భూదారిలో నీలాంబరి(అవినేని భాస్కర్)

గోదావరి నది నేపథ్యంలో శేఖర్ కమ్ముల తీసిన గోదావరి సినిమాలో టైటిల్ కార్డ్స్ పడుతున్నప్పుడు, అడవి బాపిరాజు గారు గోదావరి మీద రాసిన ‘ఉప్పొంగి పోయింది గోదావరి…’ అన్న ప్రసిద్ధ పాటయొక్క పల్లవి, ఒక చరణం ప్లే అవుతుంది. ఆ పాటలోని అన్ని చరణాలూ తీసుకుని టైటిల్ సాంగ్ గా వాడుకోక పోవడంలో ఆయకున్న కారణాలేవైనా కావచ్చు గానీ, శ్రోతలకు మాత్రం గోదావరి మీద మరొక కొత్త పాట దొరికింది

సినిమా కోసం టైటిల్ పాట రాసిన వేటూరి, తన పల్లవికి అడవి బాపిరాజు పాటలోని మొదటి రెండు పదాలనే ఆధారంగా చేసుకుని, తనదైన శైలిలో, సినిమా కథకు తగ్గట్టు సులువైన పదాలెంచుకుని, క్లుప్తమైన వాక్యాలతో రాధాకృష్ణన్ ట్యూన్‌కు పల్లవి, చరణాలు రాశాడు. రెండు చరణాల్లో గోదావరి గురించి, కథను కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఇన్ని విశేషాలతో వ్రాయడం వేటూరికే తగును. గానకళా పండితుడైన బాలు గారు గోదావరి నది మీదా, వేటూరి సాహిత్యం మీదా ఉన్న తన ఆరాధన భావాన్నంతా వినయంతో సమర్పించుకుంటూ పాడారు.

పల్లవి:

ఉప్పొంగెలే గోదావరి

ఊగిందిలే చేలో వరి

భూదారిలో నీలాంబరి

మా సీమకే చీనాంబరి

వెతలు తీర్చు మా దేవేరి

వేద మంటి మా గోదారి

శబరి కలిసిన గోదారి

రామ చరితకే పూదారి

వేసెయ్ చాప జోర్సెయ్ నావ బార్సేయ్ వాలుగా

చుక్కానే చూపుగా

బ్రతుకు తెరువు ఎదురీతేగా

చరణం1:

సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం

వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం

ఇళ్లే ఓడలైపోతున్నఇంటి పనుల దృశ్యం

ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం

ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ

నది ఊరేగింపులో పడవ మీద రాగా

ప్రభువు తాను కాగా

చరణం2:

గోదారమ్మ కుంకంబొట్టు దిద్దే మిరప ఎరుపు

లంకానాధు డింక ఆగనంటు పండ్లు కొరుకు

చూసే చూపు ఏం చెప్పింది సీతా కాంతకి

సందేహాల మబ్బే పట్టె చూసే కంటికీ 

లోకం కాని లోకం లోన ఏకాంతాల వలపు

అల పాపికొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా

పాట వివరణ:

పల్లవి:

ఉప్పొంగెలే గోదావరి

ఊగిందిలే చేలో వరి

గోదావరి నిండుగా పొంగి పొరలుతూ సాగుతోంది కాబట్టి నది ఒడ్డునున్న పొలాల్లో వరి పంటలు పచ్చగా ఊగుతున్నాయి.

భూదారిలో నీలాంబరి

లైనుకు ఒక అర్థం కాదు, రెండు మూడు అర్థాలు తీసుకోవచ్చు.

