“వేటూరి సినీ రంగ శ్రీనాధుడు ..” సినిమాని ప్రేమించే ఒక మిత్రుడితో ఉదయాన్నే జరిగిన సంభాషణలో అతని నోటి నుంచి వచ్చిన వాక్యం ఇది. రోజంతా నన్ను వెంటాడుతూనే ఉంది. పేపర్లలో వేటూరి గురించి చదువుతున్నప్పుడు, టీవీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడూ, ఇంకా ఏ పని చేస్తున్నా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చింది. దీనితో పాటే “వినువీధి నెదురెండ పొగడ దండ..” కూడా.
నిజమే.. వేటూరికీ శ్రీనాధుడికీ పోలికలు లేకపోలేదు. తమ కలాల ద్వారా నవరసాలనీ అలవోకగా పలికించడం ఇద్దరికీ వెన్నతో పెట్టిన విద్య. వారి వారి కాల మాన పరిస్థితులకి అనుగుణంగా రచనలు చేశారు ఇద్దరూ. తమ కావ్య కన్నియలకి పట్టాభిషేకం జరుగుతుండగా చూసి పులకించిపోయిన వాళ్ళే ఇద్దరూ. తమ తమ రంగాలలో తిరుగులేని స్థానం ఇద్దరిదీ. అంతేనా? ఎవరికీ తలవంచని స్వభావంలోనూ పోలిక ఉంది.
తను రాసిన ఎన్నో పాటల్లో వైరాగ్యాన్నీ, వేదాంతాన్నీ పలికించిన వేటూరి చివరి రోజుల వరకూ భోగ జీవితాన్నే గడిపారు. ఎలా సంపాదించారో అలాగే ఖర్చు పెట్టారు. లేకపొతే, మూడున్నర దశాబ్దాల పాటు సిని గేయ రచయితగా తిరుగులేని స్థానంలో ఉన్న వ్యక్తికి ఫిలింనగర్ లో సొంత ఇంటిని సమకూర్చుకోవడం అన్నది తీరని కోరికగా మిగిలిపోవడం ఎలా సాధ్య పడుతుంది?
ఆరోగ్యం మీద వేటూరికి మొదటి నుంచీ ఆశ్రద్దే అనిపించక మానదు, ఆయన జీవితాన్ని పరిశీలించినప్పుడు. ఎన్నో పాటలని ఆయన హాస్పిటల్ బెడ్ మీద నుంచే రాశారు. వేటూరితో పాటుగా తెలుగు సినిమాకి కూడా ఎంతగానో పేరు తెచ్చిన ‘శంకరాభరణం’ సినిమా ముగింపులో వచ్చే ‘దొరకునా ఇటువంటి సేవ..’ పాటని హాస్పిటల్ లోనే రాశారు వేటూరి. నిజానికి ఆయన పాటని డిక్టేట్ చేస్తుంటే, ఆ సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీ డిక్టేషన్ తీసుకున్నారు.
చాలామంది గీత రచయితలతో పోల్చినప్పుడు, పాటని అతి తక్కువ సమయంలో రాస్తారన్న పేరుంది వేటూరికి. దర్శకుడు టి. కృష్ణ సన్నివేశం చెప్పగానే ‘ప్రతిఘటన’ సినిమాలో ‘ఈ దుర్యోధన దుశ్శాసన..’ పాటని పావు గంటలో రాశారు వేటూరి. నిజానికి ఆ సన్నివేశంలో డైలాగుల కన్నా పాట ఉంటే బాగుంటుందన్న సూచన ఆయన చేసిందే. భాష మీద పట్టు తో పాటు, స్వరజ్ఞానం ఆయనకున్న వరం.
ఎలాంటి పాటనైనా రాయగలగడం వేటూరికి ఉన్న అనేక ప్రత్యేకతల్లో ఒకటి. తను రాసిన పాటల్లో మాటలు రికార్డింగ్ సమయంలో మారిపోయినప్పుడు మౌనంగా ఉండిపోకుండా, ఆ విషయాన్ని సూటిగా ప్రకటించారు ఆయన. నిర్మాణ సంస్థ ఎంత పెద్దదైనా, హీరో, దర్శకుడు తనకి ఎంత దగ్గర వారైనా మాటల మార్పు విషయంలో రాజీ పడలేదాయన. ఈ ముక్కుసూటిదనం ఆత్మవిశ్వాసం నుంచి వచ్చిందేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
జీవితపు చరమాంకం విషయంలో శ్రీనాధుడి కన్నా వేటూరి అదృష్టవంతులనే చెప్పాలి. తనకి దక్కాల్సిన గౌరవం దక్కకపోవడం, లేదా ఆలస్యంగా దక్కడం జరిగిందేమో తప్ప అవమానం ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాలేదు. అలాగే పాటలు రాయడం మొదలు పెట్టింది మొదలు, జీవితపు చివరి క్షణాల వరకూ యేరోజూ పాటకి దూరంగా ఉండలేదాయన. సాహిత్యంలో శ్రీనాధుడి లాగే, సిని సాహిత్యంలో వేటూరి ఒకేఒక్కడు.
నెమలికన్ను మురళి గారు వ్రాసిన ఈ వ్యాసం ఈ కింద లింకులో చూడవచ్చు
http://nemalikannu.blogspot.in/2010/05/blog-post_23.html
నెమలికన్ను మురళి గారికి ధన్యవాదాలతో