వేల పాటల వేటూరి – (రాజన్ పి.టి.ఎస్.కె)

మనకి బాగా నచ్చినవాళ్ళ జయంతులకి, వర్థంతులకి ఏదో ఒకటి రాయాలనిపిస్తూనే ఉంటుంది. వారివి కొన్ని జయంతులు, వర్థంతులు గడచిపోయాక…రాయాల్సింది, చెప్పాల్సింది ఇంకేమన్నా మిగిలిందా? అంటూ వెతుకులాటమొదలవుతుంది. అలాంటి వెతుకులాటలు అవసరం లేకుండా, వేల పాటలు రాసి పోసేసి, వాటిలో మరెన్నో వేల ప్రయోగాలు చేసి పారేసి “వీటిలో నీకు నచ్చింది తీసుకో- నచ్చినంత రాసుకో” అంటూ ఆ పసిడి పాటల కుప్ప మనకు తన తర్జనితో చూపిస్తూ, ముసిముసిగా నవ్వుకుంటూ, దర్జాగా నడుచుకుంటూ వెళిపోతున్నట్లు అనిపిస్తుంటుందా సుందరమైన మూర్తి.“ఏది…ఆయన రాసినమంచి హిట్ సాంగ్స్ గబగబా ఓ పది చెప్పు?” అని ఎవరైనా అడిగితే, ఏ మాత్రం తడుముకోకుండా సిరిసిరిమువ్వ, అడవిరాముడు, శంకరాభరణం, వేటగాడు, సాగరసంగమం, జగదేకవీరుడు-అతిలోకసుందరి, మాతృదేవోభవ, సప్తపది, నాలుగు స్తంభాలాట, యముడికి మొగుడు, సితార, అన్వేషణ, సీతారామయ్యగారి మనవరాలు, గీతాంజలి, మయూరి, శ్రీవారికి ప్రేమలేఖ, ఇలా అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయిన ఆయన సింగిల్ కార్డ్ సినిమాలు కనీసం ఓ పదిహేనో పదహారో ఠపీమని చెప్పెయ్యచ్చు. వీటిల్లో ఉన్న సాంగ్స్ లెక్కేస్తేనే ఎనభయ్యో తొంభయ్యో ఉంటాయి. ఇక తాపీగా కూర్చుని ఆలోచిస్తూ రాయడం మొదలు పెడితే…సహస్రం దాటినా పెన్ను ఆగే అవకాశం లేదు.“ఎన్నెల్లు తేవే ఎద మీటి పోవే” అని రంగనాథ్… పంతులమ్మకోసం తన్మయత్వంతో పాడుకుంటుంటే… “తుడిచి కన్నీళ్ళు, కలిసి నూరేళ్ళు జతగఉందామోయి” అని ఓ అందాల తార రెబెల్ స్టార్ కోసం పలవరిస్తుంటుంది.
“నీవే ముద్దుకు మూలధనం 
పడుచు గుండెలో గుప్తధనం 
ఇద్దరి వలపుల చందనం 
ఎంత కురిసినా కాదనం 
ఏమి తడిసినా వద్దనం- ఈ దినం” అంటూ రాధ వానకి, వయసుకి వందనాలు చెప్పుకుంటూ చిరూతో స్టెప్పులేస్తుంటే…
“ఆశయమన్నది నీ వరం
తలవంచును అంబరం
నీ కృషి నీకొక ఇంధనం
అది సాగర బంధనం” అని అశ్వనీ నాచప్ప బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ పెట్టుకుని
పరిగెడుతుంటుంది
“కొబ్బరి నీళ్ళ జలకాలాడి
కోనసీమ కోక గట్టి
పొద్దుటెండ తిలకాలెట్టి
ముద్ద పసుపు సందెల కొస్తావా”
అని “అమ్మతో చెప్పి అప్పాలు తెచ్చుకునే” శుభలేక సుధాకర్ తన స్థాయిలో హీరోయిన్ ని
రమ్మని అడిగితే…
“నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జా కట్టి 
గుట్టుగా సెంటే కొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి 
తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టీ 
పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారాణెట్టి 
చీకటింట దీపమెట్టి చీకుచింత పక్కానెట్టి 
నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి”
అంటూ తను ఎలా వస్తుందో, వచ్చాక ఏం చేస్తుందో తన లెవెల్‌లో చెప్పుకొస్తుంటుంది ఆ అతిలోక సుందరి “ఫోజుల్లో యముడంటి, మోజుల్లో మొగుడంటి” తన జగదేకవీరునితో.“ఆ త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాదీ బొమ్మ – రాగమేదొ తీసినట్టు ఉందమ్మా” అని చంద్రమోహన్ ప్రేమపరవశంతో పాడితే… ఆ వాగ్గేయకారుణ్ణే తలుచుకుంటూ “త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువ౦టి సొగసు చూడ తరమా” అని రాజేంద్రప్రసాద్ చిలిపిగా పాడుకుంటాడు.“అలా మండి పడకే జాబిలీ” అని సుహాసిని విరహగీతాలాలపిస్తుంటే… ”జాబిలితో చెప్పనా” అని మొదలు పెట్టిన యన్టీయార్ “తుమ్మెదలంటని తేనియకై తుంటరి పెదవుల దాహాలూ” అంటూ శ్రీదేవితో సరసంగా పాడేస్తుంటాడు.
