బాల రసాలసాల అభినవ ఘంటసాల-(వేటూరి)

జూన్ 4వ తేదీన పుటిన ప్రియమైన మిత్రుడు, నేను గీతమైంతే తాను గానమైనవాడు, అద్వితీయుడైనవాడు, నాకు ప్రాణసమానమైనవాడు, నావాడు బాలసుబ్రహ్మణ్యం
జనార్ధనరెడ్డి సి.ఎం గా ఉన్నప్పుడు నంది అవార్డ్స్ ఫంక్షన్ ఒక సంవత్సరం నెల్లూరు లో జరిగింది. అవి ప్రదానం చెయ్యడానికి వచ్చిన నేటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత ఒక గొప్ప చారిత్రక సత్యం చెప్పారు. భారతదేశంలో సరిహద్దులంటూ లేని రాష్ట్రాలు రెండే రెండు, అవి ఆంధ్రా తమిళనాడు రాష్ట్రాలు అన్నది ఆ సత్యం.

ఉమ్మడి సాహితీ, సంగీత, నాట్య, కళా, సాంస్కృతిక చరిత్ర ఈ రెండు రాష్ట్రాలకు ఉన్నట్టు మరే ఇతర రాష్ట్రాలకూ లేవని ఆమె అన్నారు. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుపల్లె కోనేటంపేటలో పుట్టిన బాలు ఆంధ్రులకి తమిళులకి ఉమ్మడి సినీ గాయకుడు. తమిళాంధ్ర దేశాలను బాలూలాగ ఉర్రూతలూగించిన మరొకరు లేరు. ఘంటసాల, టి.ఎం.సౌందర్యరాజన్ లు ఒక విధంగా ఆంధ్ర తమిళ రంగాలకే పరిమితమైన వారు. కానీ బాలూ గళం ఈ రెండు రంగాలకే కాక కన్నడ హిందీ రంగాలకు కూడా వ్యాపించి తెలుగు గాయకశ్రేణికి అఖండ కీర్తి ఆర్జించి పెట్టింది.
సాధనతో ఒక వ్యక్తి ఎంతటి శక్తిగా మారగలడో నిరూపిస్తుంది బాలసుబ్రహ్మణ్యం జీవితం. ముత్యాలొలికే దస్తూరి, మూలాగ్రాలెరిగిన ఆంధ్ర సాహితీ పరిచయం, ధ్వన్యనుకరణం వంటి కళల్లో ప్రవేశం, అనర్గళంగా ఆంగ్లంతో పాటు దేశభాషలు ఐదారు మాట్లాడగల వాగ్ఝరి అతని నిధులు

శాస్త్రీయ సంగీతం గురువు వద్ద నేర్చుకొనకపోయినా, మామ, పుగళేంది వంటి విజ్ఞుల వల్ల దానిని సాధించి పాడి మెప్పించిన గాయకుడు. ఇవన్నీ అతనిని గూర్చిన నిజాలు. సంగీత దర్శకుడిగా గంగిగోవుపాలవంటి నాలుగైదు చిత్రాలే చేసినా మధురంగా, మనోహరంగా సంగీతం వినిపించినవాడు బాలు.

ఉషాకిరణ్ సంస్థ నిర్మిచిన “మయూరి” చిత్రం సినీ నిర్మాణ రంగంలో ప్రయోగాత్మకమైన మణిపూస. ఆ చిత్రానికి అందులో ఉన్న ఉదాత్త సన్నివేశాలకి బాలూ సమకూర్చిన సంగీతం కధలో ఉన్న “మూడ్” ను ఇనుమడింప చేయడమే కాక, ఎంతో హార్దికమైన హాయిని శ్రోతలకు పంచిపెట్టింది. అటువంటిదే మరొక గొప్ప చిత్రం సంగీత రచన జరిగి కూడా ఉషాకిరణ సంస్థ నిర్మించడం జరగలేదు. అ చిత్రం పేరు “ప్రతిమ”. గణేష్పాత్రో కధ, దర్శకత్వం అనుకున్న చిత్రమది. అందులోకూడా బాలూ ఎంతో హృదయంగమమైన సంగీతం, నేను హృదయపూర్వకమైన సాహిత్యం అందించాము.కొన్ని నా భావ గీతాలు కూడా బాలూ ట్యూన్ చేసిన పద్ధతిని విని ‘మళ్ళీ దేవదాసు వంటి సినిమా తీస్తే ఇతనే సంగీతం చెయ్యాలి ‘ అనుకున్నవారున్నారు.
బ్రతుకులాంటి పాటలో బ్రతకలేని బాటలో బాటసారిని నన్నీ పాట పాడనీ’ వంటి గీతాలను మధుర విషాద గీతలుగా మలిచిన మనస్వి అతను.

బాపూరమణలకు బాలూ అన్నా అతని సంగీతమన్నా ఎంతో ఇష్టం. చుట్టూ చెంగావి చీర (తూర్పు వెళ్ళే రైలు), శశివదనా మనవే వినలేవా (జాకీ), అలా మండి పడకే జాబిలీ (జాకీ), కోనసీమలో కొంగుజారిన ఆకుపచ్చ చందమామా (సీతమ్మ పెళ్ళి) లాంటి పాటలన్నీ బాలూ సంగీత దర్శకత్వ మధురిమకు స్వర దర్పణాలు. ‘గీతాంజలి ‘ పేర నేను వెలువరించిన ‘క్రీస్తు గానసుధ ‘ ఆడియో కేసెట్ లో ప్రతీ పాటా మధురాతిమధురం.

