వేటూరి జయంతి(శంభుమహంతి)

ఇప్పుడు పాటల కోసం ఆయన రాసిన మాటల కోసం లక్ష్య సిద్ధిని వెతుకుతూ మాట్లాడడం ఓ ప్రాసంగిక అన్వయ ధోరణిని అందుకోవడం అంటే ఎందుకనో ఇష్టం లేని పనిగా ఉంది. వసంతాలను ఆవిష్కరించు వేళలలో మిక్కిలి చైతన్యం ప్రకృతి కలిగి ఉంటుంది.కోయిల ఎప్పుడూ ఒంటరి కాదు. కొమ్మలు తాకిన కోయిల ఎలా ఉంటుంది ??? ఈ ప్రశ్నకు బదులు రాశారు వేటూరి. కొమ్మలు తాకిన కోయిలకే ఆమని పుట్టునులే ! ఆహా ! వసంత కాల రీతులకు వర్ణనాత్మకత ఆపాదించడం,. స్వాగతించడం అన్నవి మరోసారి ఇంకోసారి మీరో నేనో చేయాల్సిన బాధ్యతగా మారిపోయింది ఈ ఉదయం. మనుషులంతా తమని తాము..గోదావరి తీరాల చెంత లేదా ఏ నదీ తీరం చెంత వెతుకుతూ ఉంటే తరాలు మాట్లాడతాయి. తరాలతో పాటే నిశీధులు దాటిపోతాయి. బతుకంటే మృతి కన్నా చేదైన తీపి పాట అని వేటూరి ఓ ఎడారి కోయిలై కూజించిన స్వరం శబ్దం శాబ్దిక నాదం అన్నవి తెలిసి వస్తాయి. పాటకు లాక్షణికత అంటే చిర స్థాయిలో నిలిచే తత్వం.

కొత్త తరం వస్తూ వస్తూ మేం వేటూరి స్థాయిని అందుకోలేం అని అంటుంటారు. రాముడు సీత..కథను మరోసారి పాటలో చెప్పడం అంటే ఎంత సులువు. అందరికీ తెలిసిన కథలో కవి చేయాల్సిన గానం ఏంటి ? అయినా మనం తెలుగును బతికించడం ఏంటి ? దారంతా ఇదే అనుకుంటున్నాను. తెలుగును మనం కాదు మన పూర్వ కాలంలో ఉన్నవాళ్లే ఓ ప్రాణ ప్రతిష్ట చేసి వెళ్లిపోయారు. మనం మాతృగర్భంలో ఉన్నప్పుడు వినే కథకు కొనసాగింపుగా ఉంటే చాలు. ఆ విధంగా భాషను అమితంగా ప్రేమించే వాళ్లంతా వేటూరికి సాహో అంటారు. ఆయన తరువాత వచ్చిన వాళ్లు సిరివెన్నెల లాంటి కవులు. వీళ్లంతా కూడా ఒప్పుకున్న నైజం తప్పో ఒప్పో వేగాన్ని అందుకోవడంలో మేం వెనుకబడిపోయాం. వేగంగా రాయడం సినిమా కవికి ఓ ప్రామాణికం అయితే ఆ లక్ష్య సిద్ధిని వేటూరి ఎప్పుడోసాధించారు అని చెప్పారొక సందర్భంలో సినీ గేయ కవి దివంగత సిరివెన్నెల.

సినిమాలకు పాటలకు మధ్య కవులు గేయ కవులు వారథులు అయి ఉంటారు. పాట అంటే మూడు నిమిషాలు వినిపించి వెళ్లిపోవడంలో భాగం అని అప్పటిదాకా నా ముందర అనుకునే వారు అని అన్నారు ఓ సందర్భంలో సినీ కవి సిరివెన్నెల. మూడు నిమిషాలలో ఏం చెప్పగలం. ఒక పల్లవి బలీయం. ఒక చరణం కథకు అనుసరణం. మరో చరణం జీవన తాత్వికం ఇలా రాసేవాళ్లంతా ఎంతో గొప్పవాళ్లు. అంటే టేకాఫ్ పాయింట్ వేటూరి రాస్తే..అదొక గొప్ప కావ్య గౌరవం అందుకోగలగాలి. అన్నీ అలా రాయగలరా ? అసలు కమర్షియల్ స్లాట్ లో రాసే పాటలకు సాహిత్యం వెతుక్కోవడం ఏంటి ? మీకు బుర్ర లేదు అని చాలా మంది చాలా సార్లు గేయ కవులను తిట్టిపోశారు.

కానీ అవన్నీ తప్పు. పాట కథను రామ కథను కృష్ణ గీతను అవ్యక్తంలోనూ వ్యక్తంలోనూ వినిపించగలగడమే ధ్యేయంగా ఉండాలి. అంటే ఐతీహ్యాన్ని చెప్పే కథ పాట కావాలి. ఒక్క లైను చాలు ఏమీ వద్దు.. వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి .. ఈ లైను నుంచి కవి అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వెళ్లారు. వ్యక్తం నుంచి సౌందర్య గతులను సందిగ్ధ స్థితులను ఆవిష్కరించారు. స్వర్గ లోక సౌందర్యం.. ఋషిత్వం నిండి ఉన్న సౌందర్యం.. తాత్వికం ఏమీ వద్దు అని చెప్పగలిగే తాత్వికం..ఇవన్నీ రాముడి కథ చెప్పినంత సులువు. అందుకే పోతన్న కైతలా ఇవి ? ఫల శ్రుతి ఏంటి ? పోతన్న కైతలను పోత పోసుకు వచ్చిన రీతి ఇది అని ఓ చోట వేటూరి తన పాటను నిర్వచించుకున్నారు.

కొత్త వసంతాన్ని స్వాగతిస్తూ గేయ కవి వేటూరి సుందర రాముడి స్మరణ చేయడం ఏటా నాకొక బాధ్యత. నాలాంటి వారందరికీ బాధ్యత. సినిమా పాటలు రాసేవాళ్లంటే పెద్దగా గౌరవం ఉండదు అన్న చిన్న నింద ఉంది. ఆ నింద తొలగించేందుకు చాలా మంది ప్రయత్నాలు చేశారు. వేటూరి ముందు కూడా మంచి సాహిత్యం ఉంది. తరువాత కూడా ఉంటుంది. ఉత్కృష్ట రీతిలో సాహిత్యం రాసేవాళ్లంతా ఎక్కడో ఓ చోట నిగర్వ రూపంలో ఉండిపోవడం చాలా గొప్ప పని. మనం చేయాలనుకున్నవి చేయకుండా ఎవ్వరినో నిందించి సాధించేది ఏమీ ఉండదు.

తరాల నా కథ క్షణాలదే కదా ! అని రాయడంతో వేటూరి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమని స్వాగతాలను అక్షరీకరణ చేయడంలో ఆయన మంచి పాండిత్యాన్ని నిరూపణ చేశారు. పాటకు మాటకు అర్థం సమన్వయం అన్నవి రెండూ సాహిత్యపరంగా.. బాగుంటాయి. అవి అర్థం సమన్వయంతో పాటే.. అంతరార్థాన్ని సైతం అందివ్వగలిగితే చాలు. అంటే మనం మాట్లాడుకున్నంత సులువుగా పాట ఉండాలని ఓ నియమం ఉందని చదివాను. ఆ విధంగా రాసినప్పుడు శబ్దం అర్థం భావం తులనాత్మకం అవుతాయి. వాటిని దాటి మనం ఉండలేం. !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top