తెలుగు సినీ సాహితీ సామ్రాజ్యాన్ని మూడు దశాబ్దాలపాటు ఏలినవాడు, తన ఇరవై మూడేళ్ళ వయసులో ఆలపించిన నవలారాగం ఈ “జీవనరాగం”.
రఘు పేరుమోసిన సంగీత దర్శకుడు. విపరీతమైన పని ఒత్తిడితో ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. ఎట్టకేలకు డాక్టర్ల సలహా పాటిద్దామనుకుంటాడు. నగరవాతావరణానికి దూరంగా ఏదైనా పల్లెప్రాంతం వెళ్ళి కొన్ని రోజులు విశ్రాంతిగా గడిపి రావడానికి నిర్ణయించుకుంటాడు. తను అభిమానించే, తనని ఆరాధించే గాయని రాగిణి సూచన మేరకు నాగార్జునకొండకు బయలుదేరి వెళతాడు. అక్కడ కొండ మీద ఒక కుటీరం అద్దెకు తీసుకుని గడుపుతూ, ఆ ప్రకృతి సోయగాలకు ముగ్ధుడవుతుంటాడు. యాభైయేళ్ళ వయసుపైబడ్డ వెంకన్న అతనికి వంటవానిగా కుదురుతాడు. మెల్లిగా మనసుకి చాలా దగ్గరవానిగా మారతాడు. ఒకరోజు రఘు ఆ నాగార్జునకొండ అటవీప్రాంతంలో షికారు చేస్తూ దారితప్పుతాడు. వేట ముగించుకొని తమ కోనకి అటుగా వెళుతున్న ఓ సుగాలీల తెగ అతనికి తారసపడుతుంది. వారితో అతనికి పరిచయం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆ తెగ యువకుడైన రాజులు రఘూకి ఇష్టుడవుతాడు.
ఆ సుగాలీతెగ నాయకుని కోరిక మేరకు రోజూ ఆ సుగాలీల గూడేనికి వెళ్ళి సంగీతం పాడి వస్తుంటాడు రఘు. వారంతా అతని సంగీతానికి పరవశులవుతుంటారు. రోజూ అక్కడకి సాగించే రాకపోకలతో, ఆ గూడెం నాయకుని కుమార్తె రజనీ మీద రఘూకి ఆకర్షణ కలుగుతుంది. అయితే రాజులు, రజనీ ప్రేయసీప్రియులు. రఘు తన ప్రేమ విషయంలో కొద్దిగా శృతిమించడంతో, విషయం కోన నాయకుని దగ్గరకు వెళుతుంది. తెగ కట్టుబాట్ల విషయంలో కర్కశత్వాన్ని పాటించే ఆ నాయకుడు అప్పుడేం చేశాడు? ఈ కథను మలుపు తిప్పడంలో వెంకన్న పాత్ర ఏమిటి? రఘూ మీద రాగిణికి ఉన్న ఆరాధన ఫలించిందా లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ రచయిత తన అందమైన భావనలతో మనకి సమాధానమిస్తాడు.
ఈ నవల వ్రాసినాయన యువకునిగా ఉన్నప్పుడు జర్నలిజంలో చాలా మెట్లు ఎక్కినవాడు. తొలి భారతప్రధాని జవహర్‌లాల్ నెహ్రూని ఇంటర్వ్యూ చేసిన ఏకైక తెలుగు జర్నలిస్ట్‌గా పేరొందినవాడు. “అదిగో ద్వారక…ఆలమందలవిగో” అంటూ సుమారు 55 యేళ్ళ క్రితమే ఏకంగా MLAల మీద సెటైరిక్‌గా న్యూస్ ఐటమ్ వ్రాసిన ధీశాలి. సిటీన్యూస్‌కి ‘నగర సంకీర్తన’ అని, రిపోర్టర్ పేరు ‘హార్మోనిస్టు’ అనీ శీర్షికలు పెట్టి వార్తాపత్రికలో అక్షరక్రీడలాడిన చమత్కారి. 60 యేళ్ళక్రితం, ఆంధ్రపత్రికలో పిల్లలకోసం రాబిన్‌హుడ్ వంటి సీరియల్స్ రాసి తిరుమల రామచంద్ర, ముళ్ళపూడి వెంకటరమణ వంటి సాహితీశిఖరాలను ముగ్ధులను చేసిన కథకుడు. ఇక తదనంతర కాలంలో వినుతికెక్కిన ఆయన సినీ ప్రస్థానం గురించి ఇక్కడ మాట్లాడుకోవడం సబబు కాదు. సాధ్యమూ కాదు. అందుకు వేరే పుస్తకం వ్రాయాలి.ఇక ఈ నవల విషయానికి వస్తే, ఇది నవలే కానీ కవిత్వం పోకడలు పోతుంది. అలా అని పద్యాలు, కవితలు ఉండవు. ఆ నడకలోనే కవిత్వపు సొగసుంటుంది. కథా ప్రారంభమే… “పురోగమిస్తున్న కాలపురుషుడి అడుగుల చప్పుడులా గోడ గడియారం టకటక లాడుతున్నది.” అంటూ మొదలవుతుంది. ఇక అక్కడ నుండి ప్రతీ పేజీలోనూ ఏదో ఒక కవితాత్మక వర్ణన ఉంటూనే ఉంటుంది. గాలి ఎలా లోనికి వస్తుందో వర్ణిస్తూ “కిటికీలోంచి యెగబోసుకుంటున్న చల్లగాలితో రఘూ గది కడుపునింపుకుంటోంది” అంటారు. “డికాషన్‌లో పోస్తున్న పాలలాగా చీకటిలోకి తెల్లని ఉదయకాంతులు జొరబడుతున్నాయి” అనే సూర్యోదయ వర్ణన మరో భావకుసుమం. నక్షత్రాల మధ్యనున్న చందమామతో వెలిగే ఆకాశం గురించి ఆయన ఊహ కూడా ఏ కాలం వారికైనా కొత్తగానే ఉంటుంది. ఆకాశం వంక చూస్తే నీకెలా అనిపిస్తోందని రఘు రజనీని అడిగినప్పుడు… “కోలగా ఉన్న ఆ చందమామ తెల్లని పావురంలా, నక్షత్రాలు ఆ పావురం ఏరుకు తినే గింజల్లా ఉన్నాయంటుంది” ఇరవై యేళ్ళ ప్రాయం నాటికే సంగీతం మీద, భారతీయ సాహిత్యం మీద, పాశ్చాత్య సాహిత్యం మీద రచయితకు ఉన్న పట్టు, పుస్తకం చదువుతున్నంతసేపు తెలుస్తూనే ఉంటుంది. ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.
