సిరికాకొలను చిన్నది-రాజన్ పి.టి.ఎస్.కె

కవులకు కొదవ లేని సీమ మనది. ప్రభువుల కొలువుల లోను, ప్రజల మనసులలోనూ వారి ప్రాభవానికీ లోటులేదిక్కడ.

“ఎదురైనచో దన మదకరీంద్రము డిగ్గి

కే లూత యొసగి యెక్కించుకొనియె

మనుచరిత్రం బందుకొనువేళ బుర మేగ

బల్లకి తనకేల బట్టియెత్తె

బిరుదైన కవిగండ పెండేరమున కీవె

తగుదని తానె పాదమున దొడిగె…” అంటూ ఆంధ్ర కవితా పితామహుడు తన ప్రభువైన రాయలు దివికేగినప్పుడు విలపించిన తీరులోనే మన కవులు ఎంతటి ఘనసత్కారాలు అందుకున్నారో తెలుస్తోంది. కవిత్రయం, అష్ట దిగ్గజ కవులు, శ్రీనాథుడు, పోతన ఇలా ఎందరో ప్రాచీన కవుల కావ్యాలు నేటికీ ఠీవీగా నిలబడి ఉన్నాయి. మనతో ప్రదక్షణ నమస్కారాలు చేయించుకుంటున్నాయి. అయితే, “ఘనత అంతా గతానిదే” అని చెప్పుకునే స్థితి ఎప్పుడూ తెలుగుజాతికి పట్టలేదు. విశ్వనాథ, జాషువా, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, దాశరథి, కరుణశ్రీ, ఆరుద్ర, నారాయణరెడ్డి ఇలా కవి పరంపర కొనసాగుతూనే వచ్చింది. వీరితో పాటూ సినిమా సాహిత్యాన్ని అందలం ఎక్కించిన మల్లాది, సముద్రాల, పింగళి, ఆత్రేయ, కొసరాజు వంటి కవులు కూడా తెలుగుగడ్డకు దొరికారు.  ఆనాడే కాదు, ఈనాటికీ ఏ ప్రక్రియలోనైనా ఉత్తమ స్థాయి కవిత్వాన్ని అందించగల కవులకు ఇక్కడ లోటు లేదు. కానీ అప్పుడున్నన్ని సరైన అవకాశాలు ఇప్పుడు లేవంతే. 

ఈ అవకాశాల కలిమి దశకూ, అవకాశాల లేమి దశకూ సంధికాలంలో కవిపుంగవుడొకడు పుట్టుకొచ్చాడు. ఈ పురుషుల్లోని పుంగవుడు పులకింతొస్తే ఆగేరకం కాదు. కవితా ధనువు పట్టుకుని విజృంభిస్తుంటాడు. పాటల శర సంధానం చేస్తుంటాడు. జన హృదయాలను ఛేదించి రసానందాన్ని ఉప్పొంగిస్తుంటాడు.  ఇదంతా సుమారు పదేళ్ళ క్రితం మాట. ఇప్పుడా ధనుర్ధారి లేడు. కానీ ఆయన సంధించిన బాణాలు మాత్రం లక్షలాది తెలుగువాళ్ళ హృదయాలలో దిగబడిపోయే ఉన్నాయి. అటువంటి వారిలో నేనూ ఒకడిని. చిన్నతేడా ఎక్కడంటే… ఆయన నన్ను అర్జునుడు భీష్ముడిని కొట్టినట్టు కొట్టాడు. ఆ కవితాశర సంధానకర్త, తెలుగు సినీసాహితీప్రియ హృదయహర్త అయిన శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారికి నమస్కరిస్తూ, ఆయన కవితాస్త్రాలలో ఒకటైన “సిరికాకొలను చిన్నది” సంగీత రూపకం ప్రయోగ ఉపసంహారాల కోసం తెలుసుకుందాం.

