చక్కని సాహిత్యం, శ్రావ్యమైన సంగీతం, శాస్త్రీయమైన సంగీత సాహితీ స్వరూపం కరువు అవుతున్న ప్రస్తుత కమర్షియల్ యుగంలో ‘గంగోత్రి’ చిత్రం ద్వారా ఒక మంచి పాటను, ఒక సత్సాహిత్యాన్ని – శాస్త్రీయమై నటువంటి సంగీతానికి బాసటగా చక్కని గీతాన్ని రాసే అవకాశం నాకు కలిగింది.
ఈ పాట ఇంత పవిత్రంగా ఉండటానికి కారణం – పతిత పావనము, పరమ పవిత్రము అయినటువంటి గంగోత్రిని గురించి రాసింది కావడం.
ఈ పాటలో సంగీత వైదుష్యం, సమయస్ఫూర్తి ఎంతగానో కన్పిస్తుంది. అదేమిటంటే … అమృతవాహిని అయినటువంటి గంగోత్రిని ఏ రాగం అభిషేకించగలదు? ఏ రాగామృతంతో అభిషేకించాలి? దానిని ఆకాశగంగతో తుల్యమైనటువంటి, అంతకన్న అపురూపమైనటువంటి, అరుదైనటువంటి అమృతంతో మాత్రమే అభిషేకించాలి. అందుకే ‘అమృతవర్షిణి’ రాగాన్ని ఎన్నుకుని కీరవాణి ఈ గీతానికి సంగీతాభిషేకం చేశాడు.
ఇక ఈ సన్నివేశం రాఘవేంద్రరావుగారు నాకు చెప్పినప్పుడు కీరవాణి నాకు ట్యూన్ వినిపించినప్పుడే నేను బదరికా హిమప్రాంతంలోనూ, హృషికేశ, హరిద్వారాలలోనూ ఆ శీతల పునీత గంగా ప్రవాహంలో అభ్యంగన మాచరించిన అనుభవం కలిగింది. ఆ అనుభవాన్ని నా చేతనైన మేరకు అక్షరాల రూపంలో పొదిగి ఈ గీతం రాయటం జరిగింది.
ఇటీవల టెక్నిక్ మరీ శృతి మించడంతో సాహిత్య ప్రయోజనాలు కొన్ని దెబ్బ తింటున్నాయని చెప్పక తప్పదు. ఏదన్నా గీతం రచించినపుడు అది పాడేవారు తెలుగువారు అయినా, మరొక భాష వారు అయినా పాడటం జరుగుతోంది. ఏది ఏమైనా కొన్ని కొన్ని శబ్దాలు, వాటి ఫోనెటిక్స్ దెబ్బతినడం జరుగుతోంది. అదేవిధంగా ఎన్నో పాటలలో – ఇది నాకు అర్థం కావటం లేదు, అంటే ఏమిటండీ – వంటి ప్రశ్నలు సామాన్యంగా కవులకు ఎదురవుతుంటాయి. ఉదాహరణకి ‘హిమగిరిజని’ అని నేను రాస్తే ‘హిమగిరిదరి’ అని వినబడటం జరుగుతోంది అని ఈ పాట విన్న కొందరు నన్ను అడగటం జరిగింది. ‘హిమగిరిజని’ అంటే ‘హిమగిరిలో జన్మించినది’.
తర్వాత హరిపుత్రి అని ప్రయోగం చేశాను ఈ పాట లోనే! నిజానికి విష్ణుపది గంగ. విష్ణుపాదాల నుండి ఉద్భవించినది. విష్ణు పాదమైనా, విష్ణు కరమైనా విష్ణువే గనుక, విష్ణువు పాదాల నుండి ఉద్భవించినది విష్ణువులో నుండి జన్మ ఎత్తినదే అవుతుంది కనుక హరిపుత్రి అనటంలో తప్పు లేదని భావించి చేసిన ప్రయోగం అది. అదేవిధంగా ‘విరజావాహిని’ అని కూడా గంగా నదిని వర్ణించాను. హరిద్వారం నుంచి భారత మైదానాలలోకి ప్రవహించే ఈ మహానదిని ‘విరజావాహిని’అనడంలో ఔచిత్యం పెద్దలు గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను.
