పాట రాసేటప్పుడు ఎవరూ ప్రాథమిక సూత్రాలు పాటించడం లేదు

సితార సినీపత్రికలో 19 జనవరి 1992 న ప్రచురితమైన వేటూరి గారి ఈ ఇంటర్యూలో గీతరచన గురించి, భాష గురించి, సినీరంగంలో ఉన్న పరిస్థితుల గురించి ఎన్నో విలువైన సంగతులు ఉన్నాయి. 30 ఏళ్ళ తరువాత ఇప్పుడు కూడా గీతరచయితలకు ఇవే పరిస్థితులు ఎదురవుతున్నాయి. సినిమా పాటల రచయితలే కాక పాటలను ఆస్వాదించే ప్రేక్షకులు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయిక్కడ. ఈ ఇంటర్వ్యూ స్కాన్ ని అందించిన పవన్ ఉమాపతి గారికీ, ఆ స్కాన్ ని చక్కని తెలుగు అక్షరాలుగా మార్చి ఇచ్చిన సురేశ్ కొలిచాల గారికి మా కృతజ్ఞతలు!

సరళమైన తెలుగులో బరువైన భావంగల పాటలను రాసి హృదయాలను కలిగించగల దిట్ట ప్రముఖ గేయరచయిత వేటూరి సుందరరామ్మూర్తి. సుందర సుందరంగా పాటలను జలపాతంలాగా చిందించగల తొందర రామమూర్తి ఆయన. ఎందుకంటే దర్శక నిర్మాతలు అడిగిన వెంటనే ఆఘమేఘాలమీద ఎటువంటి సన్నివేశానికైనా అందమైన పాటలు రాసివ్వగల ప్రజ్ఞ ఆయన స్వంతం. కలంలో బలమైన భావం పొదిగించుకోగలిగితే జాలువారే ప్రతి సిరాచుక్క ముచ్చటయిన అక్షరాలతో ముగ్గులు వేస్తుంది. అలాగే వేటూరి తన కలాన్ని విరజిమ్మితే అందులోంచి సిరా కాదు.. అక్షరాల వాన కురుస్తుందంటే అతిశయోక్తి కాదు. ‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అన్నట్లు సినీకవులలో వేటూరికున్నది ప్రత్యేకస్థానమే.

‘ఓ సీతకథ’ చిత్రం ద్వారా గేయరచయితగా పరిచయమయిన వేటూరి పరిశ్రమలోకి ప్రవేశించి. ఇప్పటికి 20 ఏళ్లు అయింది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన్ని కలిసి ఇంటర్వ్యూ చేశాం.

కల్తీభాష ఎక్కువవుతోంది

ప్రస్తుతం వస్తున్న గేయాలు ప్రేక్షకుల హృదయాలను గాయపరిచేవిగా ఉంటున్నాయి? ఆ గాయాలు మాన్పే తరుణోపాయం ఏమిటో చెప్పండి?” అంటూ తొలి ప్రశ్నను వేటూరి ముందుంచాం.

