గురూజీ… మళ్లీ ఎప్పుడు కలుద్దాం’ పేరుతో వేటూరి జ్ఞాపకాలను నమోదు చేయడానికి అంబట్ల రవి చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. వేటూరి సుందరరామ్మూ ర్తి తెలుగువారందరికీ సుపరిచితమే. అయితే కొందరు మహానుభావుల జీవితంలో కొన్ని కోణాలు మరుగున పడి పోతుంటాయి. వేటూరి ఓ సాహితీవేత్త మాత్రమే కాదు, సమాజం పట్ల బాధ్యత ఎరిగిన వ్యక్తి ఆయనలో కనిపి స్తాడు. కాలం మారినా గాంధేయ విలువల పట్ల నిబద్ధత సడలని పౌరుడిగా కూడా ఆయన కనిపిస్తారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల ఉన్న అభిమాన కోణం మరో కటి. వీటికితోడు తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయం పట్ల వేటూరి పడిన ఆవేదనను అభిమానులకు అందించే ప్రయత్నం చేశారు రచయిత రవి.
ఈ పుస్తకంలో కొంత భాగం వేటూరి అభిరుచులు, అలవాట్లు, తనతో వుండే వ్యక్తులతో ఆయన వ్యవహరించే తీరు, సమస్యల పట్ల స్పందించే తీరును రచయిత చక్కగా చెప్పారు. ఇంకా బయటి ప్రపంచానికి తెలియని అంతరంగాన్ని, స్వగతాన్ని, అనుభావాల్ని వేటూరితో పంచుకున్న మధురక్షణాల్ని రచయిత నెమరు వేసుకున్నారు. వేటూరికి, మనసుకవి ఆత్రేయపై ఉన్న అభిమానాన్ని వెల్లడించడానికి చోటు కేటాయించడం సబబే. ఆయన అమితంగా ఇష్టపడే ఆత్రేయ పాటల్ని కొన్నింటిని ప్రచురించడమే కాక, వేటూరికి ఇష్టమైన తన పాటలు పదింటిని కూడా ఈ పుస్తకంలో ఇచ్చారు. ఇవి కాక వేటూరి స్మృతి‘పదం’ పేరుతో దాశరథి రంగాచార్య, సుశీల, శేఖర్ క మ్ముల భావాల్ని ప్రచురించారు.
(పేజీలు: 110, వెల రూ.50, ప్రతులకు 1-60/1, ధర్మారం (బి),
డిచ్పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా, 503230; స్పూర్తి సాంస్కృతిక సేవా సంస్థ,
ఫ్లాట్ నెం. 56, ఆనందనగర్ కాలనీ, ఖైరతాబాద్, హైదరాబాద్-500 004)