నీకు తెలుసా ? తేదీ మే 22న అంటే ఇవాళ వేటూరి వర్ధంతి.

మాట మాటకూ మోగు కిన్నెర పాట పాటకూ మోగు కిన్నెర.. కిన్నెర సాని వచ్చిందమ్మా ఎన్నెల పైటేసి అని రాయడంతో ఆయన నాకెందుకనో నచ్చి ఉంటారు. వంశీగారికి ఒక పట్టాన ఎవ్వరూ నచ్చరట ! కానీ వేటూరి గారితో పాట రాయించడం ఆయనకొక ఇష్టం అని విన్నాను. వేటూరి ఏం రాసినా అలవోకగా రాస్తారు అని విన్నాను. సులువు ఆయనకు తెలుసు. టెక్నిక్ తో పాటే పోయెటిక్ సింటాక్స్ ఆయనకు బాగా అలవాటు. చిన్న చిన్న మాటలే అవి పలికే తీరే అద్భుతం. అంతా శంకరాభరణం పాటలే గొప్పవి అంటారు నాకెందుకనో గోదావరి సినిమా పాటలే బాగున్నాయి. కావ్య రీతి ఎంతో ఉన్న పాటలను అంతా స్మరిస్తే.. ప్రేమ రీతి ఎక్కువగా ఉన్నా రామ తత్వం కలిసిన గోదావరి గలగలలు నింపుకున్న ఆ పాటలు నిజంగానే ఆయనకొక జీవన్ముక్తి. ఏటా నన్ను ప్రోత్సహించు వేటూరి సాహిత్య ప్రేమికులకు నేను రుణపడిపోయాను. రామయ్య భోగాన్నీ గోదావరి తరంగాలు మాత్రమే చెప్పగలవు. మళ్లీ రామయ్య భోగాన్నీ వైభవాన్నీ ప్రాభవాన్నీ వేటూరే చెప్పగలరు. రాలేటి పూలకు వందనం. పూసేటి సాయంత్రాల వేళ ఓ గోధూళి వేళ ఆయనొక దయాళు. నేనొక బిందువు. భక్తుడ్ని కాదు బిందువును.
పాతికేళ్ల గీతాంజలి అని చాలా రోజుల కిందట వేటూరి గారిని స్మరించిన వైనం నాకెందుకనో భలే గుర్తుండిపోయింది. అంతా గీతాంజలి సినిమాను గుర్తు పెట్టుకుని కీర్తిస్తున్నారు. మణి సర్ ను గుర్తు పెట్టుకుని కీర్తిస్తున్నారు. నేను మాత్రం కవిని స్మరించాను. మా బతుకులలో వెన్నెల విరబూయించిన కవి ఇతడు అని ఇప్పటికీ కీర్తిస్తాను. పాటకు ఓ ప్రామాణిక రీతి తీసుకుని వచ్చిన కవి ఇతనే అని నిర్థారించగలను. పెర్ఫెక్ట్ మీటర్ లో పాట రాయడం సులువు కాదు. కానీ పాటను ఓ బాణిలో చెబుతూ.,. కథ చెప్పడం ఆయన రాలేటి పూల సోయగాలకే చెల్లు. అవన్నీ అనుబంధ ప్రధానాలు. అవన్నీ కావ్య ప్రధానాలు. ఆత్రేయ కన్నా ఆరుద్ర కన్నా ఇతరుల కన్నా వేగంగా రాయడం ఎంత బాగుంటుందో ఆయన మాత్రమే నిరూపించారు. నిజంగానే వేగమొక ప్రామాణిక గతి. రీతి.
వేటూరి గారు అంటే నాకెందుకనో ఓ ప్రత్యేక ఆకర్షణ అయి ఉంది. రైటర్ రాధా మండువ గారు.. ఓ సారి నేను వేటూరి సాహిత్యాన్ని విశ్లేషించిన పద్ధతి ని చదివి మెచ్చుకున్నారు.ఆ విధంగా నేను వేటూరి డాట్ ఇన్ కు పరిచయం అయి కొన్ని వ్యాసాలు రాశాను. నా తరంలో ఇంకా రేపటి వేళ వస్తున్న తరంలో తరుణంలో కొత్త స్వరం ఒక్కటి వినిపించాలని నేను అనుకుంటూ ఉంటాను. అనువాద గీతాలు కూడా ఆయన పద్ధతిగానే రాశారు. కొన్ని తిక్కగా రాశారని విమర్శలూ ఉన్నాయి. వేటూరికి కృష్ణా ప్రాంగణం ప్రాణ నేపథ్యం. గోదావరి ప్రాంగణం జీవన నేపథ్యం. కానీ మా వంశధార ను కూడా పాటలో రాశారు. ఉరికి వచ్చాను నీ వంశధారగా అని రాశారు. రాసి ఈ ప్రాంతంపై కూడా ప్రేమ కురిపించారు.
సినిమా పాటలు రాశారు శ్రీశ్రీ. సినిమా పాటలు మాత్రమే రాశారు వేటూరి. ఎవరు గొప్ప. వేగంగా రాయడమే నాకొక అలవాటు అని నిరూపించిన వేటూరి సుందర రాముడు నాకొక స్ఫూర్తి. మార్నింగ్ రాగా డిజిటల్ డైలీ గతులలో ఇన్ని వేగంగా రాయడం అంటే చిన్న విషయం కాదు. నేనొక అమ్మాయితో మాట్లాడుతూ ఇవే చెప్పాను. బాగా రాయడం ఒక్కటి వేగంగా రాయడం ఒక్కటి ఈ రెండూ ప్రామాణికాలు. ఈ ఉదయం ఒక పాట స్మరించాను. ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపుగా బతుకు దెరువు కాగా అని.. గోదావరి సినిమా కోసం ఆయన గొప్ప మాటలతో కూడిన పాటలు రాశారు. పాట సంస్కృతిని నిలిపే ప్రయత్నాలు పది కాలాల పాటూ చేశారు. గొప్ప కవి.
- శంభుమహంతి రైటింగ్స్

చక్కగా రాసారు