అనేక ఎండిన, వ్యవసాయ యోగ్యమైన, భూఖండాలకు సమృద్ధిగా నీరు పంచిన తరువాతే నీటి బుగ్గలో నీరు ఊరడం ఆగిపోయింది. అనేక వేల మంది సాహిత్య పిపాసుల దాహార్తి ని తీర్చి న తరువాతే ఆకాశం నుండి పడే జలధార ఆగిపోయింది. ఒక నది ఎండిపోయి ఉండవచ్చు కానీ ఎండిపోయే ముందు అనేక ఉపనదీ ప్రవాహాల్లో తన జలాలు కలిపింది. ఒక గొప్ప భావం,ఆలోచన మనసులలో నిలిచి పోతుంది,ఆ భావం ప్రకటించిన మహా వ్యక్తి కనుమరుగైనా. అటువంటి భావాలు శ్రోతలలో వేళ్ళూనుకుంటాయి. తరాలు మారినా ఆ భావాలకు కాలాను గుణం గా శ్రోతలు వివిధ తాత్పర్యాలు (భాష్యాలు) చెప్పుకుంటారు. భావం పునరుత్తేజం, పునర్జీవితం పొందుతుంది. ఉత్కృష్టమైన కళ, రచన లు అజరామరాలు. అనేక కాలాలలో శ్రోతలు మెచ్చుకొని ఆరాధించే కళను సృష్టించిన కళాకారుడు కూడా తన కళ లాగానే చిరస్మరణీయుడు.
జయంతితే సుకృతినో రస సిద్దా కవీశ్వరా,
నాస్తి యేషాం యశ:కాయ జరా మరణజం భయం.
పాటల రచయితలు సాధారణంగా కవులు కారు. చాలా మంది రచయితలకి గొప్ప ఆలోచనా శక్తి ఉండవచ్చు, వారు వేదాంతులు కూడా కావచ్చు. వారి భావజాలాన్ని అక్షరాలలో పలికించ సమర్ధులు కావచ్చు. కానీ చాలా కొద్ది మంది రచయతలకు మాత్రమే పదాల మీద సాధికారం తో కూడిన అనురక్తి ఉంటుంది. వారు వ్రాసిన ఏ పాట లో నైనా భాష తో పాటు భావ సౌందర్యము, పదాల అమరిక ప్రస్ఫుటం గా అగుపిస్తాయి, సినిమాలో సన్నివేశం, సందర్భం అంత ముఖ్యమనిపించవు. 60 ఏళ్ల తెలుగు సినిమా చరిత్ర లో, తమ సాహిత్యం లో సాధికారం గా అందాల పదాల విన్యాసం చేయించగల వారు ఇద్దరే మహా రచయితలు ఉన్నారు. ఒకరు శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి , రెండవ వారు పాత, కొత్త కాలాలకి వారధిగా ఉన్న శ్రీ వేటూరి సుందర రామ మూర్తి. ఇరువురికి భాష మీద పట్టు, భావనా పటిమ కూడా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు పదాలతో ఆడుకోగలిగారు. అందుకనే వారు పద “దాసులే” కాదు పద “బాసులు” కూడా.
వేటూరి కి ముందు, వేటూరి తోటి రచయితలలో కొంతమందీ, సాహిత్య పరంగా, సినిమాలలో సందర్భానుసారంగా గొప్ప పాటలు వ్రాసారు. వాటిని ఆణిముత్యాలు అనవచ్చు, సినిమా సాహిత్యపరం గానే గాకుండా, కవిత్వం లోను ప్రశంసించ దగ్గవి. ఒక్క దేవులపల్లి తప్పితే, ఎటువంటి సందర్భం లోనైనా సినిమా సాహిత్యాన్ని కవిత్వం స్థాయికి తీసుకెళ్లగల రచయితల్లో వేటూరి కి సాటి మరొకరు లేరు. మూర్ఖంగా అనిపించే సందర్భాలలో, అశ్లీల చిత్రీకరణ తోడైన చోట కూడా సాహిత్యపరంగా ఉన్నతమైన గీతాలు వ్రాయడం లో వేటూరి తన ప్రతిభ చాటారు.
