కుదిరిక కలిగిన వాగులా
వెలుతురు కన్నుల వేగులా
వైదిక పనసల పోగులా
నీలపు కలువల తీగలా
నేలకు జారిన గంగలా
శరద్వేణువులూదెను కృష్ణవేణి
విరహ రాధిక ఎదలోని కృష్ణవాణి
అంటూ వేటూరి సుందరరామమూర్తి గారు కృష్ణానదిపై తను రాసుకున్న కవితను పాడుతుంటే ఎంత మధురంగా ఉందో!
కృష్ణానదిపై ఆయన రాసుకున్న ఇంకొక పాటని కూడా వేటూరి గారు ఎంత హాయిగా పాడుతున్నారో!
భేషువా అనిపించె మా జాషువా
కవితకే కిరణమై వెలిగె కరుణశ్రీ
కిన్నెరలు పలికించె మా విశ్వనాథ
తెలుగు వారికి చాలు ఒక రాయప్రోలు
అంటూ కృష్ణాతీరం వారైన మహనీయులను స్మరించుకున్నారాయన.
ఇంకా
ఆమె పాటల డోల మా ఘంటసాల
ఆమె ఆటల హేల మా కూచిపూడి
గళం విప్పితే హాయి మా కపిలవాయి
ఆ కృష్ణ మురళిలే మా బాలమురళి
తాగితేనే చాలు ఆ నీరు గంగ
మునిగితేనే చాలు కీడు తొలగంగ
అంటూ పులకించిపోయారు వేటూరి గారు.
—————————— ———————–
శ్రీశైల శిఖరాన శివమెత్తి ఆడింది
ఆ నంది కొండల్లో సంద్రమై పొంగింది
పల్నాటి సీమలో బ్రహ్మనాయని ఇంట
కులదైవమై చాప కూడు వడ్డించింది
తెలుగింటికే రాణి మా కృష్ణవేణి
మా అన్నపూర్ణమ్మ పసుపుపారాణి
ఆ తల్లి కట్టేటి ఆకు పచ్చని చీర
ఒక కోటి ఎకరాల తెలుగు మాగాణి
ఆ తల్లి పలుకుల్లో గల పంచదార
సీస పద్యాలలో శ్రీనాథ వాణి
భేషువా అనిపించె మా జాషువా
కవితకే కిరణమై వెలిగె కరుణశ్రీ
కిన్నెరలు పలికించె మా విశ్వనాథ
తెలుగు వారికి చాలు ఒక రాయప్రోలు
ఆమె మెట్టిన చోటు మాకు దివి సీమ
ఆమె చల్లని నీడ మా స్వర్గ సీమ
కనుపాపలై వెలిగె హిందుబౌద్ధాలు
గళసీమలో పలికె నవ్యవేదాలు
ఆమె పాటల డోల మా ఘంటసాల
ఆమె ఆటల హేల మా కూచిపూడి
గళం విప్పితే హాయి మా కపిలవాయి
ఆ కృష్ణ మురళిలే మా బాలమురళి
తాగితేనే చాలు ఆ నీరు గంగ
మునిగితేనే చాలు కీడు తొలగంగ
—————————— ———————–
కుబుసము విడువని నాగులా
కుదిరిక కలిగిన వాగులా
వెలుతురు కన్నుల వేగులా
వైదిక పనలస పోగులా
నీలపు కలువల తీగలా
నేలకు జారిన గంగలా
శరద్వేణువులూదెను కృష్ణవేణి
విరహ రాధిక ఎదలోని కృష్ణవాణి
ఆగామి హేమంత రాగాల వేణువులు
ఊదసాగె పుష్యమాధవుండు
చెదురుమదురు నీటి చేమంతి గుల్బంతి
విచ్చసాగె కృష్ణవేణి కొరకు
రాలుటాకులు కావు రాగి మువ్వలొ ఏమో
సరిగజ్జెలైనవి గిరిజకపుడు
గరికకన్నెల లేత చిరునవ్వులోయన
హిమబిందు హారాలు అమరెనపుడు
మందగమనాలు నేర్చిన అందగత్తె
మంచు గుడిలోన వెలసిన మౌనదేవి
తెలుగు తల్లికి హారతి తెల్లవారి
సగం రాతిరి ఆమె నక్షత్ర వీణ
రాజన్.పి.టి.ఎస్.కె గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం