నయగారాల వేటూరి- కమల్ జి

తుమ్మెదలంటనీ తేనెలకై….
తుంటరి పెదవికి దాహాలు __ వేటూరి వారి కలం నుండి జాలువారిన రొమాంటిక్ సాంగ్. అదీనూ యన్టియార్, శ్రీదేవిల మద్యన…!!

కొన్నేళ్ల క్రితం వేటూరి మరణం సంభవించిన సమయంలో ఏదో వెబ్ పత్రికలో “వేటూరి వారు కుల వివక్షతో ఒక కులపు హీరోలకు మాత్రం బూతు పదాలతో పాటలు రాసేవారు.” అని ఒక రచయత రాయగా చదివాను. ఇలాంటి కులకోణాలాంటివి బహిరంగంగా కనపడనీ…. ఎరుగని వాతావరణంలో పుట్టి పెరిగి వచ్చిన నాకు ఈ కులకోణాలాంటివి చదివి చాలా ఆశ్చర్యమేసింది, అంటే కళల విషయంలో తమ ప్రతిభతోనూ… ఎన్నెన్నో సోపానాలు ఎక్కి వచ్చిన విద్వత్త్ కలిగిన కళాకారులను ఇలా కుల కోణం నుండి విడదీసి ఇంతగా చూస్తారా అనిపించింది…!! లేక వేటూరి వారిలో లేనివి వీరు కనుక్కొన్న కొత్త కోణం అని అనుకొని ఆ కోణాన్ని జనాల ముందర వుంచారో అన్నది అర్థం కాలేదు. అలా చూసుకొంటే… మరి ఎన్నో భావాత్మకంగానూ రసస్పందన పొందే లాంటి రాసిన పాటలను ఆ వర్గపు హీరోల సినిమాలలో మనం చాలా చాలా చూడోచ్చే….!!

“ ముద్దిచ్చే ఓ చినుకు ముత్యమై పోతుంటే… చిగురాకు పాదాల సిరిమువ్వలవుతుంటే..
ఓ చినుకు నిను తాకె తడి ఆరి పోతుంటే… ఓ చినుకు నీ మెడలో నగలాగ నవుతుంటే..” ఇందులో బూతున్నదా..?? ప్రకృతికి మనిషికి ముడిపెట్టి ఎంత అధ్బుతంగా వర్ణించారు స్త్రీ పురుషల మద్యనుండే ఆసక్తిని.

ఓ అమ్మాయి మామిడి తోటలోకి దొంగతనంగా దూరి పళ్లను కోసుకుంటూంటే అది చూసిన ఓ సామాన్య మనిషి
“ ఈతముల్లు గుచ్చుకొంటే ముంజలాంటి లేత ఒళ్లు గాయం
తోటమాలి చూసాడా.. బడిత పూజ ఖాయం..” అని ఒక లారీ డ్రైవర్ తరగతి మనిషి నుండే వచ్చే లల్లాయి పదాలతోనే హీరోయిన్ని టీజింగ్ వేలో ఆట పట్టిస్తూ పాడితే రెండో పేరా వాక్యం నుండి హీరోయిన్ అందుకుంటుంది.

మాలి నాకు మామేలే… తోట కూడ మాదేలే…..
ముల్లైనా ననుతాకి పువ్వైపోతుందిలే రామయ్యో వెళ్లి రావయ్యో “ అంటూ చాలా గడుసుగా సమాధానం చెబుతుంది.
ఇందులో ఎక్కడా బూతు లేదు. దర్శకుడు పూర్తీగా సన్నివేశం వివరించి రాయమంటే ఎలాంటి బూతు పదాలు ఆయనెందుకు వాడతారు. ఎప్పుడైతే దర్శకులు, నిర్మాతలు జోక్యం చేసుకొంటారో అప్పుడు ఆయా దర్శక నిర్మాతల ఆలొచనల పాటల్లో వొస్తాయి గానీ.

మరో సినిమాలోని చరణాలు….యన్టియార్, జయసుధల మద్యన…

“ నడిరేయి సమయాన… ఒడిచేరు తరుణాన
నక్షత్ర చేమంతి జడలల్లనా
నవ్వుల్లో తొలిపువ్వు నే గిల్లనా” అంటూ నక్షత్రాలను అరువుగా తెచ్చుకొన్నాడే యన్టియార్ తన హీరోయిన్ కోసం…!!

ఒక సినిమా షూటింగ్ లొకేషన్స్ కోసం కొత్త దర్శకుడైన మోహన్ రావిపాటితో పాటు కో-డైరెక్టర్తో కలిసి కారులో వెళ్తున్నాం, ఎప్పటిలానే నా అలవాటు ప్రకారం పాటలు వినుకొంటు వెళ్తున్నాం. నచ్చిన పాటల్లోని అర్థాలు, అంతర్లీనంగా దాగున్న భావాల గురించి చర్చించుకొంటున్నాం. అలా వాటి మద్యలో యన్టియార్, జయప్రద రొమాంటిక్ సాంగ్ ..

“ ఒక్క రాత్రి వచ్చిపోరా…. వేయి రాత్రుల వెన్నెలిస్తా” అనే పల్లవిలో “ఈ వేయి రాత్రుల వెన్నెలేంటి అర్థం కాలేదు మోహన్” అడిగాన్నేను.
“వేయి పున్నములు తెలియదా మీకు..?” అని తిరిగి అడిగాడు నన్నే.

కాసేపటికి అర్థమయ్యింది. ఓ మనిషి జీవన కాలం వందేళ్లు అని అనుకొంటే అందులో బాల్యదశ దాటి కౌమార దశకు చేరిన తర్వాత నుండి లెక్కిస్తే మనిషి జీవితంలో వేయి వెన్నెల రొమాంటిక్ రాత్రులు వుంటాయనే సంగతి.

ఆ వేయి వెన్నెల రాత్రిని ఒక్క రాత్రిలోనే చవి చూస్తావు అని హీరోయిన్ చెప్పడం…. వాహ్.. వేటూరి నీకు నీవే సాటివయ్యా అని అనిపించింది.

అదే పాటల్లోని “ కన్నెమోజులే నిన్నల్లుకోనీ… కౌగిలింతలే నా ఇల్లు కానీ “ ఈ చరణాలలో ఎంత గాఢత వున్నదో అర్థమవుతుంది. మరి ఇలాంటి పాటల్లో ఎక్కడా అసభ్యత లేదే.. మరెందుకలా మాట్లాడారో..??

ఈ పాటలోని భావాన్ని తెలియజేసినందుకు… థ్యాంక్యు Mohan Ravipati .

“ నీ పైట తీసి కప్పుకొంది ఆకాశం.. తెరచాటు సొగసులారబోసే నాకోసం…
నీ చూపులు సోకి ..సోగసు వెల్లువలాయే..
నీ ఊపిరి సోకి మనసు వేణువులూదే….” శృంగారాన్ని ఎంత సున్నతింగా చెప్పారో ఈయన..!!

ఇక పెద్దాయన ఒక మాస్ సినిమాలోని మాస్ పాటలో కాస్త మెలోడి ప్రధానమైన చరణాలు..

“ కన్నులు తెరతీసి… వెన్నెల వల వేసీ..
ప్రాణం లాగేసి పోతే ఎలా….” ఇది మొదటి చరణం.. రెండో చరణం..
“చెంపలు నిమరేసి… సిగ్గులు కాజేసీ…
నిప్పులు చెరిగేసి పోతే ఎలా…. “ ఇలా శృంగారాన్ని సుతిమెత్తగా మెరిపిస్తాడు వేటూరి వారు.
ఇక నటశేఖర్ కృష్ణగారి సినిమాలలో బోలెడన్నీ.. అందులొ ఒకటి..
“నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో…
నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో…
కనిపించే నీలో కళ్యాణ తిలకం..
వినిపించే నాలో కళ్యాణ రాగం..”

ఆ వర్గపు మరో కథానాయుకుడి సినిమాలోని పల్లవి

నడకా హంసధ్వనీ రాగమా…. అది నడుమా గగనంలో కుసుమమా
మణిపురిలో వయారమా… పురివిప్పిన మయూరమా” ఇది కథానాయుకుడు స్వరమైతే.. దానికి బదులుగా కథానాయకి..
“నడకే హంసధ్వని రాగమే….. అని అంగీకరిస్తూ..
శృతిలయానుబంధమే… స్వరజతి కళ్యాణమే.” బదులిస్తుంది. ఇంతకు మించిన భావత్మకం ఏమైనా వున్నదా….?

ఇదే పాటలొని చరణాలు వినండి చాలు…. డా॥ సి.నా.రే ని గుర్తుకు తెస్తాయి. ఈ పాట మొదట విన్నప్పుడు ఇలాంటి గంభీరమైన పదాలు రాసే సి.నా.రే గారే ఈ పాట రాసారనుకొన్నాను. తర్వాత టైటిల్స్లలో చూస్తే వేటూరి అని వున్నది. వేటూరి కలానికి అన్ని వైపుల పదునే అన్నది తేటతెల్లమవుతుంది.

ఇక “రవి వర్మకే అందనీ ఒకే ఒక అందానివో… రవి చూడనీ పాడనీ నవ్య రాగానివో” లాంటి రసాత్మక పాటలు ఎన్నో వున్నాయి. అలానే వీరి వారసులు హీరోలుగా నటించిన సినిమాలలొని ఆణిముత్యాలు చూడలేదా..??
“ తారా తారా తానాలాడే సంధ్యారాగంలో..
దిక్కు దిక్కు ముద్దాడే నా ఊహాగానంలో..” రెండు చరణాల్లోని భావాలివి… సినిమా అట్టర్ ఫ్లాప్ అవడం వలన ఇలాంటి పాటలు ఆదరణకు నోచుకోలేదు. “ ఆకాశ వీధిలో అందాల తారవో…. ఆవేశ గీతిలో పలికే సితారవో” అనే పల్లవిలోని చరణాలివి.

“ నల్ల నల్ల నీళ్లల్లోనా ఎల్లకిల పడ్డట్టున్న అల్లో మల్లో ఆకాశాన చుక్కల్లో..
అమ్మాయింటే జాబిలమ్మ అబ్బాయింటే సూరిడమ్మా ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో” వాహ్ ఎంతటి మధురమైన భావన ఇది..??

జంధ్యాల గారికి చాలా ఇష్టమైన పాటల రచయత వేటూరి వారే.. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆ వర్గపు హీరోల సినిమాల్లోని పాటలు ఒక సారి చూద్దాం..
“ శరత్కాల నదులలోని తేట నీటిలా..
పుష్యమాస సుమదళాల తేనె వాకలా..
సుప్రసన్న సుందర కవిత… సుప్రభాత మరందగుళిక
ఒక పార్వతి.. ఒక శ్రీసతి.. ఒక సరస్వతి. …
సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే తృయంబకే దేవీ నారాయణీ నమోస్థుతే…” ఈ చరణాలు విన్నారా..? ‘తెలుసా నీకు తెలుసా ప్రేమంటే ఒకే మనిషి నివశించే భువనమనీ..” అనే పాటలోనివి.
ఇక అమెరికా గురించి వివరిస్తూ… “జీవితం సప్త సాగర గీతం..వెలుగు నీడల వేదం” పాటలొ.. పల్లవి చివరి వాక్యం
“కల ఇల కౌగిలించే చోట “ తో మొదలు పెట్టి “మతి కృతి పల్లవించే చోట”, “కృషి ఖుషి సంగమించే చోట” అనే రెండవ చరణంతో ముగిస్తాడు. అక్కడి సంస్కృతి, మనుషుల మదనం… ఇవన్నీ కేవలం ఒక వాక్యంతో చెప్పడమన్నది వేటూరి వారికే చెల్లింది. కృషి వున్న చోటే ఖుషీ వుంటుంది.. ఈ రెండు సంగమాల మధనమే కదా అక్కడి ప్రజల జీవనం.

హే.. బ్రహ్మ రాసిన గీతం..
మనిషి గీసిన చిత్రం..
చేతనాత్మక శిల్పం….” ఇంతద్భుతంగా ఎవరివ్వగలరు..??

ఇక మణిరత్నం గారు తెలుగులో “గీతాంజలి” సినిమా దర్శకత్వం వహిస్తున్న సమయంలో మొదటి సారిగా వేటూరితో సంభాషణలు జరిగాయి. సినిమా ఇతివృత్తం చెప్పాక “మీ ఇష్టమండి ఈ కథకు తగ్గట్లుగా మీకు నచ్చిన విదంగా రాయండి” అంటు పూర్తీగా స్వేచ్చనిచారట మణిరత్నం గారు. మొదట ఒక పాట రాసి వినిపించారట.. అది విన్న మణిరత్నం “ ఇక మిగతా పాటలు నాకు ఏవి వివరించనవసరం లేదు. మీరు రాసాక డైరెక్ట్గా సంగీతం సమకూర్చడమే” అని అన్నారట. “ఇంత సున్నితంగా రాయగలరా తెలుగు భాషలో” అని అనుకొన్నారట మణిరత్నం గారు. అది మొదలు వేటూరి వారి మరణం వరకు తమిళ్ నుండి తెలుగు డబ్బింగ్కైనా సరే వేటూరి వారితోనే రాయించుకొన్నారు మరో కవికి తావు లేకుండా..!

సూరీడే వొదిగి వొదిగి… జాబిల్లిని ఒడిని అడిగే వేళ “ సాయం సంధ్య గురించి చెప్పడానికి ఎన్నుకొన్న భావన ఇది. ఇక రెండవ చరణంలో
ఈ మంచుబొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగేవేళలో” కథానాయుకుడు, నాయకీల పరిస్థితిని చెప్పకనే చెబుతాడు “జగతికే అతిధులు” అంటూ..!

ఇక యువతరం తెగింపును ఈ విదంగా..
“ పడనీరా విరిగి ఆకసం విడిపోనీ భూమి ఈ క్షణం.. మా పాట సాగేనులే….
నడిరేయే సూర్య దర్శనం.. రగిలింది వయసు ఇంధనం…. మా వేడి రక్తాలకే..”
వారి పోరాటమే వారి వేదాంతంగా చెబుతాడు.
అంతే కాదు.. “ నేడేరా నీకు నేస్తమూ… రేపే లేదు..నిన్నంటే నిండు సున్నరా రానే రాదూ.. ఏడేడు లోకాలతోనే బంతాటలాడాలి ఈనాడే” అని ప్రస్తుతం మనం జీవించేదే జీవితమనే సత్యాన్ని యువతరం రూపంలో చెబుతాడు వేటూరి వారు.

ఇలా ఒక వర్గపు హీరోల సినిమా పాటలే కాకుండా మిగతా కథానాయుకుల పాటల్లో ఎన్నో ఆణిముత్యాలను చూడొచ్చు… అవన్నీ వదిలేసి కేవలం బూతు పాటలనే హైలెట్ చేస్తూ జ్ఞానాన్ని ప్రదర్శించుకొనే మనుషుల గురించి మాట్లాడే వాళ్లను ఏమనుకొందాం…?? ఇక ఆయన పాటల్లోని దుష్ట సమాసాల గురించి మాట్లాడతారు. నాకయితే అవేమి పంటికింద రాళ్లలాగ ఎప్పుడు అనిపించలేదు. ఎంతో భావాత్మకంగా మనసు ఎక్కడో తేలియాడుతూ ఆస్వాదించే మైమరుపులా అనిపిస్తాయి.

“నీ ఊపిరి తగిలినవేళ..నే ఒంపులు తిరిగివేళా..
నీ వీణలో నా వేణువే పలికే రాగమాల..”
____________________

“లతాలతాసరగామాడే సుహాసినీ సుమాలతో..
వయస్సుతో వసంతమాడి వరించెలే స్వరాలతో..”
________________________

“మంచుకొండల్లోనా ఎండకాసినట్టు..
మల్లెపూలు చల్లె వెన్నెల..వెన్నెలమ్మ వెండికన్నులా..”
_________________________

“ పాలకడలిలా వెన్నెల పొంగింది….పూలపడవలా నా తనువూగింది..”
____________________________________

“ఇందు వదన కుందరదన మంద గమన మధుర వచన….గగన జఘన సొగసు లలనవే
తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే… చెలి చిగురు తొడిగే వగలా మొగ్గేలనే… “
____________________________

“ నీ వయసే వసంతఋతువై…. నీ మనసే జీవనమధువై
నీ పెదవే నా పల్లవిగా… నీ నగవే సిగమల్లికగా
చెరిసగమై…ఏ సగమేదో మరచిన మన తొలికలియకలో….”
_________________________

“ లాలీ లాలీ ప్రేమ రాణీ.. అనురాగంలోనే సాగిపోనీ
మేనాలోన చేరుకోని… సురభోగాలన్నీ అందుకోనీ..
పెదవి పెదవి కలవాలి..ఎదలో మధువే కొసరాలి..
బ్రతుకే మమతై నిలవాలి.. మురళి స్వరమై పలకాలి…!!
ప్రేయసి పలుకే మాణిక్య వీణ..ప్రేమావేశంలోనా..
కౌగిలి విలువే వజ్రాలహారం…. మోహావేశంలోన..
రావే రావే రసమందారమా…!!” వ్వాటే బ్యూటిఫుల్ …..పదాలతో ఆడుకోవడమంటే ఇదే..

ఏ కవి ఇష్ట పడి బూతు పాటలు రాయడు. ఆ సినిమా దర్శకుడి భావాలననుసరించే పాటలు రాస్తారు. కొన్ని సమయాలలొ అన్ని చంపుకొని రాయాల్సి పరిస్థితి వొస్తుంది.

అలాంటి సంఘటనే.. దాసరి గారు స్వయంగా చెప్పిన విషయాలివి. మేఘసంధేశం సినిమా నిర్మాణ సమయంలో ఆఫీస్లో వేటూరి గురించి ఎదురు చూస్తున్నారట. చెప్పిన సమయానికన్నా చాలా లేటుగా వచ్చారట.. వచ్చాకా ఆ సినిమా గురించి చర్చిస్తున్నా కూడ ఎందుకనో చాలా నిర్లిప్తంగా కనపడ్డారట వేటూరి గారు. అప్పుడు దాసరి గారు “గురువు గారు ఎందుకనో చాలా డల్‌గా వున్నారు మీరు. సంగతి ఏంటి..?” అని అడిగారట.

“ ఒక మంచి సన్నివేశం వివరించి పాట రాయమన్నారు పలానా.. వాళ్లు. తీరా రాసిచ్చాకా ‘ఇవేమి పదాలు..?, వాక్యాలు ఎవరికర్థం అవుతాయి..? కాస్త అందరికీ అర్థమయ్యేలా సామాన్య పదాలతో రాయండి” అని అన్నారు. తిరిగి “మంచి సన్నివేశం.. దానికి కరెక్ట్‌గా కుదిరిన పాట కాని వారికి నచ్చలేదు, ఓ మంచి పాట బయట ప్రపంచంలోకి రాకుండా మరుగున పడిపోతుందనే బాద.. ఆ ఆలొచనలలో వున్నాను “ అని అన్నారట. దానికి దాసరి గారు “ఒక సారి ఆ పాట ఇటివ్వండి చదువుతాను” అని తీసుకొని చదివాక..
“గురువు గారు ఈ పాట నాకిస్తారా..? నా ఈ సినిమాలో ఈ పాట కోసమే ప్రత్యేకంగా ఒక సన్నివేశాన్ని సృష్టించుకోవాలనుకొంటున్నాను..” లోలోపలే అబ్బర పడుతూ బయటకు అలా అడిగారట దాసరి గారు.
ఆ పాటే “ ఆకాశా దేశానా ఆషాడ మాసానా… మెరిసేటి ఓ మేఘమా..”

“ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమివోలె నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో ” అద్భుతమైన ఈ చరణాలు అర్థం చేసుకోవడంలొ పిపిలీకాలయ్యారు.

ఇదే సినిమాలో “కైలాసశిఖరాగ్రశైలూషికానాట్యడోలలూగేవేళ రావేల నన్నేల” అనే ఈ సుధీర్ఘ సమాసంతో సాగుతుంది ( నిన్నటి దాక శిలనైనా )

సుధీర్ఘమైన సమాసాలు, గంభీరమైన పదబందాలతో ఎక్కువగా సి.నా.రే గారు రాస్తుంటారు, అలానే వేటూరి గారు కూడ అవసరమైన చోట సన్నివేశం డిమాండ్ చేసిన చోట మాత్రమే రాసే వారు.
ఉదాః
“ ఓహో….. లలితా నా ప్రేమ కవితా…..
గగనవీణ సరిగమలు పాడగా… నీ జఘనసీమ స్వరజతులనాడగా..
తళత్తళలతో తరుణకిరణసంచలితలలితశృంగారతటిల్లత – కదలగా.. కనులు చెదరగా…కదలిరా కవితలా…వలుపుకే వరదలా… “ ( మల్లెపువ్వు )
ఇలాంటివి చాలా రాసారు.

ఇంకా చాలా చాలా వున్నాయి పాటలు అందులోని చరణాల గురించి మాట్లాడుకోవడానికి…ఎన్నెన్ని రాయగలమూ.. సత్యం మాస్టారు,
రమేష్ నాయుడు
రాజెన్ – నాగేంధ్ర
జి.కె.వెంకటేష్
చక్రవర్తి
ఇళయరాజా
ఏ.ఆర్. రెహామన్‌ల వీరి స్వరకల్పనలో ఎన్నో ఆణిముత్యాలు

ఇప్పటికే చాలా పెద్ద పిడక అయిపోయింది. ఇక్కడికే ఆపేస్తున్నాను.

ఆయన మరణానికి ఓ రెండు మూడేళ్ల ముందనుకొంటాను. ఒక వర్ధమాన దర్శకుడు తన మొదటి సినిమా ఒ అగ్ర హీరోతో ప్రారంభమవుతున్నది. ఆ దర్శకుడికి కూడ వేటూరి గారంటే వల్లమాలిన అభిమానం. ఆ అభిమానంతోనే ఆయన వద్దకు వెళ్లారు. “గురువు గారు నా మొదటి సినిమా, ఇందులో మొత్తం మీరే పాటలు రాయాలి “ అంటు తన అభిమానాన్ని వెలిబుచ్చాడు.

“సంతోషం నాయనా అలానే రాస్తాను.. ఇంతకు సంగీత దర్శకుడు ఎవరు.? “ ప్రశ్నించాడు. సదరు దర్శకుడు ఆ సంగీత దర్శకుడి పేరు చెప్పాడు. ఆ పేరు విన్న వేటూరి గారు వెంటనే “ ఆయన వద్దకు నేను రాలేను నాయనా కావాలంటే నేనిక్కడే నా ఇంటిలోనే రాసిస్తాను” అని చెప్పడంతో ‘అదేంటి గురువు గారు ఎందుకలా..?” ప్రశ్నించాడు.

“వొద్దు నాయనా అతని వద్దకు నేను రాలేను. నేను పాటలు రాసాక అవి చూసి ‘ఇవేమి తెలుగు పదాలు ఎవరికి అ ర్థమవుతాయని ఇలాంటివి రాస్తారు. మీ చాదస్తంతో చస్తున్నాం’ అని బూతులతో కన్నుమిన్ను కనపడకుండ నోటికి ఎలా వొస్తే అలా తిడతాడు. పైగా నేను రాసిన పదాలను తనకిష్టమొచ్చినట్లుగా మార్చి రాసుకొని సంగీతం సమకూర్చుకొంటాడు. మధమదాంధుడు నాయనా అతను ” చెప్పారు. పాపం ఆ వర్ధమాన దర్శకుడికి అర్థం కాలేదు ఎలా అని…?? అలానే ప్రశ్నార్థకంగా వేటూరి గారి మొహం కేసి చూస్తుండటంతో..