“పెరుగుతున్న సోకు మీద మీగడంతా అందుకో”
“ఈడు వచ్చాక ఇట్టా వచ్చా మొదటి గిచ్చుళ్ళు నిన్నే గిచ్చా”
సినిమాలలో కళారాధన తగ్గుతూ వ్యాపారం గా మారుతున్న రోజులలో, వాణిజ్య సమీకరణాలు కళని కబళించడం మొదలైన రోజుల్లో, కనీస విలువలకి కట్టుబడ్డ పాత కళాకారులు మారుతున్న సంస్కృతి కి అలవాటు పడలేక సినిమా రంగంనుంచి తప్పుకుంటున్న రోజుల్లో, స్టార్ హీరోల ఆధిపత్యం మొదలవుతున్న రోజులలో వేటూరి సినిమా లలో ప్రవేశించారు. సాహిత్యపరంగా పాటలలో కానీ సంభాషణలలో కానీ విలువలను పట్టించుకోకుండా, మూస పద్ధతి లో సినీవారసుల ప్రజాదరణ పెంచడం కోసమే కల్పించిన యుగళగీతాలు, విషాద గీతాలు వేళ్ళూనుకుంటున్న రోజులవి. ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి అనుగుణంగా, సందర్భం తో శ్రుతి కలవకపోయినా ఉపయోగించుకోగల పాటలు, ఒక సినిమా కోసం అనుకొన్నవి మరో సినిమాలో, ట్యూన్, అక్షరం, కూడా మార్చకుండా వాడుకునే పాటలు అవసరం అయ్యాయి. ఇలా మార్చి నందున ఇసుమంత తేడా కూడా కనిపించదు. “చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది” అనే పాట ‘దసరా బుల్లోడు’ అనే సినిమా కోసం వ్రాసినది ‘బంగారు బాబు’సినిమాలో ఉపయోగించారు. కధానాయిక చెంగావి రంగు చీర కట్టుకుంటే చాలు ఏ సినిమాలోనైనా వాడుకోవచ్చు. సందర్భోచితంగా, కధానుగుణంగా, పాత్రానుసారంగా, అర్ధవంతం గా ఉండవలిసిన పాట తన సజీవ లక్షణాలను వీడి తన ప్రత్యేకతను పోగొట్టుకుంది. తెలుగు సినిమాలలో పాటలు సాహిత్య విలువలు కోల్పోవటానికి ఈ ప్రక్రియ దోహదం చేసింది. ఈ సంధి కాలంలో తెలుగు పాట తన గుర్తింపు ను పోగొట్టుకుంటున్న తరుణంలో శ్రీ వేటూరి సినిమా రంగ ప్రవేశం వల్ల సినిమా పాట కి అనుకోని మంచి జరిగింది. శ్రీ వేటూరి తెలుగు పాట కి స్వభావ సిద్ధమైన గుణాలను పునఃసృష్టి చేసి, భాషా సౌందర్యాన్నిఇనుమడింప చేసేటట్టు కొత్త భావాలతో, పద ప్రయోగాలతో, పాటకి జీవం పోసారు . తెలుగు నుడికారం ను తెలుగు పాటలో పునరుద్ధరించారు.
యద్భావం తద్భవతి
యద్సందర్భం తత్సాహిత్యం
సందర్భానుసారంగా పదాలతో ఆడుకోవడం శ్రీ వేటూరి బలం, బహుశా బలహీనత కూడాను. గొప్ప సందర్భాలకి ఉత్తమమైన పాటలు వ్రాసారు. సాధారణ సందర్భాలకు తమాషాగా ఉల్లాసం కలిగించే మాటలతో పాటలు వ్రాసారు. ఆయన మాటలు సందర్భానికి సరిగ్గా సరిపోయేవి, ఎక్కువ కానీ తక్కువ కానీ ఎప్పుడూ కాలేదు. ముఖ్యంగా పాట అంటే వస్త్రాలంకరణ, ఆకర్షణియమైన ప్రదేశాలు,భారీ సెట్టింగ్ లు కన్నా ఎక్కువుగా ప్రాముఖ్యత ఇవ్వని నిర్మాతలకి, దర్శకులకు కూడా సందర్భాన్ని కించపరిచే విధంగా ఎప్పుడూ వ్రాయలేదు. అభిరుచి గల నిర్మాత, కళా దృష్టి గల దర్శకుడు, రససృష్టి చేయగల సంగీత దర్శకుడు కలసి నప్పుడు వేటూరి శ్రేష్టమైన పాటలు అందించారు.
