందాన్ని అమరావతిలో శిల్పసంపదతో పోల్చారు.

 

గోదావరి ఏడూ పాయలుగా విడిపోయినట్టు నాయికానాయకుల బంధం కూడా ఏడూ జన్మలుగా విభజించబడింది. ఆ బంధాన్ని సంపూర్ణంగా ఈ జన్మలో సాకారం చేసుకోవాలి అని నాయకుడు ఆశగా వర్ణించారు. ఆ బంధం కృష్ణవేణి (వేణి అంటే జడ లేక పాయ/నది. అందుకే కృష్ణ వేణి అంటే నల్లని జడ అని ఒక అర్థం; కృష్ణా నది అని మరొక అర్థం; అలాగే తెలుగునాట కృష్ణవేణి అనేది ఒక స్త్రీనామంగా కూడా వాడతారు) జడలో శ్రీశైలం అనే మల్లెపువ్వు వంటిది; ఆ శ్రీశైలంలో శివుని ఆలయంలో భ్రమరాంబికా దేవి ముందు వెలిగించిన దీపం వంటిది అంటూ పాటను ముగించారు.

 

ఈ పాట యువకవులకు ఒక పాఠం. ప్రతి కవితకూ ఒక వస్తువు ఉంటుంది. ఆ వస్తువుని పట్టుకుని అటు పీకి, ఇటు పీకి కవిత్వం వ్రాయడం రివాజు. ఒక పది ఉపమానాలు ఐదు అతిశయోక్తులు కలిపి చెప్పడం కూడా షరా మామూలు. ఒక వస్తువుని అనేక భాగాలుగా విభజించి, ఒక్కో ఉపవస్తువును మరొక వస్తువుకు అద్దంగా చూపుతూ రెండింటినీ పొగుడుతూ పోవడంలో ఎంత సౌందర్యం ఉందొ చూడండి.

 

అమ్మాయి అందాన్ని,ఒయ్యారాన్ని,అనురాగాన్ని వర్ణించారు. అన్నీ కలిపితేనే కదా ఆనందం? అలాగే అబ్బాయిలోని సున్నితమైన భావాలను, శృంగారాన్ని కూడా వర్ణించారు. ఈ మధ్యలో నదులు, గుడులు, దేవతల పేర్లు, కావ్యాలు అన్నీ వచ్చాయి. తెలుగునాడు గురించి తెలియని వారికి కూడా ఎన్ని విషయాలు తెలిసాయో చూడండి. అదీ వేటూరి అంటే.

 

పాట ఈ కింద విడియోలో మీకోసం

2 thoughts on “తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా (సందీప్)”

  1. చాలా చక్కని పాట పరిచయం చేశారు!
    సినిమా విజయవంతం కాకపోతే ఇంత చక్కని పాటలు కూడా మరుగునపడిపోతాయి! 🙁

  2. మంచిపాటను విశ్లేషించే ప్రయత్నం చేశారు. సూర్యకాంతమని ఒక కర్ణాటక సంగీతంలో ఒక రాగం ఉంది. గమనించగలరు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top