సాలూరికి వేటూరి సమర్పించిన ఘననివాళి!

సాలూరు రాజేశ్వరరావు గారు ఎంత గొప్ప సంగీత దర్శకులో పెద్దలు చెప్పగా విన్నాను. వారి “మిస్సమ్మ” సినిమా పాటలు నాకు చాలా చాలా ఇష్టం (ముఖ్యంగా “ఏమిటో ఈ మాయ” పాట). ఇంకా వారు మాయాబజార్, మల్లీశ్వరి వంటి చిత్రాలకు అందించిన ఆణిముత్యాలు విని “ఆహా” అనుకున్న వాళ్ళలో నేనూ ఒకడిని. ఇంతకు మించి ఆయన గురించి పెద్దగా తెలీదు. ఆయన అందించిన గొప్ప పాటలు నేను చాలా వినలేదు.

మూడేళ్ళ క్రితం సాలూరి వారిపై వేటూరి రాసిన పాటొకటి వేటూరి తనయులు రవిప్రకాష్ గారు యూట్యూబులో పెట్టగా విన్నాను. వినగానే చాలా నచ్చింది. తరువాత ఈ పాటను పప్పు శ్రీనివాసరావు గారు వేటూరి సైటులో లిరిక్ టైప్ చేసి ఈ మధ్య పెట్టినప్పుడు, మా మధ్య చక్కని చర్చ జరిగింది. అప్పుడు “ఈ పాట ఏ ఆల్బంలో ఉందా?” అని ఆరాతీస్తే, సుప్రసిద్ధ సంగీత దర్శకులు సింగీతం శ్రీనివాసరావుగారు సాలూరికి వీరాభిమానులు అనీ, సాలూరికి నివాళిగా తనే కొన్ని పాటలు స్వరపరచి, ఆ పాటల్లో సాలూరి వారి సుప్రసిద్ధ బాణీలు ఇంటర్ల్యూడ్స్ గా ఉండేలా సాలూరి తనయులు వాసూరావు గారిచేత మ్యూజిక్ చేయించి, సాలూరి వారే స్వయంగా పాడిన పాటలనీ మిక్స్ చేసి,  అత్యంత శ్రద్ధతో, భక్తితో “చల్లగాలిలో” అనే పేరుతో ఒక అద్భుతమైన ఆల్బం చేశారని, ఈ వేటూరి పాట అందులోదని తెలిసింది.  మొత్తం 8 పాటల్లో వేటూరి పాట మొదటిది.  సిరివెన్నెల, భువనచంద్ర, వెన్నెలకంటి వంటి ఇతర సినీగేయరచయితలు చెరోపాట రాయగా, సింగీతం గారు, గొల్లపూడి మారుతీరావు గారు కూడా ఓ పాట రాయడం విశేషం! ఈ పాటలను బాలూ, వాణీజయరాం, జానకి, సుశీల వంటి సుప్రసిద్ధ గాయకులు పాడారు. సింగీతం గారూ ఓ పాట పాడడం విశేషం! అదృష్టవశాత్తూ ఈ ఆల్బంలో పాటలూ, రిలీజ్ ఫంక్షన్ విశేషాలు యూట్యూబులో లభ్యమవుతున్నాయి. పాటలన్నీ చక్కని సాహిత్యంతో, మధురమైన సంగీతంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ వీడియోలు ఈ మధ్యే రోజుకొకటి చొప్పున చూస్తూ నేను అమితానందం పొందాను, సాలూరి గారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వీడియోలు చూసే సమయం లేని వారు మ్యూజికాలజిస్ట్ రాజా గారు రాసిన రెవ్యూ చదివి ఈ ఆల్బంలోని విశేషాలను తెలుసుకోవచ్చు.  ఈ ఆల్బం వెనుక ఎందరో మహానుభావులు ఉన్నా రూపకర్త అయిన సింగీతం గారికి ప్రథమ ప్రణామాలు సమర్పించుకోక తప్పదు!

బాలూ గొంతులో వినిపించే వేటూరి పాట చాలా చక్కని ట్యూన్. సాలూరి వారిపై వేటూరి తనకున్న ప్రేమనంతా కుమ్మరించి వేటూరి ఈ పాట రాశారనిపిస్తుంది! తనదైన చమక్కులతో అద్భుతంగా సాలూరి వారిని సంస్మరించారు వేటూరి గారు. పదాలను ఎంత అందంగా, ముద్దొచ్చేలా వాడొచ్చో తెలుసుకోవచ్చు ఈ పాట విని! అలాగే ట్యూన్ కి వేటూరి పదాలు ఎంత అద్భుతంగా పొదుగుతారో మరో సారి తెలిపే పాట ఇది! “మన సాలూరివారి యమునావిహారి రాగాల ఊయల!” అంటూ ఇంటర్ల్యూడ్ లో వచ్చే “చల్ల గాలిలో యమునా తటిపై” పాటతో పల్లవిని ముడిపెట్టినా, “మీ బృందావని మా అందరిదీ, మా రాజేశ్వరుడందరివాడేలే!” అంటూ మిస్సమ్మలోని పాటని గుర్తుచేసినా, “జాజిపూలతో జావళికట్టే జాణకదా నీ హార్మోనీయం!” అని అందంగా సాలూరి వారిని సంస్తుతించినా అది వేటూరికే చెల్లింది. చివర్లో “ఎప్పుడు మాష్టారూ మళ్ళీ ఆ స్వరయుగం, ఉందాలేదా ఈ జన్మకా యోగం” అన్నప్పుడు అక్కడ వేటూరి హృదయం మెరిసి మన మనసులూ తడుస్తాయి.

