ఎవ్వరో ఎవ్వరో (రచన-వేటూరి,చిత్రం-మల్లెపూవు)

బాణీ కట్టిన తరువాత పాట వ్రాయడం ఒక రకంగా అదృష్టమైతే ఒక రకంగా శిక్ష. కవిత్వం ధారలాగా పొంగితే అందులో భావానికి ఎల్లలు ఉండవు. అదే ఇక్కడ రెండు లఘువులు వెయ్యి, ఇక్కడ ఇంకో రెండు మాత్రలు పడాలి అంటూ కట్టడి చేస్తే అది కాలువ అవుతుందేమో కానీ నది కాలేదు. అలాంటి భావకవిత్వం ఉన్న పాటలు, రచయితకి స్వేఛ్ఛనిచ్చే సంగీతదర్శకులు ఉంటే సాధ్యమవుతుంది. కే.వీ.మహదేవన్, రమేశ్ నాయుడు దాదాపు అన్ని పాటలకూ, సాహిత్యం ముందు వ్రాసి ఇమ్మనేవారు అని తెలిసిందే. ఆ తరువాత చక్రవర్తి, ఇళయరాజ కొన్ని పాటలకు అలాగ వ్రాయించుకునేవారుట.

కొంతమందికి సందేహం కలుగుతుంది – “అలాగ వ్రాసిన పాటల్లో లయ ఉండదేమో? వాటిని ప్రజలు ఆదరించరేమో?” అని. కే.విశ్వనాథ్ చిత్రాలలో చాలా వరకు పాటలు ముందు వ్రాసి, ఆ తరువాత స్వరకల్పన చేయబడినవే. మరి శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతికిరణం, సిరివెన్నెల – మొన్న మొన్న సంగీతానికి నేషనల్ అవార్డు వచ్చిన స్వరాభిషేకం అలాగ చేయబడినవే! వాటిల్లో అన్నీ వినసొంపుగా ఉన్నపాటలే!ఇటు చూస్తే వేటగాడు, అడవి రాముడు మొదలైన చిత్రాలలో పాటలూ అలాగ వ్రాసినవే. మరి వాటిల్లో “ఊపు” లేదా? ఇంకో రెండు తరాల తరువాత కూడా గుర్తుండిపోయేటువంటి పాటలు చూసుకుంటే అవి భాష, భావం, స్వరం, గానం అన్నిటికీ న్యాయం చేకూర్చినటువంటి పాటలే, కాని ఇప్పుడు నేను చెప్పబోతున్నది అలాగ రచించిన పాటే (అని అది వింటే తెలుస్తుంది). హిందీలో వచ్చిన ప్యాసా సినిమాకు రీమేక్, “మల్లె పువ్వు”. హీరొ పాత్రను శోభన్ బాబు పోషించాడు. గురు దత్ సినిమా కాబట్టి సందర్భాలు ఉన్నతమైనవి. హీరో ఒక సానివాడకు వెళ్ళి అక్కడి వేశ్యల దైన్యస్థితిని చూసి పాడే పాట ఇది. ఇందులో గొప్ప భావోద్వేగం ఉంది. స్వరకల్పన చేసింది చక్రవర్తి. వేటూరి-చక్రవర్తి – వీరిద్దరికీ ఉన్న సామ్యం ఏమిటి అంటే అసమాన్యమైన శక్తి ఉన్నా, ప్రొడ్యూసర్లూ, డైరక్టర్లూ చేరి వీరిద్దరి చేతా చాలా సామాన్యమైన/నాసి రకమైన పాటలు వ్రాయించారు. ఈ పాట వారి కలిసి కృషి చేస్తే ఎంత గొప్పనైన పాటని అందించగలరు అన్నదానికి నిదర్శనం.

చిత్రం: మల్లె పువ్వు
సంగీతం: చక్రవర్తి
రచన: వేటూరి
గానం: బాలు

 

ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగేవారెవ్వరో
ఈ పాపం కడిగే దిక్కెవ్వరో
ఎవ్వరో వారెవ్వరో

అందెలు సందడి చేసిన జాతరలో, ఆకలేసి ఏడ్చిన పసికందులు
అందం అంగడికెక్కిన సందులలో, అంగలార్చి ఆడిన రాబందులు
ఎందుకో ఈ చిందులు, ఎవరికో ఈ విందులు
ఏమిటో ఏమిటొ ఏ ధర్మం ఇది న్యాయం అంటుందో
ఏ కర్మం ఈ గాయం చేసిందో? ఏమిటో ఆ ధర్మం ఏమిటో?