“కొన్ని వ్యాధులకు నివారణ లేనట్లే దీనికీ లేదనే చెప్పాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే… “ఏ గతి రచయించినేని సమకాలికులు మెచ్చరేకదా” అని భట్టుమూర్తి అంతటివాడే వాపోయాడు. మంచి పాటలు రాయించుకుంటానంటే వద్దనలేదు. అయితే ఇది వ్యాపారం కానీ కళారంగం కాదు అన్నవిషయాన్ని మరిచిపోకూడదు. ఇప్పుడు సినీరంగంలో డీజనరేషన్ మొదలయింది. అంటే వృద్ధాప్యం వచ్చి చెప్పినవారి మాటలలాగా కనిపిస్తాయి కానీ 1972 నుంచి నేను డీజనరేషన్‌కు సినిమాలలో రాస్తున్నాను. అంటే ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. ఈ 20 ఏళ్లనుంచి ఏడాది ఏడాదికి సినిమా ఆర్ట్ కు సంబంధించి డీజనరేషన్ వస్తూనే వుంది. ఉదాహరణకు చెప్పాలంటే పాటకు కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉంటాయి: ఛందస్సు, యతి, అంత్యప్రాస అని. అవి కూడా ఇవాళ ఎవరూ చూడటంలేదు. చౌచౌ భాషలో రాస్తున్నారు. సంగీతాన్ని అనుసరించి అంటే ట్యూన్స్ కు అనుగుణంగా రాసే పాట కనుక కల్తీభాష ఎక్కువవుతోంది. అలా రాయకుండా తప్పించుకోవడానికి ఆస్కారం ఉండటంలేదు. దీనివల్ల మాతృభాషలో తేటతెలుగులో చక్కగా ఎంకిపాటల్లాగానో, కిన్నెరసాని పాటలగానో రాయడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. నేను సినీరంగప్రవేశం చేసిన అయిదారేళ్లవరకూ అలాంటి పాటలు రాసే అవకాశం, అదృష్టం కలిగింది. అప్పుడు తీస్తున్న కథాచిత్రాలూ, వాటిలో ఉదాత్తమైన సన్నివేశాలూ ఉండేవి. అవి రాను రాను మృగ్యమవుతున్నాయి. పాటల రచయితగా నేను కాస్త తెప్పరిల్లుకుని సంతోషపడేదేమిటంటే అశ్లీలత అనేది పాటలలోంచి ఇప్పుడు మాటలలోకి మారింది. ఆ భారం ఇప్పుడు డైలాగ్ రచయితలు మోస్తున్నారు కాబట్టి నాకు సంతోషంగా ఉంది” అని వివరించారు వేటూరి.

వాక్యం రసాత్మకం కావ్యం

మంచి కవిత్వానికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి?

 “‘విశ్వశ్రేయస్సు కావ్యం’ అన్నారు కాళిదాసు. నవల కానిండీ… కథ కానిండీ ఏదయినా కావ్యాలకిందే లెక్క. ఇవన్నీ విశ్వశ్రేయస్సును కోరాలి. అలాగే “వాక్యం రసాత్మకం కావ్యం’ అని కూడా అన్నారు. ” కావ్యంలో ఒక్క మంచిమాట ఉన్నా అది కవిత్వం అవుతుంది. ఉదాహరణకి ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అన్నాడు గురజాడ. ‘ఆ.. ఇందులో గొప్పతనమేముంది. ఎవరు అనలేరు అమాట?’ అని మూతి తిప్పవచ్చు కానీ ఆ మాట గురజాడ అనకముందు ఇంకా ఎవరయినా అన్నారా! వితర్కించి చూస్తే.. దేశమంటే ఇండియా మ్యాప్ అనీ, అది మట్టి అనీ, భారతమాత అంటే మాతృమూర్తి అనీ, అవిడొకావిడ ఉందినీ, మట్టి స్వరూపంలోనే ఇండియా ఆకారం ఉందని అందరూ అనుకుంటున్న తరుణంలో పామరులకు పండితులకు (పండితులలో పామరులు ఉన్నట్టే, పామరులలో కూడా పండితులు ఉన్నారు). అర్ధమయ్యే రీతిలో ‘దేశమంటే మట్టి కాదురా. నీ పక్కనున్న మనిషి… అంటే సమాజంరా’ అని చెప్పినటువంటి మహాకవి గురజాడ. అలా జనభాషలో… జనానికి అర్థమయ్యే భాషలో చెప్పగలిగిన కవి ఎవరయినా ఉన్నారా? ఇటువంటిది.. ఒక్క వాక్యమైనా చాలు. పెద్ద గ్రంథాలయాలు నిండిపోయేట్లు రాయక్కరలేదు. రసాత్మకమయిన వాక్యం ఒకటయినా చాలు. 

కవిత్వ ప్రయోజనం ఏమిటంటే కాంతిని చూపించడమే. కవి అంటే సూర్యుడు. కవిత్వం అంటే సూర్యకాంతి. చీకట్లో వెలుగునిచ్చేది. శీతలంలో వెచ్చదనాన్ని ఇచ్చేది. సూర్యకిరణం వేడినీ వెలుగునీ ప్రసాదించడమే కవిత్వం యొక్క ప్రయోజనం. అదే మంచి కవిత్వానికి నిర్వచనం” అని చెప్పారాయన. 

పాటలు రాయడం తేలికే

ఈమధ్య చాలామంది పాటలు రాసేస్తున్నారు. సినిమా పాటలు రాయడం అంత తేలికా?

