ఆగదాయె రణం, ఇది తీరిపోని ఋణం(సందీప్.పి)

విషాదగీతాలలో వేటూరి ఉన్నట్టుండి బలమైన భావాలను వేస్తారు. జెమిని లో “చుక్కల్లోకెక్కినాడు”, మల్లెపువ్వు లో “ఎవ్వరో ఎవ్వరో” ఈ కోవకు చెందినవే (మనోనేత్రం బ్లాగ్ లో పాటల గురించి ఇదివరకే ప్రస్తావించాను). ఈ రోజు మరొక
మంచి పాట గుర్తొచ్చింది. వెంటనే దాని గురించి వ్రాయాలనుకున్నాను. సురేశ్ కృష్ణ దర్శకత్వంలో వెంకటేశ్, రమ్యకృష్ణ నటించిన “ధర్మచక్రం” సినిమాకు M.M. శ్రీలేఖ బాణీలను సమకూర్చారు. ఈ సినిమాలో రెండు పాటలు వేటూరి
వ్రాశారు. వాటిలో “ధీర సమీరే” అనే పాట అందరికీ తెలిసింది. బాగా హిట్ ఐంది. రెండో పాట చరమాంకంలో వచ్చే “ఆగదాయె రణం” – అది నాకు చాలా ఇష్టమైన పాట. సులభమైన పదాలు, గంభీరమైన భావలు ఉన్న వేటూరి స్థాయి పాట.

సినిమా  కథ wikipediaలో ఉంది. టూకీగా చెప్పాలంటే – వెంకటేశ్ ధనాశ లేకుండా పేదవాడికి న్యాయం జరగాలని పోరాడే వకీలు. అతడి తండ్రి ఒక MLA, పరమదుర్మార్గుడు. కొడుకు ఒక అమ్మాయిని ఇష్టపడితే, ఆమె అంతస్థు తక్కువని
ఆమె చావుకు కారణం అవుతాడు. అందువలన వెంకటేశ్ కి తండ్రి అంటే అసహ్యం, ద్వేషం. తన తల్లి కూడా భర్తను విడిచిపెట్టి వెంకటేశ్ కి తోడుగా ఉంటుంది. ఇంతలో తండ్రి ఒక ఘోరమైన నేరం చేసి దొరికిపోతాడు. తన తరఫున వాదించి ఆ case కొట్టేయించకపోతే తనకు ఇష్టమైన వారందరినీ చంపేస్తాను అని కొడుకుని బెదిరిస్తాడు. చివరకు వెంకటేశ్ తల్లి కూడా, తనకు పసుపుకుంకుమలను దూరం చెయ్యద్దు అని వేడుకోవడంతో వేరే దిక్కు లేక తండ్రి తరఫున వాదించాల్సి వచ్చిన తరుణంలో పాట ఇది. పాట గురించి చెప్పే ముందు సినిమా గురించి ఇంకొంచెం చెప్పాలి. ఈ సినిమాలో తల్లి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది – తన భర్తను కాదనుకుని వెంకటేశ్ తల్లి గురువుగా, స్నేహితురాలిగా ఉంటూ మనోబలాన్ని ఇస్తుంది. చివరకు ఆమే ఈ కథ ముగింపుని కూడా నిర్ణయిస్తుంది. వెంకటేశ్ యాంగ్రీ యంగ్ మేన్ పాత్రలో చాలా బాగా చేసాడు అని చెప్పుకోవాలి.పాట విన్నవారికి కన్నీళ్ళు నయాగరా జలపాతంలో పారాలనేమో పాటను నయాగరా దగ్గరే చిత్రీకరించారు

ఇక పాట గురించి మాట్లాడుకుందాం. అనుకూల శత్రుత్వం, ప్రతికూల శత్రుత్వం ఉంటాయి అని మా తాతయ్య అంటూ ఉండేవారు. అలాగ, ఈ కథలో వెంకటేశ్ కి తండ్రి ప్రతికూల శత్రువు ఐతే, చివరకు తల్లి అనుకూల శత్రువు అవుతుంది. అంటే మనసు మంచిది ఐనా, కాళ్ళకు బంధం వేస్తుంది. పాటంతా ఇదే అంశాన్ని గుర్తుచేస్తారు వేటూరి.

ఆగదాయె రణం, ఇది తీరిపోని ఋణం
అటు కన్నతల్లి ప్రేమబంధనం
ఇటు ధర్మచక్ర చండశాశనం
ఉరికంబమెక్కె ఉన్న ఆదర్శం

నాయకుడు తండ్రితో ఉన్న రణాన్ని ఎలాగనూ ఆపలేడు. తండ్రికి అనుకూలంగా వాదించకపోతే తనవారికి హాని చేస్తాడు, తనకు తోడుగా నిలిచిన తల్లి దుఃఖపడుతుంది. అంతటి దుర్మార్గుణ్ణి చేజేతులారా సమర్థించడం తన ఆదర్శాలకు
విరుద్ధం. “ధర్మచక్ర చండశాశనం” అనే సమాసం నాకు చాలా నచ్చింది. “చండ” అంటే “తిరుగులేనిది, ఉగ్రమైనది” అని చెప్పుకోవచ్చును. నాయకుడి దృష్టిలో ధర్మం విధించే శాశనం తిరుగులేనిది. బేరాలాడదగినదైతే అది ధర్మమెలాగ అవుతుంది. తల్లికి, ధర్మానికి మధ్యన జరిగిన సంగ్రామంలో చివరకి తన ఆదర్శాన్ని చంపుకోవలసి వస్తోంది.

