“కొమ్మకొమ్మకో సన్నాయి” పుస్తకం గురించి నెమలికన్ను మురళి

 

తెలుగు సినీ గీత సాహిత్యంలో “వేటూరి” ఓ అధ్యాయం. సంధియుగంలో ఉన్న సినిమాపాటకి ఓ కొత్త ఒరవడి దిద్దిన వేటూరి సుందర రామమూర్తి తన సిని ప్రస్థానంలో అడుగడుగునా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించిన వ్యక్తులందరినీ వినమ్రంగా స్మరించుకుంటూ ఘటించిన స్మృత్యంజలి ‘కొమ్మకొమ్మకో సన్నాయి.’ హాస్య, సంగీత పత్రిక ‘హాసం’ లో ప్రచురింపబడిన ఇరవై ఏడు వ్యాసాల సంకలనమైన ఈ పుస్తకాన్ని ఓసారి చదవడం మొదలుపెట్టాక, పూర్తి చేయకుండా పక్కన పెట్టలేం.

 

సినీ సాహిత్య రచనలో తన గురువు దైతా గోపాలం మొదలు, తనచేత చక్కని పాటలు రాయించుకున్న జంధ్యాల వరకూ సిని రంగానికి చెందిన అనేకులని తలచుకుంటూ వేటూరి రాసిన వ్యాసాలని చదువుతుంటే ‘ఎదిగిన కొద్దీ ఒదగడం’ అంటే ఏమిటో ఎవరూ చెప్పకుండానే అర్ధం అవుతుంది. ఆయావ్యక్తుల వ్యక్తిత్వాలతో పాటు, వారిని భక్తిగానూ, గౌరవంగానూ, ప్రేమగానూ స్మరించుకున్న వేటూరి వ్యక్తిత్వమూ ప్రకాశితమవుతుంది.

 

సినీ సంగీతంలో ఎంతటి గీత రచయితకైనా తొలినాళ్ళలో సంగీత దర్శకుడి సహకారం అత్యవసరం. మామూలు రచనకీ, సినీ రచనకీ ఉన్న భేదాన్ని వివరంగా చెప్పడానికైతేనేమి, ట్యూన్ కి తగ్గట్టుగా రాయడంలో మెళకువలు బోధించడానికైతేనేమి గీతరచయితకి తొలి గురువు సంగీత దర్శకుడే. తన తొలిగురువు మహదేవన్ ని భక్తిగా తలచుకున్నారు వేటూరి ‘స్వర బ్రహ్మ రాగ విష్ణు గురుర్దేవో మహదేవన్’ అన్న తొలి వ్యాసంలో.

 

‘చదివించిరి నను గురువులు..’ అన్న పద్యపాదం గుర్తుకురాక మానదు, ఈ వ్యాసం చదువుతుంటే. బాగా రాసినప్పుడు పదిమంది ముందూ మెచ్చుకుంటూనే, చిన్న చిన్న లోటుపాట్లని ఏకాంతంలో బోధ పరిచిన మహదేవన్ సంస్కారాన్ని వినమ్రంగా తలుచుకున్నారు వేటూరి. గీత రచనలో తొలిగురువు దైతా గోపాలానికి అర్పించిన నివాళి ‘కులపతి స్తుతమతి దైతా గోపాలం’ వ్యాసం. “విషయ వాంఛలను వేరు సేయుమా, విష్ణు భజనమున్ సేయుమా, తృష్ణా విషహార దివ్యౌషధమో, కృష్ణ నామసుధ గ్రోలుమా..” అన్నది గోపాలం, వేటూరి, మరిముగ్గురు యువకులకి ఇచ్చిన చివరి సందేశం.

 

“మాట తప్పడం నేరంగా పరిగణించే లోకంలో ఆత్రేయ ఆ నేరాన్ని ఎంత అందంగా ముద్దొచ్చేటట్లు చేసేవాడో ఆయన సన్నిహితులకు బాగా అనుభవం..” అంటూ సరదా సంగతులు చెప్పినా, “నిజమైన సంగీతానికి సాహిత్యం అవసరం లేద”న్న మర్మాన్నివిప్పిచెప్పిన ‘ఆదినారాయణరావుకి అంజలి’ ఘటించినా, “ఆయన నటనా ప్రభావంతో ముమ్మిడివరంలో బాలయోగి అవతరించాడు. బెంగుళూరులో శ్రీనివాస అయ్యంగార్ యావదాస్తినీ బృందావనంగా మార్చి నాగయ్యగారికి అంకితం చేశారు” అంటూ ‘చిరంజీవి చిత్తూరు నాగయ్య పాల్ ముని ఆఫ్ ఇండియా’ ని గుర్తు చేసుకున్నా, “ఇది వేటూరి మాత్రమే రాయగలిగే వ్యాసం” అని అనిపించక మానదు.

