వేటూరి జన్మదిన కానుక – ఒక పాత ఇంటర్వ్యూ పరిమళం

వేటూరి సుందరరామమూర్తి గారి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పోయిన తర్వాత మొదటిది. తప్పు ,తప్పు! సిరివెన్నెల గారు అన్నట్టు – “వేటూరి పేరు ముందు కీ.శే అని తగిలించడం నాకు ఇష్టం లేదు. ఆయన తన గీతాల ద్వారా శాశ్వతుడు”. కాబట్టి వేటూరి పోయారనుకోడానికి లేదు.
అసలు వేటూరి ఏం గొప్పగా రాసాడని, చెత్త తప్ప, ఆయన గురించి అతి చేస్తున్నారు అన్న వాళ్ళని నేను చాలా మందిని చూసాను. సముద్రాన్ని పిల్ల కాలువలు కొలవలేవు. అసలు ఆయన సముద్రమా కాదా అన్న డౌట్ ఉంటే తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. నాకు తెలియదు, confusion లో ఉన్నాను అన్నది మంచి స్థితి, నాకు తెలుసు అనుకోడం కన్నా.
ఆయన గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి “జయంతి చక్రవర్తి” గారు Phd పట్టా కోసం రాసిన థీసిస్, “వేటూరి పాట” పుస్తకంలో ఉన్న 1999 లో చేసిన interview బాగా ఉపకరిస్తుంది. 114 ప్రశ్నలతో ఉన్న interview లో ఒక 11 ప్రశ్నలని తీసుకుని ఇక్కడ అందిస్తున్నాను.  ఇది ఆయనకి నేను అందించే ఒక చిరునివాళి.

1. మీరు చదివిన విద్యలో మీకు నచ్చినది ఆంధ్రసాహిత్యమా లేక ఆంగ్లసాహిత్యమా?

రెండూనండీ. రెండూ గొప్పవే. నేను చదివింది, విన్నది ఎంత? నా చదువు చాలా కొద్ది కానీ ఒక కీట్స్ వంటి మహాకవిని కన్న ఆంగ్లసాహితీ సరస్వతి ఎంత గొప్పదో. జాన్ కీట్స్ – ఆయన ప్రభావం నామీద చాలా ఉంది. ఆ రోజుల్లో మా గురువులు శ్రీ మల్లాది గారితో చెప్తూ ఉంటాను. ఇదే విషయాన్ని ఆయన ఒకసారి నాతో అన్నారు – “నాయనా, అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం” అనే పాట నాదే అనుకుంటున్నావేమో, కాదు కాదు ఆ భావన కీట్స్ ది అన్నారాయన.

(వేటూరి గారి ఆంగ్ల సాహితీ పరిజ్ఞానం గురించి చాలా మందికి తెలియదు. ఆయన పాటల్లో కొన్న భావాలు ఆంగ్ల సహితీ ప్రభావం నుంచి వచ్చినవని గ్రహించాలి)

2. సినిమా పాటల రచయితకి ఉండాల్సిన ప్రాథమిక అర్హతలు?

సినిమాపాటల రచయితకి ప్రపంచజ్ఞానం ముఖ్యంగా ఉండాలి. ఏదైనా రాయగలిగిన శక్తి కలిగి ఉండాలి. ఇంకా సాహితీపరిచయం బాగా ఉండాలి. అలాగే సంగీత పరిచయం కూడా ఉండాలి. అప్పుడు కానీ పాట రాయడానికి అర్హుడు కాడేమో అని నా అభిప్రాయం.

(ఈ లెక్కన నాబోటి వారు అసలు పాటలు రాయకూడదు! ఇవన్నీ వేటూరి కి ఉన్నాయి. ఇవి ఈ కాలం వారికి కొంత కష్టసాధ్యమే ఏమో కాని ఒక ideal గా పనికివస్తాయ్)

3. సినిమా పాట ఎలా ఉండాలి?

గేయము అంటే పాడటానికి వీలైనది, పాడితే ఆస్వాద్యంగా ఉండేది. ప్రతి రచనా గేయం కాదు, ఆ గేయం గానానికి అనుగుణంగా ఉండడానికి కొన్ని చందోనియమాలున్నాయి. యతిప్రాసలు, స్వరపద సంధానం చెయ్యగలిగిఉండటం, చక్కని ఊహాశక్తి, పాటలో వాడిన చందస్సు తాళానికి అనుగుణంగా ఉండడం, ఇలా. యతిప్రాసలు లేనట్టి పాటలను నేను అంగీకరించను.

