“చిరంజీవి గోదావరి” (విశాలి పేరి)

తెలుగు సినిమాలలో గోదావరిని వర్ణించి మెప్పించిన పాటలు కోకొల్లలు. గోదావరి వెల్లువంటి వేటూరి సాహిత్యంలో ఎన్నో పాటలున్నా, ఎందుకో ఒక పాట మనకు తెలీకుండా మనల్ని ఆకర్షించేస్తుంది. అలా ఈ మధ్య కాలంలో విన్న పాట “చిరంజీవి గోదావరి పడమటింట పుట్టింది” . ఈ పాట “లో” గోదావరి పుట్టుక, తిరిగిన ప్రదేశాలు, చివరికి సముద్రంలో కలవడం అంతా ఒక వెల్లువగా వర్ణించారు.

“పాట చిరంజీవి గోదావరి ” అని మొదలవుతుంది. అప్పుడే పుట్టిన పాపాయిని “చిరంజీవి ” అని సంభోదించి పుట్టిన ప్రదేశం చెబుతూ, ఆ తరవాత పెళ్ళయ్యి అత్తవారింట మెట్టినప్పుడు “సౌభాగ్యవతి ” అని సంభోదించి గోదావరిని పరిపూర్ణ స్త్రీగా చూపించారు.

గోదావరి త్రయంబకంలో పుట్టి నాసిక్ నుంచి ప్రవహిస్తూ కందకూర్తి దగ్గర తెలుగు రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. మహారాష్ట్రలో గోదావరి (ఉప నదిని) మంజీరగా పిలిస్తారు. “ఆ ప్రాంతాలలో ” లావణి అనేది జనపద గాథలను తెలిపే ఛందోవిశేషం. ఇవి గ్రామీణ జీవిత గాథలను వివిధ రసాలతో ప్రకృతి సౌందర్యాన్ని వివిధ రీతులలోనూ వర్ణిస్తుంది. ఇద్దరు గాని ఒక్కరు గానీ నిలబడి పాడుతారు. మరాఠీ లావణిలో స్త్రీలు పాడడం, చేతులు త్రిప్పడం వంటి ఆంగికాభిననయం ఉంటుంది. కాని కథా విధానం ఉండదు. అటు నుంచి గోదావరి భద్రాద్రి చేరుకుంటుంది అక్కడ రామయ్య పాదాలను కడిగి, సీతమ్మని పలకరించి శబరి ఇచ్చే వాయనాలు పుచ్చుకొని బయలుదేరుతుంది.

గోదావరి నది ఒడ్డున వెలసిన పుణ్యక్షేత్రాలలో త్రయంబకేశ్వర్, నాసిక్, బాసర, కోటిలింగాల, మంథని, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం, పట్టిసం (పట్టిసీమ), మందపల్లి, కోటిపల్లి, ముక్తేశ్వరం, అంతర్వేది, అప్పన్నపల్లి, మురమళ్ళ చాలా ప్రసిద్ధి చెందినవి. అలాగే ఆ నది ఒడ్డిన ఉన్న రాజ్యాల వైభవాలు కూడా అంతే పేరు గాంచాయి.

అలాగే ఎంతో మంది కవులకు ఆలవాలము ఈ గోదావరి ఒడ్డు. ఆది కవి నన్నయ్య చేత కలం పట్టించింది ఈ గోదావరి నీళ్ళే. సీసానికి మకుటమైన శ్రీనాథుడు స్కాందములోని గోదావరి కాశీఖండాలు తెలుగులోకి అనువదించాడు.