“ఎవరి వృత్తి వారికి అలవాటుపడిన తర్వాత తేలిక కావచ్చు కానీండి. ఎవరయినా రాస్తున్నారు అనే మాటను మీరు కొంచెం పార్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పాట రాయడానికి కొన్ని ప్రత్యేకమైన యోగ్యతలు ఉన్నాయి. టుమ్రీ పాటలు రాయడం వేరు. ఒక డైనమిక్ సన్నివేశానికి పాటలు రాయడం వేరు. పురాణాలు, చరిత్ర గ్రంథాల పరిచయంతో, అలంకారశాస్త్రం తెలిసివుండి వ్యాకరణ ఛందస్సు శాస్త్రాలను జీర్ణించుకుని ఏ తరహా పాట ఇచ్చినా రాయగలిగే సామర్థ్యం ఉండటం వేరు. ఇప్పుడు ఎవరయినా రాస్తున్నారు. అంటే ఎవరు రాసినా చెల్లే సినిమాలు వస్తున్నాయి. పాటలకోసం ప్రత్యేకంగా ఫలానావారిని పిలవాల్సిన పనిలేదు. మాటలగారడి కనుక ఎవరయినా రాసెయ్యవచ్చు అనుకుంటున్నారు. ఛందస్సు లేకపోతే పాట కాదు అని పూర్తిగా నమ్మేవాళ్లలో నేనూ ఒకణ్ణి. లేకపోతే అది డైలాగ్ అవుతుంది. మీరన్నట్లు తేలికగానే కనిపిస్తుంది.

సరిగమలు రాకపోయినా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ధోరణి మొదలయి చాలా రోజులయింది కూడా. కవిత్వ వాసన, భాషాధికారం, సంగీత పరిచయం లేకుండా పాటలు రాయడం కూడా అలాగే మొదలయింది. ఇవన్నీ వాటంతట అదే వస్తున్న పరిణామాలు, ఒకరిని తిట్టుకుంటూ ప్రయోజనం లేదు” అంటూ తన అభిప్రాయం చెప్పారు  వేటూరి.

జనం కోసమే మనం

పాటల రచయిత కంటే మాటల రచయితకే భాషమీద కమాండ్ ఉంటుందని ఈమధ్య ఒకాయన అన్నాడు. మీరు ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారా?

తల అడ్డంగా ఊపి “అది ఎవరన్నారో, ఎవరి అభిప్రాయమో నాకు తెలీదు కానీ భాషలమీద కమాండ్ తో మాటలు రాయడం కుదరదు, పాటలు రాయడం కుదరదు. ఉండవలసింది భాషమీద కమాండ్ కాదు భావాన్ని కొత్తగా చెప్పగలగడం. సన్నివేశాన్ని రక్తికట్టించడం అనేది ఒక అంతర్మథనం. దాంట్లోంచి ఉద్భవించే భాష కావాలి. కానీ, “నాకు ఇన్ని భాషలు వచ్చు. ఏ భాషలోని మారుమూల పదమయినా ప్రయోగించగలను” అనుకుంటే పొరపాటు. నువ్వు ప్రయోగించే ప్రతి పదం,  పాట జనం కోసం.  ఏనాడో పింగళి నాగేంద్రరావుగారు, కె.వి. రెడ్డిగారు ‘పాతాళభైరవి’లో ‘జనం కోసం మనం చేయడమా, మనం చేసేది జనం చూడటమా’ అనే డైలాగ్ను మాంత్రికుడితో చెప్పించారు. సినీకళకు పరమావధి ఏమిటంటే మనం చేసే ప్రతిదీ జనానికి అర్ధం కావాలి. భాషమీద కమాండ్ ఉందనుకోకుండా, జనాన్ని ఎంతవరకూ ఆకట్టుకోగలిగాం, జనంమీద మనకు ఎంత కమాండ్ ఉంది అని చూసుకోవాలి” అన్నారు.