“ఏ దేశమైనా ఆకాశమొకటే
ఏ జంటకైనా అనురాగమొకటే
అపురూపమీ ప్రణయం” అని తూర్పుదేశం అమ్మాయి, పశ్చిమదేశం అబ్బాయి పాడుకుంటుంటే… పావురానికి పంజరానికి ఈ పాడులోకం పెళ్ళిచేసేసిందని ఇక్కడ ‘చంటి’ ఏడుస్తుంటాడు“కంగారు పడ్డ కన్నె శృంగారమా – వణుకుల్లో కూడ ఇంత వయ్యారమా” అని రాధను భయపెడుతున్న ఆ ‘దొంగ’ హీరో పాడుతూ ఆశ్చర్యపోతుంటే… “నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు” నేను రోమియోగా మారిపోయానంటూ ‘అల్లరి అల్లుడు’ రమ్యకృష్ణతో అల్లరి చేస్తుంటాడు.“పిపీలికాదిబ్రహ్మలో పిపాస రేపు ప్రేమలు!” అని ప్రేమ రేంజ్ ఎంతో…సింపుల్ గా చెప్పేసుకుంటుంటారు స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ దగ్గర హీరోహీరోయిన్లు. “కాలమంత కత్తిరిస్తె కాస్త యవ్వనం – రెండు కళ్ల కత్తిరేస్తె రేయి ఈ దినం” అన్న రొమాంటిక్ ఫిలాసఫీ కూడా వాళ్ళక్కడే చెప్పుకుంటారు!“ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ” అని బాలయ్య… దివ్యభారతికోసం తెగ వెయిట్ చేస్తుంటే… “జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో” అంటూ సిల్క్‌స్మిత ఎంట్రీ ఇస్తుంది.
“ప్రేమలేఖ రాశా నీకంది ఉంటదీ – పూల బాణమేశా ఎద కంది ఉంటదీ” అని హీరో
“హంసలేఖ పంపా నీకంది ఉంటదీ – పూలపక్క వేశా అది వేచి ఉంటదీ” అని హీరోయిన్ ‘ముత్యమంత ముద్దులు’ పెట్టుకుంటుంటుంటే…“ఒంటికేమో ఈడొచ్చెరా ఇంటికొస్తే తోడేదిరా” అని సూరీణ్ణి వాటేసుకున్న జాబిల్లిని మత్తుగా చూస్తూ మెగాస్టార్ తూలిపోతుంటాడు.“మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి – కలికి పదములు కడలి కడిగిన కళ ఇది” అని భారతదేశం కోసం అమెరికాలో పాడుకుంటుంటే…“మతి కృతి పల్లవించే చోటు- కల ఇల కౌగిలించేచోటు – కృషి ఖుషి సంగమించే చోటు” ఇదే అంటూ అమెరికా కోసం అమెరికాలోనే పాడుకుంటూ ఉంటారు.“వలపులన్నీ వడ్డిస్తా, వలపు వడ్డీ చెల్లిస్తా!” అంటూ జయసుధ ఓ రకంగా నందమూరి అందగాడితో అంటే..“వలపులన్ని కలిపి వంట చేసుంచాను – ఇంటి కొస్తే సామి వడ్డించుకుంటాను” అని ఆ అందగాడితోనే జయమాలిని ఇంకోరకంగా అంటుంది.వీళ్ళ వడ్డీల సంగతి ఇలా ఉంటే…సంసారమనే చదరంగం ఆడే ఆటగాడు గొల్లపూడి “బాకీ బ్రతుకుల్లో బిడ్డలు వడ్డీలోయ్” అంటూ నిర్వేదంగా పాడుకుంటాడు.“ముద్దు బేరమాడకుండ ముద్దలింక మింగవా” అంటూ గోపెమ్మ తన చేతిలో గోరుముద్ద పెట్టుకుని ‘ప్రేమించు-పెళ్ళాడు’ అని గోముగా అడుగుతుంటే…“ఓ సీతా నా కవితా – నేనేలే నీ మాతకు జామాత” అంటూ ‘రెండు జెళ్ళ సీత’ కోసం హీరో పరిగెత్తుకు వెళిపోతాడు.“ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే” అని హీరో “తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్ననులే” అని హీరోయిన్ చినుకుగా, నదులుగా, వరదగా పొంగే ప్రేమలో పరవశించిపోతుంటే…“రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై – ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని” తన ప్రేయసికి చెప్పమని ఆకాశదేశంలో ఉన్న ఆషాఢ మేఘానికి చెప్పుకుంటూ దుఃఖిస్తుంటాడో పెద్దాయన.
