వెలుతురు పిట్టల వేణుగానం!

అంతగా తెలియని వేటూరి పాటల్లో అందమైన పాటలు చాలా ఉన్నాయి. అలాంటి పాటని మొన్నా మధ్య మిత్రుడు “కిషోర్ పెపర్తి” పంపించాడు. “రాజేశ్వరి కళ్యాణం” చిత్రంలో వేటూరి రాసిన అందమైన పాటిది. ప్రేమలో పడ్డ ఒక యువజంట  ప్రణయానుభూతిని కవిత్వంతో, తెలుగుదనంతో, సుందరమైన శృంగార గేయంగా మలిచారు వేటూరి. నేనూ కిషోర్ దాదాపు  రెండు గంటలకు పైగా ఈ పాట గురించి చర్చించుకున్నాం. ఆ చర్చలోని కొన్ని సంగతులతో ఈ వ్యాసం! 

కీరవాణి సంగీతం అందించిన ఈ పాట బాణీ వినగానే ఎక్కడో విన్నట్టు అనిపించింది. ఇళయరాజా చేసిన “చిలకమ్మా చిటికేయమ్మా” (దళపతి) పాట ప్రభావం ఉందని కిషోర్ అన్నాడు. కావొచ్చు. అయితే పాట ట్యూన్ గొప్పగా ఏమీ లేకున్నా వినదగ్గ బాణీనే. ముందు ట్యూన్ చేసి తర్వాత సాహిత్యం రాసినది అనిపించింది నడక చూస్తే. బాలూ, చిత్ర చక్కగా ఆలపించిన ఈ పాటలో అక్కడక్కడా కొన్ని పదాలు సరిగ్గా వినిపించట్లేదు. పూర్తి సాహిత్యం ఇది:   

సంగీతం: కీరవాణి 
సాహిత్యం: వేటూరి
గానం: బాలు, చిత్ర 
చిత్రం: రాజేశ్వరి కళ్యాణం 

పల్లవి: 

అతడు: నింగి నేల పొద్దుల్లో  నీకు నాకు ముద్దంట
ఆమె:  కొండ కోన సందుల్లో పండేనంట గోరింట
అతడు: వెలుతురు పిట్టలు వేణువులూదిన వేళ
ఆమె: ఊపిరి గోపిక ఊయలలూగిన వేళ
అతడు: ఏలేలో… ఎదమీద ఎదబెట్టుకోనా? 
ఆమె: ఎన్నెన్నో … పొదరిళ్లు నేనల్లనా! 

|| నింగి నేల పొద్దుల్లో నీకు నాకు ముద్దంట
కొండ కోన సందుల్లో పండేనంట గోరింట || 

చరణం 1:

అతడు: కనులలో నీ పాప నేనల్లె చిటికెలేసిన వేళ
ఆమె:  కలుసుకో ఈ రేయి గాలులతో కబురు చేసిన వాడా
అతడు: చిలిపిరి చిచ్చుల సీతంగి
ఆమె:  గుండెల్లో  అగ్గేస్తే
అతడు: తపనలు తీరక  వేసంగి
ఆమె:  పొదలే మరిగె
అతడు: సందెలు  కందిన  చీకట్లో
ఆమె:  బుగ్గమ్మే మొగ్గేస్తే
అతడు: ఎర్రగ వలపె పండాల
ఆమె:  నీ జంటలో!
అతడు: ఓలమ్మో! శకునాలు చలి మంటలాయె
ఆమె:  ఓరయ్యో!  పరువాలు జడగంటలై 

|| నింగి నేల పొద్దుల్లో నీకు నాకు ముద్దంట
కొండ కోన సందుల్లో పండేనంట గోరింట || 

చరణం 2:

ఆమె:  చిలిపిగా శ్రీదేవి జాబిల్లి  జలదరించిన వేళ
అతడు: మసకలో నీ మల్లె పువ్వుల్లో మనసు రేగిన వేళ
ఆమె:  పిచ్చుక గూళ్ళకు మొగ్గేసే (ముగ్గేసే?) నవ్వుల్తో నువ్వొస్తే
వాకిలి తీసిన వయ్యారం ఒడితో (?) పిలిచె
అతడు: మామిడి పిందెలు మాటాడె మువ్వల్తో నువ్వొస్తే
కోయిల నెమలై ఆటాడే నీ నీడలో!
ఆమె:  ఓరయ్యో!  పెదవెత్తి  పెదవంటు కోనా?
అతడు: ఓలమ్మో!  ఎదురొచ్చి ఇక వెళ్ళకు!

|| నింగి నేల పొద్దుల్లో నీకు నాకు ముద్దంట
కొండ కోన సందుల్లో పండేనంట గోరింట || 

నాకు నచ్చిన కొన్ని ప్రయోగాలు – 

  1. “వెలుతురు పిట్టలు వేణువులూదిన వేళ”,  “ఊపిరి గోపిక ఊయలలూగిన వేళ” – ఇవి ప్రేమికుల స్థితిని అందంగా పట్టి చూపించే ప్రయోగాలు. ఉదయపు వెలుగు రేఖలను  “వెలుతురు పిట్టలు” గా దర్శించడం, అవి వేణువూదుతున్నాయడం అందమైన ఊహ. ప్రేమలో పడ్డవాడికి లోకం ఇలాగే కనిపిస్తుంది మరి! అలాగే నిన్నటి వరకు మామూలుగా ఉన్న అమ్మాయి ఊపిరి ఇప్పుడు గోపికై ఆ వేణుగానానికి ఊయలూగుతోంది అనడం అద్భుతంగా ఉంది!  
  2. శకునాలు చలి మంటలాయె, పరువాలు జడగంటలై –  ప్రియురాలి తలపుల చలిలో చిక్కిన అబ్బాయికి కనిపించే శుభ శకునాలే వెచ్చదనాన్ని ఇచ్చే చలిమంటలు అట!  ఆ ప్రియురాలి పరువం ఊగే జడగంట అయ్యిందట! చాలా అందమైన ఊహలు ఇవి. 
  3. చిలిపిగా శ్రీదేవి జాబిల్లి  జలదరించిన వేళ – “శ్రీదేవి జాబిల్లి” అంటూ జాబిల్లిని పెళ్లికి సిద్ధమవుతున్న కన్యగా చేసిన భావన గొప్పగా ఉంది. ఆ జాబిల్లికి కలిగిన జలదరింత “చిలిపిగా” జరిగింది కనుక అది పులకింత అనుకోవాలి. ప్రేమలో పడ్డ అమ్మాయికి జాబిల్లి వెన్నెల్లో పులకిస్తున్నట్టు కనిపిస్తోంది. అలాగే ఆ అమ్మాయి కూడా పులకిస్తున్న జాబిల్లే!    
  4. మామిడి పిందెలు మాటాడె మువ్వల్తో నువ్వొస్తే, కోయిల నెమలై ఆటాడే నీ నీడలో – ఈ లైను నాకు ముందు అర్థం కాలేదు. ఆయితే స్త్రీలు ధరించే గజ్జెలు ఉన్న పట్టీలను “మువ్వలు” అనుకుంటే వాటిల్లో మావిడి పిందెలు డిజైన్ ఉన్న పట్టీలు గతంలో తెలుగింట కనిపించేవి (ఉదాహరణకి ఇక్కడ చూడండి). వీటిని ప్రస్తావించి ఉండొచ్చు అని కిషోర్ అన్నాడు. నాకు అదే అనిపిస్తోంది. ఆ చిరు మువ్వల శబ్దం చేస్తూ ఆమె నడిచొస్తూ ఉంటే మావిడి పిందెలు మాట్లాడినట్టు ఉందిట. కోయిల కూడా కనిపించే మావిడి చెట్లను వదిలి నెమలై ఆమె వెంట ఆడిందట! ఎంత రమణీయమైన ఊహ! 
  5. పెదవెత్తి పెదవంటుకోనా –  “నా ప్రేమని నీకు చెప్పి నిన్ను అల్లుకోనా” అన్న భావాన్ని అందంగా పలికించారు ఇక్కడ.  పెదవి విప్పడం అన్న దానికి “పెదవెత్తి” అనడం నేను ఎప్పుడూ విన్నట్టు గుర్తులేదు (పెదవి విప్పడం తెలుసు). “పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా” అన్న వాక్యం  అన్నమయ్య పాటలో కనిపిస్తోంది. ఇలాంటి ఒకప్పటి వాడుక పదాలు, మరుగున పడిన పదాలు సినిమా పాటల్లోకి తేవడం వేటూరికే చెల్లింది! 

అర్థం కానివి కొన్ని – 

  1. చిలిపిరి చిచ్చుల సీతంగి – “చిలిపిరి” అన్న పదం దొరకట్లేదు నిఘంటువులో. బహుశా ఇది “చిలిపిగా చిచ్చుపెడుతున్న శీతాకాలానికి” వేటూరి చేసిన కాయినింగ్ కావొచ్చు. అలాగే శీతాకాలనికి శీతంగి/సీతంగి అని వాడడం కూడా వేటూరి చేసిన ప్రయోగమే అనుకుంటున్నాను. నిఘంటువుల్లో వేసంగి (వేసవి కాలం) ఒకటే కనిపిస్తోంది. 
  2. “పిచ్చుక గూళ్ళకు మొగ్గేసే (ముగ్గేసే?) నవ్వుల్తో నువ్వొస్తే, వాకిలి తీసిన వయ్యారం ఒడితో (?) పిలిచె” – ఈ వాక్యంలో భావం తెలుస్తూ ఉన్నా “పిచ్చుక గూళ్లు” తో వేటూరి చెప్పాలనుకున్నది ఏమిటో తెలియలేదు. ఇది దేనికైనా ప్రతీకా లేక ఏదైనా తెలుగు వాడుకా అన్నది ఎవరైనా తెలిస్తే చెప్పగలరు. ఈ వాక్యంలో సాహిత్యం కూడా కొంత సరిగ్గా వినిపించట్లేదు ట్యూన్ లో.  

మొత్తంగా చూస్తే విని ఆస్వాదించదగ్గ అందమైన పాట! నిజానికి ఈ ట్యూన్ కి, సినిమా సన్నివేశానికి ఇన్ని ప్రయోగాలతో నిండిన భావుకత అవసరం లేదనిపిస్తుంది. ఏదో మాములు పాట రాసేసి ఉండొచ్చు.  ఇదే వేటూరి వంటి కవులు మన తెలుగు సినిమా పాటలకు చేసిన ఉపకారం. అందుకు వేటూరికి ప్రణామాలు అర్పించక తప్పదు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top