తెలుగు పదానికి జన్మదినం – వేటూరి

1948లో నాకు తెలిసిన అన్నమయ్య జన్మించారు. తొలి అన్నమాచార్య ఉత్సవం తిరుపతిలో జరిగిన అమృత ఘడియ అది. పెదనాన్నగారు ప్రభాకరశాస్త్రి గారి పరిశోధక జీవితానికి పరమావధిగా అన్నమయ్య సంకీర్తన వాజ్ఞ్మయావిష్కరణ జరిగిందని ఆంధ్ర, ఆంధ్రేతర పత్రికా ప్రపంచం పతాక శీర్షికలతో ప్రకటించిన రోజు అది. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పి. వి. రాజమన్నార్ అధ్యక్షతన జరిగిన అన్నమయ్య జన్మదిన మహోత్సవ సంరంభమది. శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి (నటి, గాయని, సాహితీమూర్తి) తొలిసారి అన్నమయ్య కీర్తనలను పాడిన శుభ ముహూర్తమది.

అటు తర్వాత ఇంతింతై వటుడింతయై అన్న రీతిగా అన్నమయ్య సంకీర్తనా సాహితి విశ్వరూపం దాల్చింది. ఆకాశవాణిలో విస్తృత ప్రచారానికి నోచుకుంది. సినిమాలలోను తగు రీతిని సముచిత స్థానం సంపాదించుకుంది.

అయితే – అన్నమయ్య జీవితం చిత్రంగా తీయాలన్న అభిలాష త్యాగయ్య, రామదాసు చిత్రాల పధ్ధతిలో జీవితశేషుడు శ్రీ జంధ్యాలకు కలిగింది. ప్రయత్నమూ జరిగింది. అన్నమయ్య కీర్తనలు కొన్ని స్వర్గీయ రమేష్‌నాయుడు స్వరపరచడమూ, పాడించడమూ కూడా జరిగి ఆగిపోయింది. అదేవిధంగా కీర్తిశేషుడు ఆత్రేయకూ ఆ సంకల్పం కలిగింది. అవేవీ కార్యరూపం దాల్చలేదు. అరుదైన ఆ అవకాశం నిర్మాతగా శ్రీ దొరస్వామి రాజుకు, దర్శకుడుగా శ్రీ రాఘవేంద్రరావుకు దక్కింది. తత్ఫలితమే ఇహపరాలకు సేతువుగా నిర్మించిన ‘ఆన్నమయ్య చిత్రం. ఏది ఏమైనా గడిచిన దశాబ్దంలో మంచి జీవిత చిత్రంగా ‘అన్నమయ్య’ను అభివర్ణించ వచ్చు.

ఈ చిత్రంలో అన్నమయ్య సంకీర్తనలతో పాటు మూడు పాటలు అదనంగా కథకు, కథనానికి ఆలంబనగా చేర్చడమూ అవి నాచేత రాయించడమూ జరిగింది. ధన్యోస్మి!

ముఖ్యంగా ఇటువంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడమంటే మాటలు కాదు. ‘సంగీత జ్ఞానము భక్తివినా’ ఉండి ప్రయోజనం లేదు. వాగ్గేయ వాజ్ఞ్మయ పరిచయం మాత్రమే చాలదు. మౌనబిందువులో నుండి నాద సింధువును పొంగించుకొనగల ఉపాసనా బలం వుండాలి. తరతరాలుగా అది సంక్రమించాలి. లేదా యోగభ్రష్టుడై జన్మించిన వాడికి ప్రాక్తనవాసనా జన్యమై సిద్ధించాలి. శాంతారాం నిర్మించిన ‘అమర్‌భూపాలీ’ చిత్రానికి వసంత్ దేశాయి, ‘త్యాగయ్య’ చిత్రానికి చిత్తూరు నాగయ్య అలా లభించిన సిద్ధ పురుషులు. బీనారాయ్, ప్రదీప్ కుమార్‌లు నటించిన ‘అనార్కలీ’ని నాదరూపకమైన ప్రేమ కావ్యంగా తీర్చిదిద్దిన రామచంద్ర చితల్కర్, ‘బైజు బావ్‌రా’ చిత్రాన్ని అనురాగ రంజితం చేసిన నౌషాద్ అటువంటి వారే. ‘లవకుశ’ చిత్రానికి ఘంటసాల, ‘ఆనంద నిలయం’, ‘కృష్ణప్రేమ’ చిత్రాలకు పెండ్యాల, ‘మల్లీశ్వరి’కి సాలూరు రాజేశ్వరరావు, ‘మేఘసందేశం’ చిత్రానికి రమేష్‌నాయుడు, ‘మూగమనసులు’, ‘ముత్యాలముగ్గు’, ‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘తిల్లానా మోహనాంబాళ్’ వగైరా చిత్రాలకు కె.వి. మహాదేవన్, ‘సీతాకోకచిలక’, ‘సాగరసంగమం’ – ఇలా కొన్ని చిత్రాలకు ఇళయరాజా సమకూర్చిన సంగీతం చిత్ర కథ నుండి విడదీయలేనిది. ఆ సంగీతంలో మూగబాసలున్నాయి. ఊహాగానాలున్నాయి. మనోనేత్రంతో దర్శించే దృశ్యాలున్నాయి.

అయితే అన్నమయ్య చిత్ర సంగీత దర్శకుడికి పైన పేర్కొన్న చిత్రాలలో వున్నంత స్వేచ్ఛ లేదు. అన్నమయ్య సంకీర్తనల గానం సంప్రదాయంగా నెలకొన్న పద్ధతినే అతనూ అనుసరించక తప్పలేదు. శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు, శ్రీ మల్లిక్ స్వరపరచిన, తిరుపతి దేవస్థానం వారి నిర్దేశకత్వంలో అనుమతించబడిన పద్ధతులు అప్పటికే ప్రచారంలోకి రావడంచేత, అవి జనాదరణ పొందడం చేత సంగీత దర్శకత్వం చేపట్టిన కీరవాణి కూడా ఆ పద్ధతినే అనుసరించక తప్పలేదు.

కానీ నేను రాసిన మూడు పాటలకీ మాత్రం కీరవాణి తగిన బాణీలు కట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా హంసానంది రాగంలో నాస్తికతా తిమిర హంసుడైన అన్నమయ్య జననం గీతాన్ని స్వరపరచిన తీరు అతని సంగీత సంస్కారానికి సాక్ష్యం.

తెలుగు పదానికి జన్మదినంఇది 

జానపదానికి జ్ఞాన పథం 

ఏడు స్వరాలే ఏడుకొండలై 

వెలసిన కలియుగ విష్ణుపదం 

అన్నమయ్య జననంఇది అన్నమయ్య జననం 

రాగమాలికగా  ఈ గీతాన్ని సందర్భానుసారంగా మలచి ‘పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయా’ వంటి మాటలకు తాళలయలను మృదువుగా సమకూర్చిన కీరవాణి అభినందనీయుడు.

ఇక సినిమాటిక్‌గా ఒక యుగళగీతాన్ని అన్నమయ్యకి ఆయన భార్యలకీ దర్శకుడు ఇందులో పెట్టాలని భావించి, అది కూడా నా చేత రాయించడం జరిగింది. సాధ్యమైనంత వరకు అన్నమయ్య నాటి తెలుగు, నోటి తెలుగు ఇందులో వాడితే బాగుంటుందని భావించడం – పచ్చారు సొగసులు (ముక్కు పచ్చలప్పటికి ఆరినవేమో మరి), చీటికి మాటికి చెనకేవు, వాలే వాలే వరసలు, గాటపు గుబ్బలు, వాటపు వలపులు (ఇటువంటి ‘పుంపు’లను ‘అన్నమయ్య’ ఎన్ని ఇంపు సొంపులతో వాడాడో – ఉదాహరణకు ‘ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము’) ఆయన ఫణితినే కనులకద్దుకొని రాసినవి. జానపదుల అమాయక ప్రాకృతిక భావధోరణికి కమ్మని జీవలక్షణాలు తెచ్చిన పాటలు, పద్యాలు అన్నమయ్యవి. యతి ప్రాసల నిర్వహణలోను అన్నమయ్య పద ప్రయోగంలో లాగే ఎన్నో జాణతనాలు చూపించాడు. ‘మమ్ము… ఎడయవకయ్య కోనేటిరాయుడా’ అన్నచోట ‘ఎ’ కి ‘కో’ కాక ‘కోనేటి’లో వున్న ‘నే’ (నకార ఎకారాలు) యతి అవుతుంది. ఇటువంటి తెలుగు మెరుగులు మరుగులు ఎన్నో వున్న అన్నమయ్య పదం జానపదానికి జ్ఞానపథం కాదా మరి! భగవదున్ముఖమైన జానపదాలే అన్నమయ్య పదాలు. అందుకే ఆయన పద కవితా పితామహుడు.