చేదు అనుభవాలు

కవి హృదయంలోని అనంతమైన ఆవేదన అక్షరాలను ప్రసవించి హృద్యమైన పాటగా ఎదిగాక చిత్రీకరణ అందంగా, అమోదయోగ్యంగా జరగాలని ప్రతి రచయితా కోరుకుంటాడు. అతని కోరిక మేరకు చిత్రీకరణ జరగకపోతే రచయిత బాధపడతాడు. అలాంటి సందర్భాలు వేటూరికి కూడా ఎదురయ్యాయా?

ఆ విషయం గురించి ఆయన వివరిస్తూ “ ‘అయ్యవార్లను చేయబోతే కోతి అయింది’ అన్నట్లు పాటను చిత్రీకరణలో చెడగొడితే అలాగే అనుకుంటా. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి నా జీవితంలో. ఒక చిత్రంలో హీరోయిన్ కట్టు బొట్టు గురించి, జడలో పువ్వుల గురించీ, ఆవిడ విరబూసిన పొన్న చెట్టుకింద కూర్చుంటే ఎలా ఉంటుంది. ఇలాంటివేవో వర్ణనలతో నేను రాసిన గీతాన్ని మాక్సీలు, స్విమ్మింగ్ పూల్ డ్రస్సులు వేసి స్విమ్మింగ్ పూల్ లో చిత్రీకరించారు. ఆ దృశ్యం చూశాక ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్న నీళ్లకంటే నా కళ్లలోంచే ఎక్కువ నీళ్లు వచ్చాయి. కానీ ఏం చేస్తాం? అవన్నీ దిగమింగుకుని రాస్తుంటాం. ఇదేవిధంగా మరో చిత్రంలో మరో సన్నివేశం. అందులో ఒక గుడ్డివాడుంటాడు. అతను గాయకుడు కూడా. తండ్రి ఎంతో కష్టపడి కాయకష్టం చేసి కొడుకుకు కళ్ళు వచ్చేందుకు ఆపరేషన్ చేయిస్తాడు. ఆ కొడుకు కళ్లు తెరవగానే మొట్టమొదట ఇహలోక దైవమైన తండ్రిని చూడాలని అనుకుంటాడు. కానీ కళ్లు తెరిచేసరికి ఎదురుగా తండ్రి శవం ఉంటుంది. అటువంటి సన్నివేశం నాకు ఇచ్చి పాట రాయమని చెప్పారు. వీడు గాయకుడు కూడా కదా, వాడి హృదయబాధను పాట రూపంలో వ్యక్తంచేస్తే బాగుంటుందని చెప్పిన పాపానికి నేను ఆ పాటను రాశాను. ఆ పాట చదివి చచ్చి ఏలోకాన ఉన్నాడో కానీ నా మిత్రుడు యం.ఏ.ఎల్ ‘ఈ పాటకు నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి’ అన్నాడు. ఆ తర్వాత పాట చిత్రీకరణ ఎలా ఉంటే బాగుంటుందో నేను దర్శకుడికి సూచించాను. ఎలా అంటే… నదీతీరాన  తండ్రి దహనం జరుగుతూ ఉంటుంది. చీకట్లు ముసురుతుంటాయి. ఎక్కడో జీవనది ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి సిల్వేట్ ఎఫెక్ట్ లో డప్పు వాయిస్తూ తన ఆవేదనని పాట రూపంలో ఆకాశానికి నివేదిస్తూ ఉంటాడు. అతని ఆవేదనకు పరిహారం లేదు. చనిపోయిన తండ్రిని ఎవరూ తీసుకురాలేరు. కళ్ళు రావడం, తండ్రి పోవడం అనేదాని గురించి నేను పాట రాస్తే ఆ చిత్రంలో ఎలా తీశారంటే… తండ్రి శవానికి స్నానం చేయించడం, దాన్ని పాడెమీద మోసుకెళ్లడం.. ఇదంతా చిత్రీకరించారు. అప్పుడు నాకు అనిపించిందేమిటంటే.. తీసుకువెళ్లింది తండ్రి శవాన్ని కాదు.. నా పాటను పాడెకట్టి తీసుకువెడుతున్నారో అని, ఇలాంటి సంఘటనలు కోకొల్లలు” అని వివరించారు వేటూరి. 