కృష్ణదేవరాయలు ఉత్తరాపథ జైత్రయాత్రకు వెళుతూ మార్గమధ్యంలో శ్రీకాకుళేశ్వరుడిని దర్శించుకుంటాడు. ఆ సమయంలో ఆయనతో పాటు పెద్దన గారు కూడా ఉంటారు. ఆ గుడి మంటపంలో గజ్జెపూజ చేసి నాట్యం చేయబోతున్న అలివేణిని చూస్తారు ప్రభువుల వారు. ఆమె భక్తి తత్పరతకు మెచ్చుకొని, ఆమె కోరుకున్న విధంగా దేవదాసిత్వాన్ని విధిస్తారు. దానితో అలివేణి శ్రీకాకుళేశ్వర స్వామికి చెలిగా మారిపోతుంది. అనుకోని ఈ పరిణామంతో తన కూతురుని వేశ్యశిఖామణిగా మార్చాలనుకున్న రంగాజీ హతాశురాలవుతుంది. అక్కడనుండి సంఘర్షణ మొదలవుతుంది. కృష్ణుని పాట విన్నా, విగ్రహం చూసినా తదాత్మ్యంలో మునిగిపోయే పరమ భక్తురాలు అలివేణి. రంగాజీ ప్రేరణతో మండలాధీశుడైన మార్తాండవర్మ కృష్ణునిగా వేషం వేసుకుని వచ్చి అలివేణితో కూడుతాడు. కొంతకాలానికి ఆమె నెలతప్పుతుంది. ఈలోగా కళింగ జైత్రయాత్ర ముగించుకొని విజయనగరం వేంచేస్తారు రాయల వారు. విజయోత్సవాలలో భాగంగా అలివేణి నాట్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేయిస్తారు. అలివేణి నాట్యం మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతుంది. రాజవైద్యుడు పరీక్షించి ఆమె గర్భవతి అని చెబుతాడు. రాయలు ఆగ్రహోదగ్రుడవుతాడు. న్యాయవిచారణ అనంతరం రాయలు చెప్పిన తీర్పుతో కథ పూర్తవుతుంది.

ఈ కథ వేటూరి గారి హృదయంలో ఎప్పటి నుండో తిష్ట వేసుకుని ఉంది. దానికి అక్షర రూపం ఇచ్చింది మాత్రం 1969 ప్రాంతంలో. ఆకాశవాణి పత్రిక “వాణి”లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల ప్రకటన చూసి బాలాంత్రపు రజనీకాంతరావుగారిని కలిశారట వేటూరి గారు. ఆయననేమో ఈ ఉద్యోగాలు నీకెందుకయ్యా మంచి సంగీత నాటిక రాసివ్వు ప్రసారం చేద్దాం అంటూ భుజం తట్టారట. ఆయన ప్రోత్సాహంతో తన మనసులో గజ్జెకట్టి నర్తిస్తూ ఉన్న “సిరికాకొలను చిన్నది” సంగీత రూపకానికి అక్షర రూపం ఇచ్చారు వేటూరి గారు. ఆ స్క్రిప్టు చదివిన ప్రసిద్ధ సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు గారు తానే సంగీతం చేస్తానన్నారట. రేడియో రూపకం కాబట్టి రజనీకాంతరావు గారి సూచన మేరకు నిడివి కొంత తగ్గించారు వేటూరి గారు. అది ఒకటిన్నర గంటకు వచ్చింది. అప్పట్లో ఆకాశవాణిలో రూపకాల నిడివి గంటకు మించి ఉండేది కాదుట. కానీ ఈ రూపకం కోసం ప్రత్యేక అనుమతి తీసుకుని గంటన్నర పాటు ప్రసారం చేసేలా చేశారు రజనీకాంతరావు గారు. మహాగాయని శ్రీరంగం గోపాలరత్నం గారు కథానాయిక అలివేణి పాత్ర పోషించారు. 

