వేటూరి కలానికి అక్షరార్చన-(జగదీశ్ కొచ్చెర్లకోట)

 

 

పట్టుపరిశ్రమకి ఎప్పుడైనా వెళ్ళారా? మేం ఇంటర్లో వుండగా మా బోటనీ సార్ వెంకటేశ్వర్లుగారు తీసుకెళ్ళారు.

మొత్తం వివరంగా తెలుసుకున్న తరవాత పట్టుపురుగులు చనిపోవడం తలుచుకుని ఆ పదహారేళ్ళ వయసులో “ఈ ఆడవాళ్ళు పట్టుచీరలు కట్టుకోకపోతేనేం?” అన్నంత కోపమొచ్చేసింది.

అయితే ఒక పట్టుపురుగు చేసిన త్యాగం ఎప్పుడు సార్ధకమవుతుంది?

“నువు పట్టుచీరకడితే ఓ పుత్తడిబొమ్మా!
ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ!”

ఎవరలా అన్నది? అందంగా వున్నావనడం వేరు. ఇలా భావామృతాన్ని ఒలకబొయ్యడం ఏకొద్దిమంది కారణజన్ములకో సాధ్యమవుతుంది.

ఆ కలానికి కలకలం సృష్టించడం తెలుసు.
మనసు వికలమయ్యే విషాదాన్నీ, మదినిండిపోయే ఆహ్లాదాన్నీ అలవోకగా అందించే అరుదైన కలమది!

ఆ రాధచేత ఆరాధనాగీతి పలికించగలిగే సాహిత్యమది

కాళియమర్దనం కథ చిన్నతనాన అమ్మ చెబుతోంటే నోరుతెరుచుకుని విన్నాం.

ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చినకన్నుల చూశారని ఈయన చెబుతోంటే అచ్చెరువొందాం!

కొంతకాలంపాటు స్తబ్దుగా రాయిలా పడున్న సినీ సాహిత్యం ఈ సుందరరాముడి ‘పద’స్పర్శతో మళ్ళీ అహల్యలా అందంగా ఒళ్ళు విరుచుకుంది.

అలతిపదాలతో అలవిమాలిన అందాన్ని అలదడం ఇతగాడికి అమ్మే నేర్పిందో, అమ్మలగన్న అమ్మదగ్గరే అభ్యసించాడో…!

లిపిలేని కంటిభాషను చదవగలిగే నేర్పరితనం ఈయనకి ‘పెన్ను’తోపెట్టిన విద్య!

గడపదాటలేక నన్నే గడియవేసుకున్నానని ఆపిల్ల తనకున్న పరిధుల్ని కలబోసుకుంటే..

గడియైనా నీవులేక గడపలేకవున్నానంటూ ఆపిల్లాడు తన విరహాగ్నిని ఒలకబోశాడు.

ఇలారాయాలంటే భావమొకటే చాలదు. ప్రేమికుల మానసిక పరిస్థితులతోబాటు బాధ్యతలు, కట్టుబాట్లు, సమాజ ధోరణి.. ఇవన్నీ కూడా ముందేసుకుని కూర్చునివుండాలి.

ఉచ్ఛ్వాసనిశ్వాసాల్ని వాయులీనాతోను,
స్పందించు నవనాడుల్నీ వీణానాదాలుగాను పోల్చడమంటే కవిగారు కాళిదాసు రూపం దాల్చడం కాక మరేమిటి?

ఆకలికి మనిషి బానిస. అన్నానికి ఆకలి బానిస. నిర్మాతకి రచయిత బానిస. అందుకే…

నాదాత్మకుడిగా మనలోన వెలిగిన ఈ ప్రాణదీపం కాస్తా అ…అంటే అమలాపురమనీ, మేలైన సరుకుంది వేలమాడుకోమనీ, చిల్లరకోసం చిల్లర రాతలూ రాసింది. అయినా అఖండజ్యోతిగానే వెలిగింది.

ఏదైనా విషయాన్ని పొందుపరిచేముందు అందులో నిజానిజాల్ని బేరీజువెయ్యడం, నిర్ధారించుకోవడం.. అనే అలవాట్లులేని యువత ఈయన్నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి.

మధురలో కథావస్తువుందంటే మీనాక్షి చరిత్రను…
‘కలకత్తా గురించి పాటండీ!’ అంటే వంగదేశ ఖ్యాతినీ అధ్యయనం చేసి తనదైన శైలిలో మనదైన భాషలో ఆ పదాల్ని ఇరికించి రాయడం…ఆతరవాత మనందరిచేతా రిఫరెన్సులు చేయించడం ఈయనకి సరదా!

వయసెరుగని మనసది! ఆ కలం వృద్ధాప్యమెరుగదు..వ్యాయామమే తప్ప!

అంతటి కృషివుందిగనుకనే ఆమనిషి ఋషయ్యాడు! పట్టుదలుందిగనకనే మరోబ్రహ్మలా తన పాటలతో మనకు పునర్జన్మ ప్రసాదించాడు!

ఏలుకుంటే పాట…మేలుకుంటే పాట
పాడుకుంటే పాట…మా వేటూరి దేవుడు!

ఏపాట నేపాడను??
బ్రతుకే పాటయినవాడు అతగాడు.

అతని పాటవిన్న క్షారజలధులు కూడా క్షీరములవుతాయి. గుండియలు అందియలుగా మ్రోగి చిరనర్తనమాడతాయి.

వాసిలోనూ, రాశిలోనూ మాసిపోని ముద్రవేసుకున్న వేటూరికి నాదైన నివాళి!

–——————————————

జగదీశ్ కొచ్చెర్లకోట గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీమ్

You May Also Like

One thought on “వేటూరి కలానికి అక్షరార్చన-(జగదీశ్ కొచ్చెర్లకోట)

  1. చక్కని వ్యాసం. మీ వేటూకి అభిమానానికి, సాహితీ అభిరుచికి అభినందనలు. 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.