స్పందన – అభినందన (శ్రీ సూరపరాజు రాధాకృష్ణమూర్తి)
ఇటీవల నాకు పాటలేవీ సరిగా వినిపించడం లేదు (ఇందులో వాద్యఘోష దోషమేమీ లేదు), వినిపించడం లేదని బాధపడుతూ ఉంటే ఒక మంచి పాట కనిపించింది. అచ్చులో అచ్చంగా, స్వఛ్చంగా, హరశిరశ్చంద్రికలా, అనాఘ్రాతపుష్పంలా, అదే ఏప్రిల్ నెల వెలుగు ప్రముఖ చిత్రగీతం-‘ఎత్తగలడా సీతజడను”
అచ్చులో లేక ఇప్పటికే చాలా పాటలు కవి జీవితకాలంలోనే కాలగర్భంలో కలిసిపోయాయి. ‘నేలా నింగీ తాళాలోయ్’ ఎంతమందికి గుర్తుంది? నాకు పాట మొదలు గుర్తులేదు, సినిమా? ప్రేమ నక్షత్రమా? తిక్కనకవి ఆనందించదగిన పాట.
‘చూడలేదని పెదవి చెప్పే/చెప్పలేమని కనులు చెప్పే’ గోస్వామి తులసీదాసు విని, పారవశ్యంలో పెదవి పగలక ‘బిను బానీ’ అనుకునేవాడేమో. (‘గిరా అనయన్ నయన్ బిను బానీ’ అన్నాడు తులసి). ఇంద్రియ గోచరం కాని పరతత్వం రాముడు, పెదవి చూడలేదు, కనులు చెప్పలేవు.
ఇక ‘ఎత్తగలడా సీత జడను ‘ ఇది ప్రశ్న. ప్రశ్న కాదు, ప్రతివచనం. ఇది ఒక వాక్యం కాదు. ఇందులో ఒక మనోభావం కాదు, దీన్ని ఎన్ని విధాలుగా పలకవచ్చునో పలికి చూడండి, ఒక్కొక్కరి మనోభావాన్ని చెప్పే ఒక్కొక్క వాక్యం, ఈ వాక్యగర్భంలో నుండి వెలికి వస్తుంది. ఇందులో స్వయంవర నిబంధనఘోష ఉంది, ఆందోళన, ఆశ, ఆశంక, ఆశ్వాసం, ఉత్సుకత, ఉత్సాహం, వ్యాకులత, సీతాభిమానుల స్వాతిశయం, నిశ్చయం, దర్పణం (ఛాలెంజ్) ఇంకా ఎన్నో.
ఈ శివధనుస్సును ఎత్తినవాడే ఎత్తగలడు ఆ సీతజడను – ఇది స్వయంవర నిబందన
విల్లులు విరగ్గొట్టే ఈయనకు శృంగారం కూడా తెలుసా?!
ఆ రాముడే ఎత్తగలడా సీత జడను-మరొకడు సీతను తాకితే మసి అయిపోగలడు (తాకినవాడేమయినాడో తరువాత చూశాంగదా మనం)
ఇన్ని పలుకులు పలుకుతుందీ వాక్యం. ఇంకా ఎన్నో, ‘మా పెళ్ళికొడుకు గొప్ప అంటే మా పెళ్ళికూతురేం తక్కువ ‘ అన్న వివాదం పెళ్ళిసరదాలలో ప్రధానాంశం. ఆ అంశం ఈ గేయంలో చాలా గుప్తంగా ఉంది. సాధారణంగా శివధనుర్భంగ సందర్భంలో దద్దరిల్లే ధ్వని లోకాలలో లోకులలో దాని ప్రతిధ్వని వినడం మనకు అలవాటయిపోయింది. ఈ గేయంలో రాముడు అటువంటి ఆర్భాటమేమీ చేయలేదు,
‘ఎడమచేతను శివుని విల్లు ఎత్తిన ‘ అని చాలా తేలికగా దాటేశాడు, అయితే అందులో కూడా మన పెళ్ళికూతురు తేలికగా వదల్లేదు పెళ్ళికొడుకును, ఆమె అంతకన్నా చడీచప్పుడూ లేకుండా గుట్టుగా వచ్చి మెడలోనే వేసుకుంది మొగుడ్ని. (రాముడేడని అడుగుతుంటే నల్లపూసై సీతమెడలో నక్కి ఉన్నాడు)
నల్లపూసలా అరుదయిన పరతత్వానికి బిరుదైన సింగారం ఈ సుందరరచన. బుద్ధముగ్ధం సిగ్గులొలికే శుద్ధతత్వం)
సూరపరాజు రాధాకృష్ణమూర్తి గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం