బాధతో నిండిన సందర్భానికి వేటూరి వ్రాసిన వానపాటలు చూద్దాము. సామాన్యంగా వర్షాన్ని సంతోషానికి చిహ్నంగాను, మబ్బుని బాధకు చిహ్నంగాను వాడతారు. వేటూరి కూడా అదే చేసారు. అలాంటి పాటల్లో నాకు మొదట గుర్తొచ్చేది మేఘసందేశంలో రమేశ్ నాయుడు సంగీతంలో వేటూరి వ్రాసిన పాట. మేఘసందేశం పేరులోనే వాన ధ్వని ఉంది కదా. ఇందులో వేటూరి, “దేవులపల్లి గారి పాటలకు నా పాటలు తుల తూగుతాయి చూడండి”, అన్నట్టు వ్రాసారు.
“ఆకాశదేశాన, ఆషాఢమాసాన మెరిసేటి, ఓ మేఘమా!
విరహమో దాహమో విడలేని మోహమోవినిపించు నా చెలికి, మేఘసందేశం”
http://www.youtube.com/watch?v=59h1_ZDnfcA
సందర్భాన్ని, మబ్బుని పరిచయం చెయ్యడం కోసం వేటూరి – “ఆకాశ దేశంలో, ఆషాఢ మాసం” అని అన్నారు. ఈ “ఆకాశదేశం” ప్రయోగం వేటూరికి బాగా నచ్చి ఆ పైన చాలాసార్లు వాడుకున్నారు. [ఉదా:- అగడం బగడం (హనుమాన్ చిత్రంలో), తెల్ల చీరకు తకధిమి (ఆఖరి పోరాటం), ఏ కొమ్మకాకొమ్మ (శీను).] మిగతా పాటలో వాన
ప్రస్ఫుటంగా కనిపించకపోయినా ఆ ధ్వని ఉంటుంది. అందుకే కదా అది “మేఘసందేశం”! “వానకారు కోయిలనై” (వసంతం వెళ్ళిపోయిన తఱువాత కోకిల),”ఉలిపిరి చినుకుల బాసలతో, తొలకరి మెరుపుల లేఖలతో, రుధిర బాష్పజల ధారలతోవిన్నవించు నా చెలికి మనోవేదన…నా మరణయాతన!”
నాకు తెలిసి ఎవరికైనా సరే వాతావరణంలో మబ్బులు పట్టినప్పుడు నిజంగానే విరహభావం కలుగుతుంది. ఎందుకంటే మబ్బు నీళ్ళు కురుస్తాయి అనే ఆశని కలిగుస్తుంది కానీ వర్షం వచ్చేంత వరకూ ఆ నీళ్ళు రావు. మేఘాలు విరహం అంటే గుర్తొచ్చింది, విరహంతో కూడిన తీయని బాధని ఆనంద్ చిత్రంలో “మేఘమల్లె సాగివచ్చి దాహమేదో పెంచుతావు. నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు” అనే వాక్యం నాకు ఎంతగానో నచ్చింది.
మఱొక ఉదాహరణ కావాలంటే “మాతృదేవోభవ” చిత్రంలో జాతీయపురస్కారాన్ని అందుకున్న “రాలిపోయే పువ్వా పాటలో” ఆయన వర్షాన్ని కరిగిపోయే కలగా వర్ణించినది చూద్దాము.
