‘పుచ్చా పూవుల విచ్చేతావుల-వెచ్చా వెన్నెలలు’ (వేటూరి)

అవస్థ గురించి విశ్వనాథ వారన్నమాటే నా పాటకు చరణమయ్యింది

– ‘మనోహరంపాట గురించి వేటూరి
జీవితం అనుశృతం. గతంలో అది నాకు శృతం. “గతమంతా శృతం నాది. ప్రస్తుతానికది పునాది.” అని ఏనాడో ఆకాశవాణిలో ఆలపించాను. నా జీవితం ప్రాదేశిక సుగమ సంగీతం. ఇది అలనాటి ఆకాశవాణిలో వివిధ ప్రాంతాల లలిత గీతాల కార్యక్రమం. అయితే నీ జీవితానికీ, ఆ శీర్షికకు సంబంధమేమిటని ఎవరైనా అడగవచ్చు. నా బాల్య, యవ్వన దశలు నిలకడగా ఒకచోట సాగలేదు. స్కూలు చదువులు పెద్దకళ్లేపల్లి, విజయవాడ, జగ్గయ్యపేట, కొల్లూరులలో జరిగాయి. కాలేజీకి వచ్చాక విజయవాడ, మద్రాసు, హైద్రాబాద్ నగరాలలో జరిగాయి. సెలవులిచ్చినప్పుడల్లా కృష్ణాతీరంలో ఉన్న మా గ్రామాలకు వెళ్లటం అక్కడ ప్రకృతి ఒడిలో పరవశించి ఏకాంతంగా పాటలు పాడుకోవటం, కాలేజీ నోటుపుస్తకంలో ఆ గాలి పాటలన్నీ రాసుకోడం – ఇలా గడిచిపోయింది విద్యార్థిగా నా జీవితం. ఇంతకీ ప్రాదేశిక సుగమ సంగీతం – అంటే ప్రదేశాలు తిరగటంలో పుట్టిన సంగీతం. ఇదో ప్రయాణ సంగీతం, ప్రస్థాన గీతం – అన్నమాట.  
ఆలా రాసుకున్న అనేక పాటలు కొందరు పెద్దలు నేను సినిమా రంగంలోకొచ్చాక సందర్భాన్ని బట్టి తీసుకున్న ఉదంతాలు కొల్లలు. “సప్తపది’ చిత్రంలో “ఏ కులము నీదంటే గోకులము నవ్వింది’ పాట అలా వచ్చిందే. ఇప్పడు అటువంటిదే ‘మనోహరం’ పాటగాను మనోహరమైన పాటగాను పేరు తెచ్చుకున్న ‘మనోహరం’ చిత్రంలోని ‘పుచ్చా పూవుల విచ్చేతావుల-వెచ్చా వెన్నెలలు’ అనే పాట.

పాటలు రాసే ప్రతీవారికి ఆ పాట ఎలా పాడాలో తెలిసి ఉంటుంది. పూర్వం నుంచి గేయ రచయితలు ఉన్నారు. సంగీత దర్శకులు లేరు. గొప్ప గానకోవిదులున్నారు, వారికి పాటలు రాయడం రాదు. రాసిన పాటను ఆలపించడమే వచ్చు. బాణీ కట్టడము, పాటరాయడం, రెండూ తెలిసిన, ఎంతో తెలిసిన మహా పురుషులున్నారు. వారే మన వాగ్గేయకారులు ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజు, శ్యామశాస్తి వంటివారు. వారి కీర్తనలు వారి బాణీలలో పాడవలసినదే.