తిరిగి వేటూరి వారే “ఎలానూ ఆయన ట్యూన్స్ చేసి క్యాసెట్ చేసి పంపుతాడుగా అవి విని ఇక్కడే నేను రాసి ఇస్తాను. మీరు తీసుకెళ్లి నచ్చితే యధాతదంగా అలాగే వాడుకోండి. లేదు ఎలానూ అతను మారుస్తాడు కాబట్టి మీకు నచ్చిన పదాలను మీరే అందులో కలుపుకోండి” అని సెలవిచ్చారు వేటూరి గారు.
ఇవి ప్రైవేట్ సంభాషణలలొ విన్న నాకే కళ్ల నీళ్లు తిరిగాయి. “ కనీసం వేటూరి వారి విద్వత్త్ చూసైనా గౌరవం ఇవ్వరా వీళ్లు.. ఏమ్ మనుషులు.. అంతటి గర్వమా వీళ్లకు..?” అని అనిపించింది. బూతు పాటలు రాసే ఈ కవి గారు ఆ సంగీత దర్శకుడిని కనీసపు బూతు మాటతొ కూడ తూలనాడలేదు. చాలా గంభీరమైన పదంతో దూషించాడే కాని….. గట్టు దాట లేదు. అది ఐరనీ అంటే..!

సరిగ్గా ఎనిమిది సంవత్సరాల క్రితం కరెక్ట్‌గా ఇదే తారీఖున రాత్రి 9:30 కే నిదరబోతున్న నాకు ఫోన్ మ్రోగడంతో లేచి ఫోన్ తీసాను

“రేయ్ రెండు రోజుల క్రితం మనం వేటూరి పాటల గురించి చర్చించుకొన్నాం గుర్తుందా..? “ అడిగాడు నా కాలేజీ మిత్రుడు.
“అవున్రా ఇప్పుడేంటి..?” అడిగాన్నేను.
“వేటూరు గారు ఇందాకే చనిపోయార్రా..” అన్నాడు, ఒక్క సారిగా ఉలిక్క పడ్డా..
‘ఈయన చనిపోవడం ఏంటి ఇప్పుడు…?”
అర్థం కాక “నిజమా” అని అడిగా..
“అవున్రా టి.వి ఆన్ చేసి చూడు నీకే తెలుస్తుంది” అన్నాడు.
వెంటనే టి.వి ఆన్ చేసా.. చనిపోయినట్లుగా వార్తలు.. ఆయన గురించి విశేషాలతో కూడిన కథనాలు వెలబడుతున్నాయి.

నాకేమి అర్థం కాలేదు. ఏమ్ తొందరొచ్చింది ఈయనకు. ఏంటో నాకు ఇష్టమైనా వాళ్లందరు ఇలా ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారేంటి…? ఈయనకేమి కష్టమొచ్చిందిని ఇంత తొందరగ వెళ్లిపోతున్నారు. అని నాలో నేను మాట్లాడుకొంటున్నాను. ఏవేవో ఆలోచనలున్నాయి నాకు…. దేవుడనే వాడు నిజంగా వుండి నాకు ప్రత్యక్షమైతే ఒకే ఒక కోరిక కోరాలనుకొన్నాను.

“నా అయుష్షులో ఓ పదేళ్లు తీసేసి ( మైనస్ చేసి ) ఆ పదేళ్లను వేటూరి గారి ఆయుష్షులో కలిపి మరో పదేళ్లు ఈ భూమ్మీద అలానే ఈయన్ని వుంచేయండి” అని కోరాలనిపించింది. నిజం ఇందులో ఆయన మీద ప్రేమ కన్నా నా స్వార్థం ఎక్కువగా వున్నది. సినీ ప్రేక్షకుల ఖర్మ కాలి నేను నా వృత్తిలో బాగా సక్సస్ అవుతే….. అప్పుడు నేను దర్శకత్వం వహించే సినిమాకు మొత్తం వేటూరి వారితోనే పాటలు రాయించుకోవాలని అనుకొంటూ వుండే వాడిని. అవి ఏవి వాస్తవ జీవితంలో నిజం కాలేదు అంతే.

కమల్ జి గారు వ్రాసిన అసలు వ్యాసం ఈ కింద లింక్ లో చూడవచ్చు

https://www.facebook.com/kamal002/posts/10216863968897799

కమల్ జి గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top