(వేటూరి పాటలు ఎప్పుడైనా భావం వదిలేసి కేవలం musical గా విని చూడండి. ఎంత అందమగా అనిపిస్తాయో. డబ్బింగ్ సినిమాలకి రాసిన పాటలు కూడా. ఈ ప్రతిభను ఈ కాలం రచయితలు గమనించి తామూ నేర్చే ప్రయత్నం చెయ్యాలి)

4. ఇతర భాషా రచయితల్లో మీకు ఇష్టమైన వారు?

హిందీ – శైలేంద్ర, శైలేంద్ర, శైలేంద్ర. ముగ్గురి పేర్లు చెప్పమంటే ఒక్క శైలేంద్ర పేరే మూడు సార్లు చెబుతాను. “జీనా యహా మర్నా యహా ఇస్కే సివా జానా కహా” అన్న శైలేంద్రని మించిన కవి హిందీలో లేడు, నా అభిప్రాయంలో….
తమిళ్ – కణ్ణదాసన్. నిస్సందేహంగా కణ్ణదాసన్. కాళిదాసు తమిళుడుగా పుట్టి తమిళ సినిమా పాటలు రాయటానికి వచ్చాడేమో అని నా అభిప్రాయం. అంతటి వేదాంతి, ప్రవక్త, కవి ఇంకొకర్ని నేను చూడలేదు.

(వేటూరి గారికి హిందీ, తమిళ పాటల గురించి చాలా తెలుసన్న విషయం గ్రహించాలి. ఇది ఖచ్చితంగా ఆయనికి పాటలు రాయడంలో ఉపకరించింది)

5. సినిమాపాటల రచయితకి సంగీత పరిజ్ఞానం అవసరమా?

సంగీత పరిజ్ఞానం లేనిదే ఎవరైనా పాట రాయడానికి అనర్హుడని నా అభిప్రాయం. భావం ఎటువంటిది, దాన్ని ఏ రాగంలో, ఏ స్థాయిలో చెబితే బాగుంటుందో, ఇచ్చిన ట్యూన్ ఏ స్థాయిలో ఉందో, ఏ రాగంలో ఉందో, దానికు అణుగుణంగా సాహిత్యం రాయాలనేది నా నమ్మకం. అలా రాసినప్పుడే ఆ లిరిక్‌కి ఒక atmosphere ఏర్పడుతుంది. దానివల్ల దానికి ఒక మంత్రశక్తి ఏర్పడి, అది వినే శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అట్లా జరగనప్పుడు తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అన్నట్లు, unmusical words తో రాసే లిరిక్స్ నాకు అట్టే ఇష్టముండదు

(పాటకి, కవితకి ఉన్న ఈ తేడా గీతరచయితలు తప్పక గమనించాల్సింది. చాలా సార్లు చదవడానికి బానే ఉన్నా వినడానికి బావులేని పాటలు చూస్తాం. అలాగే చదవడానికి మాములుగా ఉన్నా వింటున్నప్పుడు సమ్మోహపరిచే సాహిత్యం లేకపోలేదు)

6. మీ దృష్టిలో సినిమా పాటకి భాష ముఖ్యమా లేక భావం ముఖ్యమా?

మౌనభాష భావం, వ్యక్తభావమే భాష. ఈ రెండూ “వాగర్ధావివసంపృక్తౌ” అన్నట్లు, అర్థం-మౌనం, వాక్కు – శబ్దం. అర్థానికి శబ్దం కావాలి, శబ్దానికి అర్థం కావాలి. భాష ముఖ్యమా భావం ముఖ్యమా అంటే భాషాభావం వేరుకాదు. భావంలేని భాష లేదు అని చెప్పాలి.

(అర్థంపర్థం లేని పాటలు చాలా రాసారని వేటూరి పై ఒక విమర్శ ఉంది. ఇందులో కొన్ని పాటలకి “అర్థం లేకపోవడం” కన్నా “అర్థం కాకపోవడం” ఉన్నది. ఊరికే లొల్లాయిగా రాసిన పాటలకి కూడా అర్థంలేకపోదు, రాసినప్పుడు రచయిత మదిలో మెదులుతుంది అది. అయితే పాట అల్లాటప్పా కనుక తీసుకున్న చొరవ వల్ల రచయిత భావం అంత స్పష్టంగా తెలియకపోవచ్చు)

7. మీరు రాసిన పాటల్లో బాగా కష్టపడి రాసినవి?

సినిమాపాట situation చెప్పగానే ఒక రైటర్‌కి కలిగే reflex అని నా అభిప్రాయం. అందుకనే ఒక పల్లవి మనం ఎందుకు రాసామో అవతలివాడికి అర్థంకాక గానీ, నిజంగా అతనికి నచ్చకగానీ, ఇంకేమైనా రాయండి గురువుగారు అని అడుగుతుంటే రాస్తాం గానీ – “The first will be best always because it is a natural reflex”. ప్రతిస్పందన. అదే సాహిత్యం.

నేను అతికష్టపడి రాసినవి కొన్ని ఉన్నాయ్. అంటే ఆ situation కి ఎలా రియాక్ట్ అవటం అనే సందేహం వస్తుంది. We can react which is the best of the way, it all depends on reflectivity. అప్పుడు ఇంకొకళ్ళు కావాలి, ఇది బాగుంది అని మనకి మనం సంతృప్తి పడితే సరిపోదు, అవతలివాళ్ళకి నచ్చుతుందా లేదా అని చూడాలి….

(ఈ మాటల్లో నిండిన అనుభవం, జ్ఞానం అందరు రచయితలకీ పనికివచ్చేదే కదా. ఇక్కడ reflex గురించి వేటూరి చెప్పడం ఆయనకి ఉన్న surrealistic భావాలకి దర్పణం. surrealism గురించి ఇంకో ప్రశ్నలో)

8. ఈ పరిశ్రంలో మీకు తగిన గుర్తింపు వచ్చిందని భావిస్తున్నారా?

గుర్తింపు లభించవలసినదానికంటే ఎక్కువే లభించిందని ఒకో సారి అనిపిస్తుంది. కాని నా మిత్రులు SPB లాంటి వారు నాకు తగిన గుర్తింపు రాలేదని బాధపడతారు. వీరు బాధపడటమే నాకు తగిన గుర్తింపు అని భావిస్తాను నేను.

(వేటూరి బహుశా రాని అవార్డుల గురించి, పురస్కారాల గురించి అంతగా మథనపడి ఉండి ఉండరు ఎప్పుడూ. ఒక విధంగా ఆయన కర్మయోగి. తన పని, తనకి తోచిన పద్ధతిలో చేసుకు పోయారు అంతే)

9. మీ ప్రకృతి వర్ణనలపై ఏ సాహిత్య ప్రభావం ఎక్కువ ఉంది? ఆంధ్రమా, ఆంగ్లమా, ఆర్షమా?

ఒకరకంగా చెప్పాలంటే ఆంగ్లమే. కీట్స్, షెల్లీ, వర్డ్స్ వర్త్ వంటి వారు చేసిన ప్రయోగాలు కొన్ని నేనూ చేసాను. ఆ ప్రయోగాల్లో ఒక అస్పష్టమైన “రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై” అని ఒక పాటలో రాసాను. ఏమిటిది అంటే అది నాకు అర్థం కావలసిందే, మీకర్థమైనవే రాస్తే ఇతరులకి ప్రయోజనం ఏమిటని? అంటే అక్కడ భావుకత, ఆ కేరెక్టర్‌ని నిలబెట్టే మాటలు అవే – “రాలిపోయిన పువ్వుల్లో తేనెని వెతికే రాతితుమ్మెదా ఉంటుంది. ఈ తుమ్మెద ఇక్కడనుంచి కదలలేదు. ఆ రాలినపూలలోంచి తేనిపొంగి పైకిరాదు” అనే భావం కోసం రాసాను. దీనికి మరో పేరు సర్రియలిజం, అధివాస్తవికత. అది నాకు చాలా ఇష్టం. ఈ అధివాస్తవికత ఉన్నదే కవిత్వం అనిపించుకుంటుంది.