ఆత్మసాక్షి చావక, అది నీతిబాటగా
అమ్మ మాట మారక, విధి జూదమాడగా
కనివిని ఎరుగని మమతల శాపమేమో
కనులను తెరువని కలియుగ న్యాయమో
మనసొక సాక్షిగ బ్రతికిన జీవితాన
జననికి ఋణపడు తనయుడి పాశమో
యే కోర్టు చెప్పిందొ ఈనాటి తీర్పు తలవొంచి నను దోషిగా

ఇన్నాళ్ళూ నీతిబాటే తన ఆత్మసాక్షిగా నడిచాడు. మమతకు ప్రతిరూపమైన తల్లి తెచ్చిన ఉపద్రవం ఇది – అందుకే “మమతల శాపం” ఐంది. వేటూరి సందర్భోచితంగా చట్టానికి సంబంధించిన విషయాలని వాడుకున్నారు. న్యాయస్థానంలో న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టుకుంటుంది. అలాగే తన తల్లి కూడా (కావాలని) గుడ్డిగా (భర్త ఎన్ని దుర్మార్గాలు చేసినా) అతడికి శిక్ష పడకుండా కొడుకు వాదించాలని తీర్పునిచ్చింది. తన ప్రియురాలిని కోల్పోయి పిచ్చివాడైపోయే
పరిస్థితిలో ఉన్నప్పుడు, తన తల్లి తోడుగా ఉండి అతడికి పునర్జన్మని ఇచ్చింది. ఆమెకు ఋణపడిన పాశం ఇప్పుడు శాపమై, తను దోషి కావాలని నిర్ణయించింది. మామూలుగా తప్పు చేసినవాడు దోషి అని న్యాయస్థానం తీర్పు ఇస్తే,
ఇక్కడ దోషి కమ్మని యే న్యాయస్థానం తీర్పుని ఇచ్చిందో (తల్లి, విధి, పాశం) అని నాయకుడు దుఃఖపడుతున్నాడు.

పేదవాడి కోసమే కొలిచాను న్యాయమే
నేను కోరు పెన్నిధి ఒక ధర్మపీఠమే
విలువలు చెరగని మనిషిని ఇంత కాలం
శిలువకు బలిపశువైతిని ఎందుకో
పగిలిన హృదయపు ముడుపుల పూజలోన
మిగిలితి బ్రతికిన శవమై అందుకే
యే తండ్రి కోరేను ఈ పుత్రశోకాన్ని తనపేగు ఉరుతాడుగా

ఈ చరణం ఎన్ని సార్లు విన్నా “కొన్ని నిముషాల్లో వేటూరి ఇంత లోతైన భావాలని ఎలాగ తోడుకొస్తారు” అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. కవి మళ్ళీ నాయకుడికి ఉన్న ఏకైక ఆదర్శం, ఆత్మసాక్షి – ధర్మపీఠం అని గుర్తుచేసారు. విలువలు కలిగిన వాడిగా ఊరంతా తెలిసిన నాయకుడు, ఇప్పుడు పదిమందికి తెలిసేలాగ వాటిని వదులుకుని నేరస్థుడిని సమర్థించాలి. తన విలువలకు కూడా వెల ఉంది అని అందరికీ తెలుస్తుంది. తనను చేతులు, కాళ్ళూ ఆడకుండా శిలువకు కట్టేసింది తన కన్నతల్లిపై పాశం. మొదటి పంక్తిలో “కొలిచాను న్యాయం” అన్నాడు నాయకుడు. అంటే న్యాయవాదన ఎప్పుడూ పరిపూర్ణమైన మనసుతో చేసేవాడు.
ఇప్పుడు మనసుని చంపుకుని చేస్తున్న వాదనని “పగిలిన హృదయపు ముడుపుల పూజ” అనడం అద్భుతమైన ప్రయోగం. నాయకుడు మనసు చచ్చాక, బ్రతికిన శవమై మిగిలాడు. దీనికి మూలకారణం ఎవరో కాదు – తన కన్నతండ్రే. శోకాలన్నింటిలోకీ పుత్రశోకం దుర్భరమైనది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డకు ఆ పేగుతోనే ఉరి బిగించి,
పుత్రశోకాన్ని తెచ్చుకునే తండ్రి ఎక్కడైనా ఉంటాడా అని నాయకుడు నివ్వెరపోతున్నాడు.

నాకు ఇది కథని, నాయకుడి వ్యక్తిత్వాన్ని బాగా జీర్ణించుకుని వ్రాసిన పాట అనిపిస్తోంది. రెండో చరణంలో ఆఖరి మూడు పంక్తులను ఎన్ని సార్లు విన్నా నాకు వింతగానే ఉంటుంది. వాటిని వ్రాయడానికి వేటూరికి ఎంతసేపు పట్టి
ఉంటుందా అనే ఆలోచన మళ్ళీ వస్తుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.