“కులికే మువ్వల అలికిడి వింటే.. కళలే నిద్దురలేచే 
మనసే మురళీ ఆలాపనలో.. మధురానగరిగ తోచే 
యమునా నదిలా పొంగినదీ.. స్వరమే వరమై సంగమమై” అంటూ వలచిన మువ్వ పిలిచిన మురళి తో ;ఆనందభైరవి’ రాగంలో అంటుంటే…
“చిరునవ్వులు అభినవ మల్లికలు
సిరిమువ్వలు అభినయ గీతికలు
నీలాల కన్నుల్లో తారకలు
తారాడె చూపుల్లో చంద్రికలు” అంటూ నెమలికి నేర్పిన నడకలు మురళికి అందని పలుకులతో నర్తిస్తుంటాయి.“వీణ వేణువైన సరిగమ విన్నావా…” అని హీరోయిన్ అడిగితే, ఆ హీరో వేరే సినిమాలోంచి వచ్చి “మానసవీణ మధుగీతం మన సంసారం సంగీతం” అంటూ పాడేస్తుంటాడు.“మర్మస్థానం కాదది మీ జన్మస్థానం -మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం” అని విజయశాంతిలోని జానకి గారు ఆవేదనతో ఆక్రోసిస్తుంటే…“కన్నతల్లి కన్నీటికి ఏ ఖరీదు కట్టిందీ కసాయిలోకం” అంటూ సూపర్‌స్టార్ కృష్ణలోని బాలు రగులుతున్న ‘అగ్నిపర్వతం’లా బ్రద్దలవుతుంటాడు.‘ఖైదీ’లోని చిరు విశ్వామిత్రుడు “వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే” అంటూ మేనకతో పాడుకుంటూ “ఋషి కథ మారే రసికత మీరే” అని అసలు
విషయం బయటపెడితే…“అసుర సంధ్యవేళ ఉసురు తగుల నీకు స్వామీ
ఆడ ఉసురు తగలనీకు స్వామీ” అని జయప్రద దేవదేవిగా అన్న మాటకు… 
“నశ్వరమిది నాటకమిది నాలుగు గడియల వెలుగిది
కడలిని కలిసే వరకే కావేరికి రూపు ఉన్నది” అంటూ అక్కినేని విప్రనారాయణ సమాధానమిస్తాడు.“కౌగిలింతలోన గాలి ఆడకూడదు.. 
చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు” అని ఒకరు
“వెన్నెలైనా చీకటైనా నీతోనే జీవితము 
నీ ప్రేమే శాశ్వతము” అని ఇంకొకరు అంటూ ఒకరినొకరు పట్టుకొని పచ్చగా కాపురం చేసుకుంటుంటారు ఒక జంట.ఇంకొకచోట
“మనసున్న మంచోళ్ళే మారాజులు
మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు” అని బాధలో ఉన్న భర్తను ఊరడిస్తూ నువ్వు “రాజువయ్యా మహరాజువయ్యా” అని భార్య అన్నం తినిపిస్తుంటుంది.“మా రేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు” అని కల్మషం లేని కన్నప్ప ఆనాడు పాడుకుంటే..“మాలధారణం నియమాల తోరణం 
జన్మకారణం దుష్కర్మవారణం
శరణం శరణం” అంటూ స్వామి అయ్యప్పను ఇప్పటి భక్తులు కొలుచుకుంటున్నారు.
