అడవిరాముడు-పాటలు

మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ

పల్లవి:
కృషి ఉంటే మనుషులు
ఋషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు

చరణం 1:
అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి
అతి భయంకరుడు యమకింకరుడు
అడవి జంతువులపాలిటి అడుగో అతడే వాల్మీకి
పాలపిట్టల జంట వలపు తేనెల పంట
పండించుకుని పరవశించి పోయేవేళ
ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు
ఒక పక్షిని నేలకూల్చాడు
జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ
తన కంటిలో పొంగ మనసు కరకంగ
ఆ శోకంలో ఒక శ్లోకం పలికే
ఆ చీకటి ఎదలో దీపం వెలిగే
కరకు బోయడే అంతరించగా
కవిగా అతడు అవతరించగా
మనిషి అతనిలో మేల్కొన్నాడు
కడకు మహర్షే అయినాడు
నవరసభరితం రాముని చరితం
జగతికి అతడు పంచిన అమృతం
ఆ వాల్మీకి మీవాడు మీలోనో ఉన్నాడు
అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు
అందుకే ….
కృషి ఉంటే మనుషులు
ఋషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు

చరణం 2:
ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం
తిరుగులేని దీక్షకీ అతడే ప్రాణం
కులం తక్కువని విద్యనేర్పని
గురువు బొమ్మగా మిగిలాడు
బొమ్మ గురువుగా చేసుకుని
బాణ విద్యలో పెరిగాడు
హుటాహుటిని ద్రోణుడపుడు
తటాలుమని తరలివచ్చి
పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు
ఎదుట నిలిచిన గురుని పాదమంటి
ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు
బొటనవ్రేలివ్వమనె కపటి ఆ ద్రోణుడు
వల్లెయనె శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు
ఎరుకలవాడు అయితేనేమి
గురికలవాడే మొనగాడు
వేలునిచ్చి తన విల్లును విడిచి
వేలుపుగా ఇల వెలిగాడు
అందుకే…..
కృషి ఉంటే మనుషులు
ఋషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు

చరణం3:
శబరీ.. ఇంతకాలము వేచినది
ఈ పిలుపుకే శబరి
ఆశ కరువిడి అడుగు తడబడి
రామపాదము కన్నది
వంగిపోయిన నడుముతో
నగుమోము చూడగలేక అపుడు
కనుల నీరిడి ఆ రామపాదము
కడిగినది శబరి
పదముల ఒరిగినది శబరి
ప్రేమ మీరగ రాముడప్పుడు
శబరి తల్లి కనులు తుడిచి
కోరికోరి శబరి కొరికిన
దోరపండ్లను ఆరగించె
ఆమె ఎంగిలి గంగ కన్న
మిన్నగ భావించిన
రఘురాముడెంతటి ధన్యుడో
ఆ శబరిదెంతటి పుణ్యమో
ఆమె ఎవ్వరో కాదు సుమా
ఆడపడుచు మీ జాతికి
జాతిరత్నములు ఎందరెందరో
మీలో కలరీ నాటికీ
అడివిని పుట్టి పెరిగిన కథలే
అఖిల భారతికి హారతులు
నాగరికతలో సాగు చరితలో
మీరే మాకు సారథులు
అందుకే…
కృషి ఉంటే మనుషులు
ఋషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top