అలాగే భీమఖండంలో భీమేశ్వరాలయం గురించి చెబుతూ

వేదండవదన శుండాదండచుళికిత
ప్రోజ్ఝితాంభశ్చటా ప్లుతనభంబు
దేవగంధర్వాప్సరో వధూటీస్తన
స్థాసకశ్రీగంధధవళితంబుఁ
గనకసౌగంధికగంధోత్తమాగంధ
సారనిష్పందపుష్పంధయంబుఁ
జటులవీచీఘటాఝాటడోలారూఢ
హంససంసన్నినాదాలసంబు
భూరితీరావనీ ఘనీభూత చూత
జాతివకుళవనీ సమాచ్ఛాద్యమాన
బహుళసింధు ధునీవనబకమరాళి
దక్షపురి యొద్దసప్తగోదావరింబు

వినాయకుడు పుక్కిళించిన నీటితోనిండిన ఆకాశంగలది,దేవగంధర్వాది స్త్రీలు స్తనములపై రాసికొన్న కుంకుమాదుల పూతచేత తెల్లనైనది, బంగారు చెంగల్వల వాసనలచే చిరుపాల మొక్క, మంచిగంధపు మొక్కపైకి కదలని తుమ్మెదలు గలది, కెరటాలనే ఉయ్యెలలపై ఊగు హంసల కూతలతో కూడినది, ఒడ్డున మొలిచిన మామిడి, జాజి, వకుళ వృక్షముల తోపులచే కప్పబడిన గోదావరిలోని కొంగలు, హంసలు కలది వృద్ధగౌతమీనది… అని గోదావరిని వర్ణించాడు. శ్రీనాథుడు గోదావరీ తీరంలో నివసించాడని కూడా కొన్ని కథలు కలవు.

సంస్కృతంలో కాళీదాసు తరవాత అంత గొప్ప కవి భవభూతి. ఇతని జన్మస్థలం విదర్భ దేశంలోని పద్మాపురం. ఇది మహారాష్ట్రలో గోండియా జిల్లాలోని ఆమ్గావ్ సమీప ప్రాంతంలో గోదావరి తీరంలో ఉంది. కనోజ్ పాలకుడు యశోవర్మ ఆస్థానకవులలో ఇతడు ఒకడు. ఉత్తర రామాయణాన్ని ఇతివృత్తంగా తీసుకొని, కరుణ రసాభివ్యంజనతో ఇతను రాసిన ఉత్తర రామ చరిత్ర అనే నాటకం సంస్కృత సాహిత్యంలో అమర కృతిగా కీర్తిని పొందింది. అద్వితీయమైన ఈ నాటక రచనతో భవభూతి సంస్కృత సాహిత్యంలో కాళిదాసు తరువాత అంతటివాడుగా కీర్తి గడించాడు. గోదావరి నీళ్ళు తాగి కోనసీమ కొబ్బరాకు కూడా కవిత్వం చెబుతుందంటారు.

గోదావరిని కాళేశ్వరం మొదలగు స్థలాలలో చూస్తే ఒకలా, కోనసీమ దగ్గర చూస్తే మరొకలా అనిపిస్తుంది. అటువైపు అన్నీ అనుభవించేసి వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలా అనిపిస్తే, కోనసీమ వైపు మాత్రం పచ్చని పంటల పట్టులంగా, కొత్తనీరుతో వచ్చిన ఎర్రమట్టి ఓణీలేసిన పదహారేళ్ళ కన్నెపిల్లలా పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. ధవళేశ్వరం దగ్గర గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప అని ఏడుపాయలుగా విడిపోతుంది. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి. ఆ సప్తఋషులు తీసుకెళ్ళి అంతర్వేది నరసింహుడి సమక్షంలో కన్యాదానం చేయగా (బంగాళా ఖాతం) సముద్రుడితో సంగమిస్తుంది.
” మహారాష్ట్ర లావణీల మంజీరం కట్టి ” అన్నప్పుడు, “సప్త ఋషులు సాగనంప సాగరాన మెట్టి” అన్న చోట కలాన్ని బహుశా అమృతంలో ముంచి రాశారేమో వేటూరి అని అనిపిస్తుంది.