“జానకి కన్నుల జలధితరంగం
రాముని మదిలో విరహ సముద్రం
చేతులు కలిపిన సేతు బంధనం
ఆ సేతు హిమాచల ప్రణయ కీర్తనం
సాగర సంగమమే ప్రణవ సాగర సంగమమే” అని ప్రణయ సాగరసంగమాలు ఒకవైపు…
“మట్టింటి రాయే మాణిక్యమైపోయే
సంగీత రత్నాకరానా
స్వర సప్తకాలే కెరటాలు కాగా
ఆ గంగ పొంగింది లోన” అంటూ స్వరరాగగంగాప్రవాహాలు మరోవైపు!ఇంకా “రాక రాక నీవు రాగ..వలపు ఏరువాక” అంటూ చిన్నమాట చెప్పే ఓ చిన్నది, “ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడూ పార్వతీ – శతమానం భవతి నీకు శతమానం భవతి” అని ఆశీర్వదించే బ్యాక్‌గ్రౌండ్ సింగర్, “ తరాల నా కథ క్షణాలదే కదా – గతించిపోవు గాధ నేనని” అనే గీతాంజలిబాలుడు, “భద్రగిరి రామయ్య పాదాలు కడగంగ పరవళ్లు తొక్కిన గోదారి గంగ”, గోరువంక వాలగానే స్వరాల గణగణలతో మ్రోగిన గంటలు, “నిన్నటి దాకా శిలలైన గౌతమిలు”, “రవివర్మకే అందని ఒకే ఒక అందం”, “ఘొల్లుమన్న మల్లెపువ్వులు”, సందెపొద్దుల కాడ ముద్దాడుకున్న బంతీచామంతులు, కరిగిపోయిన కర్పూరవీణలు, పూసంత నవ్విన పున్నాగలు, శ్రీలక్ష్మి పెళ్లికిచ్చిన చిరునవ్వు కట్నాలు, ఎల్లువొచ్చి ఎల్లకిల్లా పడ్డ గోదారమ్మ, వెన్నెలపైటేసి వచ్చిన కిన్నెరసాని, నరుడా ఓ నరుడా ఏమి కోరిక అంటూ వెంటపడే యక్షిణులు, తెలుగు పదానికి జన్మదినాలు, చుక్కల్లోకెక్కిన చక్కనోళ్ళు, “నరుడి బ్రతుకు నటనలు – ఈశ్వరుడి తలపు ఘటనలు”, నాదోపాసన చేసిన శంకరశాస్త్రులు, అలకపానుపులెక్కిన చిలిపిగోరింకలు, పులకింతొస్తే ఆగని పురుషుల్లో పుంగవులు, ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినవాళ్ళు, “ఆకాశమే హద్దురా” అంటూ చెలరేగిపోయేవాళ్ళు, ఆరేసుకోబోయి పారేసుకున్నవాళ్ళు, కోకిలమ్మ పెళ్ళికి వేసిన కోనంత పందిరులు, యమహానగరులు, కాశ్మీరులోయలో కన్యాకుమారిలు, నవమినాటి వెన్నెలలు-దశమినాటి జాబిలిలు, లిపిలేని కంటిబాసలు, చైత్రము కుసుమాంజలులు, ఎదలో ఎప్పుడో రాసుకున్న శుభలేఖలు, పట్టుపురుగు జన్మ తరించేలా పట్టుచీరలు కట్టిన పుత్తడిబొమ్మలు…ఇలా ఒకటేమిటి సర్వభావాలని, సకలప్రకృతిని, తన పాటల్లో పెట్టి, వాటిని మన చెవుల నుండి గుండెల్లోకి పరుగులు తీయించిన అద్వితీయ కవితాఘనచక్రవర్తి…మన వేటూరి సుందరరామమూర్తి.

ఆరువేల తన పాటలలో అంతకు పదింతల అందమైన భావాలను వెదజల్లిన వేటూరి గారి పదములకు నమస్కరిస్తూ… వారి మీద వచ్చిన కొన్ని విమర్శలకు ఆయన చెప్పిన
“చందమామలో మచ్చని మెచ్చని సచ్చినోళ్ళదా సరసత – వేపపువ్వులో తీపిని వెదికే తేనెటీగదే రసికత.” అనే సమాధానాన్ని గుర్తు చేసుకుంటూ స్వస్తి!-

———————————————————————————————————
రాజన్ పి.టి.ఎస్.కె గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.