వెనకటి శతాబ్దంలో కూడ మహాపురుషులు శ్రీ తూము నరసింహదాసు, ఆదిభట్ల నారాయణదాసు, ప్రయాగ రంగదాసు, పాపట్ల కాంతయ్య, దైతా గోపాలం వంటివారు ఉండేవారు. నిన్నటి శతాబ్దపు ప్రథమ దశకాలలో సినిమా అవతరించినప్పటి నుంచి దాదాపుగా ఒక కొత్త సంప్రదాయం సంగీత దర్శకత్వమనే పేర చోటుచేసుకుంది. అలా వచ్చి వచ్చి గంగ హుగ్లీగా తయారయ్యినటు ఏ స్థితికి వచ్చిందో తెలియని ప్రేక్షకుడు, శ్రోత లేరు. విష్ణుపంత్ఫగీస్, బాలగంధర్వ, నౌషాద్, మదన్ మోహన్, చితూరు నాగయ్య, సాలూరి రాజేశ్వరరావు, సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల,కె.వి.మహదేవన్, రమేష్ నాయుడు వంటివారు అక్షర సరస్వతిని స్వరకుసుమాలతో అర్చించి ఆలోచనామృతాన్ని ఆపాతమధురంగా అందరికి అందించారు.

సరే… ఇది అటుంచితే, పాటలు రాసేవాడికి ఒక ట్యూన్ ఉంటుందని ఇది వరకే చెప్పాను కదా. ఇప్పడు మనోహరం పాటకి నేను కట్టుకున్న ట్యూన్లోనే కొన్ని హంగులమర్చి ముస్తాబు చేసి సంగీత దర్శకుడు రికార్డు చెయ్యటం జరిగింది.

“పుచ్చా పూవుల విచ్చే తావుల వెచ్చావెన్నెలలు 
అచ్చా మీగడలిచ్చే తీయన తెచ్చే నీ కలలు
వచ్చీనాయమ్మ విచ్చీనాయమ్మ 
వచ్చీనాయమ్మ కలువలు విచ్చీనాయమ్మ” 

అనే పల్లవితో మొదలవుతుందీ పాట. ఇది శరద్రాత్రుల వెన్నెల గీతం. ఆహ్లాదం దీని లక్షణం. దీని వర్ణం తెలుపు. దీని రూపం ఏటిగాలి. అది మందం, మలయజం. నీలగిరి కన్నెలు నీలాలలో ఎగిరే తెల్లబారు కొంగలను చూసి తెల్ల కలువలలో మోము దాచుకుంటూ, సిగ్గుతో తమలో తాము పాడుకునే పాట. కుశలాయకం, కుచ్చెలకథ వంటి జానపద రామాయణ గీతాలలో వెన్నెలలో నదీ విహారాలు చూస్తూ పాడే జాజర పాటల బాణీలు ఎంతో చల్లనిది, నీలగిరి కన్నెల పాటల వంటివి. అన్నమయ్య గూగూగూ, జాజర, ఏల, వంటివి. ఉదాహరణకు ‘చల్లనై కాయగిదో చందమామా” వంటి పాటలు మనకు సంప్రదాయకంగా వస్తున్నవే. వాటి బాణీలే వాటికి ప్రాణవాయువులు- ఆ బాణీలలో ఒకటి నాచేత ఈ పాట రాయించడానికి దోహదం చేసింది. అదే బాణీలో ఈ పాట రికార్డు చేయడం జరిగింది.

మా అమ్మగారి పుట్టిల్లు కృష్ణాతీరం తెనాలి తాలూకా కొల్లూరు గ్రామం. ఇటు ఊరు, అటు ఏరు. ఆ ఏరుపేరు కృష్ణవేణి. పంచ గంగలలో ఒకటి. అక్కడ కృష్ణానదినీ, ఆమె వైశాల్యాన్నీ, ఇసుక తిన్నెలలో ఆమె వయ్యారాన్ని అపార జల సంపదతో నీలాదేవిగా వున్న ఆమె వైభవాన్ని చూసినప్పటిదీ అనుభవం. అటు శ్రీకాకుళం- అదే ఆంధ్ర విష్ణుక్షేత్రం, ఇటు కొల్లూరు నడుమ అనంత వైభవంతో ఆమె సాక్షాత్కరించే తీరు ఆనాటి నా పసి మనసును ఆకట్టుకుంది. నాకొక మిత్రుడుండేవాడు. సంస్కృతాంధ్ర, హిందీ భాషలలో మంచి ప్రవేశమున్నవాడు. నేను సెలవులకు వచ్చినప్పడల్లా ఇద్దరం అక్కడకు వెళ్ళేవారం. ఆ నది ఒడ్డున కూర్చునేవాళ్ళం. అదిన్నీ జన సమ్మర్ధమున్న పడవల రేవుకు దూరంగా ప్రపంచమం టే మేమిద్దరమేనేమో అన్నంత ఏకాంతంగా, దూరాన ఆవలి ఒడ్డున శ్రీకాకుళ ఆంధ్ర విష్ణుదేవాలయ గోపుర ద్వయం కనిపిస్తుంటే ఆ రెంటిమధ్యనుంచి జపాకుసుమ సంకాశుడైన సూర్యభగవానుడు ఉదయిస్తుంటే, ఆ కషాయు దీధితులు కృష్ణవేణమ్మకు బంగారు నీరు పోస్తుంటే ఎన్నిసార్లు చూశామో, కళ్ళు కవిత్వాలు పాడుతుంటే విన్నామో!