“అనుబంధమంటేనే అప్పులేకరిగే బంధాలన్నీ మబ్బులే”
మనిషికి ఇతరులతో ఉన్న కర్మబంధాలే అనుబంధాలై మబ్బులలాగా వస్తాయి. అవి కరిగిపోయే వర్షమౌతాయి, అని కవి భావం. ఇక్కడ వర్షం ఉపమానం, ఉపమేయం రెండూ కాదు. కాకపోతే వర్షించడాన్ని ఒకింత చెడు విషయంగా చెప్పడం అరుదైన విషయం. సినిమా పాటలలో లోతైన కవిత్వానికి యిలాంటి పాటలు, యిలాంటి పంక్తులు చక్కని
ఉదాహరణలు. ఇక్కడ “అప్పు” అన్నదానికి రెండర్థాలున్నాయి. ఒకటి అందరికీ తెలిసిన “ఋణము”. “ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః” అన్న సూక్తిని మనకిక్కడ వేటూరి గుర్తుచేస్తున్నారు. అయితే యిందులో వేటూరి కవిత్వ పటుత్వం ఎక్కడుందంటే, ఇక్కడ “మబ్బుల” ప్రసక్తి తేవడం! బంధాలని మబ్బులతో
పోల్చడం. ఆకాశం సముద్రంనుండి నీటిని మబ్బుల రూపంలో అప్పు తెచ్చుకొని వాన రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది. ఆ రకంగా భూమికీ ఆకాశానికి అనుబంధం మబ్బులే! అయితే అవి కరిగిపోయేవి. అలాగే బంధాలన్నవి కూడా ఎప్పటికయినా కరిగిపోయేవే. “అప్”/”అప్పు” అంటే నీరు అనే అర్థం కూడా ఉంది. అంచేత అనుబంధమంటే అప్పులే అంటే అనుబంధం అన్నది నీరు వంటిది అనే అర్థం కూడా వస్తుంది. బంధాలుకూడా నీళ్ళలాగే వివిధ రూపాల్లో ఉంటాయి. బంధాలు ఏర్పడడం పోవడం అనే ప్రక్రియ నీటి-చక్రం వంటిది. అదొక నిరంతర భ్రమణం!
సరే ఈ సారి “సరదా” విషయాలకు వద్దాము. అంటే వానని వానగా వర్ణిస్తూ, ఆ సంబరాన్ని ఎలాగ చెప్తారు? ఇది నేను నాలుగేళ్ళ క్రితం ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాను. వేటూరి పాటలు చూసాక నాకు నాలో ఉన్న కవిపైన చాలా చిన్నచూపు కూడా కలిగింది.
నాకు వెంటనే రెండు పాటలు గుర్తొస్తున్నాయి. రెండూ కమ్ముల శేఖర్, రాధాకృష్ణన్ లకు వ్రాసినవే. మొదట ఆనంద్ చిత్రంలో “వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా” పాటను చూద్దాము. ఇందాకటిదాకా మబ్బులను విరహవర్ణన కోసం
వాడుకుని ఇప్పుడు మబ్బులను “బాధ తీరుస్తారా?” అని అడుగుతున్నారు చూడండి. అందులో, “వర్షం కురిపిస్తారా? లేక ఊరకే కనబడి వెళ్ళిపోతారా” అనే ధ్వని కనిపిస్తోంది. అలాగే, చిత్రంలో రూప వానలో మిత్రులతో కలిసి నర్తిస్తుంటే చూసిన ఆనంద్ బాధని వర్ణిస్తూ వేటూరి వ్రాసిన వాక్యాలు చూద్దాము.
నెమలి ఈకలా ఉలికిపడే ఎవరి కన్నులో
చినుకు చాటున చిటికెలతో ఎదురుచూపులో
నల్లని మేఘాల మెరుపులందం
తీరని దాహల వలపు పందెం
వర్షం పడేట్టుంటే నెమలి పురివిప్పుతుంది. అందుచేత నెమలి ఈకలు “ఉలికి పడతాయి”. మరింత అందంగా ఉంటాయి. అలాగే ఆనంద్ కళ్ళు కూడా రూపని చూసి ఉలికిపడ్డాయి. ఎంత చక్కని భావం! ఆ చినుకుల చాటుగా ఆనంద్ చిటికెలు వేస్తూ (అంటే తాళం వేస్తూ, లేక సమయాన్ని లెక్కిస్తూ) ఎదురుచూస్తున్నాడు (తన ప్రణయం ఫలించడానికి). శభాష్! ఆ తఱువాతి వాక్యాలలో మేఘాలని కొంచెం దూరంలో ఉన్న రూపతోనూ, మెరుపుని ఆమె అందంతోనూ, ఆనంద్ ప్రేమని తీరని దాహంగాను – ఆ మేఘాన్ని ఇతను వర్షింపజేయగలుగుతాడా అనేదాన్ని పందెం గానూ వర్ణించారు. వర్షం గురించి చెప్పేటప్పుడు నెమలి గురించి చెప్పడం వరకు అందరూ ఊహిస్తారు, కానీ నెమలి కన్నుకి ప్రేమికుడి కన్నుకి మధ్యన అందమైన పోలిక చెప్పడం వేటూరికే సాధ్యం. ఈ వాక్యాలలో మబ్బుని మళ్ళీ ఆశగొలిపే వస్తువుగా వేటూరి వాడుకున్నారు.
ఒక సామాన్యుడి మనసులో వర్షం అనగానే కలిగే భావనలు (పడవ, సెలవు మొ.) ఈ పాటలో వేటూరి పిల్ల, బుల్లి; చదువు, సెలవు లాంటి పదాలతో లయబద్ధం చేసారు. వర్షఋతువు శ్రావణమాసంలో మొదలౌతుంది కాబట్టి శ్రావణమాసల జలతరంగం మన దేశంలో ఒక కొత్త ధ్వనిని (మృదంగం) వినిపిస్తుంది అని చెప్పడం.
“శ్రావణమాసాల జలతరంగం, జీవనరాగాలకిది ఓ మృదంగం”
వేటూరికి కూడా ఒక ఆవు వ్యాసం వచ్చు – అందాన్ని వర్ణించడం. ఈ వాక్యాలలో స్త్రీ వానకు అందం తెచ్చింది వాన స్త్రీకి అందం తెచ్చిందో తెలియనివ్వలేదు మహానుభావుడు. చినుకుల స్పర్శని పురుషుడితో పోల్చి చెప్పిన వాక్యాలు
చూద్దాము.
కోరి వచ్చిన ఈ వాన, గోరువెచ్చనై నాలోన
ముక్కులో సిగ్గు ముసిరేస్తే, ముద్దులాటలే మురిపాన
మెరిసే మెరిసే అందాలు, తడిసే తడిసే పరువాలు
గాలివానల పందిళ్ళు, కౌగిలింతల పెళ్ళిళ్ళు
ఇక “గోదావరి” లో వేటూరి వ్రాసిన పాటను చూద్దాము.
టప్పులు, టిప్పులు దుప్పటీ చిల్లులు, గాలివాన హోరుజల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటిజింకలు
జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయె ముద్ద ముద్దగా
మబ్బు మబ్బునా మెరుపుతీగె పొద్దులు కళ్ళలోన కన్నుగీటగా
మొదట ఈ పాట విన్నప్పుడు పల్లవి మొదలు నాకు నచ్చలేదు. టప్పులు, టిప్పులు ఏమిటి అనిపించింది. ఇప్పటికీ నాకు ఈ వాక్యం భావం తెలియలేదు కానీ ఆకాశాన్ని దుప్పటీతో పోల్చి అందులోంచి వర్షం దుప్పటీ చిల్లులలోంచి పడుతున్నట్టు కవి భావమేమో. అది పక్కన పెడితే ఆ జల్లులు ఏటిలో పడితే చేపలు (నీళ్ళపై పడి ఒక్క క్షణం గెంతుతాయి కనుక), చేతిలో పాపలు (మనం చేతులలో జాగ్రత్తగా పట్టుకుని మురిసిపోతాము కనుక). ఇక్కడ నాకు బాగా నచ్చింది “నీటి జింకలు” అనడం. ఊహించండి నిజంగీ ఒక జింక నీటితో తయారై గెంతుతుంటే ఎలాగుంటుందో. వాన పడినప్పుడు అదే భావన కలగాదా? అద్భుతమైన ప్రయోగంగా నాకు అనిపిస్తోంది. మళ్ళీ మబ్బును కోరికతో అనుసంధానం చేసి చెప్పారు, గమనించండి.
ఘల్లు ఘల్లున సానితెమ్మెర గౌతమింట గజ్జ కట్టిలే
ఎంగిలడ్డని గంగ ఒడ్డని పండుముసలి శబరి తల్లిలే
చల్లగాలిని నర్తకితో పోల్చి అది గోదావరి ఇంట్లో గజ్జెకట్టిందనడం వేటూరి కవితాపటిమకు మఱొక మచ్చుతునక. శబరి గురించి వ్రాసిన వాక్యం నాకు అర్థం కాలేదు. వాద్యాల హోరు వలన, పాడేవారికి తెలుగు రాకపోవడం వలన నలిగిపోయిన వేటూరి పంక్తులలో ఇదొకటి. కానీ వర్షం తనపై పడి గంగలో పడటం ఎంగిలౌతుంది అని శబరి ఒడ్డున ఉంది అనే ఉద్దేశంతో వ్రాసారని అనిపిస్తోంది.
—————————————
సందీప్ రాసిన ఈ వ్యాసం కింద లింక్ లో చూడవచ్చు
http://manonetram.blogspot.com/2012/06/2.html