వేటూరిగారొస్తున్నారు (రాజన్.పి.టి.ఎస్.కె)

రాఘవేంద్రరావు గారు సోఫాలో రిలాక్స్‌డ్‌గా జారబడి కూర్చున్నారు. టేబుల్ మీద ఉన్న ఫ్లవర్‌వాజ్‌లో పువ్వులు, ఆ పక్కనే ట్రేలో ఉన్న ఆపిల్‌పళ్ళు ఆయన వంక ఆరాధనగా చూస్తున్నాయి. “కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ – చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి” అని కళ్లు మూసుకుని హమ్ చేసుకుంటున్నారాయన. ఇంతలో బ్యాక్‌గ్రౌండ్‌లో “మనిషై పుట్టిన వాడు కారాదు మట్టిబొమ్మ – పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ – కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు – తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు” అనే సాంగ్ వినిపించిందాయనకు. ఇదేమిటని కళ్ళు తెరచి చూస్తే చిద్విలాసంగా నవ్వుతూ ఎదురుగా ఎన్టీయార్. “ఏంటి బ్రదర్ ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు” అనడిగారు ఎన్టీయార్. “ఆకుచాటున తడిసిన పిందె కోసం, కోకమాటున తడిసిన పిల్ల కోసం” అని నవ్వేశారు దర్శకేంద్రుడు. ఇంతకీ మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు అని తిరిగి అన్నగారిని ప్రశ్నించారు రాఘవేంద్రరావు. “ఏముంది బ్రదర్! నిమ్మకూరు రోడ్డుదాటి నే వస్తుంటే నిడుమోలు లాకు దగ్గర ఆపేసిందా బజ్జీలబుజ్జి. ఏలుకేస్తె కాలికేసి కాలికేస్తె ఏలుకేసి ముద్దిచ్చి పొమ్మంది. సరేలే “వలపులన్నీ వడ్డిస్తాను – వయసు వడ్డీ చెల్లిస్తాను” అని అంది కదా అని వెంటపడి వెళితే, మామిళ్ళతోపు కాడ పండు, మరుమల్లె తోటకాడ పువ్వు ఇచ్చి తుర్రుమంది. చేసేది లేక మన శ్రీదేవిని ఊహించుకుంటూ “జాబిలితో చెప్పనా… జాము రాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా…రోజా” అని పాడుకుంటూ బయల్దేరాను. అయినా “తుమ్మెదలంటని తేనియకై తుంటరి పెదవికి దాహాలు” అన్న మాట మీకు మాత్రం తెలియనిదా అనేసి ఊరుకున్నారు అన్నగారు. ఆమాత్రం దానికే ఇంతలేటయ్యిందా? అని మళ్ళీ అడిగారు రాఘవేంద్రుడు. “అబ్బే లేదండీ! ఈ లేటంతా ఆ అక్కాచెల్లెళ్ళవల్లే” అని అసలు విషయం చెప్పడం మొదలుపెట్టారు ఎన్టీయార్. నే వస్తున్న దారిలో అల్లిబిల్లి సంతలో పిల్లగాలి జాతరవుతుంటే ఆగా. అంతే “సన్నజాజులోయ్ – కన్నెమోజులోయ్” అంటూ తన తళుకు బెళుకు కనమంటూ వెంట పడిందా జ్యోతిలక్ష్మి. తన ఊపుకు జడిసి, తనని తప్పించుకుని ఆ పక్క వీధిలోకి పరిగెత్తాను. ఆ కంగారులో ఎవరో ఆడ మనిషి ఎదురుగా వస్తుంటే, పర్లేదులే అని గుద్దేశాను. ఆశ్చర్యంగా నా అంతటివాడినైన నేనే కింద పడ్డాను. ఎవరా అని చూసేలోపే “నీ ఇల్లు బంగారం కానూ” అంటూ నన్ను జబ్బ పట్టుకుని పైకిలేపిందా జయమాలిని. మంచి జోరు మీదున్నావు జోడు కడతావా అని అడిగింది. వజ్రాల వాడలోన వైఢూర్యమంటిదాన్నంది. మోజుమీద సన్నజాజి పూలు పెడతావా అని కూడా అడిగింది. ఎలానూ బజ్జీల బుజ్జి హేండ్ ఇచ్చింది కదా అని సరే అన్నా. తీరా బయల్దేరితే “ఏడేడు వారాల నగలిస్తే రమ్మంటా – హారాలకే అగ్రహారాలు రాసిస్తా” అని చావుకబురు చల్లగా చెప్పింది. అయినా ఆ పుట్టింటోళ్ళు తరిమేసిన పిల్ల – కట్టుకున్నోడు వదిలేసిన పిల్ల మనకెందుకులే అనిపించింది. పదహారేళ్ళని కట్టుకథలు చెబుతుంది గాని, దాని పట్టు చూస్తే తెలుస్తుంది పాతికేళ్ళు తక్కువుండవని. అక్కడనుండి తప్పించుకుని బయటపడి అత్త మడుగు వాగు దాటి ఇంటి దారి పట్టాను. మా ఆవిడకు ఏ అనుమానం రాకూడదని చిరునవ్వు నవ్వుకుంటూ లోపలికెళ్ళాను. నన్నలా చూసి ఈ మధుమాసంలో ఆ దరహాసాలు ఏంటంటూ సిగ్గుపడింది. నా చూపుల్లో మా “ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలు” కనిపిస్తున్నాయంది. “మా ఇంటి లోన మహలక్ష్మి నీవే – మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే – సిరులెన్నొ ఉన్నా చిరునవ్వు నువ్వే” అని చేమంతి మొగ్గలాంటి నా చెలి బుగ్గపై ముద్దుపెట్టి, హృదయాన్ని అద్దంలా పదిలంగా చూసుకోమని జాగ్రత్తలు చెప్పి బస్టాండుకి వచ్చాను. అక్కడ ఒకటో నెంబర్ బస్సు ఎక్కాను. దాని యవ్వారం మీకు తెలిసిందే కదా. వచ్చేసరికి ఈ టైమ్ అయ్యింది! అని చెప్పుకొచ్చారు ఎన్టీయార్ సోఫాలో కూలబడుతూ. గాఢంగా నిట్టూర్చారు రాఘవేంద్రుడు.

ఇంతలో తలుపు ధన్ మని తెరుచుకుంది. “ఇదే ఇదే రగులుతున్న అగ్నిపర్వతం – ఇదే ఇదే మండుతున్న మానవ హృదయం” అని ఆవేశంగా లోపలికొచ్చారు సూపర్‌స్టార్ కృష్ణ. కంగారుగా లేచారు రాఘవేంద్రరావు. ఏమైందని కృష్ణ రెండు భుజాలూ పట్టుకుని కుదుపుతూ అడిగారు. “వెన్నెలైనా… చీకటైనా… చేరువైనా… దూరమైనా, నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము” అని నాతో డ్యూయెట్లు పాడిందా శ్రీదేవి. ఇదేదో బానేవుందని, మంజువాణి ఇంటిలో మేజువాణి పెట్టించి, రాతిరంత అక్కడే రాజధానిగా చేసుకుని పరవశిద్దామనుకున్నాను. కావాలంటే ఆ కోదండరామరెడ్డిని అడగండి. అని ఆవేశంతో ఊగిపోతున్నాడు సూపర్‌స్టార్. “సరే, సరే! ఇంతకీ మీకొచ్చిన ఇబ్బందేమిటి” అని అడిగాడు దర్శకేంద్రుడు. కృష్ణ, రాఘవేంద్రరావు వైపు నిప్పులు కురిపిస్తూ చూశాడు. అంతా మీ వల్లే అన్నాడు. అదిరిపడ్డాడు రాఘవేంద్రరావు. నా వల్లా? అని ఆశ్చర్యంగా అడిగాడు. “హా మీవల్లే! మొన్నామధ్య మీరా శ్రీదేవిని చిరంజీవితో తియ్యగా చెంపదెబ్బ కొట్టించారట. అప్పట్నుంచి, పురుషుల్లో అంతకుమించిన పుంగవుడు లేడని, పులకింతొస్తే అస్సలు ఆగడని ఒకటే కలవరింతలూ, పలవరింతలూ. ఒళ్ళు మండిపోతుందిక్కడ. ఆకాశంలో ఒక తారలాంటి జయప్రద నాకోసం ఆ వేళ వస్తే, ఈ శ్రీదేవి కోసం కాదు పొమ్మన్నాను. ఒయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల్లా ఉండే ఆ విజయశాంతి కూడా ‘ఎక్కడో అలికిడి, అక్కడే అలజడి’ అని నా మీదమీద కొచ్చినా సరే, కాదని అదిలించి పంపించేశాను. ఇప్పుడు ఈ శ్రీదేవి చూస్తే “ప్రియతమా నను పలకరించు ప్రణయమా” అంటూ ఆ చిరంజీవితో డ్యూయెట్స్ పాడుకోవడానికి వెళ్ళిపోయింది.” అంటూ ఆ పక్కనున్న కుర్చీలో కూర్చుని “వైశాఖ మాసంలో వయసొచ్చిన వాళ్ళతో ఇదే ఇబ్బంది, మహలక్ష్మిలా ముక్కుపుడకలు, శ్రీలక్ష్మిలా సిగను పూలు పెట్టుకోరు. ఎప్పుడూ రతికే తెలియని రసరాత్రులు, శృతులే కలిసిన సుఖరాత్రులు కావాలంటారు. అయినా నా పిచ్చిగాని “మధువనిలో రాధికలు..మధువొలికే గీతికలు” ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారు” అని ఆవేశంగా అనుకుంటూ ఎగశ్వాస పీలుస్తున్నాడు నటశేఖరుడు.

“హలో! సూపర్‌స్టార్ గారూ! ఏదీ ఒక్కసారి ఫేస్ ఇటు టర్నింగ్ ఇచ్చుకోండి” అంటూ లోపలికి ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్. అందం హిందోళంలా అధరం, తాంబూలంలా ఉన్న అమ్మాయిలెందరో నా వెంట పడ్డారు. తమ ఎదల్లోనే శుభలేఖలు వ్రాసుకుని, కలల్లోనే నాకు పంపుకున్నవాళ్ళూ ఉన్నారు. కాశ్మీరులోయలోను, కన్యాకుమారిలోను చందమామల్లా ఉండేవాళ్ళు, నాకోసం కర్పూరవీణల్లా కరిగిపోయేవాళ్ళూ, ఈడు వచ్చాక ఇట్టా వచ్చి – నేను నచ్చాక నాకే ఇచ్చిన వాళ్ళూ, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజంటూ రగులుతున్న మొగలిపొదల్లా ఉండేవాళ్ళు, ఇలా ఎందరో భామలు ప్రేమ లోతెంతో చూడడానికి లెగులెగు లెగు వీరా అంటూ నాకోసం కాచుకుని కూర్చున్నారు. ఇంకా చెప్పాలంటే వానజల్లు గిల్లినా, నీటిముల్లు గిచ్చినా ఊగిపోయే సన్న తొడిమంటి నడుమున్న అందగత్తెలు ఎంతమంది నాకోసం వెయిటింగో తెలుసా మీకు. నాకు జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా గుర్తుపెట్టుకోండి. అయినా కొంగజపాలు, దొంగజపాలూ చేస్తూ కాలానికి బ్రేకులేస్తూ కూర్చుంటాననుకున్నారా? లేక మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లుకుని, చిన్నచీర కట్టిన పడుచు సొగసుల పాలాస్త్రీల కోసం చూస్తుంటాననుకున్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి మాష్టారూ… ఎంతమంది ఇందువదనలు, కుందరదనలు కొమ్మెక్కి కోయిలమ్మల్లా కూసినా, సందెపొద్దులకాడ సంపంగుల్లా నవ్వినా పడిపోవడానికి నేనేమీ “అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను” సుప్రీమ్ హీరోని ఆ… అని ఆ పక్కనున్న గదిలోకి వెళ్ళి మంచమెక్కి పడుకుండి పోయాడు. అప్పుడే బి.గోపాల్, రవిరాజా పినిశెట్టిలతో అక్కడకొచ్చిన కోదండరామరెడ్డి, చిరంజీవి ఎమోషనల్ డైలాగ్స్ విని “ఎంత ఎదిగిపోయావయ్యా – ఎదను పెంచుకున్నావయ్యా..” అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. కృష్ణ కోపంతో తన కుడి చేతి పిడికిలి బిగించి ఎడమ భుజం మీద కొట్టుకున్నాడు. ఈలోగా చిన్న నవ్వొకటి వినిపించింది కృష్ణకు. అటుగా చూశాడు. ఆ డూప్లెక్స్ హౌస్ మెట్ల మీద కూర్చుని ఉన్నాడు యండమూరి. ఆరో మెట్టు మీద కూర్చొని, తను ఎక్కి వచ్చిన అయిదుమెట్ల వంకా చూస్తూ 13-14-15 అని ఏవో లెక్కలేసుకుంటూ నవ్వుకుంటున్నాడు. ఎందుకానవ్వు? అని అడిగాడు కృష్ణ. “చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం చీర దాచలేని సోకు నాకు సంబరం” అని చిరంజీవి స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ దగ్గర పాడిన పాట గుర్తొచ్చి నవ్వొచ్చింది అన్నాడు. అందులో నవ్వడానికేముంది? అన్నాడు కృష్ణ. “చీకటంటి చిన్నదాని” అని అనడానికి కారణం నిరోషా అంత నల్లగా ఉంటుందనేనంటారా? అని మళ్ళీ పకాలున నవ్వాడు యండమూరి. ఉఫ్‌… అనుకుంటూ కృష్ణ కళ్లుమూసుకుని నిద్దట్లోకి జారిపోయాడు.