ఎగబోసుకుంటున్న ఏటిగాలికి అక్కడ మా తనువులు వేణువులై పాడేవి. హంస తూలికలై ఆకాశంలో శరత్కాల చంద్రుని కోసం తేలిపోయి, తెల్లమబ్బుల మీద వాలేవి. ఇరు పొద్దులు ఈ విధంగా జరిగిపోతుంటే, పట్టపగటి అనుభవాలు అచ్చతెలుగులా మనస్సులో హత్తుకుపోయేవి. ఏటి నడుమ లంకలలో  పప్పుధాన్యాల పంటలలో, బంతులు, చామంతులు, గోరింటలు, మలిసందెలతో పేరంట మాడుతుంటే ఆ ముచ్చట ముగిసిందో లేదో ఏరు కోనేళ్ళు కట్టిన చోట వెన్నెల పొడకు విచ్చే కలువలు, వచ్చే కలువ గంధాలు చవిచూసిన జన్మలివి, మూచూసిన జాతకాలివి. రాత్రి అవుతుంటే గువ్వజంట గూడు చేరుకొని కువకువ లాడుతుంటే లోకమంతా ఆదమరచి నిదురించే వేళ మేలుకుంటున్న మా కుర్రగుండెల సందడి మరపురాని అనుభూతి, ఆ పరిసరమే ఒక స్వరాల సరము.

“గువ్వజంటలకు కువకువ
ఇటు కుర్రగుండెలకు మెలకువ
వీణమీటె సెలయేరు
చలి వేణువూదె చిరుగాలి
కలువ కనులలోన కలవరింతలాయే
చలువ తనువులోన జలదరింతలాయే”

ఇంతలో శరద్రాత్రి. వినీలాకాశంలో వెన్నెల పింజెలా అన్నట్లు తెల్ల మబ్బులు హుటాహుటిని పరుగులు తీస్తుంటే పిండార బోసిన వెన్నెలలో ఆ కృష్ణాతీరంలో, నీరంలో,పులిన కేదారంలో మరెన్ని వింతలు, ఎన్నెన్ని కవ్వింతలు!

“పిండీ వెన్నెల వండీ వార్చిన
వెండీ ఇసుకల్లో
తెల్లా మబ్బులు వెల్లావేసిన
పిల్లకాలువల్లో
వచ్చీనాయమ్మా అలజడులొచ్చీనాయమ్మా”

అప్పుడా చుట్టుప్రక్కల ప్రదేశము కర్పూరము. వెన్నెల జాలుపడ్డ నీలాల కృష్ణ తెల్లని శ్రీశైలగోపురానికి నిలువుటద్దం. పాల సముద్రపు సింధుశాఖ.

మాస్టారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఋతుసంహారం అనే మధుర లఘు కావ్యం వ్రాశారు. నా దృష్టిలో మాస్టారు ఆ కావ్యంలోని అక్షరాలతో కృష్ణాతీరపు ఋతువుల సౌందర్యాన్ని సజీవ శిల్పాలుగా చెక్కారు. ఛాయా చిత్రాలు తీశారు. పంచవన్నెల చిత్రపటాలు గీశారు. ఆ కావ్యాన్ని కళ్ళారా కృష్ణాతీరంలో చూశాను. చూసినప్పటి పులకింతే ఈ పాట.

అటుపైన హేమంతం పుటుకొస్తుంది. మంచుతెరల చాటున కృష్ణవేణమ్మ దోబూచులాడుతుంది. మంచు మబ్బులు వచ్చి కృష్ణలో స్నానం చేసి పోతుంటాయి. తెలి మంచు దొంతరలు ఆమె నీటి శరీరానికి వెండి వన్నెలు తేవాలని ఆమె మీద పరుచుకు పోతుంటాయి. ఒడ్డూ కనబడదు, వచ్చే నావా కనబడదు. ఏది ఇసుకో, ఏది ఏరో తెలియదు! పల్లీయులు ప్రాతః కాలంలో పొలం పనులకు కదిలిపోతూ ఉంటారు. గంగపుత్రులు వలలు చేతబట్టిసాగుతారు. సరంగులు సరేసరి, నాలుగు గంటలకే ఏటిలో మొదటి పడవ వదులుతారు. పచ్చని ప్రకృతినిండా పచ్చికలు. ఆ పచ్చికలనిండా మంచు ముత్యాల మాలికలు, పువ్వుపువ్వున మంచు బిందువుల తళుకులు కులుకులు. తడిసి ముద్దయిన పచ్చికలు తలలెత్తలేక బాటసారుల కిర్రు చెప్పల పాదాల తొక్కిళ్లకు తలవంచి ముత్యపు రజను పూసుకున్న ఆకుపచ్చ అందాలతో ఉన్న దృశ్యము. చలిమంటలు- సరసన పిల్లదీ, పిల్లాడు-ఏవో మచ్చికలు, అచ్చికలు, బుచ్చికలు ఈ ఘట్టంలో.

“లేత పచ్చికల అణకువ నునులేత మచ్చికల కువకువ 
నిండు అల్లికల నవనవ తలదిండు మల్లికల శివశివ 
పట్టపగటి ఎండా పండు వెన్నెలాయె 
నిట్ట నిలువ తపనే నిలువ నీయదాయే-“

దీనికి వ్యాఖ్యానం పొడిమాటలతో కుదిరేది కాదు. తడిసిన వాళ్ళకే తలకెక్కే విషయము.

విశ్వనాథవారు– 

“తలుపింత ఓరావాకిలి తీయనియ్యరు 
ఉహుహంచు గొంతు కూర్చుండి తింద్రు 
చల్లపోసి కొనంగ చలివేసే జిహ్వకు 
మంచి నీళులు త్రావ మణగే నాల్క”

అన్నారు ఈ అవస్థను గురించే. అదే నా పాటకు చరణమయ్యింది.

“ఓరా, వాకిలి, తీసి తీయని దోరా వయస్సులో
మాఘూమాసపు మంచు బెబ్బులి పొంచే వేళల్లో
వచ్చీనాయమ్మా వలపులు విచ్చీనాయమ్మా”

అయితే మనోహరం సినిమాలో కృష్ణాతీరం లేదు. ఏ అందాలు చూసి ఈ గీతం వ్రాశానో వాటి ఆచూకీ కూడా ఉండదు. పాట బాగుందని అందులో వాడుకోటం జరిగింది. గ్రాఫిక్స్ తో చక్కగా తమ పరిధి మేరకు సందర్భానికి సమన్వయం చేసుకుంటూ చిత్రీకరించారు ఈ పాటను. ఇందుకు దర్శకుడు శ్రీ గుణశేఖర్ నిర్మాత శ్రీ మధుమురళి అభినందనీయులు.

– వేటూరి సుందరరామ్మూర్తి


హాసం పత్రిక వారి సౌజన్యంతో. వేటూరి రవిప్రకాష్ గారికి, కె.ఎస్.ఎం.ఫణీంద్ర గారికి, లలిత టిఎస్ గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.