అన్నమయ్య చిత్రంలోని ఈ యుగళ గీతాన్ని అభేరి, ఉదయ రవిచంద్రిక రాగ మాతృకలతో కీరవాణి ‘దక్షిణాది భీమ్ ప్లాస్’గా తీర్చిదిద్దాడు. ఇందులో నేపథ్య వాయిద్యాలు శ్రావ్యతను పెంచి సాహిత్యంలోని అర్థాన్ని మనసుకు హత్తుకునేలా ప్రయోగించడం జరిగింది. అలాగే కొన్ని సందర్భోచితంగా వాడుకున్న అన్నమయ్య పదాల పల్లవులు (బీట్‌సాంగ్స్) వాటికి వాయిద్యాల అమరిక ఎంతో సహజంగా వుంది. ‘కట్టెదుట వైకుంఠము కాణాచైన కొండ తెట్టెలాయె మహిమలే తిరుమలకొండ’ అనే పల్లవికి మాల్‌కోస్ రాగంలో సన్నాయి వాదనం అమృతోపమానంగా వుంది.

పూర్వం ఎన్నడో వచ్చిన భరణీవారి ‘విప్రనారాయణ’ చిత్రం తర్వాత అంత స్వతస్సిద్ధంగా  ‘కమిట్‌మెంట్’తో తీసిన భక్తి శృంగార చిత్రం రాలేదనేది సత్యం. అయినా సంగీతపరంగా రాజేశ్వరరావుగారు అందంగా, అద్భుతంగా, శ్రావ్యంగా రాజీపడ్డ సందర్భాలు (ఎందువల్ల అంటే సినిమా పరిశ్రమలో వున్న సందర్భాలటువంటివి) కనిపిస్తాయి. ‘అనురాగాలు దూరములాయెనా’ వంటి విరహ గీతాలే, వాటికి కట్టిన బాణీలే అందుకు సాక్షి.  అందులో వాయిద్యాల విషాదయోగాలే రాగాలై గుండెకు హత్తుకుపోతాయి. అదే మళ్లీ ‘మల్లీశ్వరి’ చిత్రంలో అటువంటి రాజీ వినిపించదు. టి.జి. కమలాదేవి పాడిన ‘ఝం  ఝం  ఝం  తుమ్మెదా’ పాటతో సహా రాయలనాటి దేశకాల మనోభావాలను నేపథ్యరాగాలుగా వినిపించిన మహాశిల్పి శ్రీరాజేశ్వరరావుగారు. రాణివాసానికి ‘మల్లీశ్వరి’ని రాజలాంఛనాలతో తీసుకువెళ్ళే వైభవం అయినవారి కన్నీటితో తడిసిన సన్నివేశానికి తన సంగీతంతో వ్యాఖ్యానం చెప్పిన మహా సంగీత దర్శకుడు శ్రీ రాజేశ్వరరావు. ఆయన వెనుక వెన్నెముక శ్రీ బి.ఎన్. రెడ్డి. సినీలాకాశంలో ధృవతార, వేగుచుక్క వీరిద్దరూ అనక తప్పదు.

ఆత్మ బలహీనమై సాంకేతిక అంగాంగాలు బలపడిపోతున్న అప్రాకృతిక జీవన విధానాలకు అద్దం పట్టే నేటి సినిమాలు అటువంటి సంగీతాన్ని భరించలేవు. ఈ రొదలో శారదగా అవతరించిన చిత్రం అన్నమయ్య.

‘దినమునకు ఒక్కటి తక్కువ కాకుండ’ ముప్పది రెండు వేల సంకీర్తనలు రచించి ‘దాచుకో నీ పాదాలకు నే చేసిన పూజలివి’ అని గుప్తనిధిగా తన పదాలను సమర్పించిన ‘అన్నమయ్య’ నాటి రాగ ప్రయోగాలు, తాళగతులపై ఇంకా సమగ్రమైన పరిశోధన జరుగవలసి వుంది. లఘువులతో ఛందస్సు నిర్వహిస్తూ తాళానికి ద్విత్వాక్షరాలను, దీర్ఘాక్షరాలను ఉపయోగించుకున్న అన్నమయ్య రచనా రీతుల రమ్యతను మనం తెలుసుకోవాలి.