“సిరులు గల్గు తెలుగుతల్లి

కురులులోన మరుమల్లియ

విరిసినట్లు వరలు కదా

సిరికాకొలనను పల్లియ” అంటూ సూత్రధారుడి గాత్రధారణతో మొదలవుతుంది ప్రథమాంకం. 

ఇంకా ఆ శ్రీకాకుళక్షేత్రం ఎంత గొప్పదో చెబుతూ…

“ఆ పురమ్ము ఒక్క నాడు

అమరావతి అవని డిగ్గి

అమరిన పురమనిపించెను

అమరపురమ్మునె మించెను” అంటాడు.

రూపకం నిండా ఉన్న సంభాషణలలోను, పాటలలోను ప్రాసలతోనూ, అలంకారాలతోనూ ఆటలాడుకుంటారు వేటూరి. 

“ఈ వెలది వెలదేనన్న మాట” అని విటుడైన శర్మ శ్లేషగా అంటే… “వెలదో, కోవెలదో – కొంచెం తమాయించుకో” అంటాడు మరొక విటుడైన మల్లినాథుడు.

అలాగే ఇంకొక చోట అలివేణిని చూసి… 

“ఎవ్వతె యిది సొగసన్నది

పువ్వు పూచినట్లున్నది

ఈ కన్నియ మా కన్నుల

రేకు విరిసి పోతున్నది” అంటూ ఒక విటుడు పాడుతుంటే…

“అదిగో చూడుము ఆయమ

అందమ్ముల చందమామ” అంటూ మరొక విటుడు అందుకుంటాడు. 

అలివేణి “ఏమని పిలువను ఎంతని కొలువను” అనే పాటలో 

”కరమరుదా కనికరమరుదా

కరివరద కావగ నన్ను వరమరుదా” అంటూ భగవంతునికి తనపై కరుణ ఉప్పొంగేలా పాడుతూ ప్రశ్నిస్తుంది. 

కృష్ణదేవరాయలు అలివేణి కోరిక మీద ఆమెకు దేవదాసిత్వం విధించి అక్కడ నుండి జైత్రయాత్ర వెళ్ళిన తరువాత, సూత్రధారుడు…

“వల్లెయన్నది చినసాని

ఒల్లనన్నది ముదిసాని” అంటూ ఒక గీతం పాడతాడు. అందులో…

వల్లెయన్న చిన్నది వయసు ముడుపు గట్టినది

వంచిన స్మరధనువువోలె వంగి వెన్ను కెరగినది” అంటూ అలివేణిని వర్ణిస్తాడు. 

ఆ తరువాత అలివేణి…

“చినదానరా వలచినదానరా

చనవున రారా నా సరసకు దొరా” అంటూ స్వామిని ఆరాధిస్తుంది.

“బిగువేల సందిట బిగువుండగా – చిరు

నగవుండ ఎనలేని వగలుండగా”  అంటూ స్వామి దగ్గర గారాలు పోతుంది.

అలివేణిని దేవదాసిగా పొందిన శ్రీకాకుళేశ్వరస్వామి కోసం మాట్లాడుకుంటూ “గుళ్ళోంచి ఉన్నట్టుండి ఒళ్ళో వచ్చిపడ్డాడు” అంటూ నిష్ఠూరాలాడతారు శర్మ, మల్లినాథులు.

అలివేణి పొద్దున్నే గుడికి వెళ్ళిందని తెలుసుకున్న రంగాజమ్మ కోపంతో చంచలతో…

“చుక్కలు మింట పడితేనే తప్ప చక్కని చుక్కలు కంటపడవచ్చునా”

“పడుచుదానికీ, పగటిపూటకీ బద్ధవైరమంటారు కదా!”

అంటూ పడుచు సూక్తులు చెబుతుంది.

ఒక పక్క శృంగార రసం, కరుణ రసం కురిపిస్తూనే మధ్యలో వేదాంతం కూడా జొప్పిస్తారు వేటూరి.