మానస వీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సాగరమధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం
అలివేణి ఆణిముత్యమా
నా పరువాల ప్రాణ ముత్యమా
ఆవిరి చిగురో అది ఊపిరి కబురో
స్వాతి వాన లేత ఎండలో
జాలి గుండె పూల దండలో
అలలు కలలు ఎగసి ఎగసి
అలసి సొలసి పోయే
పగలు రేయీ మురిసి మెరిసే సంధ్యా రాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ మెలిసే జీవన రాగంలో
శ్రీ వేటూరి కలం నుంచి ఇలాంటి పాటలు వందల కొద్దీ ప్రాణం పోసుకున్నాయి. సంపన్నమైన, పరిపూర్ణమైన సినిమా జీవితంలో, రచనా వ్యాసంగం చివరి దశలో కూడా శ్రీ వేటూరి, సినిమాలో సందర్భం తో పోటిపడి అద్భుతమైన పదాలతో పాటలు వ్రాసారు. 35 ఏళ్ల సినీ జీవిత గమనం లో మొదట్లో ఎంత ఉత్సాహం గా వ్రాసారో…
ఝుమ్మంది నాదం
సై యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీల
అంతే ఉత్సాహం తోనూ శ్రావ్యం గాను తరువాత కాలం లోను వ్రాసారు.
మధుర నాట్య సంభరిత నర్తన
కూచిపూడిలో తక ధిమితొం
విశ్వనాధుల ఏకవీరయే
తమిళ పడుచుల వలపు కధ
ఒక మనిషి గుణ గణాలను అతను స్నేహం చేసే మిత్ర బృందం ద్వారా అంచనా వేయవచ్చు.
ఆ విధంగా చూస్తే, శ్రీ వేటూరి అనేకమంది గొప్ప కళాకారులతో సాంగత్యం నెరపేరని తెలుస్తోంది. ఈ సాంగత్యం ఉభయతారకంగా ఇరువురికి ప్రేక్షకజన ప్రశంసలు తెచ్చింది. వేటూరి – విశ్వనాద్, వేటూరి – రాజన్ & నాగేంద్ర, వేటూరి – వంశి, వేటూరి – ఇళయరాజా, వేటూరి – చక్రవర్తి, వేటూరి – జంధ్యాల, వేటూరి – కే.వి. మహాదేవన్, వేటూరి – రమేష్ నాయుడు, వేటూరి – కె. రాఘవేంద్ర రావు, వేటూరి – ఉషా కిరణ్ మూవీస్ మొదలైన కలయికలు సినిమాలలో రమణీయ సందర్భాలు, సన్నివేశాలు సృష్టించాయి. వీరి సాంగత్యం, పరస్పర సహకారం వలన చలన చిత్ర పరిశ్రమ కొన్ని మరుపు రాని చిత్రాలని అందించింది. వీరి కలయిక సంగీత సాహిత్య సమ్మేళనం తో, రెండు నదుల సంగమం వల్ల ఉద్భవించిన జీవనది యై ఎనలేని ప్రేక్షక జనాదరణ పొందింది. సాహిత్యపరం గా అద్భుతంగా సాగిన శ్రీ వేటూరి సినీ జీవన గమనం లో ముందుగా చెప్పుకోవలసింది శ్రీ వేటూరి, శ్రీ విశ్వనాద్ ల అపూర్వ సృష్టి.
(ఇంకా ఉంది )
———————————–
కంచిభొట్ల శ్రీనివాస్ గారు వేటూరి గారి గురించి వ్రాసిన ఈ వ్యాసానికి బులుసు సుబ్రహ్మణ్యం గారి స్వేచ్చానువాదం
కంచిభొట్ల శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలతో….వేటూరి.ఇన్