“త్యాగరాజ కృతిలో సీతాకృతి” – ఏ కృతి?

“మిస్టర్ పెళ్ళాం” చిత్రంలో వేటూరి గారి సొగసైన రచన “సొగసు చూడతరమా” అనే పాట. ఈ పాట చివర్లో “త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువంటి సొగసు చూడతరమా, నీ సొగసు చూడతరమా” అనే వాక్యం వస్తుంది. నేను మొదటిసారి ఈ పాట విన్నప్పుడు త్యాగరాజ స్వామి సీతమ్మ తల్లిని వర్ణిస్తూ ఏదో కృతి రాసి ఉంటారని, ఆ కృతిని వేటూరి గారు ఇక్కడ ప్రస్తావిస్తున్నారని అనుకున్నాను. ఆ భావంతో చూస్తే అద్భుతమైన సౌండింగ్ కలిగిన ఈ వాక్యం నాకు చాలా నచ్చేసింది!

తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే త్యాగరాజ స్వామి సీతాదేవి ఆకృతిని వర్ణిస్తూ ఏ కృతీ రాయలేదని! మరి అలాంటప్పుడు వేటూరి ఈ వాక్యాన్ని ఏ అర్థంలో రాసుంటారా అన్న ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఇలాంటి పజిల్స్ వేటూరి గారి పాటల్లో సర్వసాధారణం! “ఆలోచనామృతం వేటూరి సాహిత్యం” అని అనుకోవాలి ఇలాంటప్పుడే!

ఈ “వేటూరి పజిల్” కి నేను ముందుగా అనుకున్న సొల్యూషన్ ఏమిటి అంటే సీతమ్మని అమ్మవారి స్వరూపంగా, ఆదిపరాశక్తిగా భావిస్తే త్యాగయ్య రాసిన “సుందరి నిన్ను వర్ణింప” వంటి కీర్తనల్లో అమ్మవారి ఆకృతి వర్ణన కనిపిస్తుంది కదా, కాబట్టి అలా సమన్వయం చేసుకోవచ్చని! ఇది కొంత కిట్టించినట్టు అనిపించినా, అప్పటికి అలా సరిపెట్టుకున్నాను.

ఈ మధ్య మా “వేటూరి అభిమానుల” గ్రూపులో ఈ ప్రయోగం గురించి “సురేశ్ కొలిచాల” గారు చేసిన విమర్శ వల్ల ఓ చర్చ జరిగినప్పుడు ఇంకా ఆలోచిస్తే రెండో సొల్యూషన్ తట్టింది. “ఆకృతి” అంటే “దేహము” (body) అనే కాక “రూపం” (form) అనీ అర్థం ఉంది. కాబట్టి “త్యాగరాజ కృతిలో సీతాకృతి” అన్నప్పుడు అమ్మవారి ఆకృతి వర్ణన ప్రత్యక్షంగా లేకపోయినా ఆమె రూపాన్ని దర్శింపజేసే ఏ వర్ణనైనా సరిపోతుందేమో అనిపించింది. త్యాగయ్య సీతమ్మ వారిపై రాసిన “సరి ఎవ్వరే శ్రీ జానకి” అన్న కృతి ఒకటి ఉందని సోదరుడు మాడుగల నాగ గురునాథ శర్మ తెలిపాడు. ఆ కృతిలో త్యాగయ్య సీతమ్మని కొనియాడుతూ భయంకరమైన అడవులకు సైతం రామునితో కలిసి నడిచిన ఆమె సాధ్వీలక్షణాలను ప్రస్తావించారు. ఈ కీర్తన వింటూ ఉంటే మనకి సీతమ్మ వారి రూపం ఒకటి మెదులుతూ ఉంటుంది. అది ధగధగలతో వైభవంగా వెలుగుతున్న అయోధ్యలోని సీతమ్మ తల్లి రూపం కాదు, నార చీరలతో రాముని వారి వెంట నడిచిన సీతమ్మ వారి రూపం. ఈ “సీతాకృతి” సినిమా సందర్భానికి కూడా సరిగ్గా సరిపోతుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ చరణంలో ఇంటి పనులన్నీ పూర్తిచేసుకుని, భర్త కోసం తయారై, గుమ్మం దగ్గర వేచి చూస్తూ, అలసటవల్ల నిదురపోయిన ఓ గృహిణిలోని అంకిత భావం కనిపిస్తుంది.

ఈ వివరణ మొదట నేను అనుకున్న వివరణ కన్నా బాగున్నా, ఇదీ అంత సంతృప్తికరంగా అనిపించలేదు. వేటూరి భావం ఇది కాదు, ఇంకా ఏదో ఉంది అనిపించింది. ఈ పజిల్ ని ఫైనల్ గా సాల్వ్ చేసిన వారు శ్రీ కొంపెల్ల వెంకట్రావు గారు. ఆయనిచ్చిన వివరణ నాకు చాలా నచ్చింది.

అసలు “సొగసు చూడతరమా” అన్న పల్లవే ఒక త్యాగరాజ కృతి అన్నది నాకు వెంకట్రావు గారు చెప్పేవరకూ స్ఫురించనే లేదు! ఈ కృతిలో నిగనిగమని మెరిసే రాముని మోము మొదలుకుని రాముని సుందర ఆకృతి వర్ణన ఉంటుంది. సినిమాలో పాట పల్లవి కూడా ఇదే కనుక వేటూరి ప్రస్తావించిన త్యాగరాజ కృతి ఇదే అని ఖచ్చితంగా అనుకోవచ్చు. అలాంటప్పుడు “త్యాగరాజ కృతిలో రామాకృతి గల ఇటువంటి సొగసు చూడతరమా” అని పురుషుల్ని వర్ణిస్తే కుదురుతుంది కానీ “సీతాకృతి” ఎలా ఒప్పుతుంది?

