
బ్రహ్మశ్రీ వేటూరి సుందరరామమూర్తి గారు
తెలుగన్నగగనాన వేటూరి ధ్రువతార;
ఆమ్నాయములవంటి కావ్యాల కలధార;
శ్రీనాధునికి ఉనికి, రసధునికి తొలిమనికి
పోతనకు ప్రతిరూపు, ధూర్జటే తన చూపు
మిన్నేటి కొక ఊపు, మిన్నాగుకై కైపు
నవ్యతకు ప్రావ, తమకముల త్రోవ
తాళ్ళపాక నందకము, మొవ్వకవి సంతకము
పింగళికి పిసాళి మస, చేమకూరకవి కేళి పస
నన్నపార్యుని తమ్మయ, సోమయాజికి అన్నయ
తొల్లి కవులకు పరువు, మదనునికి ముంగురువు
శ్రీరాణి ముక్కు పుడక, గీర్వాణికాందోళిక, శర్వాణికొక దీపిక
నెలతాల్పు నాద తనువు, లలినింపు కవన ధనువు
పలుకవుల పరమగురువు, తెలుగింటి పెరటి తరువు
అసమాన సాహితీ దీక్షితుడు, తెలుగు భాషా రక్షకుడు
మహానుభావుఁడు, మహోన్నతుడు, యువకవి కులానికి దేశికుడు
నీటారు చందురు దివ్య దీప్తి
శ్రీ వేటూరి సుందరరామమూర్తి….
తే.వేల గీతాల వేటూరి వేలి కొసల
ఉద్భవించిన గీతాలు ఉజ్వలములు
మలయుచున్నవి నేటికీ మధురమగుచు;
మనదు ప్రాచీన కవులందు మసలు మసల
నందగించేటి కవనాల నందజేసి ;
తే.రసములన్నియు రమ్యమై రాశి వోలె
కనగవచ్చును వేటూరి కవనమందు
భావ లాలిత్య లాస్యాల జీవ కళలు
మహిత సాహితీ సరములై మంపుగొలుపు ;
ఆ.సుందరయ్య కవిత సుస్వరాల సవిత
శోభనాల నెలత శుభ సమేత
ఇందుకళిక నిచ్చి ఏతాము నెత్తించి
ఇక్షు రసము పంచి ఇంచు పెంచు !!
ఆ.విన్నపాటలన్ని విన్నబాటు నొసగు
విన్న కొలది మరల వినుమటంచు;
విసుగు కలగబోదు దొసగు కనగ రాదు
పగటు పందిరైన పాటలవియె !!
వేటూరిగారితో గడిపిన మధుర క్షణాలు – కొన్ని విశేషాలు :
తన వద్దకు వచ్చిన వారిని వేటూరి గారు చాలా ఆప్యాయంగా పలకరించేవారు. వారి మాటల్లో అపారమైన కారుణ్యభావం తొణికిసలాడేది. ఒకసారి నేను వారిని హైదరాబాద్ లకడీకాపూల్లో అశోకా హోటల్లో కలిసాను. తన AC రూంలో నాకు 10 నిమిషాలు కేటాయించి, ఎంతో ప్రేమతో పలకరించారు. రెండవసారి వారిని సికింద్రాబాదులో ఒక పెళ్లి రిసెప్షన్లో కలిసాను. వారితో ప్రశాంతంగా 15 నిమిషాలు మాట్లాడగలిగాను. తరువాత 2007 నుండి 2010 వరకు వారిని దాదాపు ప్రతి రొజూ కలిసే అదృష్టం నాకు కలిగించిన గురువుగారు శ్రీ వేటూరి. ఒకరోజు, వారు అయ్యప్ప గురించి వ్రాసిన ఒక చలచిత్రేతర గీతంలో – “సంశ్రుతి భంగ అసంగ సుసంగ వశంవద సంపద స్వామిమల, నిష్కృతులెరుగని దుష్కృతులార్చే నీమములిచ్చే నీలిమల – అని వ్రాసారు. ఇలా ఒక వాక్యం సంస్కృతములోను, మరో వాక్యం తెలుగులోనూ ఎందుకు వ్రాసారు ? అని వారిని నేనడిగాను. వారు ఒక చిరునవ్వు నవ్వి, ఇది ఒక సంప్రదాయ సాహితీ ప్రక్రియ. దీనిని మణిప్రవాళ సాహిత్యం అంటారు నాయనా” అన్నారు.
నేను, దత్తాత్రేయ దీక్షితులు గారు, గోపాల్ గారు – మేము ముగ్గురం వేటూరి గారిని వారి నివాసంలో ప్రతి రొజూ కలిసేవారము. రెండు మూడు గంటలు వారి తోనే గడిపే వాళ్ళము. వారు జరిపే సాహితీ గోష్ఠి లో శ్రోతలుగా ఉండే వాళ్లము. వేటూరిగారి మాటలు ఒక గంట వింటే ఒక అద్భుతమైన పుస్తకాన్ని తనివి తీరా చదివినట్లే. వారొక “Walking Encyclopaedia”.
వేటూరిగారు సరదాగా మాతో పంచుకున్న కొన్ని విశేషాలు :
ఒకసారి అల్లురామలింగయ్య గారు విజయా గార్డెన్స్ లో వేటూరి గారిని కలుసుకుని, “కూడబలుక్కుని కన్నారేమో మీయమ్మా, మాయమ్మా” అన్న పాటని ప్రస్తావిస్తూ, తన సహజ ధోరణిలో, ఆపుకోలేక నవ్వుతూ, “కూడ బలుక్కొని కంటమేంటయ్యా…..” అని పదేపదే అంటూ, నవ్వుకుంటూ వెళ్ళిపోయారట. ఎప్పుడు తనని కలిసినా కొన్నాళ్ళ వరకూ ఇదే వారి వరసని గురువుగారు మాతో చెబుతుండేవారు. ఆపాట కిరాయి కోటిగాడు చిత్రం లోనిది. పాట పల్లవిలో వచ్చే పదాలవి.
నటి సుహాసినిగారు ఎక్కడైనా వేటూరి గారు కనిపిస్తే, అల్లంత దూరం నుంచే నవ్వుతూ నమస్కరించి, చిన్న చిన్న స్టెప్పులు వేసుకుంటూ, గురువు గారి దగ్గరికి “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు” అని పాడుతూ వచ్చేవారట. “ఎంత మంచి పాట రాసారు గురువుగారు” అంటూ హాయిగా పలకరించేవారట. వేటూరిగారు కలిస్తే చాలు, ఆమె నోట ఇదే పాట, ఇదే మాట. ఈ విషయం మాతో చెప్పి గురువుగారు కూడా హాయిగా నవ్వుకునే వారు. కొత్తగా ప్రేమలో పడ్డ కన్నెపిల్ల హృదయాన్ని ఈ పాటలో వేటూరి గారు ఎంతో చక్కగా ఆవిష్కరించారు…. ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలో వెళ్లలేను, ఉండలేను, ఏమికాను ? …. అంటూ సాగిపోయే గీతమది.
మానస వీణా మధుగీతం – పంతులమ్మ చిత్రంలోని ఈ పాటకు ఒకరోజు వేటూరి గారు చెప్పిన మాటలు విని, వారి మీటింగ్ తర్వాత త్వరత్వరగా ఇంటికి వెళ్లి వారు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని నేను, దత్తాత్రేయ దీక్షితులు గారు, గోపాల్ గారు కలిసి కొంత వరకు వ్రాయగలిగాము. మరుసటి రోజు మళ్ళీ వారిని కలిసి మేము వ్రాసినది వారికి చూపించి కరెక్ట్ చేయించుకుని (దత్తాత్రేయ గారి దస్తూరిలోఉన్న) ఆ కాగితాన్ని పదిలంగా దాచుకున్నాము. ఇవి – వారి మాటలు:
“తొలకరించిన వలపులు ప్రేమగా మారి సంసారంగా స్థిరపడితే అప్పుడు జరిగే ప్రేమయాత్ర సమశృతిలో అనురాగ పూరితమైన యుగళ గీతమవుతుంది. లోకంలో ఉన్నది తామిద్దరమే అనుకొనే ఏక భావన, ఏకాంతం కాలాతీతమై ఋతు చక్రాన్ని శరవేగంతో తిప్పుతూ కొన్ని అనిర్వచనీయ మధుర భావాలను, జీవిత సత్యాలను అనుభవపూర్వకంగా వెల్లడిస్తుంది.
నవత కృష్ణంరాజు గారు తీసిన పంతులమ్మ చిత్రం ఒక మధుర పాటలీపత్రం. తెలుగు సినిమా పాటకు “నంది” అవార్డు ప్రకటించిన తర్వాత తొలిగా ఈ పాటకే అది లభించటం, సహృదయ లోకం సంతోషించటం జరిగింది. రాగమాలికగా సాగే ఈ అనురాగ గీతిక రాజన్ నాగేంద్రల సంగీతంలో ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇందులో సాహిత్యం సంసారపక్షం. అన్యోన్యతను అద్వైతసిద్ధికి చేర్చిన అనుభవాక్షరి ఈ గీతం”.
అంజలి :
కమనీయ కళాదృష్టితో కృషించి, సుమారు ఎనిమిది వేల పాటలు రచించి, పీయూష తుల్యములగు భావ పరంపరలను గేయనిబద్ధము గావించి, చలనచిత్ర గీతాలకు పరిశోధనా స్థాయిని, కావ్య గౌరవాన్ని కలిగించి, కామలముకున్న కోమలత్వాన్ని తన పాటలన్నింటికీ ప్రసరింపజేసి, సామాన్య విషయాలను సైతం తన కవనాలలో రసమయాలుగా చిత్రీకరించి, సంస్కృతమయ సాహిత్యమైనా సులభ శబ్ద సమాసాలతో వర్ణనాలంకార ప్రాశస్త్యము కలిగించి, గంభీర గంగాప్రవాహంగా మలచి, శబ్దాన్ని శాసించి, అలతి అలతి పదాలలో అనల్పమైన అర్థాన్ని అమర్చి, ప్రసన్నమాధురీ సహిత భావార్థ పదధారలను పొంగించి, తనదైన ప్రతి కృత్యాకృతికి సుకృతము నాపాదించి, ప్రతి పాటను ఇతోధిక విజ్ఞానశ్రీ సౌఖ్యములనిచ్చు పొత్తముగా శ్రోతల హృదయాలలో నిలిపి, నేటి యువకవులకాదర్శమై నిలిచి, ఆంధ్ర భాషా యోషకు అలికమున సాంద్ర సాహితీ తిలకమలది, ఋషిగా, శేముషిగా మెరిసి వాగ్దేవి పాదాల చెంతకు చేరిన పుంభావ సరస్వతి – బ్రహ్మశ్రీ వేటూరి సుందరరామమూర్తి గారికి హృదయ పూర్వక నమస్సుమాంజలి !!

