వేటూరి గారికి జన్మదిన నివాళులు (జనవరి 29th)!
పట్టపగలు పుట్టింది పాట – వేటూరి; రమేశ్‌నాయుడు; సుజాత (1980)
సుజాత ట్విన్స్ రోల్స్ – సుజాత & సునీత పేర్లు. సునీత, మురళీమోహన్ ఆదర్శ దంపతులు; సుజాత, మోహన్‌బాబు ప్రేమికులు. అనివార్య కారణాల వల్ల సుజాత, సునీత తమ ప్లేసెస్ మార్చుకుంటారు కొంత కాలం పాటు!! వేటూరి పాట మొత్తంలో సుజాత, సునీతల పర్సనాలిటీలలో ఉన్న వ్యత్యాసాన్ని చాలా అద్భుతంగా ఈ ఒక్క పాటలో ఆవిష్కరించాడు!!
సుజాత చలాకీగా ఉంటే, అక్క సునీత నింపాదిగా ఉంటుంది. అందుకే సుజాతను సూర్యుడి లక్షణాలతో, సునీతని చంద్రుడి లక్షణాలతో పోల్చాడు. సుజాతను “పట్టపగలు పుట్టింది” అంటాడు (సూర్య లక్షణం). సునీతను “మెరిసింది ఈ సాయంత్రం” అంటాడు (చంద్రోదయ సమయం). “సూర్యకిరణ నయన జాత సుజాత” అని సుజాతను, “చంద్రవదన సదన సీత సునీత” అని సునీతని వర్ణిస్తాడు.
సుజాత ముక్కోపి అని “అలిగినా చాలు ఆమె రవ్వంత” (సూర్య లక్షణం), సునీత సహనశీలి అని “ఓర్పులో ఆమె భూమాత” (చంద్ర లక్షణం) అని అంటాడు. సుజాతకి సూర్య లక్షణం ఆపాదించాలని వేటూరి డిసైడ్ అయ్యాడు కాబట్టి తనని “సుప్రభాత సరిసిజాత సుజాత” అని ముద్దుగా సంబోధిస్తే, సునీతకి చంద్ర లక్షణంతో “శీలానికి సీత నా సునీత” అని ఆరాధనతో అంటాడు.
ఫైనల్‌గా “ఆమె నా వెయ్యేళ్ళ వేసవి గిలిగింత” అని సుజాతను ఘనంగా ఆకాశానికెత్తేస్తే.. “ఆమె నా నూరేళ్ళ ఆమని పులకింత” అని సునీతని సింపుల్‌గా పొగుడుతాడు.. ఇక్కడ “వేసవి, ఆమని ==> సూర్య, చంద్ర లక్షణాలుగా” మనం ఊహించవచ్చు. సూర్యకాంతి ని ఏకంగా వెయ్యేళ్ళు అన్నాడు కాబట్టి చంద్రకాంతిని నూరేళ్ళతో సరిపుచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు!!
ఈ పాటను 2007లో మా ఫ్రీమాంట్ ఇంట్లో జరిగిన ఒక గానాబజానా కార్యక్రమంలో నా మిత్రుడు విజయ్ వేమూరి శ్రావ్యంగా పాడి వినిపించినప్పటినుంచి ఈ పాటకు వీరాభిమానిగా మారాను. విన్న వెంటనే పాటలో సూర్య,చంద్ర లక్షణాలు గోచరించాయి నాకు (నేను 10 యేళ్ళ వయసులోనే ఈ సినిమా చూశాను కాబట్టి, సుజాత డబల్ రోల్స్ అని తెలుసు కాబట్టి.. పాటలోని ఆంతర్యాన్ని అవగతం చేసుకోటం సులువయ్యింది నాకు)! అప్పట్లో నాకు గీత రచయిత ఎవరో నాకు తెలియదు.. కానీ ఇలాంటి పదప్రయోగ సేద్యం ఒక్క వేటూరికే సాధ్యం అనే నా ఊహ నిజంగానే నిజమయ్యింది!!
(తమ ఫేస్బుక్ పోస్టును ప్రచురించడానికి అనుమతినిచ్చిన శ్రీనివాస్ చిమట గారికి మా ధన్యవాదాలు!)