అపర శ్రీనాథుడు వేటూరి -(విశాలి పేరి)

అపర శ్రీనాథుడిగా ఖ్యాతిగాంచిన వేటూరి కలములో జాలువారి మనల్ని అలరించి పాటలు ఎన్నో ఉన్నాయి. తెలుగు భాష ఉన్నంత కాలము సినీ పాటల సాహిత్యాన్ని ఆస్వాదించే అభిమానులు ఉన్నంత కాలము ఆయన చిరంజీవులే. ఆ కలంలో అమృతం అనే సిర వేసి రాసారేమో… అవి అప్పుడు విన్న వీనుల విందే! సరస్వతి కచ్చపి, అర్జునుడి గాంఢీవం, శరవణుడు శక్తి… వేటూరి కలము… వేటికవే! ఆయన కలానికి రెండు వైపులా పదునని ఆయన పాటల ద్వారానే తెలుస్తుంది. పాటలో ఎన్నోపద ప్రయోగాలు చేశారు. భాషాలంకారాలతో పాటని ముస్తాబు చేశారు.

ముఖ్యముగా ” శ్రీ హస్త కమల మధుపము” అన్న ఒక్క వాక్యము చాలు… ఎన్నో కీర్తనల సారాన్ని సమగ్రముగా సరళంగా వివరించడానికి. అమ్మవారిని “పద్మప్రియాయై పద్మహస్తాయై పద్మాక్షే పద్మసుందర్యై పద్మోద్భవాయై ” అని వర్ణిస్తాము, ఆవిడ చేతులు పద్మాలైతే ఆ పద్మాల చుట్టూ తిరిగే మధుపము శ్రీవారి పాదాలు ” (పులకభూషణమాశ్రయంతీభృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ ) . (కానీ మధుపము చుట్టు ఈ పద్మాలే తిరుగుతాయి). అన్నమయ్య వ్రాసిన “బ్రహ్మ కడిగిన పాదము” కీర్తన అనుకరించినా తనదైన ముద్ర వేశారు ” ఈ పాదం ఇలలోన నాట్య వేదం” అనే పాటతో.

కొన్ని పాటలు వింటుంటే ఋషులందరి రసజ్ఞత సారాన్ని ఆయన పుణికి పుచ్చుకున్నారేమో అని అనిపిస్తుంది. లలితా సహస్ర భాష్యాన్ని, కనకధారా స్తవాన్ని ఆయనదైన వాణిలో “అఖిలాండేశ్వరి చాముండేశ్వరి ” పాటలో చెప్పారు. “సంగీతపమి సాహిత్యం సరస్వతీ స్థనద్వయం ” అనేది ” సరస సాహిత్య, స్వరస సంగీత స్థన యుగలే ” అని సూటిగా కీర్తించారు. ఏ పాళి తోనైతే అమ్మవారిని “ఇందువదనే కుందరదనే ” అని అన్నారో.. అదే పాళితో కథానాయికని “ఇందువదన కుందరదన.. మందగమన మధురవచన ” అని పొగిడారు. “నేను మేనను కుంటే ఎద చీకటే ” అని రమణుడి సందేశాన్ని పామరులకు సైతం అర్ధమయ్యేటట్టు చెప్పారు.

” వసంత కాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః. ” అని అన్నట్టు.. కొన్ని సంధర్భాలలో అసలైన కవులు కోకిలలా బయటపడతారు. ఆయన రాసే కలం ఇరువైపులా పదును ఉన్న విషయం కూడా అప్పుడే తెలుస్తుంది. అన్నో పురాణానేతిహాసాల సారాలును కరతళామలకం చేశారు.

ఆమని వర్ణనలో దేవులపల్లి వారి తరువాత వేటూరనే చెప్పాలి. ” పొగడలేని ప్రేమకి పూన్న చెట్టు నీడకి.. పొగడదండలల్లనా? ” , “ఎలనాగు, ఎలదేటి, ఎలమావి.. ఇలాంటి అచ్చమైన పచ్చిక పదాలు పాటకు ఆయన ఇచ్చిన వరాలు. “పున్నాగ.. సన్నాయి” (పున్నాగ పువ్వు సన్నాయిలాగానే ఉంటుంది), మంచు ధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోయే, మారేడు నీవని నేనేరి తేనా మారేడు దళములు నీపూజకు, ఎరుక గలిగిన శివుడు ఎరుకగా మారగా, నీ జడకుచ్చుళ్లు నా మెడకుచ్చులు.. ఇలా చెప్పుకుంటూ పోతే పుంఖాలు పుంఖాలే రాసేయచ్చు. అన్నీ అద్భుత గీతాలు రాసేసి “బ్రతుకే పాటైన పసివాడను ” అని ఏమి తెలియనట్టే ఉన్నారు. ఏం తగ్గిందో మా సుందర రామయ్యకు భోగం ఇక్కడ… వాయువైపోతాను గగనానికి అంటూ స్వర్గసీమలలో అప్సరసలకు “కళలన్నీ ఒకటేనని ” అని చెప్పడానికి వెళ్ళిపోయాడు.

జనవరి 29వ తేదీ ఆయన జయంతి .. తెలుగు పదానికే జన్మదినం…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.