ఇక్కడే మనకి వేటూరి లోని జీనియస్, ఆయనకి ప్రయోగాలపై ఉన్న మక్కువా కనిపిస్తాయి! వేటూరి గారు ఎంతో అభిమానించే ఆయన గురువు గారైన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన “రామాయణ కల్పవృక్షం” కావ్యంలోని “ఆకృతి రామచంద్ర విరహాకృతి” అన్న పద్యము చాలా సుప్రసిద్ధమైనది. ఆ పద్యం గురించి నేను “ఈమాట” లో మొదటిసారి చదివి తెలుసుకున్నాను. గరికపాటి గారు ఈ పద్యంపై చేసిన గొప్ప విశ్లేషణ గురించి విజయసారథి జీడిగుంట గారు తెలియజేశారు (1:35:29 నుండి)

హనుమంతుడు అశోకవనంలో సీతను చూసినప్పుడు ఆ సీతమ్మ వారిలోనూ రాముణ్ణే దర్శిస్తాడు, రామ భక్తుడు కనుక! రాముని విరహమే ఆకృతి పొంది సీతమ్మగా కనిపిస్తుంది. రాముని ధనుస్సే ఆమె కనుబొమ్మల్లో కనిపిస్తుంది. ఆమె కూర్చున్న విధంలో రాముని ప్రతిజ్ఞ కనిపిస్తుంది. ఇలా సీతమ్మ సర్వమూ రామమయమై కనిపిస్తుంది. అలాగే సినిమాలో “సొగసు చూడతరమా” అంటూ తన భార్య గురించి పాడుకుంటున్న భర్తకి, ఆ త్యాగయ్య కృతిలో రాముని పరంగా చేసిన ఆకృతి వర్ణనలన్నీ సీతమ్మ తల్లివిగా కనిపించి, తన భార్యలోనూ ఆ సీతమ్మ సౌందర్యాన్ని పవిత్రంగా చూసుకుంటున్నాడు. ఇక్కడ సర్వం భామమయం, ప్రేమమయం మరి!

వెంకట్రావు గారు ఈ విషయాన్నే వివరిస్తూ ఇలా అన్నారు:

“సొగసు చూడ తరమా” అన్న కృతిలో త్యాగరాజు శ్రీ రామచంద్రుని మోహన రూపాన్ని అవ్యక్త మధురంగా వర్ణించారు. ఆ కృతి పల్లవిని ఈ పాటకు పల్లవిగా చేసి వేటూరి గారు రాసిన అద్భుతమైన పాట ఇది. ఈ కృతి నాకు బాగా తెలుసు. ఈ కృతిలో రాముల వారి వర్ణన సీతా దేవికి ఆపాదిస్తూ, హీరో తన భార్యను అంత పవిత్రంగానే ఊహించుకుంటూ పాడుకున్న పాటగా వేటూరిగారి రచన సాగిందని నా అభిప్రాయం.

త్యాగరాజు రాముని అధరాన్ని, కపోలాలను, కరములను, పాదాలను, ముంగురులను, కళ్ళను వర్ణించారు. ఈ కృతిలోనే కాక చాలా కృతులలో రాముల వారి మోహనరూపాన్ని త్యాగరాజ స్వామి వర్ణించారు. సీతాదేవిని త్యాగయ్య ఏ కృతిలోనూ వర్ణించలేదు.
‘సొగసు చూడ తరమా’ కృతి లోని రాముని అందంలో సీతాకృతిని ఊహిస్తూ ఆ సొగసు తన భార్యదని అనుకునే భర్త మనోగతమేమో ఈ పాట.

భాష, భాషాశాస్త్రం, అమరకోశం, అనేక తెలుగు నిఘంటువుల మీద పట్టున్న గురువు గారి మనసులోని భావమేమిటో !!

వేటూరి ఈ ప్రయోగం గురించి ఎక్కడా మాట్లాడినట్టు నాకు తెలియదు. హాసం రాజా గారు “అక్షరం ఆయన లక్షణం” అంటూ రాసిన వ్యాసంలో ఈ ప్రయోగం దివ్యంగా ఉందని ప్రస్తావించారు కనుక ఆయన బహుశా వేటూరి గారిని కనుక్కొని ఉంటారు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు చెప్పడానికి ఆయనా లేరు, వేటూరీ లేరు. వేటూరిని అడిగితే ఈ ప్రయోగం గురించి ఇంకెన్ని విషయాలు చెప్పేవారో! బహుశా మనకి తట్టని ఇంకో అర్థాన్నీ ఆయన సూచించి ఉండొచ్చు. అందుకే వేటూరి పాటల్లో తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత!

ఇలా ఒక వాక్యంలో త్యాగరాజ స్వామి వారి కృతినీ, విశ్వనాథ వారి పద్యాన్ని గుర్తుచేస్తూనే ఒక చమత్కారాన్ని కూడా సినిమా సందర్భానికి తగినట్టుగా చేయగలగడం వేటూరిలోని గొప్పతనం. వేటూరి ప్రయోగాలు కేవలం శబ్దసౌందర్యం కోసం చేసే గారడీలు కావని, వాటి వెనుక ఎంతో విషయం ఉంటుందని తెలియజేయడానికి ఇదో మంచి ఉదాహరణ. ఆయనలోని సరస్వతికి నమస్సులు!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top