వలపుల గోదారి చెంత వేదన ఒలికించెనొక పాట
కంటి తెరల ముందు నిల్చొన్న రూపం.. అంతకంతకు ఎదిగివచ్చిన తేజం ..ప్రేమ మాత్రమే అర్థం చేసుకోగల భాష్యం.. ఆమెతో సావాసం.. ఏటి పాయల చెంత అల ఏటి పాటల చెంత అలసిన దేవేరికి కినుకెందుకు? మనసా వాచా ఆమెనే ఆరాధిస్తే ఆ మాత్రం బెట్టు సడలించలేదా? పరుగున వచ్చే రవి కిరణమా నువ్వైనా చెప్పవూ! పిల్లగాలి అల్లరి ఆపి ఆమెని బుజ్జగించవూ! రండి సుందరరాముడి లోగిలికి..
ఓ ప్రాపంచిక రూపం మనల్ని వివశుల్ని చేస్తుంది. విషాదం ఓ చోట వైరాగ్యం చోట స్పర్థ ఓ చోట విభేదం మరో చోట కన్నీరుకు కారణమవుతుంది.ప్రేమలో ప్రేమే ఉండాలి. పరిణితి చెందిన ప్రేమలో అన్నీ ఆమే అయ్యి ఉండాలి. ఉన్నాది కూడా! అయినదిపో మరెందుకీ బెట్టు.. చిన్నతప్పు కూడా ఎందుకని క్షమించదు.ఇదే ప్రశ్న వేటూరి వారింటి అబ్బాయిది. ఇలానే అడిగాడు చుక్కని దిక్కుని పాపికొండల్ని అదిగో భద్రాద్రి రామయ్య ని.. గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా అని అంటోందీ సీతమ్మ .. మరెందుకబ్బా ! అంత బెట్టు!! ఆ కాంతకు అంత పంతమేల??
రాముడు లాంటి కుర్రాడు.. వాడు పురుషుడు పురుషోత్తముడు.. అయినా దేవదేవుడు కూడా ప్రేమ కోసమే మనిషిగా అవతరించాడట! ఇది సుందరరాముడి మాట! కన్నీటి కోవెల చెంత పల్లవించిన పాట. ఇదిగో ఇలానే నిన్న నాదిగా రేపు కాదుగా అనిపిస్తున్న .. కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా ఆ సీతమ్మ కోసం నిరీక్షించక తప్పు కాదన్నది కవి గారి భావన! ఔనండి ప్రేమలో తప్పులేముంటాయి.నిశీధిలోనో .. నిరామయ జగత్తులోనే పరివ్యాప్తి తమైన ప్రేమకు విషాదం కూడా ఓ వరమేమో! ఎడతెగని ఎడబాటు కూడా ఒకానొక సాఫల్య చింతనే! ఏదీ దృఢం కాదు ఏదీ స్థిరం కాదు ప్రేమ ఓ అచంచ లం కదా! అందుకే అన్నారేమో ఆయన మానసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా అని!! ఔనండి ఇది ఓ త్రికరణ శుద్ధి.. ఇది ఓ ఆత్మగతం. బంధం / బాంధవ్యం అన్నీ..అన్నీ.. ఆ గోదారమ్మ తోడుగా పెనవేసుకున్న తరుణాన ఆ ఇద్దరికీ ఈ కొద్దిపాటి ఎడబాటో / విరహమో ఎందుకని??
తన ప్రేమని వ్యక్తీకరించని తరుణాన రాముడైనా దేవుడైనా ఎవ్వరైనా కాలాలు వేచి ఉండాల్సిందే! నడవాల్సిందే ఎవ్వరైనా ఆమె గారి నీడలా… కరగాల్సిందే కర్పూ ర వీణియలా..! ఎగసి పడాల్సిందే ఓ వంశధారలా..! ఆ వయస్సునామీలు వేటూరికి మాత్రమే తెల్సు!ఆ..సౌందర్యారాధన ఆయనకు మాత్రమే చేతనౌను.వశమై పోయిన మనసు గురించి కన్నీరైన గౌతమి గురించి తీరం చెంత చేసిన ఎడతెగని నిరీక్షణ గురించి ఆయన మాత్రమే రాయగలరు ఓ గొప్ప భావోద్వేగంతో..! అలతి అల తి పదాలతో!ఔనండి! మూగైపోయిన మనసు ఏం ఆలోచిస్తుందని? చెంత పున్నమి ఉన్న ఆలోచి స్తుందా వెన్నెల కెరటాలను ఆస్వాదిస్తుందా పరాగ సరాగాలను ఆస్వాదిస్తుందా? లేదు కదా! కనుక మనసా వాచా ఆమెని అతడు అతడిని ఆమె పరిపూర్ణంగా ప్రేమిస్తేనే ఇవన్నీ సాధ్యం.
రాముడి కోసం వేచి చూస్తున్న ఆ సీతమ్మ ఒంటరితనంలోనూ / ఓడిన తీరంలోనూ సడలని విశ్వాసమే కదండి ప్రకటించింది. మళ్లీ మళ్లీ వినండి ..గోదారి చెంత ఆవిష్కరణకు నోచుకున్న ఈ ప్రణయ కావ్యాన్ని కాదు కాదు దృశ్య కావ్యాన్ని విరహ కాల నివేదనని ఆస్వాదించండి.. నేనే కాదు మీరు కూడా మీ అమ్మలాంటి నేస్తాలకు పాదాభివందనాలు చెప్పండి.ప్రభూ! నీ జతలోనే మా బ్రతుకు అని నివేదించండి. అనండిక ! నమామి వేటూరి..స్మరామి వేటూరి.. అని!
రత్నకిశోర్ శంభుమహంతి గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం