వేటూరి వ్రాసిన వానపాటలు చాలా ప్రజాదరణ పొందాయి. వీటిలో భావం ఒక్కోసారి సున్నితంగా, ఒక్కోసారి సునిశితంగా, మఱో సారి బాహాటంగా ఉంటుంది. విషయం భక్తి ఐనా, బూతైనా పదాలను పట్టుకోవడంలో వేటూరి చాకచక్యం ఏ కవినైనా కవ్విస్తుంది. వానపాటల్లో మరీను.
ఉన్న మాట చెప్పుకోకపోవడం ఎందుకు. ఏ చలనచిత్రకవివైనా, వాన పాటలలో అత్యధిక శాతం ప్రణయ శృంగారావేశభరితంగా ఉంటాయి. అదే, మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే పచ్చిగా ఉంటాయి. వేటూరి పాటలు అర్థమైనవారికి పదాలనే తీయని గుజ్జు వెనుక చేదైన బూతు విత్తనం తగలవచ్చును. అర్థం కానివారికి వగరు తొక్క వెనకాల తీయని గుజ్జు రుచించకపోవచ్చును. ఎవరేమన్నా ఆ పాటల్లో వగరూ,తీపి, చేదు అన్నీ ఉన్నాయి. వెరసి అది మావిడి పండు. కొంచెం గంభీరంగా చెప్పాలంటే చూతపాకం అనాలేమో. అన్నట్టు మన్మథుడిని చూతాస్త్రుడు అంటారని బ్రౌహ్ణ్య నిఘంటువు ఉవాచ. వేటూరి పాటలలో ఉత్తుంగ శృంగారభావాల కారణంగా ఆ కోణంలో కూడా ఆయన పాటలని చూతపాకం అనడం సబబేమో.
వాన చుట్టూ ఎన్ని విషయాలు ఉంటాయి? ఉరుము, మెరుపు, తళుకు, తొలకరి, జల్లు -ఇలాగ ఒక డజను పదాలుంటాయనుకోండి. వేటూరి కనీసం ఒక పాతిక వానపాటలు వ్రాసి వ్రాసారు అనుకుంటున్నాను. ఉన్న డజను పదాలతో ఈ పాటల మధ్యన ఎంత వైవిధ్యం కుదురుతుంది? సందర్భాన్ని కూడా కలుపుకుందాము అంటారా? అవును శంకరా నాదశరీరాపర సందర్భం వేఱు, వానా వల్లప్ప వానా వల్లప్ప సందర్భం వేఱు. కానీ “మన తెలుగు చలనచిత్రాలలో ఎన్ని సందర్భోచితమైన పాటలు ఉంటాయి?”, అని ఆలోచిస్తే, ఆ పాతిక పాటల్లో పదిహేను పాటలకు సందర్భం ఇదే: “హీరోకి, హీరోవిన్ కి love. వాన పడింది. పాట వ్రాయలయ్య కవి”. ఐనా కూడా పాట పాటకీ కొత్త కొత్త భావాలను, పదాల గారడీని చూపించారు వేటూరి.
మొదట మనం భక్తి రసంతో మొదలేడదాము. వానపడుతోంది. ఒక భక్తుడులో “తను చేస్తున్న మంచిపనికి లోకం ఎందుకు హర్షించట్లేదు” అనే ఆవేశం కలిగింది. దాన్ని సాహిత్యంలో ఎంత ఎత్తుకు తీసుకెళ్ళవచ్చును అని (కే) విశ్వనాథుడు, (కే. వి) మహాదేవుడు వేటూరిని అడిగితే, దానికి వేటూరి వినమ్రంగా ఇలా బెదిరించారు. శంకరాభరణం చిత్రంలో…
ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంథరా నీలకంథరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది
అవధరించరా! విని తరించరా!
“నా పాట విను, విని సంతోషించు”, అని అడగటంలో శంకరశాస్త్రి గాంభీర్యం మనకు కనబడుతుంది. ఆ తఱువాత
మెరిసే మెరుపులు మురిసే పెదవుల ముసిముసి నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరిమువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా ధరకుజారెనా శివగంగా
నా గానలహరిఁ నువు మునుగుంగా, ఆనందవృష్టిఁ నే తడువంగా
http://www.youtube.com/watch?v=iZACVIMSbOM
శివుడు పెట్టిన పరీక్షకు తను ఎలాగ ప్రతిస్పందిస్తున్నాడొ చూద్దామని లీలావినోది ముసిముసి నవ్వులు నవ్వుతుంటే అవి మెరుపులయ్యాయని, తన నడవడికి, గానానికి సంతోషించి శివుడు చేసే నాట్యంలో తుళ్ళుతున్న మువ్వల అలికిడి, తళుకు ఉరుములగానూ, ఆ వర్షం శివుడు తాదాత్మ్యంలో ఉండటం వలన గంగ క్రిందికి ఒలకడం గానూ వర్ణించడంలో వేటూరి మఱొక్క సారి “యద్భావం, తద్భవతి” అనే నానుడిని గుర్తుచేసాడు. శంకరశాస్త్రి “శాస్త్రి”. శాస్త్రాలను, భగవంతుణ్ణి మూలంగా ఉంచుకుని నడిచే వ్యక్తి. అతనికి ఆకు కదిలినా, పువ్వు మెదిలినా శివలీలగా అనిపిస్తుంది. ముందు చరణంలో అచంచలమైన గాంభీర్యం పక్కనే రెండో చరణంలో చలింపజేసే భక్తి. వేటూరి కత్తికి రెండు వైపులా కాదు, తొమ్మిది వైపులా (నవరసాలు) పదునే.
ఒక్క ఉదాహరణే ఇస్తే ఎలాగ అంటారా? సరే వేటూరి గురించి పుస్తకాలే వ్రాసినవాళ్ళు ఉన్నారు. నేను మఱొక ఉదాహరణ ఇవ్వలేనా? సరిగమలు చిత్రంలో రవి శంకర్ శర్మ (బొంబాయి రవి) సంగీతానికి వేటూరి వ్రాసిన మాటలు చూద్దాము. ఇది వాన పాట కాదు కానీ వానతో కూడిన భావం. అంటే నిఖార్సైన ఉదాహరణే. అప్పటిదాకా సంగీతం చేతకాని వాడు గురువు అనుగ్రహం వలన, దైవబలం వలనా గొప్ప పాటగాడయ్యాడు. అప్పుడు వేటూరి అన్న మాటలు:
“కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి”
అద్వైతభాష్యాలను చదివిన వాళ్ళకు కుండలో నింగి అంటే ఏమిటో తెలుస్తుంది. బ్రహ్మమంతా ఒకటే అనడానికి దృష్టాంతాలంకారంతో గౌడపాదులు (శంకరాచార్యుల గురువుకు గురువు) చెప్పిన ఉదాహరణ ఇది. బ్రహ్మం ఆకాశంలాగా అంతటా ఉంది. కుండలలోనూ ఉంది, బయటా ఉంది. కుండల వలన అది వేఱు వేఱుగా ఉన్నట్టు అనిపిస్తోంది. అలాగే మాయ (మట్టి)ని తొలగిస్తే అంతటా ఉన్నది బ్రహ్మమే (ఆకాశమే). అలాగే ఇన్నాళ్ళూ తనలో ఉంచుకున్న సంగీతశక్తి తనకు ఆ కుండ అవధి కాదని తెలుసుకుని ఒక్కసారిగా ఉరిమింది అని కవి భావన. నాకు ఈ భావం అర్థమైనా “కొమ్మ కొమ్మకో సన్నాయి” పుస్తకంలో వేటూరి ఇచ్చిన వివరణ చదివి ఆయన భావం అదే అని రూఢీ చేసుకున్న తఱువాత మరింత సంతోషం కలిగింది. ఎక్కడ గౌడపాదులు, ఎక్కడి అద్వైతం, ఎక్కడి కుండ! ఇక్కడ సంగీతసరస్వతీ శక్తిని వర్ణించడానికి వేటూరి ఉపయోగించుకున్నారు. వెయ్యండిరా నూరు వీరతాళ్ళు అనాలనిపించట్లేదు?
——————————————–
సందీప్ రాసిన ఈ వ్యాసం కింద లింక్ లో చూడవచ్చు
http://manonetram.blogspot.in/2012/06/1.html