గొంతులు మార్చి పాడడంలో గాత్రధారులకు కొత్తకోణాలు ఆవిష్కరించిన ‘దశకంఠుడు ‘ అనిపించుకున్న బాలు ‘రవైతీతి రావణ:’ అన్నట్లు మరో నాదమూర్తి. ‘బాలోచ్చిష్టం స్వరం సర్వం’ అంటే అతన్ని కొంతైనా అర్ధం చేసుకున్నట్టే.
అన్నిటికీ మించి బాలూని కళాకారుడిగా పెంచినది పూర్వులు, పెద్దలు అయిన సంగీత సాహితీవిదుల పట్ల అతనికున్న భక్తిభావం. ఘంటసాల గారియందు అతనికి గల భక్తిగౌరవాలు, ఆరాధన ఆదర్శప్రాయమైనవి.

మహామహులైన సంగీత దర్శకుల, రచయితల మధుర గీతాలెన్నో పాడే అవకాశం ఇతర గాయకుల కన్నా ఎక్కువగా అతనికి దొరికింది. చరిత్ర సృష్టించిన చిత్రాలకు పాడి చరితార్ధుడైనాడు. ఎప్పుడొ ఒక మహాయతిని గూర్చి ఆయన అతీతశక్తులకు ప్రణమిల్లి
‘మనిషికిన్ని మహిమలా
ఘనసిద్ధుల గరిమలా
ఎదలోనే దైవమున్న హనుమలా
ఎదిగితే నీ దేహం తిరిగే తిరుమల
‘ అని
పాడుకున్నది బాలూ విషయంలో నిజమైంది. లేకపోతే ఇన్ని వైవిధ్యం గల పాటలతోపాటు, పాండితీ ప్రమాణాలు మెందుగా నిండుగా వున్న వాగ్గేయాల వంటి పాటలు బాలూ పాడగలిగి ఉండేవాడా! స్పుటమైన తెలుగు సంస్కృత తమిళ కన్నడ పదాలను ఉచ్చారణా సౌలభ్యంతో పాడడానికి మానవ శక్తి కన్నా దేవదత్తమైన గళం ఉండాలి. అతని కంఠం నిజంగా దేవదత్తమే. ధ్వన్యనుకరణలో, గాత్రదానంలో, గాత్రపరమైన నటనలో ఇంతటి కళాకారుడు ఇంతవరకూ రాలేదు.

బాలూకి సాహిత్యమంటే అమితమైన అభిమానం. ఎక్కడెక్కడి పద్యాలో, గీతాలో అవలీలగా అతని స్మృతిపధంలోనుండి వస్తాయి. పెళ్ళినాటిప్రమాణాలు చిత్రంలో పింగళి వారు రాసిన డైలాగులన్నీ నోటికి వచ్చు. రఘురామయ్య గంధర్వగానంలోని ‘తాన్ ‘ లను అనునాసికంగా ఆ మహానుభావుడే అంటున్నాడా అన్నంతగా వినిపించగల చేవ అతని సొత్తు. డబ్బింగ్ రంగంలో అతనిని ప్రధమ పంక్తిలో నిలబెట్టింది. నిద్రలేచింది మొదలు నిద్రపోయేవరకూ నిర్ణిద్రగాత్రావధానమే అతని జీవితం.

నేను సైతం విశ్వఘోషకు తీపిగొంతుకనిచ్చి మ్రోశానూ’ అనగల మొనగాడు, చిత్రవాణిజ్యంలో తెలుగుపాట విలువ,మర్యాద కాపాడుతూ పాడుతున్నవాడు. పాటల్లోనే కాదు మాటల్లోను మంచి చమత్కారి. హాస్యం అంటే ఇష్టం, సంగీతం అంటే ప్రాణం. వెరసి అతనొక ‘హాసం’!. నటుడుగానూ రాణించాడు, వ్యాపారవేత్తగా కొన్ని సినిమాలు నిర్మించి వేలు పోగొట్టుకుని చేతులూ కాల్చుకున్నాడు. ఆ మాటకొస్తే ఘంటసాల గారి పేరు ముందు చెప్పాలి.

నేనంటే అతనికి ఉన్న ప్రేమ అభిమానం ఇతరులు చెప్పగా వినడానికి అలవాటుపడిపోయాను, కానీ సమక్షంలో ఎప్పుడూ విమర్శించడమే పనిగా పెట్టుకున్న కఠినాత్ముడు. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం! ఆత్రేయ మాటకు తిరుగేముంది!

‘చిత్రగాన కల్పవృక్షానికి ఫలపుష్పభరితమైన కొమ్మలెన్నో! బాల రసాలసాల అభినవ ఘంతసాల బాలసుబ్రహ్మణ్యం ఒక పుంస్కోకిల! ఏ కొమ్మనించి పాడినా ఈ కోకిల గానం మధురమే, స్వరాయురస్తు అని దీవించాల్సింది రసజ్ఞ లోకమే…!

వేటూరి గారు వ్రాసిన ‘కొమ్మకొమ్మకోసన్నాయి ‘ పుస్తకం లోని ఈ వ్యాసం ప్రచురించుకునేందుకు అనుమతిచ్చిన ‘వేటూరి రవిప్రకాష్’ గారికి కృత్జతలతో వేటూరి.ఇన్ టీం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.