ఇంత చరిత్రని నాలుగు నిమిషాలలో సరళమైన భాషలో చెప్పగలిగే గొప్పకవి వేటూరిగారు. వేటూరి ఒక వాక్యం రాశారంటే అందులో ఎంతో చరిత్ర నిగూఢమై ఉంటుంది. అలతి అలతి పదాలలో ఎంతో అందంగా గోదావరి పుట్టుకని వర్ణించిన పాట ఇది. వింటున్నంత సేపు మనసు గోదావరి ప్రవాహంలా గలగల పరిగిడుతుంది . వర్ణించింది గోదావరినైనా పాట ఆద్యంతమూ ‘జహ్నుకన్యా ప్రవహాత్ ‘ గా సాగింది. ఆ సాహిత్యానికి సంగీతాన్ని అందించింది కె.వి.మహదేవన్, సంగీతానికి, సాహిత్యానికి తన గాత్రంతో ప్రాణం పోసింది బాలుగారు.

గోదావరిని పలుచోట్ల చిరంజీవి, సౌభాగ్యవతి, మా ఇంటి మహలక్ష్మి, ఇలవేల్పుగా కీర్తించారు. రెండవ చరణంలో మొదటిసారి “వెల్లువై” అన్న చోట నిజంగా రసప్రవాహ వెల్లువైనట్టుగా అంటారు బాలు గారు.

ఇంతకీ ఈ పాట “గోదావరి పొంగింది ” అనే సినిమా నుంచి, సినిమా ఆడింది మూడు రోజులే కానీ ఈ సినిమాలోని ఇంకో పాటకి నంది అవార్డ్ వచ్చింది.

పాట ఇదిగో :

చిత్రం : గోదావరి పొంగింది (1985)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు

పల్లవి :
చిరంజీవి గోదావరి పడమటింట పుట్టింది
సౌభాగ్యవతి తాను తెలుగునాట మెట్టింది
దక్షిణాది గంగగా దయతో ఉప్పొంగుతూ…
కల్యాణిగా తాను కడలిలో కలిసింది

మా ఇల్లు అత్తిల్లుగా… చల్లగా వర్ధిల్లు గోదావరి
మా ఇల్లు అత్తిల్లుగా… చల్లగా వర్ధిల్లు గోదావరి

చరణం 1 :
నాసికా త్రియంబకాన గోముఖాన పుట్టి
మహారాష్ట్ర లావణీల మంజీరం కట్టి
నాసికా త్రియంబకాన గోముఖాన పుట్టి
మహారాష్ట్ర లావణీల మంజీరం కట్టి

సీతమ్మ సిగలోనా మందారం చుట్టి…
శబరి తల్లి ఫలహారం రామయ్యకు పెట్టి
భవభూతి శ్లోకమై… శ్రీనాథుడి సీసమై

మా ఇంటి మాలక్ష్మివై తల్లివై… వర్ధిల్లు గోదావరి
మా ఇంటి మాలక్ష్మివై తల్లివై… వర్ధిల్లు గోదావరి

చరణం 2 :
చాళుక్యుల వైభవాలు జగమంతా చాటి
నన్నయ్యకు తెలుగు కవిత ఉగ్గుపాలు పట్టి
చాళుక్యుల వైభవాలు జగమంతా చాటి
నన్నయ్యకు తెలుగు కవిత ఉగ్గుపాలు పట్టి

కోనసీమ పచ్చదనం కోకలుగా చుట్టి
సప్త ఋషులు సాగనంప సాగరాన మెట్టి
రామదాసు కీర్తనై.. పంచవటి గానమై
మా పాలి ఇలవేల్పువై వెల్లువై… వర్ధిల్లు గోదావరి
మా పాలి ఇలవేల్పువై వెల్లువై… వర్ధిల్లు గోదావరి

చిరంజీవి గోదావరి పడమటింట పుట్టింది
సౌభాగ్యవతి తాను తెలుగునాట మెట్టింది
దక్షిణాది గంగగా దయతో ఉప్పొంగుతూ
కల్యాణిగా తాను కడలిలో కలిసింది
మా ఇల్లు అత్తిల్లుగా చల్లగా… వర్ధిల్లు గోదావరి
మా ఇల్లు అత్తిల్లుగా చల్లగా… వర్ధిల్లు గోదావరి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top