“శుభోదయం” చిత్రంలోని మధుర గీతం “కంచికి పోతావా కృష్ణమ్మా”ఎంత బావుంటుందో! వేటూరి ముద్దుగా రాసిన సాహిత్యానికి మామ మహదేవన్ ఎంతో సొగసుగా బాణీ కట్టారు. అయితే ఆ పాట పల్లవిలో “కంచి”, “కృష్ణమ్మా” ఎందుకొచ్చాయో ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ మధ్య వేటూరి తనయులు శ్రీ రవి ప్రకాశ్ గారిని అడిగితే – “వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పిల్లల పాట ఒకటి ఉంది. ఆ పాట ప్రేరణతో వేటూరి గారు ఈ పల్లవి రాశారు!” అన్నారు.
గూగులమ్మలో వెతికితే పాట దొరికింది –
కంచికి పోతావా కృష్ణమ్మా!
ఆ – కంచి వార్తలేమి కృష్ణమ్మా?
కంచిలో ఉన్నది అవ్వ;
ఆ – అవ్వ నాకు పెట్టు బువ్వ!
ఇలా ప్రశ్నోత్తరాలతో సాగుతుంది పాట. ఇక్కడ సమాధానంలో అవ్వ-బువ్వ బదులు బొమ్మా-ముద్దుగుమ్మా అనడం వేటూరి చమత్కారం.
సినిమాలో ఒకరినొకరు ఇష్టపడ్డా, ఇంకా బైటపడని అబ్బాయి-అమ్మాయి ఉంటారు. అమ్మాయికి వినిపించేలా ఓ బొమ్మతో మాట్లాడుతున్నట్టు పాటందుకుంటాడు అబ్బాయి. పల్లవిలోనే విషయం బైటపెట్టేస్తాడు – నా ధ్యాసంతా ఆ ముద్దుగుమ్మేనంటూ. ఏ ముద్దుగుమ్మో మనకీ తెలుసు, ఆ అమ్మాయికీ తెలుసు! మొదటి చరణంలో ఆ అమ్మాయి అందాన్ని వర్ణిస్తాడు. ఇక్కడ నాకు బాగా నచ్చిన వర్ణన – “ఆ అమ్మాయి అడుగులు వేసి నడిచి వస్తూ ఉంటే చూసేవాళ్ళకి వినిపించే శబ్దం ఆమె అడుగుల శబ్దం కాదట! తమ గుండెలు వేగంగా కొట్టుకోవడం వల్ల వచ్చిన శబ్దమట!”.
సరే! అబ్బాయి ఇంత సొగసుగా వర్ణిస్తూ ఉంటే ఆ అమ్మాయి ఊకొడుతూ వింటుందే తప్ప, ఏమీ అనదే! అంటే తనకీ ఇష్టమనే కదా! ఇది తెలిశాక అబ్బాయికి ధీమా వచ్చి రెండో చరణంలో – “నువ్వు కృష్ణుడు కోసం వేచి చూస్తున్న రాధవని నాకు తెలుసు, మనసు దాచుకోకు” అనేస్తాడు. అమ్మాయి కూడా అబ్బాయి చూపించిన మార్గాన్నే అనుసరించి భలే గడుసుగా తన ఇష్టాన్ని తెలియజేస్తుంది – “పొంచి వింటున్నావా కృష్ణమ్మా! అన్నీ మంచివార్తలే కృష్ణమ్మా!” అంటూ!
అవునవును! ప్రేమలో పడ్డవాళ్ళకి అన్నీ మంచివార్తలే! పడనివాళ్ళ కోసం ఇదిగో ఇలా మంచిపాటలు!
కంచికి పోతావా కృష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మకాదు ముద్దుగుమ్మా!
1. త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాదీ బొమ్మ
రాగమేదో తీసినట్టు ఉందమ్మా!
ముసిముసినవ్వుల పువ్వులు పూసిందీ కొమ్మ
మువ్వగోపాలా..మువ్వగోపాలా అన్నట్టుందమ్మా!
అడుగుల సవ్వళ్ళు కావమ్మా
అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా!
2. రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా
రాతిరేళ కంట నిదరరాదమ్మా
ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మా
ముద్దు మురిపాల..మువ్వగోపాలా..నీవు రావేలా..అన్నట్టుందమ్మా!
మనసు దోచుకున్న ఓయమ్మా
నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా!
ఎడదల్లో ante entandi?
ఎడద అంటే హృదయానికి పర్యాయపదం హృదయం, ఎద, ఎడద