వేటూరి రచనలో దాగున్న సాలూరి గారి సంగీత విశేషాలను మ్యూజికాలజిస్ట్ రాజా గారు తన రెవ్యూలో చక్కగా వివరించారు –

“యస్. రాజేశ్వరరావు గారి సంగీతం పై వేటూరి గారికి ఎంతటి అనురాగం, అభిమానం, గౌరవం   వున్నాయో అణువణువునా తెలిసిపోయే పాట ఇది. మొదటి చరణం లో ‘మల్లీశ్వరికి, మేఘమాలకు నువు నేర్పిన భీమప్లాసులు ‘ (మల్లీశ్వరి సినిమాలో ‘ఆకాశవీధిలో … రాగాల ఓ మేఘమాలా’ పాట భీంప్లాస్ రాగంతోనే మొదలవుతుంది) అనే వాక్యం ఆ అనురాగానికి ఉదాహరణ గా నిలిస్తే – ‘మిస్సమ్మ’ సినిమాలోని ‘బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే ‘ పాటను దృష్టిలో పెట్టుకుని ‘ నీ బృందావనమది మా అందరిదీ మా రాజేశ్వరుడందరి వాడేలే’  ఆ అభిమానానికి సాక్ష్యంగా నిలిచిపోతుంది. అలాగే  ‘వెన్నెల పాళితో వెండితెర పై నువు రాసిన చంద్రలేఖలు’ (చంద్రలేఖ సినిమా కి రాజేశ్వరరావు గారు ఇచ్చిన డ్రమ్స్ డ్యాన్స్ మ్యూజిక్ ఆ రోజుల్లో పెద్ద సంచలనం),  ‘ఎక్కడ ఎక్కడ ఆ మోహనాల మొలకలు’ (రాజేశ్వరరావు గారి సంగీతంలో మోహన రాగం కి ఉన్న స్థానం అపారం),  ‘ఎప్పుడు మాస్టారు మళ్ళీ ఆ స్వర యుగం – ఉందో లేదో ఈ జన్మ కా యోగం’  వంటి వాక్యాలు  ఆయన పట్ల వేటూరి గారికి ఉన్న గౌరవానికి అక్షరాభిషేకంలా అనిపిస్తాయి. ముఖ్యంగా ఈ  వాక్యాలు వింటుంటే రాజేశ్వరరావు గారి అభిమానులకు గుండె చెమ్మగిల్లక మానదు. అందుకేనేమో ఈ ఆడియో ఆవిష్కరణ సభలో స్పీకర్ లో ఈ పాట వస్తున్నంత సేపూ శ్రీమతి పి. సుశీల కళ్ళు వొత్తుకుంటూనే వున్నారు.  ఇక ఈ పాటకు సింగీతం గారు సమకూర్చిన ట్యూను, దాన్ని శ్రీ బాలు గారు తనదైన స్పష్టమైన వాచకంతో , గళమాధుర్యం తో, భావస్ఫోరకంగా ఆవిష్కరించిన తీరు,   మధ్య మధ్య రాజేశ్వరరావు గారు సంగీతాన్నిచ్చి పాడిన   అలనాటి “చల్లగాలిలో యమునా తటి పై’ లలిత గీతన్ని ఇమిడ్చిన పద్ధతి – ఇవన్నీ ఈ పాటని పదే పదే వినేలా చేస్తాయి.”

ఈ అందమైన పాటని విని ఆస్వాదించండి!

పల్లవి:

నాటిగీతాల పారిజాతాల మౌనసంగీతమో
వేయి ప్రాణాల వేణుగానాల గీతగోవిందమో
అది తెలుగింటి కోవెలా మధువొలికేటి కోయిలా
అది పున్నాగపూల సన్నాయి బాల పూసంత వెన్నెల
మన సాలూరివారి యమునావిహారి రాగాల ఊయల

చరణం 1

మల్లీశ్వరికి మేఘమాలకు నువు నేర్పిన భీమప్లాసులు
మల్లీశ్వరికి మేఘమాలకు నువు నేర్పిన ప్రేమఊసులు
వెన్నెలపాళితో వెండితెరపై నువు రాసిన చంద్రలేఖలు
దేవులపల్లికి కోవెల కట్టిన సర్వస్వరాల చమకాలు
భావకుసుమాల పరిమళాలతో బంతులాడిన గమకాలు
నీ బృందావని మా అందరిదీ
మా రాజేశ్వరుడందరివాడేలే!!

చరణం 2

సంగీతానికి సాహిత్యానికి ఎల్లలు చెరిపిన గాంధర్వం
జాజిపూలతో జావళికట్టే జాణకదా నీ హార్మోనియం
ఏవీ ఏవీ ఆ పంచదార చిలకలు
ఎక్కడ ఎక్కడ ఆ మోహనాల మొలకలు
ఎప్పుడు మాష్టారూ మళ్ళీ ఆ స్వరయుగం
ఉందా లేదా ఈ జన్మకా యోగం

ఈ పాటను యూట్యూబులో ఇక్కడ వినొచ్చు –

 

“చల్లగాలిలో” ఆడియో రిలీజ్ వేడుక వీడియోలూ యూట్యూబులో ఉన్నాయి. ఈ మొదటి వీడియో చూస్తే మిగిలినవి కనిపిస్తాయి. ఈ వీడియోలోనూ వేటూరి పాట చక్కని ఫొటోలతో, సాహిత్యంతో ఉంది – (22:40 నుంచి)

You May Also Like

2 thoughts on “సాలూరికి వేటూరి సమర్పించిన ఘననివాళి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.