“విగ్రహం విష్ణుమూర్తి అవుతుందటే?” అని చంచల అంటే… మనం మాత్రం విగ్రహాలం కామా చంచలా అని తిరిగి ప్రశ్నిస్తుంది అలివేణి. “మూడునాళ్ళ ముచ్చటగా ఆడి పడిపోయే ఈ రాతిబొమ్మల కన్నా రాతివిగ్రహం రమణీయమే కదా” అంటుంది.

అలివేణీ, జలజల సంభాషణలో వచ్చే… “నందకిశోరుడు నల్లనివాడు ఎందుకైనాడే ఇందుముఖి ఎందుకైనాడే” అనే గీతం కూడా చాలా అందంగా ఉంటుంది.

“వెన్నలదొంగ కన్నెలదొరగా ఎందుకైనాడే ఇందుముఖీ” అని జలజ ప్రశ్నిస్తే…

“కన్నె మనసు వెన్న వంటిది, కనుక అయినాడే” అని అలివేణి సమాధానమిస్తుంది.

ఇంకొక చోట చంచల “రాయి ఎక్కడైనా రాయడౌతుందా?” అని వెటకారంగా ప్రశ్నిస్తే…

“రాయి కాడే తల్లి రాయడేనే చెల్లి

రాక మానడు జాబిల్లి – చీకటులు

పోకమానవు చూడు మళ్ళీ” అంటూ ఒక మధురమైన గీతంతో ప్రత్యుత్తరమిస్తుంది.

ఇంకా.. 

“ఎదురు తెన్నులు కాసి, 

వెదురుకూపిరి పోసి 

కదలివస్తాడమ్మ తల్లీ” అంటుంది. 

“వలచి వస్తాడమ్మ తల్లీ, 

వలపులే కొలిచి పోస్తాడమ్మ చెల్లీ” అని ముక్తాయింపునిస్తుంది.

తృతీయాంకం… 

“అందగాడు నందబాలుడెందున్నాడే

సందెకాడ వస్తానన్న చందమామ ఏడే” అంటూ గోపిక వేషంలో ఉన్న సరస పాడే గీతంతో మొదలవుతుంది.

జలజ కృష్ణుడుగా, ఇంకొక ఇద్దరు చెలికత్తెలు గోపికలుగా, అలివేణి అలివేణిగానే వేసే కృష్ణలీలలు యక్షగానమిది.

“కాకుళమంతా గోకులమైనా

కదలి రాని ఆ కథయేమే” అని ఒక గోపిక పాడితే…

“సన్నజాజి పూజ – కనుసన్న జాజి పూజ” అంటూ మరో గోపిక అందుకుంటుంది. చివరిలో…

“గోకులాన గొల్లడై

కాకుళాన వల్లభుడై

కదిలీ కదలించి కథలు నడిపెనక్కడా

కదలక మెదలక తానే కథయైనా డిక్కడ” అని అందరు గోపికలూ కలిసి పాడతారు.

కథాక్రమంలో… “తొలివలపు పిలుపులన్నీ పెనుశిలకు పూజలేనా?” అంటూ శ్రీకాకుళేశ్వరుడు అలివేణికి కలలో కనిపించి ఆమె యవ్వనాన్ని రాళ్ళపాలు చేసుకోవద్దని ప్రాధేయపడతాడు. ఆ మాటలకు కలత చెందిన అలివేణి స్వామికి మోహినీ అవతార ఘట్టాన్ని గుర్తు చేస్తూ… 

“అమృతభాండమే అందుకొంటివే

అభాండములకా ఇంత కలగితివి

గోవర్ధన గిరిధారీ శౌరీ” అంటూ అనునయిస్తూ పాడుతుంది.

తనకు వచ్చిన కల గురించి రంగాజీ, చంచలా అపహాస్యం చేస్తున్నప్పుడు, అలివేణి…

“కదిలే శిలలకు తెలుసా

కదలని శిలలోని మనసు

చెదిరే కనులకు తెలుసా

చెదరని కలలోని సొగసు

వదిరే పెదవికి తెలుసా

మది పాడిన మధురగీతము” అంటూ ఆలాపన చేస్తుంది.

అలివేణికి దేవదాసీత్వం కొరకు ఇవ్వవలసిన పొలాల అప్పగింతకు మునిమాపువేళ రమ్మని రంగాజీకి కబురుపెడతాడు మండలాధీశుడైన మార్తాండ శర్మ. 

“మసకలో మంతనాలు ఎందుకంటావ్?” అని చంచలతో ఆశ్చర్యంగా అంటుంది రంగాజీ. ఇంకెందుకూ…. పొంతనానికే అని కిలకిలా నవ్వుతుంది చంచల.

మాయోపాయంతోనైనా ఆ మండలాధీశుడి చెంతకు అలివేణిని చేర్చాలని ఆలోచన చేస్తుంది రంగాజీ.

“మండలాధీశులు మన్మథ పురాగ్రహారీకులని విన్నాను.”, “కమ్మ కస్తూరి కాముడి దస్తూరి” వంటి చమక్కులు మాట్లాడుతుంది. 

మండలాధీశుని దగ్గరకు వెళ్ళి ఆ రాత్రివేళ కృష్ణుని వేషంలో తమ ఇంటికి వచ్చి అలివేణిని కలవమంటుంది రంగాజీ.

అక్కడ అలివేణి బాలకృష్ణుని బొమ్మను పట్టుకుని 

“పామునైనా కాకపోతిని పాన్పు నీ కమరింపగ

గోవునైనా కాకపోతిని కొసరి ఆకలి తీర్చగ

వేణువైనా కాకపోతిని ప్రాణగానము సేయగ

నెత్తినైనా చేరనైతిని నెమలి కన్నుల చూడగ”

అంటూ పాడుకుంటుంటుంది. ఈ పాట చదువుతున్నప్పుడు ఈ రూపకం వచ్చిన అయిదేళ్ల తరువాత రిలీజ్ అయిన “గోరంత దీపం” సినిమాలో ఆరుద్ర గారు వ్రాసిన “రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగ” అనే పాట గుర్తు వస్తుంది. 

ఆ రాత్రివేళ కృష్ణుని వేషంలో వచ్చిన మార్తాండశర్మ అలివేణితో…

“సొగసులు పూచినదానా సోగకనుల చినదానా

నిన్నెదను దాచుకోనా నీ పదును దోచుకోనా” అంటూ పాడతాడు.

అందుకు సమాధానంగా…

“కన్నెచెరను విడిపిస్తే కన్నుల సిరి వెలిగిస్తే

ఆ పున్నెము నీదేగా మరుపున్నమి మనదే కాదా” అంటూ అలివేణి పొంగిపోతూ సమాధానమిస్తుంది.

మరుసటిరోజు తెల్లవారు ఝామున రంగాజమ్మ కృష్ణుడి వేషం కట్టిన మార్తాండశర్మతో “అల్లుడు గారికి ఇష్టమని వెన్న, పాలు తెచ్చాను. వాటితో పాటు కొన్ని విన్నపాలు కూడా తెచ్చాను. చిత్తగిస్తారా” అంటుంది. గీతంలోనే కాదు వచనంలో కూడా వేటూరి చమత్కారాలు ఇలా రూపకం మొత్తం కనబడుతూనే ఉంటాయి. ఇంకొక చోట “ఏటి చీరా – నీటి పైట” అనే అందమైన పద ప్రయోగం కూడా చేస్తారు.

మార్తాండశర్మ దొంగకృష్ణుని వ్యవహారం కొంత కాలం పాటు నడుస్తూ ఉంటుంది. 

“బంతీ చేమంతులతో హేమంతం వెడలిపోయె

గుండెలలో చలిమంటల గుబులు కాస్త పలుచనాయె” అంటూ కాలం ఎలా సాగుతోందో చెప్పుకొస్తాడు సూత్రధారుడు.