“ఎన్.ఏ.టీ. వారు నిర్మించిన ‘సీతారామకళ్యాణం’ చిత్రంపై ఘాటుగా నేను ‘రామారావణీయం సీతారామకళ్యాణం’ అనే శీర్షికతో రాసిన సమీక్ష చూసి చిరునవ్వుతో, ఎవరిగురించో రాసినట్టుగా ‘కొంచం ఘాటు తగ్గిస్తే బాగుండేదేమో’ అన్న సహ్రుదయశీలి ఆయన” అంటూ ఎన్టీఆర్ లోని ఓ కోణాన్ని చూపిస్తూనే, “ఒకానొక ఉగాదినాడు నంది అవార్డ్ అందుకోడానికి వచ్చిన నన్ను దూరంనుంచే చూసి దగ్గరకి వచ్చి కరచాలనం చేస్తూ ‘మీ పాటలు మానోట పలకడం లేదే! మాపాట మాదై పోయిందే’ అన్న రామారావుగారిని నేను మరవలేను” అన్న వేటూరి వాక్యాలని మనమూ మరువలేం.

 

దైతా గోపాలం సక్కుబాయి పాటలని ‘సక్కుబాయి’ సినిమాకోసం తన పేరిట వాడుకున్న సముద్రాల విమర్శల పాలయ్యారనీ, ఎంత చక్కని సంగీతం చేసినా, సత్యం కాపీ బాణీల విమర్శల నుంచి బయట పడలేక పోయారనీ చెప్పినప్పుడు వేటూరి లోని నిర్మొగమాటిని చూస్తాం మనం. అలాగే సంగీత విభాగం వారిని మాత్రమే కాక, నటులు రేలంగినీ, జగ్గయ్యనీ తల్చుకుని వారితో తన అనుభవాలని వివరంగా పంచుకున్నారు. జగ్గయ్య మరణించాక రాసిన వ్యాసానికి ‘నాటి ఆకాశవాణి నేటి అశరీరవాణి’ అనే శీర్షిక ఇవ్వడం వేటూరికి మాత్రమే సాధ్యం.

 

“ఆకుపచ్చని సిరాతో లేత కొత్తిమీర ఆకులవంటి అక్షరాలతో ధీమాగా నిలిచే తలకట్లతో ఆయన తెలుగు అక్షరాలు కనువిందు చేసేవి” అంటూ దాశరధి ఉత్తరాలని ఇష్టంగా గుర్తు చేసుకుంటూనే “ఆయనతో గడిపిన క్షణాలు సరస్వతీ వీక్షణాలు – నిత్యజీవితంలో విలక్షణాలు. ఈ సులక్షణ కవితాశరధికి దాశరధికి ఇవే నా తేనెకన్నీరాజాతాలు” అంటూ వ్యాసాన్ని ముగించిన తీరు అనితరసాధ్యం. పెండ్యాల, సాలూరి, రమేష్ నాయుడు, రాజన్ నాగేంద్ర, బాపు-రమణ, విశ్వనాధ్, చక్రవర్తి, నాగిరెడ్డి, బాలు, ఇళయరాజా, రెహ్మాన్… వీరందరితోనూ తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న తీరు అపురూపం.

 

ఇక్కడ సొంత సంగతొకటి చెప్పుకోవాలి. సుమారు ఓ రెండు నెలల క్రితం, అంటే ఈ పుస్తకం కొనడానికి పూర్వం, బ్లాగ్మిత్రులు కార్తీక్ గారు ‘చిత్రమాలిక’ కోసం జంధ్యాల గురించి వ్యాసం ఒకటి పంపమన్నప్పుడు, ఓ టపా రాసి దానికి ‘జంధ్యావందనం’ అని శీర్షిక ఇచ్చాను నేను. ఈ శీర్షిక గురించి ఒకరిద్దరు మిత్రుల దగ్గర తగుమాత్రంగా గర్వ పడ్డాను కూడా. ఈ పుస్తకంలో జంధ్యాలకి నివాళిగా వేటూరి రాసిన వ్యాసానికి అదే శీర్షిక చూసి షాక్కొట్టింది నాకు. వేటూరి నన్ను చూసి జాలిగా నవ్వినట్టు అనిపించింది. గర్వ పడ్డ క్షణాలను తల్చుకుని సిగ్గు పడ్డానని ఒప్పుకోడానికి మొహమాట పడడంలేదిప్పుడు.

 

బాపు కవర్ డిజైన్ తో అందంగా ముస్తాబైన ఈ ‘కొమ్మకొమ్మకో సన్నాయి’ ని అందుబాటులోకి తెచ్చిన వారు హైదరాబాద్ కి చెందిన వేటూరి సాహితీ సమితి వారు. నూట తొంభై పేజీల ఈ పుస్తకం వెల నూట ఇరవై రూపాయలు. సినిమాలనీ, సినిమా సంగీత సాహిత్యాలనీ ఇష్టపడే వాళ్ళు తప్పక చదవాల్సిన రచన ఇది.

 

నెమలికన్ను మురళి వ్రాసిన ఈ వ్యాసం ఈ కింద లింక్ లో చూడవచ్చు.

http://www.nemalikannu.blogspot.in/2011/01/blog-post_26.html

 

నెమలికన్ను మురళి గారికి కృతజ్ఞతలతో ..

 

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.