పాటకు పట్టాభిషేకం
మనసంతా తెలియని ఏదో బాధ..
పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కరే శెలవు తీసుకుంటున్నారు..
ఇంకా సాహిత్యలేమి, సంగీతలేమితో మనవంటి అభిరుచి కలిగిన సంగీత, సాహిత్యప్రేమికులందరూ బాధపడాలేమొ అన్న ఫీలింగ్..
ఇంతకాలం నామనసుకు నచ్చిన పాటలు ఒకటికి పదిసార్లు వింటూ ఆతృష్ణను తీర్చుకుంటూ వచ్చాను…
ఇప్పుడు FB ద్వారా మీ అందరి స్పందన చూస్తుంటే నాలాగా ఎందరో ఇలాంటి పాటల్ని ప్రేమించే ఆరాధకులు వున్నారనే నమ్మకం మరింత బలపడీంది..
ఇలా నా జ్ఞాపకాల్లో దాచుకున్న మరోపాట..హుషారైన పాట…
మీకోసం మీతో పంచుకొంటున్నాను..
మొత్తం పచ్చని ప్రకృతిలో అద్భుతంగా చిత్రీకరించారు.
“అల్లరిబావ” సినిమా..
మధువనిలో రాధికవో..
మధువొలికే గీతికవో…
వేటూరి సాహిత్యం..
ఎంత గొప్పగా రాసారో
సినిమాలో చూస్తే గుంపులో గోవిందా…
పాటగా ప్రత్యేకంగా వింటే ఈ పాట తేనెలో ముంచి తీసిన చక్రకేళియే.. ఆ తియ్యదనాన్ని అద్దింది సుశీలమ్మ బాలు గళ విన్యాసం..
సంగీతం రాజన్-నాగేంద్ర…
చెవులకే కాదు నేత్రాలకు కూడా విందే..
జయప్రద అందమే అందం.. నిఖార్సయిన సహజసౌందర్యం..ప్లాస్టిక్ సర్జరీలు ఎరుగని పుత్తడిబొమ్మ.సౌందర్యరాశి…
కృష్ణగారి గురించి చెప్పేదేముంది..
అందరికన్నులు నామీద అన్నట్టు మన చూపులను మరల్చుకోనివ్వని జయప్రదను చూసిన తర్వాత ఇంకేమి పట్టవు సినిమా అయితే..ఆడవాళ్ళని కూడా బంధించేస్తుంది..
తెల్లచీరెలో అయితే అప్పుడే తెలిమంచులో తడిసిన తెల్లగులాబీయే..
ఆవిడ సౌందర్యానికి సత్యజిత్ రే ఇచ్చిన కాంప్లమెంట్ చాలు.
జయప్రదలాంటి అందగత్తె నభూతో నభవిష్యతి అన్నారు..ఏంటి జయప్రదను తెగ పొగుడ్తోంది అనుకుంటున్నారా.. లేదండి అక్షరసత్యం. కావాలంటే మీరూ గమనించండి…
పాటలో ఆవిడ లిప్ మూమెంట్స్, ఆవిడ క్లోజప్స్.కెమెరాకి అద్భుతమైన ఫేస్ ఆవిడది..నేనూ Screen Person నే కాబట్టి ఇవన్నీ బాగా గమనిస్తాను..
ఇక్కడ పాట ఒక్కటే, కనుక టోటల్ గా పాట గురించి మాట్లాడుకుందాం..
సాహిత్య పరంగా వేటూరి రాసిన ప్రతి పదం కర్పూరపు విడియమే…ఒక మామూలు ప్రణయగీతాన్ని ఎంత చక్కగా కప్పురంపు విడియంలా ఎంత సొబగుతో నింపాడో…
“మధురం ఈ జీవనం
మధురం ఈ జవ్వనం
మనోహరం మనోహరం”
యవ్వనానికి వికృతి జవ్వనం…ఇక్కడ ఎందుకు వాడాడు అని ఆలోచిస్తే
జీవనం-జవ్వనం సరిపోతుంది..
కార్తీకాన కళలే చిలికి వెలిగే జాబిలి…
కార్తీక చంద్రుడిలో చల్లదనం,ఆకళా ప్రత్యేకం.
సామాన్యంగా చంద్రుడు పూర్ణుడై ఏనక్షత్రంలో వుంటాడో ఆ మాసానికి ఆనక్షత్రం పేరు వస్తుంది.. కృత్తికా నక్షత్రంలో పరిపూర్ణంగా సంచరిస్తాడు కనుకే కార్తీక మాసానికి అంత ప్రాధాన్యత..
అలా తన ప్రేయసిని పోలుస్తూ…
ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడీ జాబిలి
ఒక మల్లె చాలు తెల్లదనానికి,స్వచ్ఛతకు..ఇంక మల్లెలపొద అంటే…అతని మనసు ఎంత స్వచ్ఛమైందో అంచనా వేసుకోవటమే…
ఆమెని జాబిల్లితో పోలిస్తే హీరోని సూర్యుడితో పోలుస్తుంది ఈమె.