“ఒక్క, ఒక్క, ఒక్క, ఒక్కరూపాయి కూడా ఇవ్వను, నచ్చింది చేసుకోండి” అని ఎవరిమీదో శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ వేగంతో మొబైల్‌లో కేకలేసుకుంటూ లోపలికొచ్చాడు శోభన్ బాబు. “ఏమైంది బాబూ?” అంటూ అతని వెనకాలే లోపలికొచ్చాడు విజయ్ బాపినీడు. “అసలు నా గురించి వీళ్ళకేం తెలుసండీ. సుహాసినిని అడగమనండి తెలుస్తుంది నా గొప్పతనమేంటో! “ప్రేమే నీ రూపం – త్యాగం నీ ధర్మం అని చెప్పింది నాకోసం. నువ్వు రాజువయ్యా – మహరాజువయ్యా అని కూడా అంది. అంత గొప్ప విషయాలు ఈ గాడిదలకేం అర్థమవుతాయి”. కొమ్మకొమ్మకీ ఓ సన్నాయి ఉంటుందనీ, ఎల్లువొస్తే గోదారమ్మ ఎల్లాకిల్లా పడుతుందని తెలుసా అసలీ ఫూల్స్‌కి. సందె గాలి వీస్తున్నప్పుడు..సన్నజాజి పూస్తున్నప్పుడు “చిన్నమాట ఒక చిన్న మాట” అంటూ నాకోసం వెర్రెక్కిపోయే ఆడవాళ్ళు ఉన్నారన్న విషయమైనా తెలుసా ఈ స్కౌండ్రల్స్‌కి. “దేహమేరా దేవాలయం – జీవుడే సనాతన దైవం” అని మొన్నా రామాలయం దగ్గర కూడా చాలామందికి చెప్పాను. ఆ విషయం విజయశాంతికి కూడా తెలుసు! అంటూ కోపంతో చెలరేగిపోతున్నాడు నట భూషణుడు. రాఘవేంద్రరావు మెల్లగా లేచి వెళ్ళి “కూల్‌డౌన్..కూల్‌డౌన్ బాబూ, అలా మండి పడకయ్యా బాపు గారి జాబిలి లాగా” అని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. శోభన్‌బాబుకి కోపం నషాళానికి అంటింది. ఏంటి కూల్ డౌన్. ఇదంతా మీవల్లే అన్నాడు. రాఘవేంద్రరావుకి మతి పోయింది. ఇందాక కృష్ణా ఇలానే అన్నాడు. ఇప్పుడు శోభన్ బాబు అలానే అంటున్నాడు. గుసగుసగా అడిగినట్టు అసలు ఏమైంది? అన్నాడు. “మీరు ఆ దేవత సినిమాలో పాటకోసం సవాలక్ష బిందెలు తెప్పించారు. షూటింగ్ అయిపోయాక ఆ రామానాయుడు గారు ఆ బిందెలన్నీ షామియానా వాడికి తిరిగిచ్చేసి రెంటు కట్టేశానన్నారు. కానీ ఈరోజు ఆ బిందెలవాడు కాల్ చేశాడు. లెక్కేస్తే మూడు బిందెలు తక్కువున్నాయట. వాటికి నన్ను డబ్బులు కట్టమంటున్నాడు రాస్కెల్. అసలు ఆ బిందెలతో నాకేంటండి సంబంధం. ఆ వందల బిందెల ఆలోచన మీది. వాటి మీదనుంచి చెంగుచెంగున దూకిందేమో ఆ శ్రీదేవి. మధ్యలో నాకేం పట్టిందండి” అని ఆవేశపడిపోతూ “ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగే వారెవ్వరో..ఈ పాపాలు కడిగే దిక్కెవరో” అంటూ ఆపైన మాటరాక ఆగిపోయాడు శోభన్‌బాబు. ఆ బిందెలవాడికి ఆ మూడు బిందెల డబ్బులు నేనిచ్చేస్తానని చెప్పి, నిప్పులో పడ్డ ఉప్పులా ఎగిరెగిరి పడుతున్న ఉప్పు శోభనాచలపతిరావుని శాంతింపజేశారు రాఘవేంద్రరావు.
“ఆకాశదేశానా.. ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా” అని పాడుకుంటూ పై గదిలోంచి కిందకి దిగుతున్నాడు ఎఎన్నార్. అప్పుడే దాసరితో కలిసి అక్కడకు వచ్చిన జయప్రద, పరిగెట్టుకుని వెళ్ళి ఆ నటసమ్రాట్ పాదాలకు నమస్కరించి “నిన్నటిదాకా శిలనైనా – నీ పదము సోకి నే గౌతమినైనా” అంటూ పాటందుకుంది. “ఈ పాదనమస్కారాలు, శిలలకు పూజలు వట్టి ట్రాష్” అనుకుంటూ గబగబా మెట్లు దిగి వెళ్ళి ఎన్టీయార్ కునుకు తీస్తున్న సోఫాలో కూర్చున్నాడు అక్కినేని. “ఎంతో మధురమీజీవితం – అంతే లేని ఓ అద్భుతం” అని తనలో తాను అనుకుంటూ అలా కళ్ళు మూసుకున్నారు. “అసుర సంధ్యవేళ ఉసురు తగుల నీకు స్వామీ – ఆడ ఉసురు తగలనీకు స్వామీ” అని అక్కినేని వంక ఓరగా చూస్తూ, పాట పాడుకుంటూ పై గదిలో రిలాక్స్ అవ్వడానికి వెళ్ళిపోయింది జయప్రద.
“పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ” అని జడ తిప్పుకుంటూ అక్కడకు వచ్చింది మీనా. వచ్చీరావడంతోనే, ఎగిరి ఎఎన్నార్ పక్కన కూర్చుంది. “తాతయ్యా, నాకొక డౌట్” అంది. ఎంటన్నాడు అక్కినేని. ‘జయచిత్ర మామ్మ’ను చూసి “రవివర్మకే అందని ఒకే ఒక అందానివో” అని ఎలా అనాలనిపించింది అంది. ఎఎన్నార్ ముఖంలో రంగులు మారడం గమనించిన దాసరి, విసుగ్గా… ఇదిగో అమ్మాయ్! ఇప్పుడవన్నీ ఎందుకు? నువ్వు లోపలికెళ్ళు అని గద్దించాడు. “పావురానికి పంజరానికి పెళ్లిచేసె పాడు లోకం – కాళరాత్రికి చందమామకి ముళ్లుపెట్టె మూఢలోకం” అని దాసరి వంక చూస్తూ, చిలిపిగా నవ్వుతూ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది.

ఇంతలో వెంకటేశ్, నాగార్జున కబుర్లు చెప్పుకుంటూ లోపలికొచ్చారు. రాఘవేంద్రరావుకి ఎదురుగా ఉన్న కుర్చీలలో కూర్చున్నారు. సాయంకాలమైంది. ఇంకా మన ప్రోగ్రామ్ మొదలవ్వడానికి చాలా టైముంది. సరదాగా పాటలు పాడుకుందాం అన్నాడు దర్శకేంద్రుడు. సరేనన్నాడు దర్శకరత్న. “ఆకాశాన సూర్యుడుండడూ సందె వేళకు” అని ఎత్తుకున్నాడు వెంకటేశ్. ఆ వెంటనే “ఆమని పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ” అని అందుకున్నాడు నాగార్జున. “చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు..ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు” మొదలు పెట్టాడు వెంకటేశ్. “కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో, తడి నీడలు – పడనీకే ఈ దేవత గుడిలో! చిరు చేపల కనుపాపలకిది నా మనవి.. ఓ పాపాలాలీ” అంటూ పాట మధ్యలో నుండి మొదలు పెట్టాడు నాగార్జున. “అబ్బా…ఇవేం పాటలు. ఊపున్నవి పాడొచ్చు కదా” అంటూ లోపలికొచ్చింది రస రమ్యకృష్ణ. నాగార్జున క్షణం ఆలస్యం చెయ్యలేదు. “నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు – నేను రోమియోగ మారినది లగాయితు – నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయితు” అంటూ వెల్కమ్ చెప్పాడు. వెంకటేశ్ పాటకోసం తడుముకుంటుంటే “ఆకాశమే నా హద్దుగా, నీ కోసమొచ్చా ముద్దుగా – తెచ్చానురా మెచ్చానురా గిచ్చేయి నచ్చిన సొగసులు” అంటూ కిలకిలా నవ్వింది రమ్యకృష్ణ.

ఇంతలో భూమి కొద్దిగా అదిరింది. “సెంచరీలు కొట్టే వయస్సు మాదీ – బౌండరీలు దాటే మనస్సు మాదీ” అంటూ కార్ దిగీ దిగడంతోటే ఒక్క ఉదుటన లోపలికి దూకాడు బాలయ్యబాబు. బెదిరి చూస్తున్న రమ్యకృష్ణ చెయ్యి పట్టుకుని “ప్రేమంటేనె పేచీలు రాత్రికి మాత్రం రాజీలు – గిల్లిగిచ్చి కజ్జాలు లవ్లీ లావా దేవీలు – మనసు ఆగదు వయసు తగ్గదు” అంటూ డాన్స్ మొదలు పెట్టాడు. మరి నా పాటో అంటూ వచ్చింది రవీనా టాండన్. “స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..” అంటూ తనతో కూడా కాలు కదిపాడు బాలయ్య. ఇంతలో ఎక్కడో గుళ్ళో గంట మోగిన శబ్దం వినిపించింది. వెంటనే బాలకృష్ణ “శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావ తాళాన్వితం .. సంగీతామృత పానం ఇది స్వరసుర జగతీ సోపానం” అని ఆరున్నొక్క రాగంలో పాడుతూ, తల విపరీతంగా ఊపుతూ అక్కడ టోటల్ మూడ్‌నే ఛేంజ్ చేసేశాడు.

ఆ టైమ్‌లో ఎంట్రీ ఇచ్చారు సింగీతం శ్రీనివాసరావు గారు. వస్తూనే… “ఆకాశం నీ హద్దురా ఏ అవకాశం వదలొద్దురా” అంటూ అందరిలో ఉత్సాహం పెంచారు. సర్ మాక్కొంచెం రొమాంటిక్‌గా కావాలన్నారు వారిలో కొందరు. “సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో, మలయజ మారుత శీకరమో, మనసిజ రాగ వశీకరమో” అంటూ గేర్ మార్చారు సింగీతం గారు. ఇంకొంచెం డోస్ పెంచాలన్నారు ఇంకొందరు. సింగీతం గారి ఉత్సాహం రెట్టింపయ్యింది. “నెర జాణవులే వరవీణవులే, కిలికించితాలలో, జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో” అంటూ అందర్నీ రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రొమాన్స్ గుండెకు టచ్ అయ్యేలా పాడండన్నారు రాఘవేంద్రరావు. “సిరిమల్లె నీవే విరిజల్లు కావే – వరదల్లే రావే వలపంటి నీవే – ఎన్నెల్లు తేవే ఎద మీటి పోవే” అని రాగాలాపన చేశారు సింగీతం. ఇప్పుడు విషాదం అన్నారు దాసరి. “ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా – పూదారులన్ని గోదారికాగా.. పాడింది కన్నీటి పాటా” అని ఆగారు బరువెక్కిన గుండెతో. ఇప్పుడు ఫైనల్‌గా రోమాలు నిక్కబొడుచుకునే పాటకావాలన్నారు అక్కినేని. “ఈ పాదం ఇలలోన నాట్య వేదం – ఈ పాదం నటరాజుకే ప్రమోదం” అంటూ ముగించారు సింగీతం గారు. అందరూ చప్పట్లు కొట్టారు.

ఇంతలో “జగములేలిన వాని సగము నివ్వెరబోయే – సగము మిగిలిన వాని మొగము నగవైపోయే” అన్న పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుండగా లోపలికొచ్చారు “ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడూ పార్వతీ” లాంటి బాపు రమణలు. వారి వెనకాలే “మా ఱేడు నీవని ఏరేరి తేనా – మారేడు దళములు నీ పూజకు” అంటూ రెబల్‌స్టార్ మీసం తిప్పుకుంటూ వచ్చాడు. మీరో పాట పాడండని బాపుని అడిగారు రాఘవేంద్రరావు గారు. “రమణ గారు బాగా పాడతారండీ” అని చెప్పి వెళ్ళి సోఫాలో కూర్చున్నారు బాపు. రమణ గారు ఎత్తుకున్నారు.. “కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ – ఇతడే దిక్కని మొక్కని వాడికి – దిక్కు మొక్కు లేదండండీ – బాబు రాండీ రాండీ శిశువా” అని ఆగారు. భలే ఉందీ పాట, ఇంకొంచెం పాడండి అని అడిగింది రమ్యకృష్ణ. “అప్పులు గొప్పగ చెయ్యొచ్చండి – అసలుకు ఎసరే పెట్టొచ్చండి – పీపాలెన్నో తాగొచ్చండి – పాపాలెన్నో చేయొచ్చండి” అని నవ్వేసి పాట ఆపేశారు రమణ గారు. ఇంకో సరదా పాట కావాలన్నాడు వెంకటేశ్. “ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం – మమ్మీ పోయి డాడీ వచ్చే ఢాం ఢాం ఢాం – పెన్ను పోయి గరిటె వచ్చే ఢాం ఢాం ఢాం – ఇదే కొత్త కింగ్‌డం ఢాం” అన్నారు రమణగారు. ఇప్పుడొక రొమాంటి ఎక్స్‌ప్రెషన్ ఉన్న లైను కావాలన్నాడు నాగార్జున. “త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువ౦టి సొగసు చూడ తరమా, నీ సొగసు చూడ తరమా” అని ముసిముసిగా నవ్వి ఊరుకున్నారు రమణ గారు. చివరిగా అందరికీ ఏదైనా సందేశం ఇవ్వండి అన్నారు రాఘవేంద్రరావు. “విడిపోకు చెలిమితో – చెడిపోకు కలిమితో – జీవితాలు శాశ్వతాలు కావురా – దోస్తీ… ఒకటే ఆస్తిరా!” అని పాడేసి వెళ్ళి బాపు పక్కన కూర్చున్నారు రమణ గారు. ఇప్పుడు మీరొక పాట పాడండి అని దాసరిని అడిగారు రవిరాజా పినిశెట్టి. “నవమినాటి వెన్నెల నేను – దశమి నాటి జాబిలీ నీవు – కలుసుకున్న ప్రతిరేయీ – కార్తీక పున్నమి రేయి” అని పాడి, ఇంకచాలు నాకు ఆయాసమొస్తుంది, మళ్ళీ పాడమని అడగకండి అన్నారు.

ఆలోగా “ఒయ్యారి గోదారమ్మ… ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం – కడలి ఒడిలో కలసిపోతే కల వరం” అని పాడుకుంటూ లోపలికొచ్చారు వంశీ. ఇదే గోదావరి మీద కొంచెం విషాదం ధ్వనించేలా పాడండి అని అడిగింది మీనా అక్కడకు వచ్చి. వంశీ పాడేలోపే “వెన్నెల్లో గోదారి అందం – నది కన్నుల్లో కన్నీటి దీపం. అది నిరుపేద నా గుండెలో.. చలి నిట్టూర్పు సుడిగుండమై.. నాలో సాగే మౌనగీతం” అని పాడుతూ లోపలికొచ్చింది భానుప్రియ. “యవ్వనాలు అదిమి అదిమి.. పువ్వులన్ని చిదిమి చిదిమి – వెన్నెలంత ఏటిపాలు చేసుకుంటినే..” అని ఇంకొంచెం ఆర్ద్రంగా పాడేసరికి అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయ్. సిట్యుయేషన్ బరువెక్కిందనేసరికి భానుప్రియ పాట మార్చింది. “కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, విశ్వనాథ కవితై, అది విరుల తేనెచినుకై, కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై” అంటూ అందరి హృదయాలు ఆనందంతో పొంగించిందా జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన మైనాలాంటి భానుప్రియ. ఇప్పుడు నాకు రొమాంటిక్‌గా కావాలంది జయప్రద క్రిందకు దిగివచ్చి. “గోపెమ్మ చేతిలో గోరుముద్ద – రాధమ్మ చేతిలో వెన్నముద్ద – ముద్దు కావాలా…ముద్ద కావాలా…ఆ విందా ఈ విందా నా ముద్దు గోవిందా” అంటూ పాట మొదలు పెట్టిందా చారడేసి కళ్ళ సుందరి. “జారు పైట లాగనేలరా, ఆఆ, ఆరుబయట అల్లరేలరా, ఆఆ, ముద్దు బేరమాడకుండా ముద్దలింక మింగవా” అనేసరికి అంతటి దర్శకేంద్రుడు కూడా మాట లేకుండా ఉండిపోయాడు. “వాలుజళ్ళ ఉచ్చులేసినా, ఆఆ, కౌగిలింత ఖైదు వేసినా, ఆఆ, ముద్దు మాత్రమిచ్చుకుంటే ముద్దాయల్లె ఉండనా” అని భానుప్రియ పాట ఆపే టైమ్‌కి అక్కడున్న వారంతా సరసలోకంలో షికారు చేస్తున్నారు. ఇంకొక్క పాట భానుప్రియ పాడినా, తమనుతాము తమాయించుకోవడం కష్టమనిపించింది అక్కడున్న వారందరికీ. బాపూ గారు, రాఘవేంద్రరావు గారు వంశీగారి వంక “నువ్వు మామూలువాడివి కాదబ్బాయ్” అన్నట్టు చూశారు. వంశీగారు “నిరంతరమూ వసంతములే-మందారములా మరందములే” అని ఆనందంగా పాడుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చున్నారు.

“నెమలికి నేర్పిన నడకలివీ, మురళికి అందని పలుకులివీ, శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీలా” అని పాడుకుంటూ మెల్లిగా వాకింగ్ స్టిక్ సహాయంతో లోపలికి వచ్చారు కళాతపస్వి. అక్కడ ఉన్నవాళ్ళలో కొంతమంది లేచి “ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది” అనే పాటందుకున్నారు. అందరి వంకా చిద్విలాసంగా చూసి కుర్చీలో కూర్చున్నారు విశ్వనాథ్ గారు. “ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటుపోతుందో ఎవరినీ అడుగక” అని పాడుతూ వచ్చి విశ్వనాథ్ గారికి నమస్కరించాడు చంద్రమోహన్. “మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలా” అని పాడుకుంటూ వచ్చి ఆయన పక్కన కూర్చుంది అందానికే అందమైన ఆ పుత్తడి బొమ్మ జయప్రద. కూర్చునేటప్పుడు జయప్రద కాలి గజ్జె ఘల్లుమనేసరికి, విశ్వనాథ్ గారి గుండె ఝల్లుమంది.

ఈలోగా “ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ – పడమటి సంధ్యా రాగాలేవో పారాణి పూసెనులే” అని పాడుకుంటూ విజయశాంతి లోపలికొచ్చింది. ఏమిటి విజయా మా జంధ్యాల పాట పాడుకుంటూ వస్తున్నావ్!, తను వస్తున్నాడా? అని అడిగారు విశ్వనాథ్. అదిగోనండి వచ్చేశారు అని గుమ్మంవైపు చూపించింది. లిపిలేని కంటి బాసలు పలికిస్తూ నవ్వుతూ లోపలికొచ్చారు జంధ్యాల. రావడంతోటే సోఫాలో జారబడి, కనులు మూసుకొని “అక్షరాల నీడలలో, నీ జాడలు చూచుకుని, ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని, నీ కంటికి పాపను నేనై, నీ ఇంటికి వాకిలి నేనై, గడప దాట లేక, నన్నే గడియ వేసుకున్నాను, గడియైనా నీవులేక గడపలేక ఉన్నాను” అంటూ పాడుకుంటున్నారు. అందరూ శ్రద్ధగా ఆయన పాటనే వింటున్నారు. జంధ్యాల కళ్ళు తెరిచారు. రాఘవేంద్రరావు గారు జంధ్యాలతో…ఏదైనా నీ టైపు సరదా పాట పాడు అన్నారు. “నడుం మీద జడ కుచ్చెల టెన్నీసు – గుచ్చుతోంది గుండెల్లో పిన్నీసు – ఓ సీతా నా కవితా నేనేలే నీ మాతకు జామాత” అని పాడారు జంధ్యాల. అందరూ ఘొల్లుమన్నారు. ఇప్పుడు గుండె పొంగిపోవాలి అన్నారు దర్శకేంద్రుడు. “ఎవరీ గోపిక పదలయ వింటే.. ఎదలో అందియ మ్రోగే – పదమే పదమై మదిలో వుంటే.. ప్రణయాలాపన సాగే, హృదయం లయమై పోయినదీ.. లయలే ప్రియమై జీవితమై..” అని వెంటనే పాడేశారు జంధ్యాల. “పిలిచిన మురళికి వలచిన మువ్వకి, ఎదలో ఒకటే రాగం అది ఆనందభైరవి రాగం” అంటూ ఆ పాట పల్లవితో ముక్తాయింపునిచ్చారు రాఘవేంద్రరావు. ఇప్పుడు గుండె కదిలిపోవాలి అన్నారు విశ్వనాథ్. “వెన్నెలే కరువైన నాడు నింగి నిండా చుక్కలే – కన్నె గానే తల్లి వైతే కంటి నిండా చుక్కలే!” అంటూ పాడి గొంతు పెగలక ఆగిపోయారు. ఇప్పుడు డ్యూయెట్ పాడాలి. కానీ అందులో ఫిలాసఫీ ఉండాలన్నారు దాసరి. “జీవితం సప్త సాగర గీతం, వెలుగు నీడల వేదం, సాగనీ పయనం” అని పాడటం మొదలు పెట్టారు జంధ్యాల. “ఏది భువనం ఏది గగనం తారా తోరణం, ఈ చిగాగో సియర్స్ టవరే స్వర్గ సోపానమూ. ఏది సత్యం ఏది స్వప్నం డిస్నీ జగతిలో, ఏది నిజమో ఏది మాయో తెలియని లోకమూ’ అనేసరికి, ఇదేదో అమెరికా జాతీయగీతంలా ఉందే అన్నారు కోదండరామిరెడ్డి. ఇప్పుడింకో ప్రేమగీతం కావాలి అన్నారు రెడ్డిగారు. “ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే, కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే, ప్రేమను కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే, జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువవుతానులే, నీ నవ్వులే చాలులే” అని పాడారు జంధ్యాల. అందరూ తన్మయత్వంలో ఉన్నారు. ఇంకొక్కటి, ఇంకొక్కటి అని అందరూ అరవడం మొదలు పెట్టారు. “అలివేణీ ఆణిముత్యమా – నీ కంట నీటి ముత్యమా – ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో – స్వాతి వాన లేత ఎండలో – జాలినవ్వు జాజి దండలో” అని ఆపారు. ఎవ్వరికీ తనివి తీరడం లేదు. ఇంకొక్కటి పాడండి ప్లీజ్ అన్నారు. “అడుగులా అష్టపదులా, నడకలా జీవనదులా, పరువాల పరవళ్ళు పరికిణీ కుచ్చిళ్ళు, విరి వాలుజడ కుచ్చుల సందళ్ళు” అంటూ ముద్దుకే ముద్దొచ్చే ముద్దమందారం కోసం పాట పాడారు జంధ్యాల. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.

ఇంతలో “గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన” అని పాడుకుంటూ లోపలికొచ్చారు బాలసుబ్రహ్మణ్యం. వచ్చీరావడంతోటే, ఏంటి రాఘవా పెద్దాయన ఇంకా రాలేదా అని అడిగాడు. లేదు బాలూ, అందరం గురువుగారి కోసమే వెయిటింగ్ అన్నారు రాఘవేంద్రరావు. “ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి, భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి, వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి” అని పాడుతూ వచ్చిన శేఖర్ కమ్ముల, బాలూ వైపు తిరిగి గురువు గారు వచ్చేశారు. కీరవాణీ గారితోను, వైవిఎస్ చౌదరితోనూ కలిసి ఇప్పుడే కారు దిగారు అన్నాడు. అందరూ లేచి నిల్చున్నారు. గదుల్లో పడుకున్నవాళ్ళంతా కూడా వచ్చి అందరితో కలిశారు.

ఇంతలో మిన్నేటి సూరీడులా, “రా దిగిరా – దివి నుండి భువికి దిగిరా” అని వేడుకుంటే కైలాసం నుండి దిగి వచ్చిన పరమశివుడిలా ఆ పెద్దాయన లోపల అడుగు పెట్టారు. వెంటనే బాలు ఆయన పాదాల మీద పడిపోయాడు. “దొరకునా ఇటువంటి సేవ, నీ పద రాజీవముల చేరు నిర్వాణసోపానమధిరోహణము సేయు త్రోవ” అంటూ ఆయన పాదాలను కన్నీళ్ళతో తడిపేస్తున్నాడు. “ప్రాణము నీవని, గానమె నీదని, ప్రాణమె గానమనీ – మౌనవిచక్షణ, గానవిలక్షణ, రాగమె యోగమనీ” అంటూ అలానే పాడుతునే ఉన్నాడు. మెల్లిగా బాలూని పైకి లేవనెత్తిందా మూర్తి. బాలూ కళ్ళకు కన్నీళ్ళు అడ్డొచ్చి ఆ మూర్తి సరిగా కనపడటం లేదు. కళ్ళు తుడుచుకొని చూస్తే ఆ సుందరమైన మూర్తి బాలూ కళ్ళకు శతసహస్ర రవితేజంలా కనిపించింది. ఆ సుందర రామ మూర్తి చేయి బాలూ తలని ఆప్యాయంగా నిమిరింది. సరిగమలకు డుమువులు ఆశీస్సులు అని చిరునవ్వు నవ్విందా ముఖం. శ్రీరాముని ఆంజనేయస్వామి కౌగిలించుకున్నట్టు కౌగిలించుకున్నాడు బాలు. అందరూ ఆ వేటూరి సుందరరామమూర్తి గారి చుట్టూ చేరారు. అందరితో మాట్లాడుతూనే ఆయన కళ్ళు నాలుగు వైపులా చూస్తున్నాయి. ఇంతకీ ఈ సమావేశం ఏర్పాటు చేసినవాడెక్కడ అని అడిగారాయన. “నమస్కారం గురువు గారు” అని ముందుకు వచ్చి నమస్కరించి ఆయన పాదాల మీద పడ్డాడు రాజన్ పి.టి.ఎస్.కె.

స్వస్తి!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top