(వేటూరి రాసిన అర్థం కాని ఎన్నో భావాలు అధివాస్తవికత వల్ల అని ఇది చదివితే తెలుస్తుంది. అధివాస్తవికతలో అస్పష్టత ఉన్నా, అది కలిగించే “భావ సాంద్రత” గొప్పగా ఉంటుంది)

10. మీరు పాటల రచయితగా తొలిరోజుల్లో పోటీనీ గానీ ఇబ్బందిని గానీ ఎదుర్కొన్నారా?

ఏనాడూ నేను ఎదుర్కోనిది ఏదన్నా ఉంటే ఇదొక్కటే. నాకు ఎవర్నీ పోటిగా నేను భావించలేదు. అసలు ఆ దృష్టి ఉండేది కాదు. నా పని నేను చేసుకుపోయేవాణ్ణి.

(వేటూరి గారిని కర్మయోగి అన్నది ఇందుకే)

11. సినిమారంగంలో రచనాపరంగా వారసులుగా ఎవరిని భావిస్తారు?

వారసుల్ని గురించిన ఆలోచన లేదు. నాకన్నా ఎక్కువ విలువలు పాటిస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు పరిశ్రమలో. నేనేదో పెద్ద విలువలు పాటించానని, అది నిలబెట్టే వారసులకోసం నేను ఆ లెవల్లో ఆలోచించను. ఈ నా వారసత్వమే రానక్కరలేదు, ఇంతకన్నా బెటర్ వారసత్వమూ రావచ్చు. ఆత్రేయ గారు నన్ను తన వారసునిగా చెప్పుకోటానికి, అంతగా నన్నాయన ప్రేమించాడు, అభిమానించాడు, తులనాత్మకంగా చూసాడు. ఒక కవిగా నన్ను observe చేసాడు. నాకా ధోరణి లేదు. ఒంటరిగా నా పని నేను తలొంచుకుని చేసుకుంటూ పోవడమే తప్ప…

(వేటూరి వారిలో ఉన్న ఒక మంచి లక్షణం – తన పరిమితుల గురించి, తప్పుల గురించి తాను ఎరిగి ఉండడం. ఈ లక్షణాన్ని పుణికిపుచ్చుకోవడం కూడా ఈనాటి రచయితలకి అవసరమేమో)

జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః

నాస్తి యేషాం యశః కాయే జరామరణజం భయం

 

4 thoughts on “వేటూరి జన్మదిన కానుక – ఒక పాత ఇంటర్వ్యూ పరిమళం”

  1. జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
    నాస్తి యేషాం యశః కాయే జరామరణజం భయం

    చక్కనైన వ్యాసాన్ని వ్రాసి వేటూరితో మాట్లాడిన ఒక అనుభవాన్ని కలిగిపించావు సోదరా…చాలా కృతజ్ఞతలు.

    సందీప్

  2. వేటూరి రాసిన డబ్బింగ్ పాటలు చండాలంగా ఉన్నాయి.

    సఖి చిత్రంలోని స్నేహితుడా పాట లోని ఈ మాటలు చదవండి. జజ్జినకరి జనారే అంటూ నృత్యం చేయాలనిపిస్తుంది.
    —————————————
    పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా నేను నిద్రపోతే లేత గోళ్ళు గిల్లవోయ్
    సందెల్లో తోడువోయ్
    ఐదు వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు సాయవలెరా
    ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం
    శాంతించాలి పగలేంటి పనికే (2) నీ సొంతానికి తెచ్చేదింక పడకే
    వాలే పొద్దు వలపే
    వూలెన్ చొక్క ఆరబోసే వయసే నీటీ చెమ్మ చెక్క లైనా నాకు వరసే
    ఉప్పు మూటే అమ్మై నా
    ఉన్నట్టుండి తీస్తా ఎత్తేసి విసిరేస్తా కొంగుల్లో నిన్నే దాచేస్తా
    చాలక పొద్దు విడుదల చేసి వరమొకటడిగేస్తా
    ——————————–

  3. చాలా చాలా థాంక్స్.
    నాకు మిగతా ౧౦౩ ప్రశ్నలకి వేటూరి ఏమన్నారో వెంటనే వినాలని ఉంది.
    “వేటూరి పాట” పుస్తకం మార్కెట్ లో దొరుకుతోందా. మీకు ఎక్కడ దొరికిందో చెప్పగలరు. కొమ్మ కొమ్మకో సన్నాయి తెప్పించు కుంటున్నా . దొరికితే ఇది కూడా తెప్పించుకుందామని.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top