శీలానికి శిలువలు, కామానికి కొలువులు
కన్నీటి కలువలు, ఈ చెలువలు
కదులుతున్న ఈ శవాలు, రగులుతున్న శ్మశానాలు
మదమెక్కిన మతితప్పిన, నరజాతికి నందనాలు
ఎప్పుడో ఎప్పుడో ఈ జాతికి మోక్షం ఇంకెప్పుడో
ఈ గాధలు ముగిసేదింకెన్నడో?
ఎన్నడో? మోక్షం ఇంకెప్పుడో?

అత్తరు చల్లిన నెత్తురు జలతారులలో
మైల పడిన మల్లెలు ఈ నవ్వులు
కుక్కలు చింపిన విస్తరి తీరులలో
ముక్కలైన బ్రతుకులు ఈ పూవులు
ఎందరికో ఈ కౌగిళ్ళు, ఎన్నాళ్ళో ఈ కన్నీళ్ళు
ఎక్కడా ఎక్కడా ఏ వేదం ఇది ఘోరం అన్నదో
ఏ వాదం ఇది నేరం అన్నదో
ఎక్కడో ఆ వేదం ఎక్కడో

ఈ మల్లెల దుకాణాలు, ఈ గానాబజానాలు
వెదజల్లిన కాగితాలు, వెలకట్టిన జీవితాలు,
వల్లకాటి వసంతాలు, చస్తున్నా స్వాగతాలు
కట్లు తెగిన దాహాలకు, తూట్లు పడిన దేహాలు
ఎక్కడో ఎక్కడో ఈ రాధల బృందావనమెక్కడో
ఈ బాధకు వేణుగానం ఎక్కడో
ఎన్నడో ఎక్కడో ఎప్పుడో

ఈ పాటలో విశ్లేషించడానికి ఏమీ లేదు. ఎక్కడా కష్టమైన పదాలు వాడలేదు కవి. చిన్న చిన్న పదాలతో గొప్పభావాన్ని వ్యక్తపరిచాడు. ఒక చరణానికి, మఱో చరణానికీ బాణీలో పొంతనలేదు. అందుకే ఇది మొదట సాహిత్యం వ్రాసిన పాట అని అనిపించింది.

కొన్ని మాటలు నిప్పుకణాలలాగా ఉన్నాయి. కన్నీటి కలువలు, కదులుతున్న శవాలు, రగులుతున్న శ్మశానాలు, మైలుపడిన మల్లెలు, వెలగట్టిన జీవితాలు, వల్లకాటి వసంతాలు – ఇవన్నీ బరువైన ప్రయోగాలు. “కన్నీటి కలువలు” అని విన్నప్పుడు “మాతృదేవోభవ” చిత్రంలో “కన్నీటికి కలువలు పూచేనా?” అనే వాక్యం గుర్తుకొచ్చింది. అలాగే, “ఈ రాధల బృందావనమెక్కడో?” అని అనడం, వేశ్యల గురించి వర్ణిస్తూ కూడా రాధమ్మను తలుచుకుంటూ, అందులో ఎటువంటి దైవధిక్కారం లేకుండా, ఒక రకమైన ఆవేశాన్ని చూపించాడు కవి. ఇలాగ ఈ పాట గురించి చెప్పుకుంటూ పోతే ఎంతైనా వ్రాయచ్చు. కాకపోతే ఇది వర్ణించేటువంటి సాహిత్యం కాదు, మనసుని సూటిగా గుచ్చే సాహిత్యం. విని అనుభవించాలి, అంతే! వేటూరి మాటల్లో చెప్పాలంటే, “మనసు…మాటలు కాదుగా?”

—————————————————————–

సందీప్ రాసిన ఈ వ్యాసం ఈ కింద లింక్ లో చూడవచ్చు

http://manonetram.blogspot.in/2010/07/blog-post.html

You May Also Like

One thought on “ఎవ్వరో ఎవ్వరో (రచన-వేటూరి,చిత్రం-మల్లెపూవు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.