‘సురలకు నరులకు సొరిదెలు వినవిన అరుదుగ తాళ్లపాక అన్నమయ్య పదములు’- ఈ ఛందస్సు గమనిస్తే శివకవులు వాడిన కన్నడ ఛందస్సులు లయహారిణి, లయ గ్రాహి, రగడలకు భిన్నంగా అన్నమయ్య మరికొన్ని ఛందస్సులు బహుశః జానపదాలు కావొచ్చు వాడినట్లు తెలుస్తోంది. ఈ పదాలకు సంగీతం సమకూర్చిన శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వంటి సంగీతజ్ఞులు ఇంకా మరికొంత మంది చేసిన సేవ మార్గదర్శకంగా నిలిచిపోయింది. మహా గాయని శ్రీమతి ఎం. ఎస్. సుబ్బలక్ష్మి గానం చేసిన అన్నమయ్య కీర్తనలలో ప్రణవనాదం, శ్రీమన్నారాయణ మంత్రం మనకు వినిపిస్తాయి. ఆ స్థాయిని కీరవాణి నేపథ్యానికి వాడిన వాయిద్యాలతో అవకాశమున్నంతవరకు సాధించారు.  ‘కట్టెదుట వైకుంఠము’ అనే పాటను సమయం, మనోధర్మం, భావం, వర్ణం కలిసి వచ్చే నాదస్వరాలాపనతో ప్రారంభించడం కీరవాణి సంస్కారానికి గుర్తు.

అన్నమయ్య చిత్రానికి బాక్సాఫీస్ సూత్రానికి మధ్య పడి నలిగింది సాళ్వ నరసింహరాయలు పాత్ర. మహోదారుడు, చిరస్మరణీయుడు, అన్నమయ్య సాహితీ ప్రచారకుడు అయిన ఆ మహాప్రభువు పెనుగొండ నేలిన సాహితీ పోషకుడు, సంగీతోపాసకుడు, ప్రజాపాలకుడు. ఆయనకు కూడా ఒక యుగళగీతం ఈ చిత్రంలో వుంది. రచనను బట్టి బాణీ, బాణీని బట్టి రచన విడదీయడానికి వీలులేనట్టు కుదిరిన గీతమది.

తెలుగు కన్న తమిళంలో చక్కని సంగీతానికి అవకాశం ఎక్కువగా వుందంటే అత్యుక్తి కాదు. ‘దేవరాగం’ అనే భరత్ చిత్రానికి (శ్రీదేవి – అరవిందస్వామి) కీరవాణి ఎంత హాయిని స్వరబద్ధం చేశాడో విన్నవారికి అనుభవమే. పెళ్ళిసందడి, అల్లరి ప్రియుడు, సుందరకాండ వగైరా చిత్రాలకు కూడా చాలా మంచి కట్టుబాటుతో సంగీతం అందించాడు.

సంగీతతత్వ మెరిగి, ఉదాత్తమైన కథలు సంగీతాన్ని కోరినప్పుడు అది యివ్వగల సంగీత దర్శకులు మనకు వున్నారు. వారి శక్తిని సంస్కారాన్ని తగిన విధంగా వాడుకునే అవకాశం, అవసరం ఈనాడు ఏర్పడవలసి వుంది.

జాతీయ స్థాయిలో సంగీతపరంగా ఉత్తమ చిత్రం నిర్మించగల వారుంటే ఎన్నో మంచి కథలు, జీవిత కథలు వున్నాయి. ఈ అవసరాన్ని గమనించి బాపూరమణ, విశ్వనాథ్ వంటి వారు తిరిగి రంగప్రవేశం చేయాలి. రాఘవేంద్రరావు, దాసరి వంటి వారు మళ్ళీ పూనుకోవాలి. కొత్తవారుంటే వారెవరో ఎక్కడో ఎప్పుడో అటువంటి చిత్రం తెలుగువారికి అందించాలి.

-వేటూరి సుందరరామ్మూర్తి


హాసం పత్రిక వారికి, వేటూరి రవిప్రకాష్ గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.