నీలాకాశ వీధుల్లోన వెలిగే సూర్యుడూ.. వెతలే మాసిన కధలో వెలిగెను నేడీ సూర్యుడూ..
మబ్బులు వీడిన సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో..అలా కష్టాలన్నీ తీరిపోయిన హీరో కూడా అలా వున్నాడని భావం
తొలి తొలీ వలపులే.. తొలకరీ మెరుపులై.. విరిసే వేళలో.. హేలలో.. డోలలో…
ఎంత అద్భుతమైన పదాల మేళవింపో..
పాటలో భాషా,భావం కలిసి ప్రేయసీప్రియుల్లా ప్రయాణిస్తుంటే సంగీతబాణీ కృష్ణవేణీ లా ప్రవహించి మనసులను ఆనంద తరంగాలలో ఓలలాడిస్తుంది..
” బృందావనికి మురళీధరుడు ఒకడే కృష్ణుడు“అంటుంది హీరోయిన్…
మనసే అందాల బృందావనం కదా..
ప్రేమ భావనలో ఎడారిలో వున్నా మనసు అందాల బృందావనమే కదూ..
ఆ స్థాయిలో ఆలోచించగలగటం ఒక వరం..
ఎదిగిన బాలిక ఎదగల గోపికకతడే దేవుడు
ఎంత గొప్ప భావన..
వయసుకు వచ్చి ఎదిగిన మనసుతో ఆలోచిస్తే అతనే దేవుడు..
ఓహ్.. ఎంత చక్కని వ్యక్తీకరణ..
బృందావనికి అన్నచోట సుశీలమ్మ బృందావన సౌందర్యమంతా ఆవిడ గళంలో ఒలకబోసింది…
ఇక హీరో…
మధురాపురికి యమునా నదికి ఒకటే రాధికా.. మరువైపోయిన మనసున వెలసెను నేడీ దేవతా అంటాడు…
మధురకు గానీ యమునకు గానీ రాధ ఒక్కతే…రాధాకృష్ణుల అనుబంధం ఆత్మా పరమాత్మల అనుబంధం.. అలాగే మనదీ అంటూ…
మరువైపోయిన మనసున వెలసెను నేడీ దేవత
మరువై పోవటం అంటే తెలుసా…
నిర్జలం అంటే నీళ్ళుకూడా దొరకని ఎడారిలాంటి నా మనసులో ఏకంగా గుడిని చేసి వెలసింది ఈ దేవత…అని..
ఎంత వున్నత స్థానం..
ఒక ఆడామగా మధ్య అనుబంధానికి ఎంత వున్నతమైన భావన..
Really వేటూరి గారు మీకు శత సహస్రవందనాలు…
వెలుగులా వీణలే.. పలికెనూ జాణలో.. అదియే రాగమో.. భావమో..బంధమో
ఇది ఒక గొప్ప పాటగా భావిస్తే…
వేటూరి సాహిత్యం,రాజన్ నాగేంద్ర ల స్వరసంగమం,సుశీలమ్మ, బాలుల గళం త్రివేణీ సంగమంలా కలిసిపోయి తేనెధారలను వర్షిస్తాయి…
ఇటువంటి పాట వేటూరి మాత్రమే రాయగలడు అనే స్థాయిలో ఎన్నో మంచి పాటలను రాసి తెలుగు పాటకు కావ్యగౌరవాన్ని కల్పించిన ఆయన్ని ఆధునిక శ్రీనాధుడు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదేమో…అన్న భావన నాకు.
సినీగీతాసారాన్ని బోధించిన సుందర రాముడు అనుభవాల పల్లకిలో దాచిన అనుభూతులకు అక్షరరమ్యతను అలది ప్రేక్షకుల మీదకు అక్షర సుమశరాలను సంధించిన చమత్కారుడు…
ఆ అక్షరసుమశరాలను స్వరపారిజాతాల పరిమళలతో అదే స్థాయిలో గుబాళింపుతో మన మనసులను దోచేసిన జంట రాజన్ నాగేంద్ర లు…
ఈ పాటకు మరో ముఖ్యలు వున్నారు వారే కొరియోగ్రాఫర్…
కృష్ణ జయప్రదల డాన్స్ అనే అనాలమో ఎంతో అద్భుతంగా కంపోజ్ చేసారు…
ఒకచోట ఇంటర్లూడ్ లో జయప్రద రాయంచలా బ్యూటిఫుల్ గా నడుస్తుంది.. అసలు పాట ప్రారంభమే ఆవిడ పరుగుతో ప్రారంభమౌతుంది..
మొత్తానికి నాకు నచ్చిన పాట…
విశ్లేషణ చాలా ఎక్కువైంది…
ఇది వేటూరి గారి గురించి రాయమని కొందరడిగారు…
అందుకని…
ఓపికతో చదివిన వారికి చదవనివారికి,నచ్చినవారికి,
నచ్చనివారికి కూడా..
❤విజయదుర్గ, దూరదర్శన్❤
విజయదుర్గ (దూరదర్శన్) గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం