అలు అరు ఇణి-వేటూరి(విశాలి పేరి)

భావకవిత్వం ప్రజలలోకి సులువుగా తీసుకెళ్ళే ప్రక్రియే ఈ సినీ సాహిత్యము. కవి ఏది చూశాడో, ఏది భావించాడో పాటల ద్వారా ప్రేక్షకులకు అందిస్తాడు. ఆ పాటలాధారంగా వినేవాడు చిత్తంలో దాన్ని మళ్ళీ చూడాలి. అలా చూస్తే మొదట కవి చూసిన ఆ వస్తు సౌందర్యం ఎంత అందమైనదో ప్రేక్షకుడికి కూడా చక్కగా వ్యక్తమౌతుంది. ఈ భావ గీతాలలో ప్రకృతి వర్ణనలు, హరివిల్లుగా విరుస్తాయి. మన తెలుగు సినీగీతాలలో ముఖ్యంగా ఇటువంటి ప్రకృతి వర్ణనతో కోకిల చేత “కుకు” లు పాడించింది దేవులపల్లివారు అయితే , ఆ తరవాత వేటూరి మాత్రం ఆ కోకిల చేత పెళ్ళి పిలుపులని, నెమలికి తెలియని నాట్యాన్ని నేర్పించారు.

గోదావరి అలల తాకిడి వింటే కొబ్బరాకు నుండి వచ్చే అరుణకిరణం కూడా కవిత్వం చెబుతుందిట. నాకు గోదావరి ఎప్పుడు చూసినా ఆకుపచ్చని లంగా వోణీతో శంఖాలు పూరించి కిన్నెరలు మీటించి శంకరాభరణాలపకంఠి అయిన పదరాణాల తెలుగింటి ఆడపిల్లలా అనిపిస్తుంది. అటు వంటి గోదారి ఒడ్డున చిత్రీకరించే పాటలలో సాహిత్యం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కదా! అలాంటి పాటలలో ఎన్నటికీ మరువలేని పాటలు “ప్రేమించు – పెళ్ళాడు ” సినిమాలోనివి. వేటూరి సాహిత్యానికి, ఇళయరాజా సంగీతము బంగారానికి సువాసననిచ్చింది. ఆ గోదారొడ్డున సూర్యోదయాలు, సూర్యాస్తమాలు, వెన్నెలలో అందాలు అన్నీ అనుభవేజ్ఞులకే తెలుస్తుంది.

చింబించుకున బింబాధరాల సూర్యోదయాలే పండేటి వేళ ” అని అన్నా ” గగనం భువనం అలిసే సంధ్యారాగం అవుతుంటే ” అని అన్నా, ఆ వర్ణనకు మూలము ఆ గోదారి ఒడ్డూ, అక్కడి సూర్యోదయాలు, సూర్యాస్తమాలే కదా!

నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగా మువ్వాగోపాలుని రాధికా ” ఈ పదంలో మాత్రం నాకు గిరికాదేవిని వర్ణించిన తీరు గుర్తొస్తుంది. నంది తిమ్మన తన పరిజాతపహరణం లో “అన్ని పూల మీదా తిరిగే తుమ్మెద తన మీద వాలటం లేదని సంపెంగి పువ్వు బాధపడి, బ్రహ్మ కోసం తపస్సు చేసిందిట. అప్పుడు బ్రహ్మ సంపెంగి పువ్వును గిరికా దేవి ముక్కుగా చేశాడుట (అంటే ఆవిడ ముక్కు సంపెంగి పువ్వు, కళ్ళు తుమ్మెదలు). అంతే కాదు ముఖము చంద్రబింబం అయ్యిందిట, పాపం నక్షత్రాలు తమ విభున్ని ఇమ్మని ఆ గిరికా దేవి కాలి మీద పడ్డారుట (కాలి గోళ్ళు నక్షత్రాలలా మెరుస్తున్నాయని కవి భావం). ఇలాంటి పోలిక ఈ రోజుల్లో ఏ పద్య రూపలో చెబితే అర్ధం చేసుకొనే వారు తక్కువే, కాబట్టీ అందరికీ అర్ధమయ్యేటట్టు వేటూరి గారు ఈ పాటలో వర్ణించారు. (వయ్యారి గోదారమ్మ) .