అదేవిధంగా విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని… ఆకాశంబున నుండి శంభుని శిరంబు అందుండి శీతాద్రిసుశ్లోకంబైన హిమాద్రి నుండి…. అనే పద్యం గుర్తు పెట్టుకుంటే, గంగానది ఎన్నెన్ని దశలలో ఏయే క్షేత్రాల ద్వారా, ఏఏ పేర్లతో వచ్చి సాగర సంగమం చేసిందో, ఎక్కడ ఎప్పుడు ఏ మహత్కార్యం ఆవిడ వల్ల జరిగిందో మనకు పురాణాల వల్ల తెలుస్తుంది. అలకనంద, భాగీరధీ పేర్లతో ఆ గంగామాత ఏ విధంగా వారణాసి క్షేత్రానికి చేరి అనేకమంది కలినరుల కల్మషాన్ని కిల్బిషాన్ని హరించే పావనతోయాలతో సాగిపోయి సాగర సంగమం చేసిందో మనకు తెలుస్తుంది.
నాకు చెప్పిన సన్నివేశంలో గంగానదిలో పసుపు, కుంకుమలతో, పాలు, పన్నీటితో, శ్రీగంధంతో, పంచామృతాలతో ఈ కథానాయిక చేస్తున్న స్నానమే గంగమ్మకి జరుగుతున్న అభ్యంగనం అభిషేకం కనుక ఆ వర్ణనలు ఈ విధంగా రాయడం జరిగింది.
పసుపు కుంకుమతో
పాలు పన్నీటితో …
శ్రీగంధపు ధారతో
పంచామృతాలతో …
అంగాంగం తడుపుతూ…
దోషాలను కడుగుతూ…
గంగోత్రికి జరుపుతున్న
అభ్యంగన స్నానం
ఈ స్నానం చేస్తూ, ఈ అభిషేకం చేస్తూ ఆవిడను కోరుకుంటున్న వరాలు ఏమిటి…
అమ్మా…. గంగమ్మా….
కృష్ణమ్మకు చెప్పమ్మా కష్టం కలిగించొద్దని
యమునకు చెప్పమ్మా
సాయమునకు వెనకాడొద్దనీ
గోదారికి…. కావేరికి…
ఏటికి… సెలయేటికి…
కురిసేటి జడివానకి… దూకే జలపాతానికి…
నీ తోబుట్టువులందరికీ…
చెప్పమ్మా… మా గంగమ్మా…
జీవ నదివిగా… ఒక మోక్ష నిధివిగా….
పండ్లు పూలు పసుపులూ
పారాణి రాణిగా…
ప్రవహిస్తున్న తల్లీ ఈ విధమైన వరాన్ని మాకు ప్రసాదించవలసింది అని ఆ కన్నె పడుచులు, మాంగల్య దేవతలు, వీళ్లందరు అభ్యర్థించడం జరుగుతుంది.
ఆమె
శివుని జటలనే తన నాట్య జతులుగా
జలకమాడి సతులకు సౌభాగ్య దాత్రిగా…
గండాలను పాపాలను కడిగివేయగా…
ముక్తి నదిని మూడు మునకలే చాలుగా
జలదీవెన తలకుపోసె జననీ గంగాభవానీ
ఇక్కడ జలదీవెన తలకుపోసె జననీ గంగాభవానీ అని రాసాను. జలదీవెన దుష్టసమాసం అనవచ్చు. జీవగర్ర వంటిదే ఈ జలదీవెన కూడా!
ఆడవాళ్ళు పాడే నోముల పాటలలో, జానపదాలలో, నలుగు పాటలలో ఇటువంటి చక్కని దేశీయమైన సమాసాలు రావటం పరిపాటిగానే ఉంది. పైగా అటువంటి నిబద్ధత లేని రోజుల్లో జలదీవెన అన్న మాట వ్యాకరణ దోషమనో, భాషా దోషమనో అనుకోవలసిన పని లేదు. ఆ విషయం తెలిసినవారికి చలామణి ఈ రోజుల్లో లేదు. మనం భాషను ఎంత సాంకర్యం చేస్తే అంత గొప్పవాళ్ళం కావడానికి అవకాశాలున్న రోజులివి.
పోతే ఈ చక్కని గీతం సాహిత్యపరంగా చాలా గొప్పది కాకపోవచ్చు కానీ సంగీత పరంగా మాత్రం అక్షరాలకు ఒక ఆయువు దొరికి అవి సచేతనమై, ప్రవహించే గంగానదిలా సుడులు తిరుగుతూ కొండకోనల్లోంచి ఉరవడిగా, వడివడిగా పరుగులు తీస్తూ వస్తున్న వాహినిని, ఆవిడ ఉరుకులలో పరుగులలో వినిపించే స్వరలహరికలను, అలా మానస శ్రవణానికి వినిపింపజేసే చక్కని సంగీతంతో చేయి కలుపుతూ సాగిన సాహిత్యం ఇది. ఈ అవకాశం అపురూపం, అరుదైనటువంటి ఓ సంఘటన. దీనికి సంబంధించి నేను ఎంతవరకు కృతకృత్యుణ్ణయ్యానో, శ్రోతలు, ప్రేక్షకులే ప్రమాణం.
నదులను గురించి ‘సిరిసిరిమువ్వ’ లో ‘గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే ‘ పాట దగ్గర్నుంచి నిన్న మొన్నటి చిత్రాల వరకూ ‘సీతారామయ్యగారి మనుమరాలు’ లో ‘గోదారి గంగ భూదారి గంగ‘ అని వర్ణిస్తూ ఓ పడవ పాట రాసినా, తర్వాత ‘ఆశాజ్యోతి’ చిత్రంలో రమేష్‌నాయుడు సంగీత దర్శకత్వంలో ‘ఏరెళ్లిపోతున్నా నీరుండిపోయింది నీటి మీద రాత రాసి నావెల్లిపోయింది‘ అని రాసినా, ‘దశ తిరిగింది’ అనే చిత్రంలో ‘అందాల నా కృష్ణవేణి … శృంగారరస రాజధాని… ‘ అనే యుగళగీతాన్ని రాసినా, అటు తర్వాత ‘జీవనగంగ’ చిత్రంలో ‘తానేడ పుట్టిందో తల్లి గంగమ్మ మా వాడకొచ్చింది తరలి గంగమ్మ‘ అనే పాట రాసినా, ‘మరో సీత కథ’ అనే చిత్రంలో ‘ఎందరు ఏడ్చిన ఏడుపులో కృష్ణా గోదావరి … ఎందరి ఆరని కన్నీళ్ళో అంతులేని కడలి‘ అనే గీతాన్ని రాసినా, ‘నా వాలు జడ కృష్ణవేణి, నా సిగ పూలు ఎన్నెలా గోదారి‘ అని ప్రయోగాలు చేసినా, నదుల గురించి రాయాలన్నా, ఇవన్నీ నదులతో నాకు గల వ్యక్తిగతమైన అనుబంధాన్ని వాటిపై నాకు గల అనురాగాన్ని వ్యక్తీకరించుకోవటానికే!
ఇవి జీవనదులు…. మన జాతి జీవనంలో ఇవి ప్రాణనదులు. మన నవనాడులు ఈ మహానదులే. రవీంద్రనాథ్ ఠాగూర్ పద్మానది మీద రాసిన అనేకానేక గీతాలు బెంగాల్‌లో పడవవాళ్లు పాడుకుంటూ పరవశించి పోయినటువంటి సందర్భాలు మనం బెంగాలీ నవలలు చదివినప్పుడు తెలుస్తూ వుంటుంది.
నది మనకు తల్లి వంటిది. ఏ నదీ తీరంలో ఎవరు పుడతారో వాళ్ళకి ఆ నది ఓతల్లిగా, తన ఒళ్లో పెట్టుకు లాలించే కన్నతల్లిగా కనిపిస్తుంది. ఆ ఋణానుబంధమే కవితా ప్రబంధంగా వచ్చినటువంటి ప్రబంధాలు కూడా మహాకవులు పూర్వం రాశారు. వారి వారసత్వంలో అనేకమంది కవులు …. ‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు. ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు‘ అన్న ఆరుద్ర వంటి కవులు… పూర్వ కవులు… మహానుభావులు ఎందరో ఈ విధంగా తరంగిణీ తరంగ గానం చేసినటువంటివారే.
అదే కోవకు చెందినటువంటి ఒక పాట ఈ కృతకయుగంలో సినిమాలలో మళ్లీ రాసే అవకాశం నాకు రావటం, అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించడమే కాక చిరస్మరణీయంగా మిగిలిపోయే తీపి గుర్తు.
– వేటూరి సుందరరామ్మూర్తి
హాసం పత్రిక వారికి, వేటూరి రవిప్రకాష్ గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం