చరణం-1
చిటారు కొమ్మన మిఠాయి పొట్లం
అందించెనులే నీ రసగీతం
మొగ్గై మిగిలెను సినిమా గేయం
పూయించెనులే నీ కవికిరణం!
వాణిజ్యానికి వాణీవైభవం
సామాన్యులకీ కవితాసౌరభం
ప్రసాదించిన నీ పాటే
మాకు వరం, మా పరం!
ఘాటుప్రేమ ఇది వేటూరీ, నిను దాటి వెళ్ళదు మనసోయీ!
ఘాటుప్రేమ ఇది వేటూరీ, నీ పాట గుండెలో స్థిరమోయీ!
చరణం-2
ప్రయోగాల పుట్టినిల్లు నీ కలం
నీ చమక్కులకు మెరిసి మురిసినది వెండితెర!
నీ రచనల ఎల్లెడలా సౌందర్యం
నీ పండువెన్నెలల తడిసి కులికినది కొంటెకల!
ధురంధరుడివీ మనోహరుడివీ ఒకేఒక్కడివీ
వ్యాకరణాలకు వ్యతిరేకులకూ అందనివాడివీ
ఎలా కొలవడం నీ ప్రతిభా
దోసిట ఒదగని సముద్రమా!
ఘాటుప్రేమ ఇది వేటూరీ, నీ గడుసు పాటపై వలపోయీ!
ఘాటుప్రేమ ఇది వేటూరీ, నీ చిలిపి చతురిమే ముద్దోయీ!
చరణం-3
ఒక్క గంటలో రాసిన పాటలలో
గుడిగంటలుగా మోగినవెన్నో
మౌనముద్రలో జ్ఞాననేత్రంతో
వెలువరించిన పదసుధలెన్నో
అల్పాక్షరాల్లో అనంతార్థాలు
వెలుగును పంచే వేదాంతాలు
తెలుగుతల్లి పాదాలకు పారాణి నద్దావయా
నీ పాదధూళి మా కంటనీయి గురువర్యా!
ఘాటుప్రేమ ఇది వేటూరీ, నీ గీతి జాతికే కీర్తోయీ!
ఘాటుప్రేమ ఇది వేటూరీ, నీ పాట తరగని ఆస్తోయీ!