భూమ్మీద గోదారి పరువులిడుతుంటే ప్రవాహంతో వచ్చే చప్పుడు నీలాంబరి రాగంలా వినిపిస్తుందని;

ఎత్తునుండో(aerial view), దూరంనుండో చూస్తే నీలం రంగులో(ఆకాశపు నీడవల్ల) భూమ్మీద పడి ఉన్న ఆకాశపు తునకలా గోదావరి నది ఉందని

భూమి దారిలో పడున్న నీలిరంగు వస్త్రంలా గోదావరి కనిపిస్తుందని

మా సీమకే చీనాంబరి

గోదావరి నీటి పారుదలవల్ల మా ప్రాంతమంతా సస్య శ్యామలంగా పచ్చని పట్టు వస్త్రం పరచినట్టు ఉంది, కాబట్టి నువ్వే మా సీమకు చీనాంబరివి అని ప్రాంత ప్రజలు కొనియాడుతున్నారు. కవి చీనం అని రాస్తే అది పైరుల పచ్చదనం అనడమేంటని అడగకూడదు. ‘గల గలా గోదారి కదలి పోతుంటేను, బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే

బంగారు పంటలే పండుతాయి’  అన్న శంకరంబాడి మాటల్ను గుర్తు చేసుంకుందాం

వెతలు తీర్చు మా దేవేరి

నిన్ను నమ్ముకునే మా అందరి జీవితాలున్నాయి. మా కష్టాలు తీర్చే దేవతవి నువ్వు అని కొలుస్తున్నారు.

వేద మంటి మా గోదారి

మాకు దేవతవే కాదు, నిత్యం మేము మా నోళ్ళలో నీ పేరునే వేదంలా పఠించుతున్నాము

శబరి కలిసిన గోదారి

శబరి నదిని ఉపనదిగా నీలో ఐక్యంచేసుకున్నదానివి.

రామ చరితకే పూదారి

రాముడి చరిత్రలో నీ పాత్ర చాలా పెద్దది. నీ ఒడ్డున సీతారాములు గుడిసె వేసుకుని గడిపిన జీవితం గొప్పది. రామ చరిత్రలో ముఖ్యమైన మలుపు కూడా నీ ఒడ్డునున్న కాలంలో జరిగినదే.

వేసెయ్ చాప జోర్సెయ్ నావ బార్సేయ్ వాలుగా

పడవలు, ఓడలు నడిపేవారు పైకి ఎగకట్టే తెలచాప, జోరుగా నడిచే నావ, బరిసెలు పట్టుకున్న నావకారులు తెడ్డేస్తున్నప్పడు ఒకరికొకరు ఇచ్చుకునే సంజ్ఞలుహుషారుకొరకు, synchronize చేసుకునేందుకు పలికే పదాలివి

చుక్కానే చూపుగా

బ్రతుకు తెరువు ఎదురీతేగా

నేల మీద నడిచే బళ్ళకు steering లాంటిది, పడవకు చుక్కాని. నావలో వెళ్ళేప్పుడు నదియొక్క గమనాన్ని చుసే దిశలో ప్రయాణిస్తున్నమన్నది తెలుసుకోగలము. చూపుతో మనం దిశను ఎంచుకుని ప్రాయాణం చేస్తున్నట్టు, చుక్కానితో దిశలో ప్రయాణించాలో అలా నడుపుతాము. గోదారినే నమ్మకుని బ్రతికేవారికి గోదావరి మీద ఎదురీదటమే జీవన విధానం

ప్రయాణానికైనా చూపు ప్రధానం. బ్రతుకు తెరువంటే బ్రతుకు సాగే దారి, మార్గం. బ్రతుకంటే ప్రవాహానికి ఎదురీదటమే కదా? నది ప్రయాణానికైనా, బ్రతుకుకైనా. దీన్ని తాత్విక కోణంలో చూసి భావం గ్రహించాలి

మొదటి చరణలో గోదాట్లో సాగిపోతున్న లాంచీలోని పదుగురి గురించి వర్ణిస్తున్నాడు వేటూరి

సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం

లాంచీ ప్రయాణంలో పరిచయమయ్యే స్నేహాలు, ఎందరో దంపతులు, వాళ్ళు ముచ్చటపడి చిలకతో చెప్పించుకునే జోస్యంవల్ల వచ్చే చిలపితనాలుచిలిపితనాన్ని మనుషుల్లో రేపిన చిలక జోస్యం. అంటే అక్కడి వాతావరణమంతా పండుగలా, తిరనాళ్ళులా ఉంది అన్నదే కవి హృదయం.

వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం

లాంచీలోనే వేడి వేడిగా అట్లు వేసి అమ్ముతున్నారు, చల్లని గాల్లో నీటి మీద వేడివేడి అట్లకోసం జనం ఎగబడటంవల్ల 

ఇళ్లే ఓడలైపోతున్నఇంటి పనుల దృశ్యం

పడవలో ప్రయాణించే గృహిణులు కొందరు తమ నట్టింట్లో కూర్చున్నంత హాయిగా కింద కూర్చుని సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా రాత్రి వంటకు కావలసిన ఆకులు ఒలుచుకుంటూ, కూరలు తరుక్కుంటూ, పూవుల దండలు కట్టుకుంటూ ఉన్నారు. ఇంతులను చూస్తుంటే, ఇంట్లో ఉన్నామా ఓడలో ఉన్నామా అన్న తేడానే తెలీడంలేదట

ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం

ఇలాంటి ఎన్నో అందాలు నీలో ఉన్నాయి. అందాలు తమని తాము చూసుకోడానికి నువ్వే నీటి అద్దం.

ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ

నది ఊరేగింపులో పడవ మీద రాగా

ప్రభువు తాను కాగా

ఇన్ని అందాలు నిండిన గోదారి ప్రాంతం అయోధ్యకంటే ఏం తక్కువ? అక్కడ ప్రభువు కాకుంటేనేం? ఇక్కడ ప్రభువయ్యాడు. భద్రాచలానికి నది మీద పడవల్లో ప్రయాణంచేసే భక్తులు, భాగవతాదులు రాముడి విగ్రహానికి పూజలు చేస్తూ, రామనామ కీర్తనలవి పాడుకుంటున్న దృశ్యం ఎలా ఉందంటే ఉత్సవమూర్తిని పడవమీద ఊరేగిస్తున్నట్టుంది.

రెండో చరణంలో సినిమా కథనీ కొంచం చెప్పాడు వేటూరి.

గోదారమ్మ కుంకంబొట్టు దిద్దే మిరప ఎరుపు

పచ్చని పొలాలమధ్యన గోదారమ్మ నీటితో పండే మిరప తోటలనే/కాయలనే ఆయమ్మ ఎంతో ఆశగా నుదుట కుంకుంలా దిద్దుకుందట. ఆమె పారుదలతో పండే మిరప కుంకుమంత ఎర్రగా ఉంటుందని కూడా భావించవచ్చు.

లంకానాధు డింక ఆగనంటు పండ్లు కొరుకు

ఆంధ్రాలో ప్రసిద్ధమైన పొగాకు లంక పొగాకు. లంక పొగాకు పైరయ్యేది గోదారి నీటితో. ఘాటు పొగాకుకి ఎవ్వరయినా దాసులవ్వాల్సిందే. లంకా నాథుడైనా లంక పొగాకుకొరకు ఉవ్విళ్ళురుతూ ఇంక ఆగలేను పట్టుకురండిరా బాబూ అని పళ్ళు కొరుకుతాడటదర్శకుడు దీన్నిపడవలో వేసిన రామాయణ నాటకంలోని రావణాసురుడు లంక పొగాకుతో చేసిన చుట్ట తాగుతున్నట్టు చిత్రీకరించాడు