విమర్శకులు లేరు

మరో ప్రశ్నకు సమాధానంగా “ఇప్పుడు గుణదోష విచారణ చేసే విమర్శకులు లేరు. అలాగే విమర్శ అంటే కంకరరాళ్ళు పుచ్చుకుని కొట్టినట్లు ఉండకూడదు, శాడిజంతో రాసే విమర్శకులున్నారు. ఇప్పుడు, మంచిని ఎంచి మెచ్చుకోవడం, చెడును తగుమాత్రంగా ఎత్తిచూపి తిరిగి అది జరగకుండా చూసుకోవాలని హెచ్చరికలతో విమర్శలు చేసే సమీక్షలు మీ పత్రికలలో రావడంలేదు. ఇది మీరు ఒప్పుకుని తీరాలి. ఏదో శాపనార్థాలు పెట్టినట్లు పేజీ తెరవగానే ‘వీడమ్మ కడుపుమాడ… వీడు నాశనం అయిపోను.. వీడిరాత తగలడిపోను’ అన్నట్లుగా.. రాసే సమీక్షలు కూడా వస్తున్నాయి. అందులో పక్షపాతం వహిస్తున్నారని స్పష్టంగా తెలిసిపోతూనే ఉంటుంది. చెరుకుగడలను నిందిస్తూ చొప్పదంట్లను మెచ్చుకున్నట్లుగా మెచ్చుకునే సమీక్షలు వస్తున్నాయి” అంటూ నిర్మొహమాటంగాన అభిప్రాయాన్ని వెల్లడించారు వేటూరి.

“ఇప్పుడొస్తున్న పాటలలో ఒక్కోసారి వాయిస్ కంటే నాయిస్ ఎక్కువగా వినిపిస్తుంటుంది. అలాంటి సందర్భాలలో పాట వినిపించకపోయేసరికి మీకు బాధ అనిపించవా?

“ఇది సంగీత దర్శకులను అడగాల్సిన ప్రశ్న. ఆ సంగీత దర్శకులచేత సంగీతాన్ని చేయించుకుంటున్న వాళ్లని అడగాలి. కాకపోతే ఇందులో చిన్న సౌలభ్యం ఉంది. ఏదన్నా రాయకూడని పదాలను రాస్తే అవి ఈ నాయిస్ లో కలిసిపోయి వినిపించవు. ద్వంద్వార్థాలతో కాదు ఏకార్ధంలో రాసినా జనానికి అర్థం కాకుండా ఉంటుంది. ఆ రకంగా మేము రక్షించబడుతుంటాం”

యుగళగీతాల యోగ్యత 

“మీ ఇరవైఏళ్ల సినీజీవితంలో మరిచిపోలేని సంఘటనలు ఏమన్నా ఉంటే వివరించండి”. 

“ఒకసారి ఇద్దరు సంగీత దర్శకులకు ఏకకాలంలో పాటలు రాయాల్సి వచ్చింది. రెండూ డిఫరెంట్ సాంగ్స్. ఈ యుగళగీతాలు వచ్చిన తర్వాత టూన్స్‌కి రాయడం మొదలయింది. బాగా బిజీగా ఉండటంతో హడావిడిలో పొరపాటున ఒకరికి ఇవ్వాల్సిన పాటను మరొకరికి ఇచ్చి పంపేశాను. అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా తొందరలో చూడకుండా పాటల కాగితాలను తీసుకువెళ్లిపోయారు. ఒకటి జెమినీ రికార్డింగ్ థియేటర్లో, మరొకటి విజయాగార్డెన్స్ లో రికార్డింగ్ జరుగుతోంది. పాట రికార్డ్ చేసే సమయానికి మొదట జెమినీకి వెళ్లాను. అక్కడ వేరేపాట వినబడుతుండేసరికి ‘ఇదేమిటీ.. ఈ పాట ఇక్కడ వినబడుతోంది. దీన్ని వేరేవాళ్లకోసం. రాశాను కదా’ అని అనుమానం వచ్చింది. ఆ పాట ట్యూన్ కాకుండా వేరే ట్యూన్లో వినబడుతుండేసరికి కంగారుపుట్టి లోపలికి వెళ్లాను. సంగీత దర్శకుడిని పక్కకు పిలిచి- ‘అయ్యా.. చిన్న. పొరపాటు జరిగిపోయింది. ఈ పాట మీకు రాసింది” కాదు, వేరేవాళ్లకు రాసిన పాట మీకు వచ్చింది. ఇది “మీ ట్యూన్ కి సరిపోయిందా?” అనడిగాను. “సరిపోయింది కానీ మీరిప్పుడు లేనిపోనివి పెట్టకండి. ఫైనల్ టేక్ కూడా వచ్చింది. సింగర్ మళ్లీ దొరకదు. నా దుంప తెగుతుంది” అని అతను బతిమాలాడు. 

‘ఇదేమిటిరా బాబు’ అనుకుంటూ అక్కడినుంచి. విజయగార్టెన్స్ కు వెళ్లాను, సంగీతదర్శకుడి దగ్గరకు వెళ్లి “ఏమయ్యా నీ ట్యూన్ కి పాట సరిపోయిందా? అనడిగాను. 

దీనినిబట్టి తెలిసిందేమిటంటే డ్యూయెట్లకు యోగ్యత, సమయం, సందర్భం ఏఏ చూడటంలేదు. స్కేల్ పెట్టి కొలవడం, ట్యూన్ సరిపోవడమే ఈ యుగళగీతం యోగ్యత అయింది. ఈ పాత్రలు ఈ పాట పాడదగునా, ఈ సన్నివేశానికి ఈ పాటలో వాడిన మాటలు సరిపోతాయా? అనేటువంటివి చూసుకోవడం పోయింది అనేదానికి ఇదొక నిదర్శనం.. మనం మారుద్దామా అంటే టైం ఉండటంలేదు. ఎవరికీ (అందని) వేగంలో సినీరంగం ఉందిప్పుడు” అని నిట్టూర్చారు వేటూరి.

బహుముఖుణ్ణి కాలేను

‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రంలో సీతారామయ్య పాత్రను మీచేత వేయించాలని. మొదట అనుకున్నట్లు క్రాంతికుమార్ తెలిపారు. ఒకవేళ మిమ్మల్ని అడిగి ఉంటే ఆ చిత్రంలో నటించి ఉండేవారా?

“నటించేవాడిని కాదు. ఎందుకంటే మొదటినుంచి నాకు నటనమీద ఆసక్తిలేదు. కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా నాటకాలలో నటించలేదు. మిత్రుల బలవంతంమీద నటన అంటే ఏమిటో తెలుసుకోవాలని కొన్ని చిత్రాలలో నటించాను. అంతే. అలాగే కొందరు ‘ఇన్ని పాటలు రాశారు కదా… మాటలు ఎందుకు రాయకూడదు?’ అని అడుగుతుంటారు. నేను ఏకముఖుణ్ణి. బహుముఖుణ్ణి కావడం ఇష్టంలేదు. ఆ తపన కూడా నాలో లేదు. బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకోవాలనుకుంటున్నవారి పాట్లు, భంగపాట్లు చూస్తూనే వున్నాను కనుక వాటి జోలికి పోదలుచుకోలేదు” అని స్పష్టం చేశారు వేటూరి 

‘సిరికాకొలను చిన్నది’ ఏమయింది? 

శ్రీకృష్ణదేవరాయలు కాలంనాటి ఓ దేవదాసి గాథ ఆధారంగా వేటూరి ‘సిరికా కొలను చిన్నది’ పేరుతో ఒక నాటిక రాశారు. దానిని సినిమా తీయబోతున్నానని అప్పట్లో కళాతపస్వి విశ్వనాథ్ ప్రకటించారు. కానీ ఎందువల్లో అది కార్యరూపం దాల్చలేదు.

ఆ ప్రతిపాదన ఏమయిందని అడగ్గా “అందులోని కొన్ని అంశాలు వేరే సినిమాలలో వచ్చేయ్యడంతో దాన్ని తీయడంలేదు” అని చెప్పారు వేటూరి. 

ముగింపు 

“నాతో మాట్లాడటమే ఒక కళ” అన్నాడు గిరీశం. అలాగే వేటూరితో మాట్లాడుతుంటే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. ఎంత సేపయినా అలా మాట్లాడుతూ ఉండిపోవాలనిపిస్తుంది. కానీ ఆయన సమయం ఎంతో విలువయినది కనుక కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నాం.

ఇంటర్వ్యూ: వినాయకరావు 

ఫొటోలు: మధుసూదన్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.