“అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను” అంటూ చంటబ్బాయ్ సినిమాలో హీరో…హీరోయిన్ తో కలిసి సరదాగా పాడుకున్నా…ఆ పాటలోని మొదటి వాక్యం మాత్రం ఆ హీరో విషయంలో నిఖార్సయిన సత్యం.
ఒక రాజకీయ నాయకుడిగా ఆయన విధానాలతో విభేదించేవారు ఎందరో ఉండుండొచ్చు. కానీ, ఒక తరంలో కోట్లాదిమంది తెలుగు వారిని అలరించిన నటుడిగా మెగాస్టార్ చిరంజీవికి అగ్రతాంబూలం ఇవ్వడాన్ని మాత్రం ఎవరూ కాదనలేరు.
ఇప్పటి హీరోలను వదిలి, ముందుతరం వరకూ చూస్తే…ఎన్టీయార్, ఎయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున- ఈ ఎనిమిదిమందీ తెలుగు సినీ ప్రపంచానికి అష్టదిగ్గజాల వంటి అగ్ర కథానాయకులు. వీరంతా తెలుగు ప్రేక్షకులను బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో అలరించినవారే. అందరూ అసంఖ్యాకంగా అభిమానులను కలిగి ఉన్నవారే. అయితే వీరందరిలో ఎన్టీయార్, చిరంజీవి మాత్రం తారాస్థాయిని అందుకున్నారనిపిస్తుంది.
ఈ రెండు తరాల లెజండరీ హీరోలకీ కూడా సూపర్‌హిట్ పాటలను రాసిన విఖ్యాత రచయిత- వేటూరి సుందర రామమూర్తి గారు.
చిరంజీవి డ్యాన్స్, స్టైల్, ఫైట్స్‌తో తెలుగు సినిమా కొత్త దారి పట్టింది.
చిరంజీవి పుట్టినరోజున ఆయన పాటలకోసం ఆలోచిస్తుంటే…అందులో అధికశాతం పాటలన్నీ వేటూరి గారు రాసినవే కదా అనిపించింది. లెక్కలేసి చూసినా చిరంజీవి-వేటూరి కాంబినేషన్‌దే రాసి-వాసి.
హాయిగా సాగే ప్రేమగీతాలైనా, మంచి దరువున్న పాటలు అయినా, కామెడీ సాంగ్స్ అయినా వాటిలో అందమైన సాహిత్యం పొదగబడినవి ఎన్నో ఉన్నాయి.
చిరంజీవి స్టెప్స్, వేటూరి లిరిక్స్, ఇళయరాజా/చక్రవర్తి/రాజ్-కోటి సంగీతం కలగలిసి ప్రేక్షకులతో ఈలలు వేయించాయి.
ఈ కాంబినేషన్‌లో హిట్ పాటలను గబగబా లెక్కేసినా కనీసం 60-70 అయినా వస్తాయి.
“మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు -మల్లె జాజి అల్లుకున్న రోజు”
“కరిగి పోయాను కర్పూర వీణలా – కలిసి పోయాను నీ వంశధారలా”
“గోరింట పూసింది గోరింక కూసింది – గొడవేమిటే రామ చిలకా నే తీర్చనా తీపి అలకా”
“రాగాల పల్లకిలో కోయిలమ్మ – రాలేదు ఈవేళ ఎందుకమ్మ”
“నేను నీకై పుట్టినానని – నిన్ను పొందకా మట్టికానని”
“కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ- కొండెక్కి చూసింది చందమామ”
“ప్రియతమా నను పలకరించు ప్రణయమా..అతిథిలా నను చేరుకున్న హృదయమా”
“శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో – అది నీకు పంపుకున్నా అపుడే కలలో”
“అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా”
“అందాలలో అహో మహోదయం-భూలోకమే నవోదయం”
“ఏమని నే…చెలి పాడుదునో – తికమకలో…ఈ మకతికలో”
“కట్టు జారిపోతా ఉంది – చీర కట్టు జారిపోతా ఉంది”
“ఉత్తరాన లేవంది ధృవ నక్షత్రం- దక్షిణాన లేవంది మలయ పర్వతం- నింగిలేని తారకా నీవెక్కడ నీవెక్కడ”
“హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో- మునిమాపుల్లో ఎల్లో మురిపాలలోయల్లో”
“శతమానమన్నదిలే చెలిమే -చిన్ని చిన్నారి ఆశలు గిల్లే”
“సీతే రాముడి కట్నం… ఆ సీతకు రాముడు దైవం- అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం”
వంటి హాయిగా సాగే సంగీతంతో కూడిన పాటలు
“వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా – నీటిముల్లే గుచ్చుకుంటే ఎట్టాగమ్మా”
“వానా వానా వందనం-వయసా వయసా వందనం”
వంటి వానపాటలు
“ఎంత ఎదిగిపోయావయ్యా – ఎదను పెంచుకున్నావయ్యా”
“నీ దారి పూలదారి పోవోయి బాటసారి – నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి”
వంటి హీరో క్యారెక్టర్ ని హృద్యంగా ఎలివేట్ చేసే పాటలు
“మా ఊరి దేవుడు అందాల రాముడు -మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు”
“అమ్మంటే మెరిసే మేఘం-నాన్నంటే నీలాకాశం”
వంటి భక్తి భావం ఉన్న పాటలు
“మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లాను రారా రారా”
“ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జఘన సొగసు లలనవే”
“బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే – మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే”
“సందె పొద్దులకాడ సంపంగి నవ్వింది – అందగత్తెని చూడ జాబిల్లి వచ్చింది”
“యమహో నీ యమ యమ అందం – చెలరేగింది ఎగా దిగా తాపం”
“రాధా రాధా మదిలోన మన్మథ గాధ – రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ”
“కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ.. కోరింది ఇచ్చుకోవా”
“కాశ్మీరులోయలో కన్యాకుమారిరో – ఓ సందమామ ఓ సందమామ”
“అరెరే యముడికి నే మొగుడినిరా – మనసుగల మనిషినిరా అభయమిదే”
“దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా”
“ఇది ఒక నందనవనము..మనసులు కలిసిన దినము..”
“బహుశా నిన్ను బందర్లో చూసి ఉంటా – తెలిసే నిను తొందర్లో తాకి ఉంటా”
“చక్కిలిగింతల రాగం – ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే”
“ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి”
“దేవుడైన జీవుడైన రిక్షవోడురా – భారతాన కృష్ణుడేమి చేసినాడురా”
“రగులుతోంది మొగలిపొద – గుబులుగుంది కన్నె ఎద”
“నీ మీద నాకు ఇదయ్యో..అందం నే దాచలేను పదయ్యో”
“కలలో పెట్టని ముద్దులు పెట్టు-కరిచే గాలికి కౌగిలి పట్టు”
“పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో ”
“నాగినివో భోగినివో, నాట్యకళా విలాసినివో”
“సాయంకాలం సాగరతీరం- నా చెలి ఒళ్లో… చలి సందళ్లో”
“నడక కలిసిన నవరాత్రి- సిగ్గు పడితే శివరాత్రి”
“నా కోక బాగుందా.నా రైక బాగుందా – కోకా రైకా కలిసిన ఒంటి సోకు బాగుందా”
“రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా”
“మన్మథా మన్మథా మామ పుత్రుడా.. ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా”
“నాపేరే కాంచనమాల నావయసే గరం మసాలా”
వంటి ఫాస్ట్ బీట్ పాటలు
“నేను ప్రేమ పూజారి…ఏదీ పోదు చేజారి – గుండెల్లో దాచుకున్న గుట్టులాగే గూఢచారి”
“ఏరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది -ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది”
“కొలువైనాడే ఊరి కొరివైనాడే- మా కొబ్బరికాయల సుబ్బరాయుడే”
“అమ్మ గదే .. బుజ్జి గదే .. నాపై కోపమా- దానికదే దీనికిదే అంటే నేరమా”
“కాష్మోర కౌగిలిస్తే ఏం చేస్తావో నేపాళీ మంత్రమేస్తే ఏమౌతావో – కంగారు పడ్డ కన్నె శృంగారమా వణుకుల్లో కూడ ఇంత వయ్యారమా”
“అచ్చా అచ్చా వచ్చా వచ్చా ఈడు వచ్చాక ఇట్టా వచ్చా… నువ్వు నచ్చాక నీకే ఇచ్చా”
వంటి సరదా పాటలు
“జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా – నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకూ కన్నీళ్ళూ”
“మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా- విడిపోకు చెలిమితో.. చెడిపోకు కలిమితో
జీవితాలు శాశ్వతాలు కావుర”
“గగన కిరణ గమనమిది భువన భవన చలనమిది చలిత లలిత కదనమిదే జతిని తెలుసుకో”
వంటి ఉత్తేజాన్నిచ్చే పాటలు
“మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం-మెరిసినా.. కురిసినా .. కరుగు నీ జీవనం” వంటి తాత్విక గీతాలు
ఇలా అన్ని రకాల పాటలు అన్నేసి రాసి చిరంజీవి నర్తనకు కలంతో పదం కలిపారు వేటూరి.
బెంగాలీలకు ఈ పాటను వారి భాషలోకి అనువదించి ఇస్తే వాళ్లు వేటూరి గారి విగ్రహాన్ని పెట్టుకుని గౌరవించుకునేవారని భువనచంద్ర గారు కీర్తించిన పాట “యమహా నగరి కలకత్తా పురి – నమహో హుగిలీ హౌరా వారధి”
చిరంజీవి స్టార్ స్టేటస్‌ను తెలిపే రెండు సూపర్ హిట్ పాటలు రాసినదీ వేటూరే.
సుప్రీమ్ హీరో అయ్యాక…”సుప్రీమ్ హీరో…స్వీట్ హార్ట్” అంటూ మొదలయ్యే “అందం హిందోళం అధరం తాంబూలం” అనే పాట, చిరంజీవి మెగాస్టార్ అయ్యాక “స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్” అంటూ మొదలయ్యే “జపం జపం జపం కొంగ జపం-తపం తపం తపం దొంగ తపం” అనే పాట రాసింది కూడా వేటూరే.
చిరంజీవి తల్లిగారి పేరు అంజనాదేవి గారు. చిరంజీవిగారికి ఇష్టమైన దైవం హనుమంతుడు. అసలు చిరంజీవంటేనే ఆంజనేయుడు గుర్తుకు వస్తాడు. అందుకేనేమో “అంజనీపుత్రుడా వీరాధివీరుడా శూరుడా ధీరుడా నీమీద నాకు యహా”అని రాశారు ముఠామేస్త్రి సినిమాలో.
ఊరికే ఏదో సరదా కొద్దీ ఇలా ఈ పాటలన్నీ గుర్తు చేసుకోవడం. ఇవన్నీ అలా కొంతసేపు ఆలోచిస్తే గుర్తొచ్చిన పాటలు. ఇలాంటి పాటలు చిరంజీవి-వేటూరి కాంబినేషన్ లో ఇంకో అయిదారు డజన్లైనా ఉంటాయి.
ఒక్కో పాటనీ విశ్లేషించుకుంటూ వెళితే..ఫేస్‌బుక్కే కాదు పెద్దసైజు నోట్‌బుక్ కూడా సరిపోదు.
అందుకే చివరిగా మా ఎవర్ గ్రీన్ సుప్రీమ్ హీరో చిరంజీవికి పుట్టినరోజు విషెస్ చెబుతూ …
“వీరవిక్రమ ధీరదిగ్గజ.. నీకే స్వాగతాలు” అని పాడుకుంటూ…
*********Happy Birthday Megastar*********