“నెలత కాస్త నలతపడే కొలత దాటు కొత్తలతో” అంటూ అలివేణి గర్భవతి అయ్యిందన్న అసలు విషయాన్నీ చెబుతాడు.

రాయలు వారు కళింగ దిగ్విజయ యాత్ర చేసి విజయనగరం తిరిగి వస్తారు. వచ్చే వైకుంఠ ఏకాదశి నాడు విజయనగరం హజారా రామస్వామి ఆలయంలో నాట్యం చెయ్యడానికి అలివేణిని తీసుకురమ్మని రంగాజమ్మకు కబురు పెడతారు. ఆమెకు మరణభయం పట్టుకుంటుంది. అలివేణి ఇప్పుడు గర్భవతి. కానీ వెళ్ళక తప్పదు. 

రాయల సన్నిధిలో అశేష ప్రజావాహిని చూస్తుండగా నాట్యం మొదలు పెడుతుంది అలివేణి. కాసేపటికే కళ్లుతిరిగి పడిపోతుంది. రాజ వైద్యుడు ఆమె నాడి పరీక్షించి “ఏలినవారు మన్నించాలి! ఇది కళ తప్పడం కాదు మహాప్రభూ నెలతప్పడం” అని విషయం వివరిస్తాడు.

అలివేణినీ, రంగాజీని, చంచలను బంధించమని ఆజ్ఞాపిస్తాడు రాయలు. మండలాధీశుడైన మార్తాండశర్మను వెంటనే రావలసిందని వర్తమానం పంపిస్తాడు.

తరువాత రోజు న్యాయ విచారణ మొదలవుతుంది. రంగాజీ, చంచల, జలజల సాక్ష్యాలతో మార్తాండుడే ఈ దుష్కార్యానికి పాల్పడ్డాడని నిరూపణ అవుతుంది.

తను వ్రాసిన మనుచరిత్ర కావ్య ప్రభావం జనుల మీద పడి మార్తాండశర్మ వంటి ఇటువంటి మాయా ప్రవరులు పుట్టుకొస్తున్నారని బాధపడతాడు పెద్దనామాత్యుడు. రాయలు కూడా ఈ మొత్తం అపరాధంలో తనకూ పాలు ఉందని వేదన పడతాడు.

ధర్మశాస్త్రం ప్రకారం అపరాధులైన అలివేణీ, మార్తాండులకు మరణదండన తప్పదనీ, ఈ విషయంలో ప్రభువుల వారి తుది తీర్పు ఎలా ఉంటుందోననీ పురవాసులంతా తమలోతాము తర్జనభర్జన పడుతుంటారు. 

అక్కడ చెరసాలలో అలివేణి…

“మోహాలయమ్మైన దేహమా సెలవు

నా ఆత్మకాకాశమే యింక నెలవు

తారనై ఉంటాను నీల గగనాన

నీ రూపవర్ణాల నిండు సదనాన” అని పాడుకుంటూ ఉంటుంది.

తీర్పు చెప్పే రోజు వస్తుంది. రాయలు సభ తీరుస్తాడు. ధర్మధికారులందరూ, ఈ విషయంలో న్యాయం ఎలా చేయాలో తెలియడం లేదంటారు. ప్రభువుల వారినే న్యాయం చేయవలసినదిగా కోరతారు.

పెద్దన గారు మార్తాండుడికి, అలివేణికి పెళ్ళి చేస్తే నవ శకానికి నాంది పలికిన వారిమవుతామంటాడు. ఆ మాటలకు అలివేణి పగలబడి నవ్వుతుంది. రాజవైద్యుల మాటలచే ఆమె ఉన్మాది అయినట్టుగా తెలుసుకుంటాడు పెద్దనామాత్యుడు. రాయలు పెద్దనతో ఇటువంటి పతివ్రతా శిరోమణి మార్తాండుడివంటి ధూర్తునకు అందేటటువంటిది కాదంటాడు. చివరిగా తన తీర్పు చెప్పడం మొదలు పెడతాడు.

ఎక్కడ అలివేణి దేవదాసిగా దేవుని ఆరాధించిందో ఆ గుడిలో నిర్మాల్యం విసర్జించే సేవకునిగా జీవిత కాలం గడపమంటాడు మార్తాండశర్మని. అలివేణికి కొడుకు పుడితే వేదపారంగతున్ని చేయమని, కూతురు పుడితే దీక్షిత దుహితగా పెంచి ఉత్తమాచారా సంపన్నుల ఇంటికి కోడలిగా చేయవలసిన బాధ్యత నిర్వహించమనీ ఆజ్ఞాపిస్తాడు. 

“ఇకనుండి విజయ నగర సామ్రాజ్యంలో దేవునికి దాసీ లేదు – జీవునికి సానీ లేదు” అంటూ తన ధర్మ నిర్ణయాన్ని వెలువరిస్తాడు. 

చివరిగా…

“జాణగా జనియించి మాధవ కథాగాన

వీణగా రవళించి నిదురించె అలివేణి

కలలన్ని అలలైన సిరికాకొలను రాణి

గలగలని నేడు సాగిన కృష్ణవేణి” అంటూ సూత్రధారుడు నాటకాన్ని పరిసమాప్తి చేస్తాడు.

“సిరికాకొలను చిన్నది” సంగీత రూపకాన్ని వింటూ, ఈ పుస్తకం చదవడం ఒక గొప్ప అనుభూతి. అయితే రేడియో నాటకం కాబట్టి, పుస్తకంలో ఉన్న మొత్తం భాగం సంగీత రూపకంలో ఉండదు. కాకపోతే, పుస్తకంలో ఉన్న అదనపు భాగం మనకు అదనపు ఆనందాన్ని ఇస్తుంది అంతే. లక్డీకాపూల్ బి.ఎస్.ఎన్.ఎల్ ఆఫీసు వీధిలో, రోడ్డు ప్రక్కన పాతపుస్తకాలు అమ్మే వాళ్ళ దగ్గర అయిదారేళ్ళ క్రితం దొరికిందీ పుస్తకం. ఆ తరువాత వేటూరి సుందర రామమూర్తి గారి అబ్బాయి వేటూరి రవిప్రకాశ్ గారి సౌజన్యంతో ఈ పుస్తకాన్ని కినిగెలో ఈ-బుక్‌గా కూడా తీసుకువచ్చాము. అప్పట్లో వేటూరి రవిగారు ఇచ్చిన సమాచారంతోనే, ఆకాశవాణి హైద్రాబాదు కేంద్రానికి వెళ్ళి సిరికాకొలను చిన్నది సి.డి. కూడా కొనుక్కున్నాను. సిరికాకొలను చిన్నదాని సోయగాలను విని, చదివి ఎంతో ఆనందాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు పొందినా, మరొక్కసారి ఆ ఆనందాన్ని పొందుతూ ఈ పుస్తక పరిచయ వ్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. 

ఈ పుస్తకానికి ముఖచిత్రాన్నీ, వెనుక అట్ట మీద వేటూరి గారి బొమ్మనూ వేసిన బాపూ గారికీ,

 “వేటూరి వారిపాటకి

  సాటేదని సరస్వతిని చేరి కోర, నా

  పాటేశ్వరుడికి వుజ్జీ

  వేటూరేనంది నవ్వి వెంకటరమణా!”

అంటూ వేటూరి వారిని కందంతో అంతెత్తున పొగిడిన ముళ్ళపూడి వెంకటరమణ గారికీ నమస్కరించుకుంటూ… వేటూరి సుందర రామమూర్తి గారిని పదే పదే స్మరించుకుంటూ స్వస్తి!

You May Also Like

2 thoughts on “సిరికాకొలను చిన్నది-రాజన్ పి.టి.ఎస్.కె

    1. Kinige.com లో ఉందని పై వ్యాసంలోనే పేర్కొన్నారు. గమనించగలరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.