చాలాకాలం తరువాత రఘు రాగిణిలు కలుసుకున్నప్పుడు “అది వారి సంయోగంలో ‘ఆషాఢస్య ప్రథమ దివసే’ అన్నట్లున్నది” అంటారాయన. ఈ ‘ఆషాఢస్య ప్రథమ దివసే’ అన్నది కాళిదాసు మేఘదూతం లోని ఒక శ్లోకపాదం. అలాగే రాగిణి రఘూకి వ్రాసిన ఉత్తరంలో “అటు ఇటు సుషుప్తి – మధ్య సంధిజ్వరం జీవితం” అంటూ షేక్స్పియర్ ప్రస్తావన తీసుకు వస్తుంది.
‘సేలపాటున తానుసెట్లసాటున నేనుమనిషినేయని వగపుమానునైపో తలపు’ అని నండూరి వారి ఎంకినీ గుర్తుచేస్తారు మధ్యలో ఒకచోట.
చండవేగంతో, నిర్లిప్తంగా బారులుబారులుగా సాగిపోతున్న కొరివిచీమలు, వీణపై ‘ఆరభి’రాగతానం అవరోహణంలో వాయిస్తున్న వరసను స్ఫురింపజేస్తున్నవట, ‘కదనకుతూహల’ రాగ ఆరోహణక్రమంలా వేగంగా ఆమె దూరదూరాన తీరానికి వెళ్ళిపోయిందట, ఆమె తనలో ఆలపించుకుంటున్న ‘కళ్యాణి’ రాగంలో రెండు ‘దీపక’రాగ విషమ మూర్ఛనలు విసరినట్లున్నదట. ఇలా సందర్భానుసారంగా ఎన్నో రాగాల పేర్లు ఈ పుస్తకంలో అనేకచోట్ల కనపడతాయి.
కొన్నిచోట్ల రచయిత వాడిన పదబంధాలు, వాక్యాలు తదనంతర కాలంలో ఆయన రాసిన సినిమా పాటలను స్ఫురింపజేస్తాయి. పక్షులు “జిలిబిలి పలుకులు” పలకడం సితార సినిమాలో “జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన ఓ మైనా మైనా”ను గుర్తుకు తెస్తే, రజనీని చూసిన రఘు మనసు మొదట చెరువులా దబకలాడి, తరువాత సరోవరమై హసించి, చివరిగా మహా సముద్రమై ఉప్పొంగిందని వర్ణించడం… “చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ” పాటను స్ఫురింపజేస్తుంది.
ఇక పదాలతో ఆడుకోవడం ఆయనకెప్పుడూ సరదానే! ముళ్ళపొదల మధ్యలో ఉన్న రేగుచెట్ల గురించి చెబుతూ “రేగుపళ్ళు తీయనివెప్పుడూ, తీయరానివిగా ఉంటాయని” అంటారు. ఆ రేగుపళ్ళు తీయగా ఉన్నా, వాటిని ఆ ముళ్ళపొదలు దాటుకుని తీయడం కష్టమన్న భావం స్ఫురించేలా!
ఇక కథ చివరి అంకంలో, కీలకమైన పెళ్ళి ఘట్టం దగ్గర, రఘు ఆ గూడెం నాయకుడిని రాజులు చేసుకోబోయే పెళ్ళికూతురు ఎవరని అడుగుతాడు. దానికా నాయకుడు నువ్వేసూద్దువుగాని దొర అంటూ… “ఈడుముదరని సిన్నది. జోడుకుదిరిన కన్నెది. అభిమానానికి కూనపులి. అందానికి జాబిలి. పుడుతూనే ఆడిది. పున్నెంకట్టుకో దొరా – నీ సేయి మంచిది” అంటాడు.
ఇలా ఈ నవలలో ఉన్న కవిత్వపు సొగసుని చెప్పుకుంటూ వెళితే పుస్తకం మొత్తం మళ్ళీ తిరగ రాసినట్టుంటుంది. అందుకే ఇప్పటికి ఇక చాలిస్తున్నాను. వేటూరి సుందరరామమూర్తి గారికి అలవాటు ప్రకారంగా నమస్కరిస్తున్నాను. స్వస్తి!
— రాజన్ పి.టి.ఎస్.కె