చూసే చూపు ఏం చెప్పింది సీతా కాంతకి

సందేహాల మబ్బే పట్టె చూసే కంటికీ

సినిమాలో లాంచీ ఎక్కేవారికి హీరో సాయం చేస్తుంటాడు. అదివరకే హీరోయిన్ దృష్టిలో చెడ్డవాడయిన హీరోని మళ్ళీ అపార్థంచేసుకుంటుంది సీత అన్న పేరుగల హీరోయిన్. నిజానిజాలు అన్వేషించకుండా, ఆమెకు క్షణం కనిపించే దృశ్యమే నిజం అనుకుని, వెంటనే ఒక నిర్ణయానికొచ్చేసే తొందరపాటు మనస్తత్వంగల ముక్కుసూటి మనిషి హీరోయిన్. (ఈమె తొందరపాటు, అపార్థమే కథలో మరో ముఖ్యమైన మలుపుకూ కారణమవుతుంది.) సన్నివేశంలో కూడా అమ్మాయి లాంచీ ఎక్కడానికి సాయం చేస్తున్న హీరోని వెనుకనుండి చూసి ఫ్లర్ట్ అని  అపార్థం చేసుకుంటుంది. మరుక్షణమే అతను సాయం చేసింది గర్భిణికని గ్రహిస్తుంది.  

లోకం కాని లోకం లోన ఏకాంతాల వలపు

నరసింహ అవతారంలో లాగా, ఇటు భూమ్మీదా కాదు, అటు ఆకాశము కాదు. నది మీద ప్రయాణం చేస్తున్న యువతి యువకులకు దొరికిన ఏకాంతం వల్ల వారి మనస్తత్వాల కలవడం వల్ల కలిగిన వలపు. లోకం కాని లోకం అన్న వాక్యానికి, మన ఊరు కాని ప్రదేశం అన్న అర్థంలోకూడా తీసుకోవచ్చు. అంటే హీరో హీరోయిన్లు వాళ్ళ ఊరు కాకుండా వేరే చోట ఉన్నారు కాబట్టి లోకం కాని లోకంలో అవుతుందిక్కడ. ఏకాంతమే వారి ప్రేమకు సాయపడిందనీ అర్థంచేసుకోవచ్చు.

అల పాపికొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా

ఇన్ని గొప్పలు ఉన్నప్పటికీ, భూలోకంలోనే స్వర్గాన్ని సృష్టిస్తున్నప్పటికీ, గోదారివల్ల కాని పనేంటంటే పాపికొండల నలుపు కడగలేక పోవడమేనట, అందుకు తనకు తానే సిగ్గేసి నవ్వుకుంటోందని సటైరిక్ చురక వేసి పాటని ముగించాడు కవి.

*  * * 

2 thoughts on “భూదారిలో నీలాంబరి(అవినేని భాస్కర్)”

  1. చాలా చక్కని వ్యాసం! ట్యూన్ పరంగా, గానం పరంగా, సాహిత్యం పరంగా గొప్ప పాటే ఇది ఖచ్చితంగా! వేటూరిలో బ్రిలియన్స్ ని చూపించే పాటనిపిస్తుంది!

    చాలా పాటల్లానే ఈ పాట కూడా ఒక్కోరికి ఒక్కోలా అర్థం అవుతుంది. భాస్కర్ కి అర్థమైనట్టే నాకూ అర్థమైంది పాటా చాలా వరకూ. అయితే కొన్ని లైన్లకి నాకు చేసుకున్న అర్థం ఇది –

    – వేసెయ్ చాప జోర్సెయ్ నావ బార్సేయ్ వాలుగా, చుక్కానే చూపుగా, బ్రతుకు తెరువు ఎదురీతేగా

    నదిని నమ్ముకున్న వాళ్ళకి నదే బ్రతుకులో స్ఫూర్తి నింపుతుంది. చూపు చుక్కానిగా మారినప్పుడు ఎన్ని ఒడిదుడుకులున్నా దారి తప్పదు, ఎదురీత నేర్చుకున్నప్పుడు ఎంత కష్టమొచ్చినా తట్టుకునే స్థైర్యం వస్తుంది (ఎదురీతే బ్రతుకు తెరువు – అంటే ఎదురీతే బ్రతికే దారి చూపిస్తుంది అని, తెరువు అంటే దారి).

    – సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం

    స్నేహాలూ, సంభాషణలూ ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు ప్రియంగా మాట్లాడేవాడు రేపు దుర్భాషలాడొచ్చు, ఇప్పుడు ప్రాణస్నేహితుడు అనుకున్నవాడు రేపు శత్రువు కావొచ్చు. ఈ సినిమా కథలో కూడా హీరో-హీరోయిన్ల మధ్య స్నేహం ఇలాగే మారుతుంది. అందుకే వాటిని “చిలిపి చిలక చెప్పే జోస్యం” తో పోల్చారు. అంటే ఏమౌతుందో తెలీదని.

    – ఆరేసేటి అందాలన్నీ అడిగె(ను) నీటి అద్దం

    కనిపించే అందాలన్నీ (ఇది పడవలో అమ్మాయిల అందమనే కాదు, చుట్టూ కొండలు వగైరా కూడా) తనలో ప్రతిఫలించుకుని చూసుకోవాలని గోదావరి నది నీటి అద్దం గా మారి తహతహలాడిందిట!

    – “నది ఊరేగింపులో పడవ మీద *లాగ*, ప్రభువు తాను కాగ” అనుకుంటున్నాను

    గోదావరి నది తన అలల చేతులేసి పడవ మీద ఆ రామచంద్రుని లాగి ఊరేగిస్తోంది. అందుకే ఆనందంతో ఉప్పొంగింది అని కూడా అనుకోవచ్చు (ఈ లైను తరువాత పల్లవి “ఉప్పొంగెలే గోదావరి..” వస్తుంది)

    – లంకానాధు డింక ఆగనంటు పండ్లు కొరుకు

    లంకానాధుడు అంటే లంకకి నాధుడు అంటే లంకకి రాజు, రావణుడు అని అర్థం. అయితే వేటూరి చిలిపిగా “లంక పొగాకుకి నాధుడు” (అంటే లంక పొగాకు తాగుతూ రాజాలా ఫీల్ అయ్యేవాడు అనుకోవచ్చు) అని దీనికి అర్థం మార్చి ప్రయోగించారు! దీనికీ రావణుడికి ఏమీ సంబంధం లేదు, విజువల్ లో అలా చూపించినా!

    – అల పాపికొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా

    ఇక్కడ “నవ్వు తనకు రాగ” అనాలా “అలుపు తనకు రాగ” అనాలా అన్న విషయంపై తనకీ వేటూరికి గంటకు పైగా చర్చ జరిగడం ఎప్పటికీ మర్చిపోలేను అని వేటూరి శిష్యుడు ధర్మతేజ రాసినట్టు గుర్తు! అంటే వేటూరి చేసే పదప్రయోగాల వెనుక ఎంత చరిత్ర ఉంటుందో ఊహించుకోవచ్చు. “ప్రాస కోసం, శబ్ద సౌందర్యం కోసం ఏదో రాసిపడెయ్యడమే” వేటూరి సహజ లక్షణం అయ్యింటే “అలుపు” అని రాసి పడేసేవాడాయన, నలుపుకి ప్రాస కనుక! ఇక్కడ గోదావరి నలుపు పోగొట్టలేక పోయేనే అని అలుపు రాలేదు, నవ్వు వచ్చింది. అంటే ఓటమిని అంగీకరించలేదు. ఎంత కడిగినా పోని పాపాన్ని, మారని బ్రతుకుని చూసి నవ్వుకుంది. తన దీవెనలు ఇస్తూనే ఉంది, తన నీళ్లతో కడుగుతూనే ఉంది. “పాపికొండలు” అన్నది మనందరికీ కూడా వర్తిస్తుంది! పాపాన్ని, మకిలిని కొండలా పేర్చుకున్నాం కనుక!

    ఇవి కేవలం నాకు తోచిన భావాలు. భాస్కర్ కి ఇంకొన్ని భావాలు తోచాయి. ఈ గ్రూపులో మిగతా అందరికీ కూడా ఇంకొన్ని తడతాయి. మరి వేటూరినే అడిగితే ఇంకెంత చెప్పేవారో ఆయన! అందుకే వేటూరిని “మహా సముద్రం” అని సిరివెన్నెల అంతటి మహానుభావుడే అన్నది!

    1. చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా అలుపు-నవ్వు దగ్గర అద్భుతం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top