వేటూరి రాసే పాటలలో పల్లవులు చాలా సూటిగా వినే వారి వినుల విందుగా, క్యాచీగా ఉంటాయి. ఎంత సుతారంగా ఉంటాయో అంత భాషాలంకారాలతోను ఉంటాయి.

(వయ్యారి గోదారమ్మ ఒళ్లంతా ఎందూకమ్మ కలవరం
కదలి ఒడిలో కరిగి పోతే కల… వరం
)

(రాధా బాధితుణ్ణిలే… ప్రేమారాధకుణ్ణిలే )

శృంగారగీత విషయంలో శృంగారరసాన్ని లలితమైన పదాలతో, దీర్ఘసమాసాలతో, ఉధృతమైన పదాలు లేకుండా సరళంగా చెప్పాలి. అలా సరళమైన లలితమైనపదాల్ని పాటలో ఉపయోగిస్తే అక్కడ శబ్దౌచిత్యాన్ని పాటించినట్టుగా అనుకోవచ్చు. ఇలాంటి పాటలు కొన్ని దశాబ్ధాలైనా ఈనాటికీ అదే ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

ప్రేమలో మునిగిన జంట చుట్టూ ఉన్న ప్రపంచాన్నే ఏదో ఊహాలొకంగా భావిస్తూ కోకిలలనే నేస్తాలుగా చేసుకుంటూ, వెన్నెల వేణుగానాలలో తేలుతూ, నదులలో వీణమీటే తెమ్మెరే ప్రాణాలుగా, తుమ్మెదలనే చుట్టాలనుకుంటూ, స్వరసుమాలను పూయిస్తూ, పదాలఫలాలను ఆశ్వాదిస్తూ, నిరతరమూ వసంతగానాలు ఆలపిస్తూ ఉంటారు.

అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే…
మెరుపులేఖల్లు రాసి మేఘమై మూగవోయే…
మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే
మాఘ దాహాలలోనా అందమే ఆవిరాయే

ఈ వర్ణన రాయాలంటే కవితారసోదయం అయ్యితే కానీ సాధ్యము కాదు. ఎక్కువగా పౌష్య మాసంలో మంచు పడుతుంది, అదే సమయంలో ధ్యాన్యపు పంట చేతికి వస్తుంది. ఈ రెంటినీ కలిపి “మంచుధ్యాన్యాలు ” అన్న పదప్రయోగము… వేటూరికే చెల్లింది.

వాలుజళ్ళ ఉచ్చులేసినా.. కౌగిలింత ఖైదు చేసినా ” అంటూ అందమైన శిక్ష కోరుకొనే చిలిపి ముద్దాయి ఈ పాటలకే హై లెట్టు. వేటూరి కొన్ని పాటల్లో “జడకుచ్చులు.. మెడకి ఉచ్చులు ” అని ప్రయోగించారు.

ప్రేమించు పెళ్ళాడు సినిమా పాటలలో, మరచిపోయిన “అలు అరు ఇణి ” తెలుగింటి మూలాములల నుండి ధైర్యంగా వచ్చి మనతో ఆడుకుంటాయి. , “ఆలటవెలదిగా, తేటగీతిగా ” నాయికని ముందుంచి, “నండూరి వారి ఎంకిని, విశ్వనాథ వారి కిన్నెరసానిని, బాపురమణల సీగానపసూనాంబని ” జడకుచ్చుళ్లతో, పరికిణీతో వచ్చి స్వేఛ్చగా, హాయిగా మనతో విహరించేలా చేస్తాయి. పాట విన్నాక కూడా మన మనసు పొరలలో ఆ జ్ఞాపకాలు పదిలంగా పదికాలాలు నిలిచిపోతాయి.

ఇంత మంచి సినిమానీ, సినిమాకి తగిన పాటలని మాకు ఇచ్చినందుకు మీకూ ఎన్నో వందనాలు వంశీ గారు!!

4 thoughts on “అలు అరు ఇణి-వేటూరి(విశాలి పేరి)”

    1. శ్రీనివాస్ పప్పు

      మీరు తెలుగు వారేనా? తెలుగు అక్షరమాల తెలిసుంటే వీటి గురించి తెలిసుండేది

      1. తెలియదనే గా అడిగిందీ, కాస్త వివిరించి చెప్పుదురూ!

Leave a Reply to Rajendra Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top